ప్రీమెచ్యూర్ మెనోపాజ్: 40 ఏళ్లకు ముందే పీరియడ్స్ ఆగిపోతే ఏమవుతుంది?

ముచ్చటించుకొంటున్న ముగ్గురు భారత మహిళలు (ప్రతీకాత్మక చిత్రం)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, డాక్టర్ శిల్పా చిట్నీస్ జోషి
    • హోదా, గైనకాలజిస్ట్, ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, బీబీసీ మరాఠి కోసం

‘‘డాక్టర్, ఈ మధ్య నేను ప్రతి చిన్న పనికి బాగా అలసిపోతున్నాను. చాలా చిరాగ్గా అనిపిస్తోంది. ఏమీ చేయాలనిపించడం లేదు.’’

‘‘డాక్టర్ నా శరీరమంతా సూదులు గుచ్చుతున్నట్లు అనిపిస్తుంది. నోటికి రుచి తగలడం లేదు. రాత్రి పూట నిద్ర పట్టడం లేదు.’’

‘‘డాక్టర్, కొన్ని నెలలుగా నేను తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్నాను. జాయింట్స్ బాగా నొప్పిపుడుతున్నాయి. నీరసంగా ఉన్నట్లు అనిపిస్తోంది.’’

‘‘ఆరు నెలలుగా ప్రతి 15 రోజులకు ఒకసారి పీరియడ్స్ వస్తున్నాయి. ఆ సమయంలో రుతుస్రావం విపరీతంగా ఉంటుంది.’’

‘‘డాక్టర్, ప్రస్తుతం నేను బాగా లావైపోతున్నాను. ఎంత వ్యాయామం చేసినా, డైట్ అనుసరిస్తున్నా కూడా అవి సాయం చేయడం లేదు. నా రొమ్ములో కూడా బాగా నొప్పి వస్తోంది."

ఈ సమస్యలన్నింటికీ కారణం మెనోపాజ్ అని ఆ మహిళలు, వారి బంధువులు భావిస్తున్నారు.

మెనోపాజ్

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో 40కి పైబడిన మహిళల్లో ఏదైనా అనారోగ్యం తలెత్తితే, తొలుత వారు ఇది మెనోపాజ్ వల్లే కలిగిందని అనుకుంటూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం, తప్పు కూడా.

సాధారణంగా మహిళల్లో మెనోపాజ్ 48-49 ఏళ్లలో వస్తుంది. కొన్నిసార్లు 50-51 వరకు కూడా పీరియడ్స్ కొనసాగుతాయి.

50 ఏళ్ల తర్వాత కూడా పీరియడ్స్ కొనసాగితే, క్రమం తప్పకుండా గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్లి చెక్ చేయించుకోవాలి.

మెనోపాజ్ అంటే మహిళల రీప్రొడక్టివ్ సిస్టమ్ మెల్లమెల్లగా తగ్గిపోయి, ఆ తర్వాత పూర్తిగా ఆగిపోతుంది. ఇది చాలా నిదానంగా, స్థిరంగా కొనసాగుతుంది.

ఇది శాశ్వతమైన, సహజమైన మార్పు. ఇది జబ్బుకాదు. ఇది ఒక దశ. ఈ దశలో శరీరంలో పెద్దగా ఎలాంటి మార్పులూ కనిపించకపోవచ్చు.

సాధారణ మెనోపాజ్‌లో పీరియడ్స్ ఆలస్యంగా వస్తూ, రక్తస్రావం తక్కువగా అవుతుంది.

మెనోపాజ్ సగటు వయసు 48 నుంచి 49 ఏళ్ల మధ్యలో ఉంటుంది. ఈ వయసులో మరికొన్ని వ్యాధులు కూడా వస్తుంటాయి.

40 ఏళ్ల తర్వాత మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ సంబంధిత ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి.

ఈ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవడం అత్యంత అవసరం. మహిళలలో చాలా మంది ఈ పరీక్షలను చేయించుకోరు. ఈ సమస్యలను మెనోపాజ్‌గా పేర్కొంటూ కొట్టిపారేస్తుంటారు.

మెనోపాజ్

ఫొటో సోర్స్, Getty Images

ఈ లక్షణాలన్నీ మెనోపాజ్‌వేనా?

రుతుక్రమంలో సమస్యలు, బరువు పెరుగుతూ ఉండటం, చర్మం పొడిబారడం, జుట్టు ఊడిపోవడం వంటివి థైరాయిడ్‌ వచ్చినప్పుడు కూడా వస్తుంటాయి.

యోని ద్వారంలో తరచూ దురద రావడం, యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్, నీరసం, శరీరంలో ముఖ్యంగా పాదాలు వాచిపోతూ ఉండటం, బరువు పెరగడం వంటివి డయాబెటిస్ లక్షణాలు.

