తెలంగాణ: జీవో నం.111 ఎత్తేసి ఏడాది... హైదరాబాద్ చుట్టుపక్కల ఏం మారింది, ఏం మారలేదు?

జీవో నం.111
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హైదరాబాద్ నగరానికి ఆనుకుని ఉన్న హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్(గండిపేట) జలా‌‍శయాల పరిరక్షణకు ఉద్దేశించినదే జీవో నం.111.

ఈ జీవో వలన ఏళ్ల తరబడిగా అభివృద్ధి నిలిచిపోయిందని దాని పరిధిలోకి వచ్చే 84 గ్రామాల ప్రజలు చెబుతున్నారు.

వారి డిమాండ్ మేరకు ఈ జీవోలో నిబంధనలు ఎత్తివేస్తూ, 2022 ఏప్రిల్ 12వ తేదీన జీవో నం.69ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

మరి, ఈ కొత్త జీవో వచ్చాక జంట జలాశయాల చుట్టుపక్కల నివాసం ఉంటున్న లక్షల ఎకరాలు, లక్షలాది జీవితాలలో ఎలాంటి మార్పులు వచ్చాయి?

ఇదొక కోటి రూపాయల ప్రశ్నగా మారిందని అటు ప్రజలు, ఇటు పర్యావరణ వేత్తలు అంటున్నారు.

రియల్ ఎస్టేట్‌లో ఊపు వచ్చి భూముల ధరలు పెరగడానికి కారణమైందని కూడా అంటున్నారు.

జీవో నం.111

ఈ ఏడాదిలో ఏం జరిగింది?

జీవో నం.69 తీసుకువచ్చాక, గత ఏడాది కాలంలో వచ్చిన అతిపెద్ద మార్పు ఏదన్నా ఉందంటే అది రియల్ ఎస్టేట్ పరంగానే అని చెబుతున్నారు అక్కడి ప్రజలు.

ఆయా గ్రామాల్లో రెసిడెన్షియల్ జోన్ కాని చోట లే అవుట్ల పరంగా అనుమతి లేదు. రియల్టర్లు వేసినా, అవి అక్రమ లే అవుట్లుగానే మిగిలిపోయాయి.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నివేదిక ప్రకారం, జీవో నం.111 ప్రాంత పరిధిలో 132 అనుమతి లేని లేఔట్లున్నాయి.

జీవో నం.111లోని నిబంధనలు ఎత్తివేశాక లే అవుట్ల సంఖ్యలో పెద్దగా మార్పు లేకున్నా, భూముల ధరలు విపరీతంగా పెరిగాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు.

"జీవో నం.111 లోని నిబంధనల కారణంగా గ్రామ కంఠం పరిధి దాటాక నిర్మాణాలకు వీలుండేది కాదు. అందుకే భూములు అమ్మడం, కొనడానికి పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. రెసిడెన్షియల్ జోన్ లో లే అవుట్ వేస్తే 60 శాతం భూమి గ్రీన్ బెల్ట్ కిందనే వదిలేయాల్సి వచ్చేది.

నిబంధనలు ఎత్తివేశాక గత ఏప్రిల్‌లో ధరలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి శంకర్పల్లి మార్గంలో, అంతకుముందు రూ.3 కోట్లు పలికితే, ఆ తర్వాత రూ. 8 కోట్లు అన్నారు. మొయినాబాద్‌లోనూ రూ.2 కోట్లు పలికితే, ఆ తర్వాత రూ.5 కోట్లకు పైగా చెప్పారు. ఇది కూడా గాలి బుడగలానే మారిందని చెప్పవచ్చు.

కొత్త జీవో ప్రకారం నిబంధనలు రాకపోవడంతో మళ్లీ కొనుగోళ్లు, అమ్మకాలు లేక ఎక్కడ ధరలు అక్కడే ఉండిపోయాయి" అని రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రవీణ్ రెడ్డి బీబీసీకి చెప్పారు.

