10 వేల మెదళ్లను ఇక్కడ డబ్బాల్లో ఎందుకు దాచిపెట్టారు?

డెన్మార్క్‌లో 10 వేల బ్రెయిన్లు నిల్వ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒడెన్స్‌లో యూనివర్సిటీ ఆఫ్ సౌత్ డెన్మార్క్‌లో బ్రెయిన్ కలెక్షన్‌కి ఇన్‌ఛార్జ్ డాక్టర్ మార్టిన్ వైరెన్‌ఫెల్ట్ నీల్సన్
    • రచయిత, విలియం మార్క్వెజ్
    • హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్

యూనివర్సిటీ ఆఫ్ సౌత్ డెన్మార్క్‌లోని బేస్‌మెంట్‌లో వేలాది తెల్లటి బక్కెట్లు వరుసగా కనిపిస్తాయి.

ప్రతి దానిలోనూ ఫార్మాల్డిహైడ్‌ అనే రసాయనిక పదార్థంతో భద్రపరిచిన మనిషి మెదళ్లు ఇక్కడ ఉన్నాయి. ఇలా మొత్తంగా 9,479 మెదళ్లు ఈ బక్కెట్లలో నిల్వ చేశారు.

1945 నుంచి 1980 వరకున్న నాలుగు దశాబ్దాల కాలంలో సైకియాట్రిక్ ఇన్‌స్టిట్యూట్‌లలో చనిపోయిన రోగులకు శవ పరీక్ష చేసేటప్పుడు వారి మెదళ్లను తొలగించారు. అలా తొలగించిన మెదళ్లను ఇలా భద్రపరిచారు.

అయితే, ఈ మెదళ్లను రోగుల నుంచి కానీ లేదా వారి కుటుంబ సభ్యుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే నిల్వ చేసినట్లు తెలిసింది.

అంత పెద్ద మొత్తంలో మనుషుల అవయవాలతో వారేం చేస్తారు అనే దానిపై ఆ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

1990లో డానిష్ ఎథిక్స్ కౌన్సిల్ చివరికి ఒక తీర్పు ఇచ్చింది. ఈ మెదళ్లను సైంటిఫిక్ రీసెర్చ్ కోసం వాడుకోవచ్చని తెలిపింది.

దీంతో, దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా నెలకొన్న ఈ చర్చకు ముగింపు పలికింది. ఒడెన్స్ నగరంలోని యూనివర్సిటీలో ఈ మెదళ్ల బ్యాంకు ఉంది.

ఇలా సేకరించిన మెదళ్లు ఎన్నో రకాల వ్యాధుల గురించి అధ్యయనం చేసేందుకు ఉపయోగపడ్డాయని కొందరు నిపుణులు చెప్పారు.

ఈ మెదళ్ల ద్వారా డెమెన్షియా, మానసిక కుంగుబాటు వంటి పలు రకాల వ్యాధులపై అధ్యయనం చేసినట్లు తెలిపారు.

కానీ, అప్పటి కాలంలో రోగులకు సరైన హక్కులు లేకపోవడం, మానసిక అనారోగ్యంపై చిన్న చూపు వంటివి ఈ మెదళ్ల సేకరణతో వెలుగులోకి వచ్చాయి.

డెన్మార్క్‌లో 10 వేల బ్రెయిన్లు నిల్వ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రీసెర్చ్ కోసం బ్రెయిన్లను వాడుకోవచ్చని చెప్పిన డానిష్ ఎథిక్స్ కౌన్సిల్

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత..

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1945లో ఈ మెదళ్ల సేకరణ ప్రారంభమైంది.

డెన్మార్క్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన సైకియాట్రిక్ సంస్థలలో చనిపోయిన మానసిక రోగుల శరీరాల నుంచి ఈ మెదళ్లను తొలగించే వారు.

మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన తర్వాత దగ్గర్లోని సమాధుల్లో అంత్యక్రియలు నిర్వహించడానికి ముందు ఈ అవయవాన్ని వైద్యులు తొలగించే వారు.

తొలుత ఈ మెదళ్లను బ్రెయిన్ పాథాలజీ ఇన్‌స్టిట్యూట్‌లోని అర్హౌస్ రిస్కోవ్ సైకియాట్రిక్ హాస్పిటల్‌లో ఉంచారు.

ఆ తర్వాత వీటిని పూర్తిగా పరిశీలించి, వివరణాత్మకంగా ఒక డాక్యుమెంటేషన్ రూపొందించేవారు.