ఛాతీలో దడ పుట్టడం, చెమట ఎక్కువగా వస్తుండటం, తలనొప్పి, చిన్న దానికే చిరాకు పుట్టడం వంటి లక్షణాలు అధిక రక్తపోటులో కనిపిస్తుంటాయి. గుండె సంబంధిత వ్యాధుల్లో కూడా అరుదుగా ఈ లక్షణాలను చూస్తుంటాం.

అందువల్ల ఈ లక్షణాలను మెనోపాజ్ సమస్యగా భావించకుండా వెంటనే డాక్టర్‌‌ను సంప్రదించడం మంచిది.

మెనోపాజ్

ఫొటో సోర్స్, Getty Images

పీరియడ్స్ తక్కువ వయసులోనే ఆగిపోవడానికి కారణాలు ఏమిటి?

40 ఏళ్ల కంటే ముందే రుతుక్రమం ఆగిపోతే, దీన్ని ‘ప్రీమెచ్యూర్ మెనోపాజ్’ అంటారు. ఒకవేళ పీరియడ్స్ 40 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఆగిపోతే, దీన్ని ‘ఎర్లీ మెనోపాజ్’గా చెబుతారు.

ప్రపంచంలో ఇతర మహిళల కంటే భారతీయ మహిళళ్లో ప్రీమెచ్యూర్ మెనోపాజ్ రేటు కాస్త ఎక్కువగా ఉందని ప్రస్తుత అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇలా ఎందుకు జరుగుతుందనేదానిపై చాలా రీసర్చ్ పేపర్లు రాశారు. ఎందుకు త్వరగా పీరియడ్స్ ఆగిపోతాయి, వాటి వెనుకున్న కారణాలను కొన్నింటిని వీటి నుంచి తెలుసుకుందాం. కానీ ఇంకా చాలా విషయాలు అస్పష్టంగానే ఉన్నాయి.

మహిళల ఆర్థిక పరిస్థితి, పోషకాహారం, కుటుంబంలో మానసిక ఒత్తిడి, పెళ్లి చిన్న వయసులోనే అవ్వడం, విడాకులు వంటివి మహిళలలో ప్రీమెచ్యూర్ మెనోపాజ్‌‌కు కారణమవుతాయి.

చిన్న వయసులోనే పిల్లల్ని కనడం, ఎక్కువ మంది పిల్లల్ని కనడం కూడా మహిళలలో త్వరగా పీరియడ్స్ ఆగిపోయేందుకు కారణమవుతున్నాయి.

కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఆటోఇమ్యూన్ వ్యాధులు, క్యాన్సర్‌కు ఇచ్చే కీమోథెరపీ, రేడియోథెరపి లాంటివి కూడా పీరియడ్స్ త్వరగా ఆగిపోయేందుకు కారణాలుగా ఉంటున్నాయి.

చిన్న వయసులో గర్భసంచి తొలగించిన వారికి కూడా తొందరగా, అంటే తొలగించిన సంవత్సరానికే "మెనోపాజ్" లక్షణాలు కనపడతాయి.

అండాశయం నుండి అండాలు విడుదల కాకపోవడం, అందువల్ల హార్మోన్ల సమతౌల్యం దెబ్బతినడం, బహిష్ఠులు ఆగిపోవడం జరుగుతాయి.

మెనోపాజ్

ఫొటో సోర్స్, Getty Images

పీరియడ్స్ త్వరగా ఆగిపోతే వచ్చే సమస్యలేంటి?

చాలా మంది భారతీయ మహిళల మానసిక స్వభావం చూస్తే, పీరియడ్స్ ఆగిపోతే వారు చాలా సంతోషంగా భావిస్తారు.

నిజానికి పీరియడ్స్ కొనసాగుతున్నంత కాలం మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్‌ అనే రెండు హార్మోన్లు బాగా పనిచేస్తున్నాయని అర్థం.

ఈ రెండు హార్మోన్లు మహిళల శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచేందుకు సాయపడతాయి. ముఖ్యంగా ఎముకలు, గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. ఈ హార్మోన్లు మహిళల సెక్స్ లైఫ్‌పై కూడా ప్రభావం చూపుతాయి.

ఒకవేళ పీరియడ్స్ ముందుగానే ఆగిపోతే, ఈ రెండు హార్మోన్ల సంఖ్య మహిళల శరీరంలో తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోవడం వల్ల మహిళల శరీరం, మనసుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

మహిళలకు మెనోపాజ్ వచ్చిన తర్వాత గుండె సంబంధిత వ్యాధులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఊబకాయం, రక్త పోటు, డయాబెటిస్, మానసిక ఒత్తిడి వంటివి కూడా పెరుగుతాయి.

ఎముకలు పెళుసుగా మారి, విరిగిపోయేందుకు కారణమవుతుంది.

