వయసు పెరిగితే జుట్టు ఎందుకు తెల్లబడుతుంది, నల్లగా మార్చగలమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మిచెల్ రాబర్ట్స్
- హోదా, డిజిటల్ హెల్త్ ఎడిటర్
వయసు పెరుగుతున్నా కొద్ది జుట్టు ఎందుకు తెల్లబడుతుందనే కారణాన్ని తాము కనుగొన్నట్లు అమెరికా శాస్త్రవేత్తలు చెప్పారు.
జుట్టును నల్లగా ఉంచే కణాలు మెచ్యూర్ అయ్యే సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు, జుట్టు తెల్లబడటం ప్రారంభమవుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఒకవేళ ఈ సెల్స్ మెచ్యూర్ అయితే అవి మెలనోసైట్స్‌గా మారతాయి. మెలనోసైట్స్ మన జుట్టును సహజ సిద్ధంగా ఉంచేలా తోడ్పడతాయి.
న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం ఎలుకలపై ఈ పరిశోధన చేపట్టింది. ఎలుకలకు కూడా ఇదే మాదిరి జుట్టు కణాలు ఉంటాయి.
తెల్లగా మారిన జుట్టును మళ్లీ నల్లగా మార్చేందుకు కూడా మెలనోసైట్స్ సాయం చేస్తాయని సైంటిస్ట్‌లు తమ అధ్యయనంలో పేర్కొన్నారు.
పలు క్యాన్సర్లకు, వివిధ రకాల అనారోగ్య కారణాలకు చికిత్సలను కనుగొనేందుకు మెలనోసైట్స్‌పై చేపట్టిన అధ్యయనాలు సాయపడతాయని బ్రిటీష్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్స్(బీఏడీ) తెలిపింది.
జుట్టు తెల్లగా ఎలా మారుతుంది?
మనకి వయసు పెరుగుతున్నా కొద్ది జుట్టు ఊడిపోతూ ఉంటుంది. జీవితంలో ఇది సహజ ప్రక్రియ.
చర్మంలో ఉండే హెయిర్ ఫోలికల్స్ నుంచి వెంట్రుకలు వస్తాయి. ఇక్కడ జుట్టును నల్లగా ఉంచే కణాలుంటాయి.
ఈ కణాలు ఎప్పటికప్పుడు పుడుతూ, చనిపోతూ ఉంటాయి. ఈ కణాలు మూల కణాల నుంచి తయారవుతాయి.
ఏదైనా కారణం వల్ల ఎప్పుడైనా మూల కణాల నుంచి ఈ కణాలు ఉత్పత్తి అవ్వడం ఆగిపోతే, అప్పుడు మన జుట్టు తెల్లబడటం ప్రారంభమవుతుంది.
ల్యాబ్ టెక్నిక్స్, స్పెషల్ స్కానింగ్ సాయంతో ఈ కణాల ఉత్పత్తి ఎలా జరుగుతుంది? వాటి వృద్ధి ఎలా ఉంటుందనే ప్రక్రియపై న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన ఒక బృందం అధ్యయనం చేసింది.
తలపై వచ్చిన జుట్టుకి కూడా ఒక వయసు ఉంటుంది. వాటి వయసు పెరుగుతున్నా కొద్ది అవి రాలిపోయి, వాటి స్థానంలో కొత్తవి వస్తూ ఉంటాయి. ఇదొక నిరంతర ప్రక్రియ.
కానీ, తర్వాత మెలనోసైట్స్ కణాలు నిదానంగా తగ్గిపోవడం ప్రారంభమవుతుంది.
మూల కణాలు వాటి స్థానంలోనే స్థిరంగా ఉంటాయి. మెలనోసైట్స్ ఉత్పత్తి కావు. దీని కారణంగా, మన జుట్టు రంగు తెల్లగా మారడం మొదలవుతుంది

ఫొటో సోర్స్, Getty Images
తెల్ల జుట్టు మళ్లీ నల్లగా మారుతుందా?
‘‘మన జుట్టును నల్లగా ఉంచేందుకు మెలనోసైట్స్ మూల కణాలు ఎలా పనిచేస్తాయని తెలుసుకునేందుకు మా అధ్యయనం సాయం చేస్తుంది.’’ అని న్యూయార్క్ యూనివర్సిటీ లాంగాన్ హెల్త్ పీహెచ్‌డీ స్కాలర్, రీసెర్చ్ టీమ్ హెడ్ డాక్టర్ సి సన్ నేచర్ జర్నల్‌కి చెప్పారు.
మెలనోసైట్స్ మూల కణాలు తెల్లటి జుట్టును మళ్లీ నల్లగా మార్చుతాయనే ఆశలను ఈ అధ్యయనం పెంచింది. తెల్ల జుట్టు మళ్లీ నల్లగా మారుతుందని శాస్త్రవేత్తలు ఆశించడం ఇదే తొలిసారి కాదు.
పౌష్టికాహార లోపం నల్లటి జుట్టు తెల్లగా మార్చేందుకు ఒక కారణంగా నిలుస్తుందని పరిశోధకులు తెలిపారు.
ఒత్తిడితో కూడా నల్ల జుట్టు తెల్లగా మారుతుందని కొందరు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా, జుట్టు తెల్ల రంగులోకి మారడాన్ని కొంత కాలం ఆపవచ్చని కొందరు నిపుణులంటున్నారు.
జన్యుపరమైన కారణాల వల్ల కూడా నల్ల జుట్టు తెల్లగా మారుతుందని కొందరు రీసెర్చర్లు చెబుతున్నారు.
