తమిళనాడు: 'ప్రభుత్వ వైద్యుల చికిత్స తర్వాతే నా కూతురికి అవయవ లోపం'.. హెడ్‌ కానిస్టేబుల్ పోరాటం

దెబ్బతిన్న పాప కాలు
    • రచయిత, ప్రమీలా కృష్ణన్
    • హోదా, బీబీసీ తమిళ్

చెన్నైలోని ఎగ్మోర్ ప్రభుత్వ పిల్లల ఆస్పత్రిలో 'తప్పుడు వైద్యం' చేయడం ద్వారా తన కూతురికి అవయవలోపం ఏర్పడిందని ఒక పోలీసు హెడ్ కానిస్టేబుల్ ఆరోపించారు. దీనికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా యాక్షన్ తీసుకోవడం లేదన్నారు.

గురువారం(ఏప్రిల్ 13న) సచివాలయం గేటు వద్ద తన కూతురితో కలిసి ఆందోళన చేయడంతో తన ఫిర్యాదును వైద్య విభాగం, పోలీసులు స్వీకరించారని అన్నారు.

పోలీసు హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు విచారణ చేపడతామని, ప్రభుత్వాస్పత్రిలో ఏదైనా తప్పు జరిగిందని తేలితే వెంటనే తాము చర్యలు తీసుకుంటామని తమిళనాడు ఆరోగ్య, సంక్షేమ శాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ తెలిపారు.

అవడి పోలీస్ క్వార్టర్స్‌‌‌కు చెందిన కోదండరామన్, చెన్నైలోని ఒట్టెరి పోలీసు స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.

తన పదేళ్ల కుమార్తెకు మూడేళ్ల వయసులోనే కిడ్నీ సమస్య వచ్చింది. 2015 ఏడాదిలో తన కూతుర్ని చికిత్స కోసం ఎగ్మోర్ ప్రభుత్వ పిల్లల ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపారు.

2015 నుంచి 2020 వరకు ఐదేళ్లపాటు తమ కూతురికి ప్రభుత్వ వైద్యులు రాసిన మందులే వాడామని, మరే ఇతర ఆస్పత్రిలో చికిత్స తీసుకోలేదని కోదండపాణి చెప్పారు.

తప్పుడు వైద్యంతో దెబ్బతిన్న పాప కాలు

‘‘అక్టోబర్ 2021లో నా కూతురికి కుడి కాలిపై దురద వచ్చింది. రక్తం గడ్డకట్టింది. ఆమె కుడి కాలుకు, ఎడమ చేయికి రెండింటికీ పక్షవాతం వచ్చింది. దీనికి కూడా వారు చికిత్స అందించారు. చికిత్స సమయంలో మా కూతురు 26 కేజీల నుంచి 14 కేజీలకు తగ్గిపోయింది. 80 రోజుల పాటు నా కూతురు కోమాలోకి వెళ్లింది.

మా కూతుర్ని కోల్పోవాల్సి వస్తుందేమోనని చాలా భయపడ్డాను. చికిత్స చేసేటప్పుడు ఏమైందో చెప్పమని అడిగితే, కనీసం డాక్టర్లు సరిగా స్పందించలేదు. ఆస్పత్రి నుంచి బయటికి వెళ్లేందుకు కూడా మమ్మల్ని అనుమతించలేదు’’ అని కోదండపాణి ఆరోపించారు.

ఎలాగోలా తన కూతుర్ని బయటికి తీసుకొచ్చి, పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేశామని ఆయన చెప్పారు. కానీ తన ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తెలిపారు.

‘‘గత వారం హెడాఫీసు వద్ద ఆందోళన చేశా. మూడేళ్లుగా నేను ఫిర్యాదు చేస్తూనే ఉన్నాను. ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా నా ఫిర్యాదు దాఖలు చేశాను. కానీ ఏ విభాగం నుంచీ నాకు సాయం అందలేదు. మా విభాగంలో కొందరు అధికారులు నా బాధను చూసి స్వచ్ఛందంగా నా ఫిర్యాదును వేలూర్ సీఎంసీ ఆస్పత్రికి పంపించారు.’’ అని కోదండపాణి చెప్పారు.

పాప కుడి కాలు ముందు భాగాన్ని శస్త్రచికిత్స చేసి తొలగించారని, ఎగ్మోర్ ఆస్పత్రిలో తప్పుడు వైద్యం చేయడంతోనే తన కూతురు కాలు దెబ్బతిందని కోదండపాణి ఆరోపించారు.

తన కూతురికి డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమని, కాలు దెబ్బతినడం తనను ఎంతో బాధిస్తుందని చెప్పారు.

తన కాలు దెబ్బతినిందనే విషయాన్ని తానసలు జీర్ణించుకోలేకపోతోందని బాధపడ్డారు.

‘‘నా కూతురి వయసు పదేళ్లు. ఈ విషయంపై గత మూడేళ్లుగా ఎన్నో ఆస్పత్రులు తిప్పాను. కానీ అందరూ కూడా ఎగ్మోర్ ఆస్పత్రిలో ఏదో తప్పుడు చికిత్స ఇవ్వడంతో ఆమె కాలు ముందు భాగాన్ని కోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు.

ఇది మమ్మల్ని తీవ్రంగా బాధిస్తోంది. కూతురి సమస్య వల్ల నా భార్య మానసికంగా కుంగిపోయారు. ప్రభుత్వ డాక్టర్లు కావడంతో వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు’’ అని కోదండపాణి చెప్పారు.

తాను ప్రభుత్వ ఉద్యోగినని, అయినప్పటికీ ప్రభుత్వ ఆస్పత్రిలో తనకు జరిగింది చాలా దారుణమని అన్నారు.