మెనోపాజ్ తర్వాత యోని పొడిబారడం, సెక్సువల్ జీవితంపై ఆసక్తి కోల్పోవడం వంటివి జరుగుతాయి. దీంతో జీవిత భాగస్వాముల మధ్య వివాదాలు తలెత్తుతాయి. మానసిక ఒత్తిడికి గురవుతారు.

మెనోపాజ్

ఫొటో సోర్స్, Getty Images

నివారణ ఉందా?

ఈ సైడ్ ఎఫెక్ట్స్‌ను తగ్గిచేందుకు, ఒకవేళ ప్రీమెచ్యూర్‌గా పీరియడ్స్ ఆగిపోయినా కనీసం 45 ఏళ్ల వరకు పీరియడ్స్ కొనసాగేలా మహిళలు హార్మోన్ పిల్‌ను డాక్టర్ సూచన మేరకు తీసుకోవచ్చు.

35 ఏళ్ల తర్వాత ఏ మహిళకైనా హార్మోన్స్ తీసుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే, వారి శరీరంలో సహజంగా హార్మోన్స్ ఉంటాయి.

త్వరగా రుతుక్రమం ఆగిపోయిన మహిళల శరీరంలో హార్మోన్లు బాగా తగ్గిపోతాయి. ఇది శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

ఆ సమయంలో హార్మోన్ పిల్స్ తీసుకోవడం వల్ల, ఈ మహిళల్లో ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు.

పీరియడ్స్ సరైన సమయంలో రాకపోతే ముందస్తుగానే పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.

చాలా మంది మహిళలకు పీరియడ్స్ సరిగ్గా రావు. కొంత మంది మహిళలు 35 ఏళ్ల తర్వాత రుతుక్రమం ఆగిపోతుందని అనుకుంటూ ఉంటారు.

వారు సకాలంలో వైద్య సలహా తీసుకోరు. ఒక్కసారిగా తీవ్ర రక్తస్రావం కూడా మొదలవుతుంది. మహిళలు కచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. మెనోపాజ్ వయసు 48 నుంచి 49 ఏళ్లు, ఆపైనే ఉంటుంది.

మెనోపాజ్

ఫొటో సోర్స్, Getty Images

మెనోపాజ్ లాగా భావించి 35 ఏళ్ల తర్వాత వచ్చే ఏదైనా అనారోగ్య పరిస్థితిని పట్టించుకోకపోతే, మహిళల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం వాటిల్లుతుంది.

ప్రీమెచ్యూర్ మెనోపాజ్ కూడా సాధారణం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సరైన వైద్య సలహా, చెకప్‌లు చేయించుకోవాలి.

మెనోపాజ్ తర్వాత కూడా మహిళలు ఇంకా 30 నుంచి 35 ఏళ్ల వరకు నివసిస్తారు. మన సమాజంలో 40 ఏళ్ల తర్వాత చాలా కొద్ది మంది మహిళలు మాత్రమే వారి ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తారు.

పైన పేర్కొన్న విధంగా, మెనోపాజ్ తర్వాత మహిళల ఆరోగ్యాన్ని కాపాడే హార్మోన్లు తగ్గిపోయి, పలు వ్యాధులకు దారితీయొచ్చు.

ఈ విషయాలన్నింటిన్ని దృష్టిలో పెట్టుకుని, మంచి ఆహారాన్ని తీసుకుంటూ, వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేస్తుంటే ప్రీమెచ్యూర్‌ మెనోపాజ్‌‌ను ఆపవచ్చు.

పలు విటమిన్లు, న్యూట్రియెంట్స్ కూడా మహిళల ఆరోగ్యానికి సహకరిస్తాయి. బియ్యం, బంగాళాదుంప, చక్కెర, పిండి వంటి వాటి నుంచి తీసుకునే కార్బోహైడ్రేట్స్‌ను తగ్గించడం ద్వారా మహిళలు తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. కనీసం రోజుకు 45 నిమిషాలు వ్యాయామం చేయడం మంచిది.

మారుతున్న కాలం ప్రకారం, మెనోపాజ్‌ విషయంపై మహిళలు దృష్టి సారించి, దీని నుంచి వచ్చే సమస్యలను ఎలా తగ్గించుకోవాలో నిర్ణయించుకోవాలి. దీని కోసం మహిళలు మానసికరంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి. శరీరంలో వస్తున్న మార్పులను సానుకూలంగా తీసుకోవాలి. అప్పుడు క్లిష్ట సమయంలో కూడా ప్రశాంతంగా ఉండొచ్చు.

(గమనిక: వ్యాస రచయిత వైద్యులు. ఈ వ్యాసం నిర్దిష్టమైన సమస్య మీద స్థూలమైన అవగాహన కోసం మాత్రమే.)

ఇవి కూడా చూడండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)