అంతేకాక, కొందరు కావాలని రంగు వేయించుకుంటూ ఉంటారని అన్నారు. తమ జుట్టు తెల్లగా లేదా బూడిద రంగులోకి మారడం కంటే ముందే రంగు వేసుకోవడం ప్రారంభిస్తారు కొందరు.
యువతతో సిల్వర్ హెయిర్ ట్రెండ్ చాలా ప్రాచుర్యం పొందిందని గ్లామర్ మ్యాగజీన్ తెలిపింది. అంతేకాక, బ్రైట్ అండ్ పెర్లీ కలర్ ఆయిస్టర్ గ్రే కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ప్రాచుర్యం పొందింది.
సాధారణంగా తెల్లగా మారిన వెంట్రుకను తొలగించడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ, అదే కణాల నుంచి వచ్చే జుట్టు నల్లగా వచ్చేలా చేయడం సాధ్యం కాదని కొందరు నిపుణులు చెప్పారు.
హెయిర్ ఫోలికల్స్ దెబ్బతినడం వల్ల కొత్త జుట్టు పెరుగుదల కూడా ఆగిపోతుందని, దీని వల్ల జుట్టు రాకపోవడం లేదా బట్టతల ఏర్పడుతుందని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
హెయిర్ కలరింగ్ మార్కెట్ ఎంత పెద్దది?
హెయిర్ డైయింగ్ అనేది పెద్ద వ్యాపారమని బ్రిటీష్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్స్ డాక్టర్ లీలా ఆస్‌ఫోర్ బీబీసీకి చెప్పారు.
2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా హెయిర్ కలర్ మార్కెట్ 33.7 బిలియన్ డాలర్లకు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.2,76,477 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు.
హెయిర్ కలర్ మార్కెట్‌కి అంత పెద్ద మొత్తంలో డిమాండ్ ఉందన్నారు.
‘‘ఈ రీసెర్చ్‌లో ఒక స్పష్టమైన అంచనాలున్నాయి. సామాన్య ప్రజలు వైపు నుంచి చూస్తే, తెల్లటి జుట్టును మళ్లీ నల్లగా మార్చేందుకు మేం అడుగు దూరంలోనే ఉన్నాం.
వైద్య ప్రపంచ పరంగా చూస్తే, ఇతర కాంప్లికేషన్లను కూడా మెరుగ్గా అర్థం చేసుకోవచ్చు’’ అని లీలా తెలిపారు.
ఉదాహరణకు...మెలనోమా లేదా ప్రమాదకరమైన స్కిన్ క్యాన్సర్ వ్యాధి గురించి అర్థం చేసుకునేందుకు ఇది సాయపడుతుందన్నారు.
‘‘అలోపేసియా అరేటా అనే దాన్ని అర్థం చేసుకునేందుకు కూడా ఇది సాయపడుతుంది. ఈ స్థితిలో మన సొంత రోగ నిరోధక శక్తినే మన జుట్టును ప్రభావితం చేసి, జుట్టు ఊడిపోయేందుకు కారణమవుతుంది. కొన్నిసార్లు ఈ రోగులకు తెల్లటి ప్యాచెస్ కూడా వస్తుంటాయి. ఆ తర్వాత మళ్లీ జుట్టు వస్తుంది’’ అని డాక్టర్ లీలా అన్నారు.
ఈ అధ్యయనం మన శరీరంపై వచ్చే తెల్లటి మచ్చల గురించి మరింత సమాచారం ఇవ్వగలదని చెప్పారు. శరీర సహజ రంగును అలానే ఉంచేందుకు, ప్రభావిత ప్రాంతంలో హెయిర్ ఫోలికల్స్ ట్రాన్స్‌ప్లాంట్ చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. దీనిపై మరిన్ని అధ్యయనాలు చేపట్టాల్సి ఉంది.
జుట్టు బాగా ఎదగాలంటే ఆరోగ్యకరమైన స్కాల్ప్ అత్యంత ముఖ్యమని బ్రిటీష్ హెయిర్, నెయిల్ సొసైటీ డాక్టర్ యుషుర్ అల్-నుయామి తెలిపారు.
ఇటీవల చేపట్టిన అధ్యయనాలు హెయిర్ ఫోలికల్స్‌ను, జుట్టును నల్లగా ఉంచే కణాలను అర్థం చేసుకోవడాన్ని పెంచాయని నుయామి చెప్పారు.
‘‘జుట్టు రాలడం, ఇతర అనారోగ్య పరిస్థితులకు మూల కణాల చికిత్స గురించి మరింత సమాచారం సేకరిస్తున్నాం. కలర్ ప్రొడ్యూసింగ్ సెల్స్‌పై చేపట్టిన అధ్యయనం కూడా రోగులకు రాబోయే చికిత్సా విధానాల్లో ప్రముఖ పాత్ర వహించనుంది’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఇరాక్ వార్@20: సద్దాం పాలనే నయమని సర్వేలో తేల్చిన ప్రజలు
- ‘‘హిందూ మహాసముద్రంలో ఇదొక సముద్రపు శ్మశానవాటిక... కానీ శవాల లెక్క ఉండదు’’
- తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల ఫారాలు ఎందుకు మూతపడుతున్నాయి?
- 72 మంది ముస్లింలను చంపిన కేసులో ఒక్కరినీ పట్టుకోలేకపోయారా, బాధితులు ఏమన్నారు?
- సీక్రెట్ : మనం చెప్పిన అబద్ధాలే మన రహస్యాలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