‘‘ఈ మెదళ్లన్నింటికి సంబంధించిన సమాచారమంతా డాక్యుమెంటేషన్ చేసి పెట్టారు’’ అని ఒడెన్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ డెన్మార్క్ బ్రెయిన్ కలెక్షన్ ప్రస్తుత డైరెక్టర్, పాథాలజిస్ట్ మార్టిన్ వైరెన్‌ఫెల్ట్ నీల్సన్ బీబీసీ న్యూస్ వరల్డ్‌తో చెప్పారు.

‘‘ఈ రోగులు ఎవరో మాకు తెలుసు, వారెక్కడ పుట్టారు, ఎప్పుడు చనిపోయారు అన్ని వివరాలు మా వద్ద ఉన్నాయి. అలాగే, వారి వ్యాధులు, శవపరీక్ష రిపోర్ట్‌లు కూడా ఉన్నాయి’’ అని డాక్టర్ నీల్సన్ తెలిపారు.

చాలా మంది రోగులు వారి జీవిత కాలంలో ఎక్కువ భాగం సైకియాట్రిక్ హాస్పిటల్స్‌లోనే ఉన్నారు. పూర్తి పాథాలజిస్ట్ రిపోర్ట్‌లతో పాటు, ఆ మెదళ్లు ఎవరికి చెందినవో ఆ రోగుల మెడికల్ హిస్టరీ కూడా అందుబాటులో ఉంది.

స్థలం సరిపోక పోతూ ఉండటంతో అర్హౌస్ యూనివర్సిటీని సరికొత్త ప్రాంతానికి తరలించేటప్పుడు, 1982లో ఈ మెదళ్ల సేకరణ ప్రక్రియ ముగిసింది.

యూనివర్సిటీ తరలి వెళ్లే సమయంలో ఈ జన్యుపరమైన మెటీరియల్‌ను నాశనం చేయాలనే ప్రతిపాదనలు వచ్చినట్లు నీల్సన్ తెలిపారు. కానీ, వీటి రెస్క్యూ ఆపరేషన్‌ను వివరించిన డాక్టర్ నీల్సన్, ఒడెన్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ డెన్మార్క్ ఈ మెదళ్లను స్టోర్ చేసుకునేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు.

డెన్మార్క్‌లో 10 వేల బ్రెయిన్లు నిల్వ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆస్పత్రులకు దగ్గర్లో శ్మశాన వాటికల్లో రోగుల ఖననం

నైతికతపై పలు ప్రశ్నలు

డాక్టర్ నీల్సన్ ఈ కలెక్షన్ యూనిట్‌కు ఐదేళ్లు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

కానీ తొలిసారి వాటిని చూసినప్పుడు తాను కూడా ఆశ్చర్యానికి గురైనట్లు తెలిపారు. అయితే, వీటిని ఎప్పుడూ రహస్యంగా దాచలేదు. వీటిపై అప్పుడప్పుడు రూమర్లు వస్తూనే ఉండేవి.

‘‘ఆ సమయంలో రోగుల మొత్తం జీవితం హాస్పిటల్‌లోనే గడిచిపోయేది. వారి వ్యాధికి ఎలాంటి చికిత్సలేదు. అందుకే వారు అక్కడే ఉండాల్సి వచ్చేది.

అక్కడే గార్డెన్‌లో లేదా కిచెన్‌లో లేదా మరెక్కడైనా వారు పనిచేసే వారు. అక్కడే మరణించే వారు. ఆ తర్వాత హాస్పిటల్ వారే శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు నిర్వహించే వారు’’ అని ఎస్ఐఎన్‌డీ సైకియాట్రిక్ హెల్త్ నేషనల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కుంద్ క్రిస్టెన్‌సెన్ బీబీసీ న్యూస్ ముండోకి చెప్పారు.

సైకియాట్రిక్ రోగులకు చాలా తక్కువ హక్కులు మాత్రమే ఉంటాయి. ఎలాంటి అనుమతి లేకుండా కొన్ని నిర్దిష్ట కేసుల్లో మాత్రం వారికి చికిత్స చేసేవారు.

ఈ రోగుల మెదళ్లను నిల్వ చేసిన విషయం కనీసం వారి బంధువులకు కూడా తెలిసి ఉండకపోవచ్చని క్రిస్టెన్‌సెన్ అన్నారు.