జీవో నం.111

ఇప్పటికీ బహిర్గతం కాని నివేదిక

జీవో నం.111 ఎత్తివేసేందుకు సమగ్ర అధ్యయనం చేసేందుకు 2016లోనే ప్రభుత్వం హైపవర్ కమిటీ వేసింది.

అది 2022 మార్చి 31న కమిటీ నివేదిక ఇచ్చినట్లు ప్రభుత్వం జీవో నం.69 విడుదల సందర్భంగా ప్రకటించింది.

అయితే,ఈ నివేదికలో ఏముందన్నది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే.

మరోవైపు జీవో నం.111పై దాఖలైన పిటిషన్లు ఇప్పటికీ తెలంగాణ హైకోర్టులో పెండింగులో ఉన్నాయి.

దీనిపై హైకోర్టు చేపట్టిన విచారణ సందర్భంగా, జీవో నం.111 నిబంధనలు అమల్లో ఉన్నాయని ప్రభుత్వం చెప్పిందని సామాజిక ఉద్యమకారిణి లుబ్నా సార్వత్ చెప్పారు.

"గత సెప్టెంబరులో హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో జీవో నం.111 నిబంధనలు ఇంకా అమల్లోనే ఉన్నాయని చెప్పింది.

కానీ, గత ఏప్రిల్‌లోనే నిబంధనలు ఎత్తివేస్తూ జీవో నం.69 తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఇలా రెండు వేర్వేరు విధానాలు ప్రభుత్వం పాటించడం సరికాదు.

కొత్త జీవో ప్రకారం నిపుణుల కమిటీ వేసినా, నిర్దేశిత సమయం పెట్టకుండా విధివిధానాలు ఖరారు చేయాలని చెప్పింది. జీవో నం.111 ఎత్తివేస్తే జంట జలాశయాలను కాపాడేందుకు ఏం చేస్తారో కచ్చితంగా చెప్పాలి" అని లుబ్నా సార్వత్ చెప్పారు.

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులు

అసలు జీవో నం.111 తో ఏం జరిగింది?

హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ (గండిపేట) రిజర్వాయర్లను కాలుష్యం బారి నుంచి కాపాడేందుకు 1996 మార్చి 8న జీవో 111 విడుదలైంది.

84 గ్రామాల పరిధిలోని 1.32 లక్షల ఎకరాలకు వర్తించేలా ఈ జీవోను తీసుకువచ్చారు.

ఈ జీవో లోని పేరా ౩ ప్రకారం, రెండు రిజర్వాయర్ల చుట్టూ పది కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి కాలుష్య కారక నిర్మాణాలు చేపట్టకూడదు.

పరిశ్రమలు, పెద్ద హోటళ్లు, రెసిడెన్షియల్ కాలనీలు నిర్మించకూడదు.

కేవలం రెసిడెన్షియల్ జోన్ లోనే నివాసాలకు అనుమతి ఉంటుంది.

ఏదైనా లే అవుట్ వేస్తే, 60 శాతం స్థలాన్ని ఓపెన్ స్థలాలుగా చూపించాలి.

మాస్టర్ ప్లాన్ లోని 90 శాతం స్థలాన్ని రిక్రియేషన్, కన్జర్వేషన్ అవసరాలకు వినియోగించాలి.

గండిపేట నుంచి అసిఫ్ నగర్ వరకు ఉన్న కాండ్యూట్ చుట్టూ వంద అడుగుల వరకు ఎలాంటి లే అవుట్లకు అనుమతి ఇవ్వకూడదు.

ఈ జీవో వచ్చాక హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగినా, 84 గ్రామాల్లో అభివ్రద్ధి ఆగిపోయిందని అక్కడి ప్రజలు చెబుతున్న మాట.

"ప్రపంచంలో ఎక్కడా క్యాచ్‌మెంట్ ఏరియాకు పది కిలోమీటర్ల పరిధి ఉన్న రిజర్వాయర్ లేదు. అర కిలోమీటరు నుంచి కిలోమీటరు ఉన్నా సరిపోతుంది.

