నరేంద్ర మోదీ- సత్యపాల్ మలిక్: రిలయన్స్ కాంట్రాక్ట్‌ను ఈ మాజీ గవర్నర్ అప్పట్లో ఎందుకు రద్దు చేశారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అభినవ్ గోయల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మలిక్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఇటీవల నోటీసులు పంపించింది.
రిలయన్స్ ఇన్సూరెన్స్ ‘కుంభకోణం’లో కొన్ని ప్రశ్నలకు సమాధానాల కోసం ఆ నోటీసులు పంపినట్లు సీబీఐ చెబుతోంది. అయితే, ఆ కుంభకోణంపై మొదట మాట్లాడింది సత్యపాల్ మలికే.
ఈ కేసులో ప్రశ్నించేందుకు సీబీఐ ఆయన్ను పిలవడం ఇది రెండోసారి. 2022 అక్టోబరులోనూ ఆయన్ను విచారణకు పిలిచింది.
జమ్మూకశ్మీర్‌లోని ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య బీమాకు సంబంధించిన ఈ కేసులో సీబీఐ ఇప్పటికే రెండు ప్రాథమిక విచారణ నివేదిక (ఎఫ్ఐఆర్)లు నమోదుచేసింది.
ఈ కేసులో అవినీతి చోటుచేసుకుందని వార్తలు వచ్చాయి. దీనిపై సత్యపాల్ మలిక్ చాలాసార్లు మాట్లాడారు.
కొన్ని రోజుల క్రితం న్యూస్ వెబ్‌సైట్ ‘ద వైర్’కు చెందిన సీనియర్ జర్నలిస్టు కరణ్ థాపర్‌కు సత్యపాల్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ కేసుల్లో నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సత్యపాల్ విమర్శలు చేశారు. ‘‘అవినీతినిప్రధాన మంత్రి అంతగా ఏమీ ద్వేషించరు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా ఉండేటప్పుడు రూ.300 కోట్ల విలువైన లావాదేవీలతో రెండు ఫైళ్లు తన ముందుకు వచ్చాయని, కానీ, ఆ రెండు ఫైళ్లనూ తాను వెనక్కి పంపానని ఆయన అన్నారు.
వీటిలో ఒక ఫైల్ ప్రభుత్వ ఉద్యోగులకు రిలయన్స్ ఇన్సూరెన్స్‌కు సంబంధించినది. రెండోది కిరూ జల విద్యుత్ ప్రాజెక్టు.
ప్రధాన మంత్రికి సన్నిహితులైన కొందరు ఆ రెండు ఫైళ్లకూ ఆమోదముద్ర వేయాలని తనపై ఒత్తిడి చేసినట్లు సత్యపాల్ మలిక్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ రిలయన్స్ ఇన్సూరెన్స్ వివాదం?
జమ్మూకశ్మీర్ ఆర్థిక విభాగం నివేదికను బీబీసీ పరిశీలించింది. ఇదే రిపోర్టును సీబీఐకి కూడా ఆర్థిక శాఖ పంపించింది.
ప్రభుత్వ ఉద్యోగులకు ఇన్సూరెన్స్ కోసం మొదట జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ‘ఐసీఐసీఐ లాంబార్డ్’తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి 2017 మార్చి 30తో గడువు ముగిసింది. దీంతో మళ్లీ బీమా కోసం జమ్మూకశ్మీర్ ఆర్థిక విభాగం ప్రక్రియను మొదలుపెట్టింది.
దీని కోసం 2017 ఫిబ్రవరి 8నే ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి వివరాల కోసం ప్రభుత్వం ఒక నోటీసు జారీచేసింది. ఈ ప్రక్రియలు మధ్యలోనే నిలిచిపోయాయి. టెండర్ ప్రక్రియలతోపాటు ఫిర్యాదుల పరిష్కారం కోసం ఒక కన్సల్టెంట్ లేదా మధ్యవర్తిని నియమించుకోవాలని ఆర్థిక శాఖ భావించింది.
కన్సల్టెంట్‌గా పనిచేసేవారి కోసం జమ్మూకశ్మీర్ ఆర్థిక విభాగం ఒక టెండరు ఆహ్వానించింది. దీనికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏ) దగ్గర రిజిస్టర్ అయినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ట్రినిటీ ఇన్సూరెన్స్ బ్రోకర్ ప్రైవేట్ లిమిటెడ్, లైఫ్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ బ్రోకర్, న్యూ ఇండియా ఇన్సూర్ రిస్క్ మేనేజ్‌మెంట్ తదితరులు ఈ టెండర్‌లో పాలుపంచుకున్నాయి.