సేకరించిన చాలా మంది మెదళ్లలో లోబోటోమీ చేసిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది సరైన వైద్యం కాదని ఇప్పుడు తెలిసినప్పటికీ, అప్పట్లో ఇది సర్వసాధారణమైన చికిత్స అని చెప్పారు. ఈ చికిత్సను ఇప్పుడు క్రూరమైనదిగా, అమానవీయమైనదిగా పరిగణిస్తున్నారు.

డెన్మార్క్‌లో 10 వేల బ్రెయిన్లు నిల్వ

ఫొటో సోర్స్, COURTESY: KNUD KRISTENSEN

ఫొటో క్యాప్షన్, ఎస్ఐఎన్‌డీ సైకియాట్రిక్ హెల్త్ నేషనల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కుంద్ క్రిస్టెన్‌సెన్

తుది నిర్ణయం

ఎస్ఐఎన్‌డీకి క్రిస్టెన్‌సెన్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు, ఈ మెదళ్లతో ఏం చేయాలన్న దానిపై నిర్ణయాలు తీసుకున్నారు. పలు దఫాల చర్చల అనంతరం ఒక నిర్ణయానికి వచ్చారు.

రోగుల అనుమతి, వారి బంధువుల అనుమతి లేకుండా ఈ మెదళ్లను సేకరించినట్లు గుర్తించారు.

ఈ సేకరణ ప్రక్రియ నైతిక పరంగా అంత సరైంది కాదనే నిర్ణయానికి వచ్చారు. ఈ అవయవాలను ధ్వంసం చేయాలా లేదా రోగులకు అంత్యక్రియలు నిర్వహించిన దగ్గరే వాటిని కూడా ఖననం చేయాలా అనే దానిపై చర్చలు జరిపారు.

అయితే, ప్రతి ఒక్కరి సమాధులను గుర్తించడం అంత తేలిక కాదని తెలిసింది. అలాగే ఒకే స్థలంలో ఈ మెదళ్లున్నంటిన్ని పూడ్చిపెట్టాలని కూడా అనుకున్నారు.

కొన్నేళ్ల తర్వాత, డానిష్ ఎథిక్స్ కౌన్సిల్ ఒక తీర్పు చెప్పింది.

కుటుంబాల అనుమతి లేకుండా సేకరించిన ఈ మెదళ్లను సైంటిఫిక్ రీసెర్చ్ కోసం ఉపయోగించడం నైతికంగా ఆమోదించదగ్గదేనని తెలిపింది. దీనికి ఎస్ఐఎన్‌డీ కూడా అంగీకరించింది.

రీసెర్చ్ కోసం వీటిని ఉపయోగించుకోవచ్చని డానిష్ ఎథిక్స్ కౌన్సిల్ తెలిపింది.

‘‘మెదళ్లను సేకరించే విషయంలో మనం చాలా అనైతికంగా ప్రవర్తించాం. ఇవి మన దగ్గరున్నప్పటికీ, వాటిని పరిశోధనకు కాకుండా ధ్వసం చేయాలనే ఆలోచన చేయడం కూడా అనైతికమే’’ అని క్రిస్టెన్‌సెన్ వివరించారు.

ఒకసారి విచారణకు ఆమోదించాక, నైతిక విధానంలో ఈ ప్రాజెక్ట్ జరుగుతుందనే హామీ ఉంటుందన్నారు.

మెదళ్ల సేకరణ, వాటి డాక్యుమెంటేషన్ అంతా కొన్ని నిర్దిష్టమైన షరతులకు లోబడి అందుబాటులో ఉంది.

దీనిపై ఏ రీసెర్చర్ అయిన ప్రాజెక్ట్ సమర్పించవచ్చు. వీరిలో అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కూడా ఉండొచ్చు.

అయితే డానిష్ శాస్త్రవేత్తలతో కలిసి వీరు పనిచేయాలి. వీరి ప్రాజెక్ట్‌ను ఎవాల్యూషన్ కమిటీకి సమర్పించాల్సి ఉంటుందని మార్టిన్ నీల్సన్ చెప్పారు.

డెన్మార్క్‌లో 10 వేల బ్రెయిన్లు నిల్వ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శవపరీక్ష చేసేటప్పుడు సేకరించిన మెదళ్లు, ఇతర కణజాలాలు

‘అద్భుతమైన శాస్త్రీయ వనరు’

ఫార్మాలిన్‌తో ఉన్న బక్కెట్‌లో ఈ మెదళ్లను నిల్వ ఉంచారు. శవపరీక్ష సమయంలో సేకరించిన అదనపు కణజాలాన్ని ఫారాఫిన్ బ్లాక్స్‌లో చుట్టారు.

