పోడు భూములపై వాగ్దానాలు ప్రకటనలకే పరిమితమా, పట్టాల పంపిణీ ఉందా?

- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘ఫిబ్రవరి నెలాఖరులో తప్పకుండా పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తాం. పోడుభూములు ఇవ్వడమే కాదు, వాళ్లకు రైతుబంధు సదుపాయాన్ని కూడా కల్పిస్తాం. వాళ్లకు కరెంటు సదుపాయం కూడా కల్పిస్తాం. అవసరమైతే గిరి వికాసం కింద తీసుకుని నీటి సౌకర్యం కల్పిస్తాం.’’ అని పోడు భూములకు పట్టాల పంపిణీపై ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన అసెంబ్లీలో స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఇది.
ఇలా ప్రకటించి దాదాపు మూడు నెలలు కావొస్తోంది. నేటికీ పోడు భూముల పంపిణీ వ్యవహారం కొలిక్కి రాలేదు.
ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ గడిచినా గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పించే వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇంకా ప్రారంభించలేదు.
పోడు భూముల విషయంలో కేసీఆర్ ఇలాంటి ప్రకటన చేయడం ఇదే తొలిసారి కాదు. అనేక సందర్బాలున్నాయి.
2021 ఏప్రిల్ 14న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఓ ప్రకటన చేశారు.
‘‘నేను అధికారులను వెంట పెట్టుకుని పర్సనల్‌గా నాగార్జున సాగర్ వస్తా. రెండు రోజులు ఇక్కడే ఉంటా. పోడు భూముల సమస్య పరిష్కరిస్తా. అందుకు ప్రజా దర్భార్ కూడా ఏర్పాటు చేస్తాం.’’ అని కేసీఆర్ అప్పట్లో చెప్పారు.

2021 అక్టోబర్ 1వ తేదీన మరో ప్రకటన చేశారు.
‘‘పోడు భూముల వ్యవహారం తేలుస్తామని మేం హామీ ఇచ్చి ఉన్నాం. అటవీ అధికారులు, గిరిజనుల మధ్య గొడవలు ఉండటం, ఘర్షణపూరిత వాతావరణం ఉండటం ఏ రకంగానూ మంచిది కాదు. కాబట్టి సమస్య పరిష్కారం కావాలి.’’ అని చెప్పారు.
అంతకుముందు 2019 జులై 19న అసెంబ్లీలో మరో ప్రకటన చేశారు.
‘‘అన్ని జిల్లాలకు, అన్ని డివిజన్లకు నేనే స్వయంగా పోతా.. నేను ఒక్కడినే కాదు, మంత్రివర్గాన్ని, అధికార గణాన్ని, అటవీ శాఖ ఉన్నతాధికారులను, చీఫ్ సెక్రటరీని, రెవెన్యూ సెక్రటరీని అందర్ని తీసుకెళ్లి, ప్రజాదర్బార్ పెట్టి.. ఇదిగో ఇది పోడు భూమి.. ఇదిగో ఇది మీ పట్టా.. అని ఇచ్చేస్తాం.’’
ఇలా వివిధ సందర్భాల్లో చెప్పినా నేటికీ సమస్య పరిష్కరం కాలేదు.
ఫలితంగా ఇప్పటికీ, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లో అటవీ భూముల విషయంలో అక్కడి అధికారుల, స్థానికుల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
అయితే, పోడు భూముల విషయమై ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ తరఫున నివేదిక ఇచ్చిందని, ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖమంత్రి సత్యవతీ రాథోడ్ చెప్పారు.
గతేడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ శాఖాధికారి శ్రీనివాసరావు హత్య సంచలనం రేపింది.
తెలంగాణలో పోడు భూముల సమస్య అనేది ఇప్పటిది కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి నలుగుతోంది.
అటవీ భూములపై హక్కులు కల్పించాలని ఏళ్ల తరబడిగా గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రతిసారీ ఎన్నికలప్పుడు ఇది రాజకీయ అస్త్రంగా మారుతోందని, అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని గిరిజన సంఘాలు చెబుతున్నాయి.

