ప్రధాని మోదీ మేకప్ కోసం నెలకు రూ. 80 లక్షలు ఖర్చు చేస్తారనే వార్తల్లో నిజమెంత- Fact Check

ఫొటో సోర్స్, Madame Tussauds
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ బృందం
- హోదా, బీబీసీ న్యూస్
మేకప్ ఆర్టిస్టులతో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియో మీద ''ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం, మేకప్ కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నెలకు సగటున రూ. 80 లక్షలు ఖర్చు చేస్తారని తెలిసింది'' అని ఉంది.
ఈ వీడియో ఫేస్‌బుక్, ట్విటర్‌లలో వేల సంఖ్యల్లో షేర్ అయింది.
ఇదే సమాచారంతో గురుగ్రామ్ కాంగ్రెస్ అధికార ఫేస్‌బుక్ పేజీలోనూ ఈ వీడియోను షేర్ చేశారు.

ఫొటో సోర్స్, Gurugram congress/fb
అయితే, మా పరిశీలనలో ఈ వీడియోలో పేర్కొన్న సమాచారం తప్పుదోవ పట్టించేలా ఉందని తేలింది.
వీడియో నిజమైనప్పటికీ దానిపై ఉన్న సమాచారం అబద్ధం.
ఈ వీడియోపైన పేర్కొన్నట్లు మోదీ మేకప్ ఆర్టిస్టులతో మేకప్ వేయించుకోవడం లేదు.

ఫొటో సోర్స్, Madame Tussauds
ఈ వీడియో వెనుకున్న వాస్తవం ఏమిటి?
ఈ వీడియో మార్చి 2016 నాటిది. మోదీ మైనపు విగ్రహం తయారు చేసేందుకు మేడం టుసాడ్స్ బృందం ప్రధాని నివాసానికి వెళ్లింది. అక్కడే మోదీకి సంబంధించిన కొలతలను వారు తీసుకున్నారు.
వీడియోపైన పేర్కొన్నట్లు వారు మోదీకి మేకప్ వేయడం లేదు. మైనపు విగ్రహం తయారీ కోసం ఆయన ముఖం, శరీరం కొలతలను తీసుకుంటున్నారు.
నిజమైన వీడియో మేడం టుస్సాడ్స్ యూట్యూబ్ పేజీలో చూడొచ్చు.
2016 ఏప్రిల్ 28న మోదీ మైనపు విగ్రహాన్ని లండన్‌లోని మేడం టుస్సాడ్స్‌లో ప్రతిష్ఠించారు.

ఫొటో సోర్స్, Mikineni sai/fb
ఆర్టీఐ ద్వారా తెలిసిందనే వార్తల్లో నిజమెంత?
ఆర్టీఐ ద్వారా తెలిసిన సమాచారం ఆధారంగా మోదీ తన మేకప్ కోసం నెలకు రూ.80 లక్షలు ఖర్చు చేశారని తేలిందని ఈ వీడియోలో పేర్కొన్నారు.
అయితే, మోదీపై వచ్చిన ఆర్టీఐ ప్రశ్నల గురించి ప్రధానమంత్రి అధికార వెబ్‌సైట్లో పరిశీలిస్తే అందులో మోదీ మేకప్ ఖర్చు వివరాలపై ప్రశ్నే లేదు.
మోదీకి సంబంధించిన విద్యార్హతలు, ఆయన పెట్టిన సెలవులు, ప్రధానమంత్రి కార్యాలయం వై-ఫై స్పీడ్, మోదీ రోజువారీ షెడ్యూల్ వివరాలపై ప్రశ్నలున్నాయి.
అయితే, 2018లో వచ్చిన మీడియా కథనాల ప్రకారం, రోహిత్ సభార్వాల్ అనే ఆర్టీఐ కార్యకర్త '1988 నుంచి ప్రధానమంత్రికి సంబంధించిన వార్డ్‌రోబ్‌పై ఎంత ఖర్చు చేశారు' అనే ప్రశ్న అడిగారు.
అయితే, దీనికి పీఎంవో సమాధానం ఇస్తూ 'ఇలాంటి వివరాలు వ్యక్తిగతమైనవి. ఇలాంటివి అధికారిక రికార్డుల్లో ఉండవు' అని స్పష్టం చేసింది.
(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