నీల్సన్ కేవలం ఈ మెదళ్ల సేకరణను నిర్వహించడమే కాకుండా.. ఈ మెటీరియల్‌ను ఎలా మెరుగ్గా వాడుకోవాలో కూడా రీసెర్చర్లకి గైడ్ చేస్తారు.

మెదళ్ల డీఎన్ఏలో వచ్చే మార్పులను పరిశీలించేందుకు సరికొత్త మోలిక్యులర్ బయోలజీ టెక్నిక్స్‌ను వాడటంపై అవగాహన కల్పిస్తారు.

‘‘ఇదొక అద్భుతమైన శాస్త్రీయ వనరు. మానసిక అనారోగ్యం గురించి మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే ఇది చాలా ఉపయోగకరం’’ అని డాక్టర్ నీల్సన్ అన్నారు.

నూతన తరం పరిశోధకులకు ఉపయోగకరంగా ఎన్నో ఏళ్ల క్రితమే మెదళ్లను దాచిపెట్టాలని శాస్త్రవేత్తలు తీసుకున్న నిర్ణయం చాలా ఉత్తమమైనదని ఈ కలెక్షన్ డైరెక్టర్ చెప్పారు.

‘‘ఇప్పట్నుంచి ముందున్న సుదీర్ఘ కాలాన్ని తీసుకుంటే, అంటే 50 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ సమయంలో, ఎవరైనా ఇక్కడకు వచ్చి మెదడు గురించి మన కంటే ఎక్కువ తెలుసుకుంటారు’’ అని అన్నారు.

మానసిక అనారోగ్యం గురించి సరికొత్త ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుందని క్రిస్టెన్‌సెన్ అన్నారు.

డెన్మార్క్‌లో 10 వేల బ్రెయిన్లు నిల్వ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రోగులకు, వారి కుటుంబాలకు తెలియకుండా 1930 నుంచి 1940 మధ్యలో లోబోటోమీ నిర్వహించిన డాక్టర్లు. నేటి కాలంలో దీన్ని క్రూరమైనదిగా భావిస్తున్నారు.

‘‘ గొప్ప ఆస్తులలో ఒకటి ఈ మెదళ్లు. ఎందుకంటే అప్పటి కాలంలో పెద్దగా మందులు లేకపోవడం వల్ల యాంటీ సైకియాట్రిక్ డ్రగ్స్ ఇవ్వని మెదళ్లను ఈ చనిపోయిన రోగుల నుంచి శాస్త్రవేత్తలు సేకరించారు. ’’ అని క్రిస్టెన్‌సెన్ అన్నారు.

దీంతో పాత మెదళ్లను, కొత్త మెదళ్లతో సరిపోల్చవచ్చని, ఈ డ్రగ్స్ అవయవాలపై ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయో కనుగొనవచ్చని చెప్పారు.

రీసెర్చర్లు ఈ పరిశోధనల కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. మందులను అభివృద్ధి చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపే ఫార్మా పరిశ్రమ చాలా సైకియాట్రిక్ అధ్యయనాలకు నిధులను అందిస్తుంటుంది. అయితే, మానసిక అనారోగ్యానికి కారణాలను మాత్రం కనుగొనలేదు.

డెమెన్షియా, మానసిక కుంగుబాటు వంటి వ్యాధులపై అధ్యయనం చేసేందుకు ప్రస్తుతం చాలా పరిశోధనలు జరుగుతున్నాయని డాక్టర్ నీల్సన్ అన్నారు.

కానీ, ఈ పరిశోధన విప్లవాత్మకమంటూ ఇప్పటి వరకు వారు ఎలాంటి ఫలితాలను కనుగొనలేదు. ఈ ప్రాజెక్టులకు దీర్ఘకాల నిబద్ధత అవసరమని అన్నారు.

పెద్ద మొత్తంలో మెదళ్లను సేకరించడం చాలా గొప్ప విలువను అందించనుందని నీల్సన్ మరోసారి చెప్పారు. ఇది ప్రత్యేకమైనదన్నారు.

ఒకవేళ పరిశోధించాలనుకుంటే, కేవలం కొన్ని మెదళ్లకే ఈ పరిశోధన పరిమితం కాదు. ఒకే ప్రాజెక్ట్‌పై 100 నుంచి 500, వెయ్యి వరకు మెదళ్లను తీసుకుని పరిశీలించవచ్చు. మనం దీనిలో మార్పులను గమనించవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)