సెల్ఫీ వీడియోలతో మీ గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చా? స్మార్ట్ ఫోన్‌తో రక్తపరీక్ష చేసుకోవచ్చా?

సెల్ఫీ తీసుకొంటున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images/ Arijit Mondal

    • రచయిత, టామ్ ఓహ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సెల్ఫీ వీడియోలతో రక్తం సరఫరా తీరును, గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చా? స్మార్ట్ ఫోన్ ఉపయోగించి ఇంట్లోనే రక్తపరీక్ష చేసుకోవచ్చా? సరికొత్త మొబైల్ టెక్నాలజీల అభివృద్ధి కోసం జరుగుతున్న పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

'రక్తం గడ్డకట్టడం' అనే సమస్య ఎవరికైనా ప్రమాదకరమే. రక్తం అవసరమైనదానికన్నా తక్కువగా గడ్డకట్టినట్లయితే, అధిక రక్తస్రావం వల్ల ప్రాణాలు కోల్పోయే ముప్పుంది.

రక్తం అవసరమైనదానికన్నా ఎక్కువగా గడ్డకట్టినట్లయితే, థ్రాంబోసిస్ ముప్పు తలెత్తుతుంది. ఇది గుండెపోటుకు దారితీస్తుంది.

సాధారణంగా ల్యాబ్‌లో వైద్యబృందం బ్లడ్ టెస్టులు చేస్తారు. అయితే, మీ రక్తం నమూనాలు లేనిదే ఆ టెస్టులు చేయడం అసాధ్యం.

కానీ త్వరలో స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి మీరే ఇంట్లోనే రక్త పరీక్ష చేసుకొనే టెక్నాలజీ రావొచ్చు.

మొట్టమొదటి మొబైల్ ఫోన్‌ను అభివృద్ధి చేసిన బృందానికి మార్టిన్ కూపర్ నాయకత్వం వహించారు. మన ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవడానికి సెల్‌ఫోన్‌లు ఒక ముఖ్యమైన సాధనంగా మారతాయని ఆయన విశ్వసించారు. అది ఇప్పటికి నెరవేరుతోంది.

మొబైల్ ఫోన్‌లో మొదటి కాల్ మాట్లాడి 50 ఏళ్లవుతోంది. ఈ ఐదు దశాబ్ధాల్లో కొత్త కొత్త వెర్షన్స్ వచ్చి వినియోగదారులను మెప్పించాయి. ఇంకా మెప్పిస్తూనే ఉన్నాయి.

మొబైల్ రక్త పరీక్షలు

ఫొటో సోర్స్, Justin Chan/University of Washington

రక్త పరీక్ష కోసం ఏ ఫోన్ వాడారు?

2022 మార్చిలో యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తలు ఒక చుక్క రక్తంలో గడ్డకట్టే ప్రక్రియను గుర్తించడానికి ఐఫోన్‌ను ఉపయోగించారు.

డివైజ్‌లోని లైడార్ (లైట్ డిటెక్టింగ్ అండ్ రేంజింగ్) సెన్సర్‌తో పరీక్షించారు. పల్స్‌డ్ బీమ్‌లను ఉపయోగించి లైడార్ ఫోన్ పరిసరాల 3డీ చిత్రాలను రూపొందిస్తుంది.

వస్తువులు లేదా దూరాల కచ్చితమైన కొలతలను తీసుకొని, వాస్తవ ప్రపంచాన్ని వర్చువల్ ప్రపంచాన్ని ఆగ్మెంటెడ్ రియాలిటీతో కలిపేందుకు మొబైల్‌కు సాయపడే టెక్నాలజీ ఇది.

ఉదాహరణకు మీ గదిలో ఎలాంటి ఫర్నిచర్ ఉందో ఇది చెబుతుంది. ఫొటోలు తీసేటప్పుడు ఆటో ఫోకస్‌ను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

రక్తం గడ్డకట్టడం, పాలలో కల్తీని గుర్తించడంలో సెన్సర్ కచ్చితమైనదని తేలింది.

గాజు ముక్కపై ఉంచిన చిన్న బిందువు నుంచి గడ్డకట్టిన, గడ్డకట్టని రక్తం మధ్య తేడాను గుర్తించగలిగామని పరిశోధకులు కనుగొన్నారు.

రక్తం గడ్డకట్టడాన్ని అంచనా వేయడం కోసం ఒక చుక్క రక్తంలో రాగి కదలికను ట్రాక్ చేయడానికి పరిశోధనా బృందం ఇటీవల స్మార్ట్‌ఫోన్‌లో వైబ్రేషన్ మోటార్, కెమెరాను కూడా ఉపయోగించింది.

గుండెపోటు

ఫొటో సోర్స్, BOY_ANUPONG/GETTYIMAGES

సెల్ఫీ వీడియోలతో...