ప్రక్రియల అనంతరం ట్రినిటీ గ్రూపునకు ఈ టెండర్ అప్పగించారు. దీనిపై 2017 నవంబరు 27న జమ్మూకశ్మీర్ ప్రభుత్వం, ట్రినిటీల మధ్య ఒప్పందం కుదిరింది.

2018 ఫిబ్రవరి 16న ఆర్థిక విభాగం, ట్రినిటీ కలిసి బీమా కోసం టెండర్ ప్రక్రియలు మొదలుపెట్టాయి. అయితే, బిడ్డింగ్‌కు ఒకేఒక కంపెనీ వచ్చింది. ఎక్కువ కంపెనీలు ఆసక్తి చూపకపోవడంతో ఈ ప్రక్రియలు ముందుకు వెళ్లలేదు.
2018 జూన్ 1న కొన్ని షరతులను సవరించి మళ్లీ టెండర్లను ఆహ్వానించారు. దీనిలో ఏడు కంపెనీలు పాల్గొన్నాయి.
మొత్తానికి 2018 జులై 4న బిడ్డింగ్ జరిగింది. దీనిలో న్యూ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలను అనర్హులుగా ప్రభుత్వం గుర్తించింది.
అనంతర ప్రక్రియల్లో ఈ కాంట్రాక్టు రిలయన్స్‌కు దక్కింది. ఉద్యోగులకు ఏడాదికి రూ.8,777, పింఛను దారులకు రూ.22,229గా ప్రీమియంను నిర్దేశించారు.
ఉద్యోగులు, పింఛనుదారులతోపాటు వారి కుటుంబంలోని ఐదుగురు సభ్యుల వరకు ఏడాదికి ఆరు లక్షల ఆరోగ్య బీమా కల్పించాలని నిర్ణయించారు. ఈ పథకం కింద దాదాపు 3.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రతిపాదనలు సిద్ధంచేశారు.
2018 జులై 6న ఈ టెండర్‌ను రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తున్నట్లు లెటర్ ఆఫ్ అవార్డును ప్రభుత్వం జారీచేసింది.
2018 ఆగస్టు 31న జమ్మూకశ్మీర్ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ ఎదుటకు ఈ ప్రతిపాదన వెళ్లింది. అదే ఏడాది సెప్టెంబరు 20న ఇన్సూరెన్స్ పాలసీని ప్రభుత్వం నోటిఫై చేసింది.
2018 సెప్టెంబరు 28న రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి రూ.61.43 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ మరుసటిరోజే రిలయన్స్ ఖాతాలో ఈ డబ్బులు జమ అయ్యాయి.
అదే ఏడాది అక్టోబరు 1 నుంచి మెడికల్ ఇన్సూరెన్స్ పథకం అమలులోకి వచ్చింది. అయితే, వివాదాల నడుమ 2018 నవంబరు 30న ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్‌ను రద్దుచేస్తున్నట్లు రిలయన్స్‌కు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. డిసెంబరు 31న ఇది అమలులోకి వస్తుందని చెప్పింది.

వివాదం ఎందుకు?
ఈ-టెండరింగ్ ప్రక్రియలను అనుసరించలేదు.
మొదటి టెండర్ ప్రక్రియలకు కంపెనీలు ముందుకు రాకపోవడంతో షరతులను చాలావరకు సడలించారు.
ఒప్పందం కుదిరిన తర్వాత ట్రినిటీ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ప్రైవేటెడ్ లిమిటెడ్ దానిలో మార్పులు చేసింది.
రిలయన్స్‌తో పూర్తిస్థాయి ఒప్పందం కుదరకముందే, 2018 సెప్టెంబరు 28న రిలయన్స్‌కు తొలి విడత డబ్బులను జమచేశారు.
సత్యపాల్‌పై ఒత్తిడి ఉందా?
గవర్నర్‌గా పదవీ బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే తన దగ్గరకు రిలయన్స్ ఇన్సూరెన్స్ ఫైల్ వచ్చిందని ద వైర్‌తో సత్యపాల్ మలిక్ చెప్పారు.
‘‘ఆ కాంట్రాక్టును రద్దుచేసిన మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకే బీజేపీ నాయకుడు రామ్ మాధవ్ రాజ్‌భవన్‌కు వచ్చారు. ఆ కాంట్రాక్టు రద్దుచేసినందుకు ఆయన చాలా కోపంతో ఉన్నారు. మళ్లీ దానికి ఆమోదం తెలపాలని ఆయన అన్నారు’’ అని సత్యపాల్ వివరించారు.