ఏమిటీ పోడు భూములు?
అడవులు, లేదా కొండవాలు ప్రాంతాల్లో చెట్లు, పొదలను నరికివేసి భూములు చదును చేస్తుంటారు. వాటిల్లో గిరిజనులు, గిరిజనేతరులు కొందరు వ్యవసాయం చేస్తుంటారు.
అలాంటి వ్యవసాయాన్ని పోడు వ్యవసాయంగా పిలుస్తుంటారు.
పోడు భూముల కోసం గిరిజనులు అడవులను నరుకుతుంటారు. ఈ విషయంలో అటవీ శాఖాధికారులు, గిరిజనుల మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి.
ఈ భూములన్నీ అటవీ శాఖకు చెందినవి కావడంతో గిరిజనులకు హక్కులు ఉండవు.
కాని, వాటినే నమ్ముకుని ఏళ్ల తరబడిగా వ్యవసాయం చేస్తున్నారని, అర్హులను గుర్తించి పట్టాలు ఇవ్వాలని గిరిజన సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తుంటారు.
‘‘పోడు పట్టాల విషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. దరఖాస్తులు తీసుకున్నాక అర్హులను గుర్తించలేదు. పోడు భూములపై తీసుకున్న దరఖాస్తులపై వెంటనే అర్హులను గుర్తించి పట్టాలు పంపిణీ చేయాలి.’’ అని రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రంగారెడ్డి బీబీసీతో చెప్పారు.

ఏయే జిల్లాల్లో ఎక్కువ
తెలంగాణలో 66 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
ఇందులో పోడు భూములు 12 జిల్లాల్లో ఎక్కువగా ఉన్నట్లు అటవీ శాఖ సర్వేలో తేలింది.
80 శాతం భూములు భద్రాద్రి కొత్తగూడెం, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, నిర్మల్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లోనే ఉన్నట్లు గుర్తించారు.
ఈ విషయంపై సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సహాయ కార్యదర్శి పోటు రంగారావు బీబీసీతో మాట్లాడారు.
‘‘పోడు భూములకు హక్కులు కల్పించే విషయంపై ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో ప్రకటనలు చేసింది. ఇదంతా ఎన్నికల గిమ్మిక్కులుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడే ఇవ్వకుండా ఎన్నికల వరకు జాప్యం చేయాలనే ఉద్దేశం కనిపిస్తోంది. దరఖాస్తులు తీసుకున్నారు కానీ తర్వాత ప్రాసెస్ ముందుకు పడలేదు. వెంటనే దరఖాస్తుల పరిశీలన చేయాలి.’’ అని డిమాండ్ చేశారు.

దరఖాస్తులు తీసుకుని..
2021 అక్టోబరులో ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్ల సదస్సు ఏర్పాటు చేశారు.
అందులో ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్-2006 చట్టం ప్రకారం దరఖాస్తులు స్వీకరించారు.
దాని ప్రకారం రాష్ట్రంలో 28 జిల్లాల నుంచి 4,14,353 దరఖాస్తులు ప్రభుత్వానికి అందినట్లు అధికారులు చెబుతున్నారు.
వాటి ప్రకారం లెక్కిస్తే 12,46,846 ఎకరాలకు పట్టాలు ఇవ్వాల్సి ఉందని అంచనా వేశారు.
కేసీఆర్ చేసిన ప్రకటన ఏమిటి..?
గత ఫిబ్రవరి అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకటన మేరకు 11.50 లక్షల ఎకరాలకే పట్టాలు ఇస్తామని చెబుతున్నారు.
మరో 1.5 లక్షల ఎకరాలలో గిరిజనేతరులు ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
ఆ 11.50 లక్షలకైనా పట్టాలు వస్తాయా.. అనే విషయంపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.
దీనిపై బీబీసీతో మాట్లాడిన పోటు రంగారావు.. ‘‘ప్రభుత్వం చెబుతున్నట్లు గిరిజనేతరులు అంటే ఎవరో చెప్పాలి. గుత్తి కోయల్ని గిరిజనేతరులుగా చూస్తున్నారు. వారు వేరొక రాష్ట్రం నుంచి వచ్చారని ప్రభుత్వం చెబుతోంది. వారు ఈ దేశ పౌరులే కదా..? వారికి ఓటరు కార్డులు, రేషను కార్డులున్నాయి.
మనం అమెరికా, బ్రిటన్ వెళ్లి అక్కడ శాశ్వత గుర్తింపు కార్డులు పొందుతున్నాం. అలాంటప్పుడు ఒకే దేశంలో ఉన్న పౌరులు వేరొక రాష్ట్రానికి వచ్చి ఉంటున్నప్పుడు ఇక్కడి ప్రజలు కారని చెప్పడం ఎంత వరకు సమంజసం..? దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి.’’ అని చెప్పారు.

అటవీ హక్కుల చట్టం ఏం చెబుతోంది..?
2006లో కేంద్ర ప్రభుత్వం రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్(ఆర్వోఎఫ్ఆర్) చట్టాన్ని తీసుకువచ్చింది. అటవీ హక్కుల చట్టంగా దీన్ని పిలుస్తున్నారు.
అడవులలో ఎవరైతే బతుకుతున్నారో.. వారికి అడవిపై హక్కులు కల్పించేందుకు ఉద్దేశించిన చట్టమిది. వేటాడటం మినహా మిగిలిన హక్కులు కల్పించేలా చట్టం చేశారు.
ఈ హక్కును వ్యక్తిగా లేదా గ్రూపుగా ఇస్తారు.
దీని ప్రకారం 2005 డిసెంబరు 13లోపు ఆక్రమణలో ఉన్న భూములకే పట్టాలు ఇవ్వాలి.
పది ఎకరాలకు మించకుండా పోడు భూములకు హక్కు కల్పించాలి.