రక్తపోటు, గుండె ఆరోగ్యానికి సంబంధించిన ఇతర అంశాలను పరిశీలించడానికి పలువురు పరిశోధకులు ఫోన్‌ కెమెరా ఉపయోగించే టెక్నిక్‌లను అభివృద్ధి చేస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్‌ ఫ్రంట్ కెమెరాలతో తీసే వీడియోలతో ఆ వ్యక్తి ముఖంలో రక్తం సరఫరాలో మార్పులను గుర్తించగల అల్గారిథమ్‌లను కెనడాలోని టొరంటో యూనివర్శిటీ, చైనాలో జెజియాంగ్‌లోని హాంగ్‌జౌ నార్మల్ వర్సిటీల పరిశోధకులు అభివృద్ధి చేశారు.

మరో చైనీస్ శాస్త్రవేత్తల బృందం డీప్-లెర్నింగ్ అల్గారిథమ్‌ అభివృద్ధి చేసింది.

ఇది స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగించి తీసిన నాలుగు రకాల చిత్రాల ఆధారంగా గుండె ఆరోగ్యంతో పాటు ఇతర సమస్యలను గుర్తించగలదు.

ఈ అల్గారిథం ముఖ్యంగా ముక్కు, బుగ్గలు, నుదురు భాగాల్లో ముడతలు, చర్మం కింద కొవ్వు నిల్వలు లాంటి సూక్ష్మమైన మార్పులపై దృష్టి సారించింది. ఇలాంటి మార్పులను మనిషి కంటితో గుర్తించడం కష్టం.

ఇది 80 శాతం కేసులలో గుండె జబ్బులను సరిగ్గా గుర్తించగలదు. అయితే 46 శాతం కేసుల్లో ముప్పును తప్పుగా గుర్తించింది. అంటే వ్యక్తులు వైద్యులను కలిసి సమాచారాన్ని ధ్రువీకరించుకోవాలి. లేదంటే తప్పుడు ఫలితం వారిలో అనవసర ఆందోళనను కలిగించవచ్చు.

రోగుల ఆరోగ్య పరిస్థితులను గుర్తించడానికి ఈ డివైజ్ "చౌకయిన, సరళమైన, ప్రభావవంతమైన" సాధానం కాగలదని ఈ అధ్యయనంలో భాగమైన చైనాలోని నేషనల్ సెంటర్ ఫర్ కార్డియోవాస్కులర్ డిసీజెస్‌లోని కార్డియాలజిస్టులు చెబుతున్నారు.

గుండె సమస్యలను గుర్తించడానికి స్మార్ట్‌ఫోన్‌ల రూపంలో చౌకయిన, మరింత పోర్టబుల్ మార్గం అందుబాటులోకి రావొచ్చని వారు నమ్ముతున్నారు.

స్మార్ట్‌ఫోన్‌పై ఫింగర్ పెడితే చాలు.. రిపోర్టు

లాస్ ఏంజిల్స్‌లో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని కార్డియాలజిస్ట్ జెన్నిఫర్ మిల్లర్, యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలోని ఇంజినీర్లు కలిసి ఒక చిన్నపాటి అల్ట్రాసౌండ్ స్కానర్‌ను అభివృద్ధి చేశారు. గుండె ద్వారా రక్తం ఎలా ప్రవహిస్తుందో చూపించే ఎకోకార్డియోగ్రామ్‌లను రూపొందించేందుకు వీలుగా స్మార్ట్‌ఫోన్‌కు దీనిని అనుసంధానించవచ్చు.

ఈ టెక్నాలజీల్లో చాలా వరకు ప్రయోగం, అభివృద్ధి దశల్లోనే ఉన్నప్పటికీ, స్మార్ట్‌ ఫోన్‌తో ఆరోగ్యాన్ని చెక్ చేసుకోవడానికి ఇప్పటికే కొన్ని మార్గాలు ఉన్నాయి.

'ది స్మార్ట్‌ఫోన్: అనాటమీ ఆఫ్ యాన్ ఇండస్ట్రీ' పుస్తక రచయిత అయిన ఎలిజబెత్ వోయ్క్ 'రివా' అనే ఒక అమెరికన్ స్టార్టప్‌ గురించి ప్రస్తావించారు. ఫోన్ కెమెరా, దాని ఫ్లాష్‌‌ను ఉపయోగించి రక్తపోటును ట్రాక్ చేసే టెక్నాలజీ రివాకు ఉంది.

"ఈ టెక్నాలజీ ఏంటంటే.. స్మార్ట్‌ఫోన్ కెమెరాపై వేళ్లను ఉంచితే, రక్తనాళాల్లో తరంగ ఆకారాలను అది కొలుస్తుంది. అలా రక్తపోటును అంచనా వేస్తుంది. ఇదో అద్భుతమైన టెక్నాలజీ" అని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)