ఈ కేసులో తనపై ఆరోపణలు చేసినందుకు తన న్యాయవాది ద్వారా సత్యపాల్ మలిక్‌కు రామ్ మాధవ్ పరువునష్టం దావా నోటీసులు పంపించారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘‘ఈ రెండు ఒప్పందాల్లో భాగంగా చెరో రూ.150 కోట్ల వరకూ చేతులు మారే అవకాశం ఉంటుంది. వాటికి ఆమోదం తెలిపితే, మూడో రోజే నాకు ఆ డబ్బులు వచ్చేవి’’ అని సత్యపాల్ మలిక్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
సీబీఐ విచారణకు డిమాండ్
ఈ విషయంపై విచారణ చేపట్టాలని 2022 మార్చి 23న జమ్మూకశ్మీర్ డిప్యూటీ సెక్రటరీ మొహమ్మద్ ఉస్మాన్ ఖాన్ సీబీఐకు ఒక లేఖ రాశారు.
‘‘జమ్మూకశ్మీర్ ఉద్యోగుల ఆరోగ్య బీమాను రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌కు అప్పగించడంతోపాటు కిరు జల విద్యుత్ ప్రాజెక్టును ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించడంపై కొన్ని ఆరోపణలు వస్తున్నాయి’’ అని ఆ లేఖలో ప్రస్తావించారు.
‘‘దీనిపై జమ్మూకశ్మీర్ ఆర్థిక, విద్యుత్ విభాగాల నుంచి నివేదికలు కోరాం. పరిశీలన అనంతరం వీటిని సీబీఐ దర్యాప్తుకు సిఫార్సు చేయాలని భావించాం. దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతున్నాం’’ అని ఆయన చెప్పారు.
ఏప్రిల్ 19న ఈ కేసులో సీబీఐ ఒక ప్రాథమిక విచారణ నివేదిక (ఎప్ఐఆర్)ను నమోదుచేసింది. మొదటి నిందితుడి స్థానంలో ట్రినిటీ గ్రూప్‌ను, రెండో నిందితుడి స్థానంలో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ పేర్లను ప్రస్తావించారు. ఆ తర్వాత కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తుల పేర్లనూ దీనిలో చేర్చారు.
‘‘ఆ లేఖలోని అంశాలను పరిశీలించిన అనంతరం జమ్మూకశ్మీర్ ఆర్థిక విభాగంలోని కొందరు అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు కనిపిస్తోంది’’అని ఎఫ్ఐఆర్‌లో రాశారు.
‘‘స్వప్రయోజనాల కోసం వారు ట్రినిటీ, రిలయన్స్‌లతో కుమ్మక్కయ్యారు. దీని వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిళ్లింది’’ అన్నారు.

కిరూపై మరో ఎఫ్ఐఆర్
ఒక రోజు తర్వాత, అంటే 2022 ఏప్రిల్ 20న కిరూ జల విద్యుత్ ప్రాజెక్టును ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించడంపై కూడా ఒక ప్రాథమిక విచారణ నివేదిక నమోదైంది.
దీనిలో ఐఏఎస్ నవీన్ కుమార్, సీనియర్ ప్రభుత్వ అధికారులు ఎంఎస్ బాబు, ఎంకే మిత్తల్, అరుణ్ కుమార్ మిశ్రా తదితరులపై ఆరోపణలు మోపారు. దీనిలో కూడా ఈ-టెండర్ నిబంధనలను అనుసరించలేదన్నారు. రూ.2,240 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును పటేల్ ఇంజినీరింగ్ లిమిటెడ్‌కు అప్పగించడంలోనూ లోపాలున్నాయని ఆరోపించారు.
సత్యపాల్ నేపథ్యం ఏమిటి?
తనను తాను ‘లోహియా’వాదిగా సత్యపాల్ మలిక్ చెబుతుంటారు. లోహియా సోషలిజం నుంచి ఆయన స్ఫూర్తి పొందారు. మేరఠ్ కాలేజీ స్టూడెంట్ యూనియన్‌లో విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో 1946 జులై 24న ఆయన జన్మించారు. సత్యపాల్‌కు రెండేళ్ల వయసున్నప్పుడే తండ్రి మరణించారు.