‘‘చాలా రోజులు నేను ఆస్పత్రిలో ఉన్నాను. రోజుల తరబడి నేను తినలేకపోయాను. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే నేనెంతో బాధకు గురయ్యాను. ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల ఎన్నో ఏళ్లుగా దీనిపై ఫిర్యాదు దాఖలు చేస్తూ చర్యలు తీసుకుంటారేమోనని వేచిచూస్తున్నాను’’ అని చెప్పారు.

ఇప్పుడు నిరసన చేయబట్టే తన ఫిర్యాదును పోలీసులు స్వీకరించారని, సామాన్య ప్రజల జీవితం తన కంటే దారుణంగా ఉంటుందని కోదండపాణి అన్నారు.

‘‘నిరసన చేసే సమయంలో ఒక రోజు నా కూతుర్ని తీసుకుని ముఖ్యమంత్రి స్పెషల్ యూనిట్‌కు వెళ్లాను. ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు నేను అధికారులకు చెబితే, నా సొంత డిపార్ట్‌మెంట్‌ అధికారులే వద్దని నన్ను ఆపేశారు. నేనొక సామాన్య వ్యక్తిలా ఫిర్యాదు చేస్తానన్నా ఒప్పుకోలేదు. ’’ అని తెలిపారు.

కోదండపాణి ఆరోపణలపై మంత్రి సుబ్రమణియన్‌ను బీబీసీ ప్రశ్నించగా, దీనిపై విచారణ చేసేందుకు ముగ్గురు డాక్టర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

కోదండపాణి ఫిర్యాదును స్వీకరించామని, ఐదేళ్లుగా డాక్టర్లు పాపకి వైద్యం చేశారని చెబుతున్నారని చెప్పారు. అయితే, ఏ డాక్టర్ కూడా ఉద్దేశపూర్వకంగా పాపకు హాని కలిగించరని అన్నారు.

డాక్టర్లు అందించిన వైద్యంలో ఏమైనా తప్పులున్నాయా అనే దానిపై విచారణ చేస్తున్నామని, కమిటీ నివేదిక ప్రకారం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని మంత్రి సుబ్రమణియన్ చెప్పారు.

ప్రభుత్వ వైద్యుల ప్రమేయం ఉన్న కారణంతోనే కోదండపాణి ఫిర్యాదును వైద్య శాఖ తీసుకోలేదా అని ప్రశ్నించగా, కోదండపాణి ఫిర్యాదు మేరకే తాము విచారణ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

‘‘ఆయన అంతకుముందు ఫిర్యాదుపై కూడా మేము విచారణ చేస్తున్నాం. కోదండపాణితో నేను ఫోన్‌లో మాట్లాడాను. ఆయన బాధను నేను అర్థం చేసుకున్నాను. ఆయన ఫిర్యాదుపై విచారణ చేసేందుకు కమిటీని ఏర్పాటు చేశాం. ఒకవేళ వైద్యుల తప్పుందని తేలితే, చర్యలు తీసుకుంటాం’’ అని చెప్పారు.

తన కూతురికి తప్పుడు వైద్యం అందిందని తాను ఫిర్యాదు చేసినప్పుడు ఎలాంటి విచారణ చేపట్టలేదని సుబ్రమణియన్ అన్నారు. ఇలాంటి కేసుల్లో ఒక రూల్ ఉంటుంది. ఒకవేళ ఫిర్యాదు దాఖలైతే ఆస్పత్రిలో కమిటీ తప్పనిసరిగా విచారణ చేపట్టాలి.

డాక్టర్‌ది తప్పుందా, లేదా, రోగి ఆరోపణలు కొట్టిపారేసేవా అనేది ప్యానల్ ఎంక్వైరీలో తేలుతుంది. ఆ నిబంధనను పాటించారా లేదా, కోదండపాణి కమిటీ నివేదికను ఆమోదిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.

తప్పుడు వైద్యంతో దెబ్బతిన్న పాప కాలు

ఎగ్మోర్ పిల్లల ఆస్పత్రిలో వైద్యులు తప్పుడు వైద్యం అందించారని కోదండపాణి చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నట్లు ఆస్పత్రి సీనియర్ అధికారి ఒకరు బీబీసీకి తెలిపారు.

‘‘నెఫ్రోటిక్ సిండ్రోమ్ కారణంతో వైద్యం కోసం 2015లో ఈ పాప తొలిసారి మా ఆస్పత్రిలో చేరింది. వరుసగా ఎనిమిదేళ్ల పాటు మేము ఈ పాపకు చికిత్స చేశాం. ఒకసారి పాప శరీరంలో ప్రొటీన్ బాగా లీకైంది. దీనికోసం మేం వైద్యం అందించాం. కానీ, కొందరికి చికిత్స చేసేటప్పుడు రక్తం శరీరంలో ఒకే దగ్గరుంటుంది. ఇది ఒక్క భాగంలోనే ఉండి, రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది.

ఆ భాగం తన పనితీరుని కోల్పోతుంది. దీన్నే ‘గ్యాంగ్రీన్’ అంటారు. అదే ఈ పాపకు కూడా అయింది. నెఫ్రోటిక్ సిండ్రోమ్‌‌కు కూడా మేం చికిత్స అందిస్తామన్నాం. ఇది ప్రతి ఒక్కరికీ జరగదు. కొందరి శరీరంపై ఈ ప్రభావం పడే అవకాశం ఉన్నందున చికిత్స పద్ధతిని తప్పని చెప్పలేం’’ అని అధికారి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)