అదే చివరిసారిగా పంపిణీ
అటవీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చాక తెలంగాణలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 96,676 మందికి 3.8 లక్షల మందికి పట్టాలు ఇచ్చారని అధికారులు చెబుతున్నారు.
ఇది జరిగి దాదాపు 14 ఏళ్లు దాటిపోయింది.
ఆ తర్వాత ఇప్పటివరకు అటవీ భూములపై గిరిజనులకు హక్కులు కల్పిస్తూ పట్టాలివ్వలేదని రైతులు చెబుతున్నారు.
అప్పట్లోనూ 1.86 లక్షల మందికి పట్టాలు ఇవ్వలేదు. ఎందుకు తిరస్కరించారో చెప్పలేదని రైతులు చెబుతున్నారు.
చట్టం ప్రకారం ఇవ్వడం సాధ్యమేనా..?
అటవీ హక్కుల చట్టంలో కటాఫ్ డేట్ 2005తోనే ముగిసింది.
కానీ, ప్రస్తుతం పట్టాలివ్వాలంటే సాధ్యమవుతుందా.. అనే ప్రశ్న వస్తోంది.
దీనికి ప్రత్యామ్నాయం ఉందని అధికారులు చెబుతున్నారు.
‘‘గ్రామ సభలు పెట్టుకుని పోడు భూములు ఇవ్వాలని తీర్మానం చేస్తేనే అవుతుంది. అలా తీర్మానం చేసి అధికారులకు పంపించాలి. అప్పుడే పోడు భూముల పట్టాలు ఇవ్వడానికి సాధ్యమవుతుంది.’’ అని కె.రంగారెడ్డి బీబీసీతో అన్నారు.
‘‘అటవీ హక్కుల చట్టం 2006 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చాక భూముల ఆక్రమణలు పెరిగిపోయాయి. తమకు హక్కులు వస్తాయేమోననే ఉద్దేశంతో భూములు ఆక్రమించుకోవడం పెంచేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చత్తీస్ ఘడ్ నుంచి వలస వచ్చిన గుత్తి కోయలు పెద్దఎత్తున ఆక్రమణలకు పాల్పడ్డారు.
వారందరికీ ప్రభుత్వం ఏ మేరకు పట్టాలు పంపిణీ చేస్తుందనేది పెద్ద ప్రశ్న.’’ అని అటవీ శాఖాధికారి ఒకరు చెప్పారు.

క్యాబినెట్ సబ్ కమిటీ ఏం చేసింది..
పోడు భూముల సమస్యపై అధ్యయనం, పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండేళ్ల కిందట క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు.
మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారు.
ఈ కమిటీ పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. పోడు భూముల వివరాలు అధికారుల నుంచి తీసుకుంది.
పోడు భూముల వ్యవహారంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలపై మంత్రి సత్యవతి రాథోడ్ ను బీబీసీ తెలుగు సంప్రదించింది. ఈ విషయమై ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ తరఫున నివేదిక ఇచ్చినట్లు ఆమె చెప్పారు. పోడు భూముల సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు.
ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారనీ, అర్హులైన వారందరికీ ప్రభుత్వం పోడు పట్టాలు ఇవ్వనుందని మంత్రి సత్యవతీ రాథోడ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘కొత్త లోకం ఎప్పుడు సృష్టిస్తావు, నీ దగ్గరకు ఎప్పుడు రమ్మంటావు?’’ – ఏమిటీ కల్ట్స్, ప్రజలు వీటిలో ఎందుకు చేరుతున్నారు?
- ట్రాన్స్‌జెండర్ జంట: బిడ్డకు జన్మనిచ్చిన కేరళ కపుల్
- నరేంద్ర మోదీ- సత్యపాల్ మలిక్: రిలయన్స్ కాంట్రాక్ట్‌ను ఈ మాజీ గవర్నర్ అప్పట్లో ఎందుకు రద్దు చేశారు?
- మూల కణాల మార్పిడి: క్యాన్సర్‌తోపాటు హెచ్ఐవీ నుంచి కోలుకున్న అమెరికన్ కథ
- 'చివరి లాటరీ టికెట్'తో రెండున్నర కోట్లు గెలుచుకున్న 89 ఏళ్ల రిక్షావాలా
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