సత్యపాల్ రాజకీయాల్లో రావడంలో చౌధరి చరణ్ సింగ్ ప్రధాన పాత్ర పోషించారని సీనియర్ జర్నలిస్టు హేమంత్ అత్రీ చెప్పారు. 1974లో చరణ్ సింగ్ పార్టీ భారతీయ క్రాంతి దళ్ టికెట్‌పై బాగపత్ అసెంబ్లీ నుంచి సత్యపాల్ పోటీచేశారు. 28 ఏళ్లకే ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు.
1980లో లోక్ దళ్ పార్టీ టికెట్‌పై ఆయన రాజ్యసభలో అడుగుపెట్టారు. అయితే, నాలుగేళ్ల తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరారు.
1987లో కాంగ్రెస్ నుంచి వీడిపోయి లోక్ జన్ మోర్చాను పెట్టారు. 1988లో దీన్ని జనతా దళ్‌లో కలిపేశారు.
1989 సార్వత్రిక ఎన్నికల్లో అలీగఢ్ నుంచి సత్యపాల్ పోటీచేసి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు.
1996లో మళ్లీ అలీగఢ్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ టెకెట్‌పై పోటీచేశారు.
‘‘సత్యపాల్ జాట్ నాయకుడు. అలీగఢ్‌లో ఆయన ఘోర ఓటమి చవిచూశారు. 40 వేల ఓట్లతో ఆయన నాలుగో స్థానానికి పరిమితం అయ్యారు. విజేతకు 3.3 లక్షల ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన పెద్ద జాట్ నాయకుడేమీకాదని వార్తలు వచ్చాయి’’ అని జర్నలిస్టు హేమంత్ అన్నారు.
తన 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చాలావరకు సోషలిస్టు భావజాలానికి సత్యపాల్ కట్టుబడి ఉన్నారు. కానీ, 2004లో ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ టికెట్‌పై చౌధరి చరణ్ సింగ్ కమారుడు అజిత్ సింగ్‌పై ఆయన పోటీచేశారు.
‘‘ఆ ఎన్నిక కూడా జాట్ గుర్తింపుకు ప్రతీకగా రాజకీయ వర్గాల్లో చూశారు. కానీ, అప్పుడు కూడా ఆయన విఫలమయ్యారు. అజిత్ సింగ్‌కు 3.5 లక్షల కోట్లు రాగా, మూడో స్థానంలో నిలిచిన సత్యపాల్‌కు లక్ష ఓట్లు వచ్చాయి” అని హేమంత్ అన్నారు.
2005-2006 మధ్య ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. 2009లో బీజేపీ కిసాన్ మోర్చాకు ఆల్ ఇండియా ఇన్‌చార్జిగా పనిచేశారు.
‘‘ఆయన ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ బీజేపీ ఆయనను పక్కన పెట్టలేదు. 2012లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడి పదవి ఆయనకు దక్కింది. ఉత్తర్ ప్రదేశ్‌లో పార్టీ నిలదొక్కుకునే క్రమంలో భాగంగా జాట్ నాయకుడికి ప్రాధాన్యం ఇచ్చింది’’ అని హేమంత్ అన్నారు.
‘‘మరోవైపు నరేంద్ర మోదీతో సత్యపాల్‌కు వ్యక్తిగతంగానూ మంచి సంబంధాలు ఉండేవి’’ అని ఆయన చెప్పారు.
2014లో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయిన తర్వాత, 2017 సెప్టెంబరు 30న బిహార్ గవర్నర్ పదవిని సత్యపాల్ మలిక్‌కు అప్పగించారు.
11 నెలల తర్వాత అంటే 2018 ఆగస్టులో జమ్మూకశ్మీర్ గవర్నర్ పదవిని సత్యపాల్‌కు అప్పగించారు.
ఇవి కూడా చూడండి:
- సచిన్‌తో బీబీసీ ఇంటర్వ్యూ: ‘‘నేను ఎందుకు రిటైర్ అయ్యానంటే..’’
- డిబ్రూగఢ్ జైలు: అమృత్‌పాల్ సింగ్‌ను బంధించిన ఈ కారాగారం ఎలా ఉంటుంది?
- హైదరాబాద్ బిర్యానీ, పిస్తా హౌజ్ హలీమ్‌లను వందల కిలోమీటర్ల దూరం ఎందుకు పంపుతున్నారు?
- స్వలింగ సంపర్కుల పెళ్లిని చట్టబద్ధం చేస్తే వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి?
- ట్రాన్స్‌జెండర్ జంట: బిడ్డకు జన్మనిచ్చిన కేరళ కపుల్
( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