అలాగే రిజర్వాయర్లకు నీటిని తీసుకువచ్చే లేదా తీసుకెళ్లే కాల్వల చుట్టూ బఫర్ జోన్ ఉండాలి. అది కూడా, రెండు వైపులా మూడు మీటర్ల పరిధి ఉంటుంది. దానికి తగ్గట్టుగా క్యాచ్ మెంట్ ఏరియాను నిర్ధరించాల్సి ఉంది" అని ఐఏఎస్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

జీవో నం.111

రిజర్వాయర్ల నీరు తాగునీటికి ఉపయోగమేనా?

జీవో నం.111 వచ్చినప్పుడు హైదరాబాద్‌కు సరఫరా అయ్యే తాగునీటి అవసరాల్లో 27.59 శాతం ఆ రెండు రిజర్వాయర్ల నుంచే వచ్చేది.

గతంలో హైదరాబాద్ జనాభాకు రోజుకు 145 మిలియన్ గ్యాలన్ (ఎంజీడీ)ల నీరు అవసరం ఉండేది. ఇప్పుడు డిమాండ్ 602 ఎంజీడీలకు చేరుకుంది.

ఇందులో దాదాపు 99 శాతం నీటిని కృష్ణ, గోదావరి, మంజీర నుంచి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

కేవలం 1.25 శాతం నీటినే హిమాయత్ సాగర్, గండిపేట నుంచి తీసుకుంటున్నామని అంటోంది.

అందువల్ల ఆ రెండు జలాశయాల నుంచి తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాల్సిన అవసరం లేదన్నది ప్రభుత్వం చెప్పేమాట.

కానీ నిబంధనలు పూర్తిగా ఎత్తివేస్తే జలాశయాలకు నీటి సరఫరా చేసే కాలువలు ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.

ఇప్పటికే హుస్సేన్ సాగర్ కాలుష్యంతో నిండిపోయింది. భవిష్యత్తులో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌కు అదే గతి పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

"జీవో నం.111 పూర్తిగా ఎత్తివేస్తే జలాశయాల మనుగడకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. వాటిని కేవలం తాగునీటి వనరులుగానే చూడకూడదు. మిగిలిన అవసరాలకు వాడుకునేలా ఉండాలి" అని లుబ్నా సార్వత్ బీబీసీకి చెప్పారు.

జీవో నం.111

రాజకీయంగా మైలేజీ…

జీవో నం.111 పరిధిలోకి వచ్చే గ్రామాల్లో చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాలు ఉన్నాయి. చేవెళ్ల లోక్ సభ స్థానం ఉంది.

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రాజకీయ పార్టీలు ప్రకటనలు చేస్తూనే వచ్చాయి.

2014 ఎన్నికలప్పుడు చేవెళ్లకు వచ్చిన కేసీఆర్.. తాము అధికారంలోకి వస్తే జీవో నం.111ను ఎత్తివేస్తామని అక్కడి సభలో ప్రకటించారు.

ఆ తర్వాత 2018 ఎన్నికల్లోనూ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మూడు చోట్ల ప్రజలు బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్)నే గెలిపించారు.

ప్రస్తుతం మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ వ్యవహారం స్థానికంగా తలనొప్పిగా మారిందని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.

"జీవో నం.111ను ఎత్తివేస్తున్నట్లుగా చెప్పి ఏడాది అయిపోయింది. దీనిపై విధివిధానాలు తీసుకురాలేదు. కొత్తగా గ్రీన్ జోన్ ఎక్కడవరకు ఉంచుతున్నారు, క్యాచ్ మెంట్ ఏరియా పరిధి ఎంత? ఇలా ఎన్నో విషయాలకు స్పష్టత ఇవ్వాలి" అని రంగారెడ్డి జిల్లా శ్రీరామనగర్ సర్పంచి ప్రభాకర్ రెడ్డి బీబీసీకి చెప్పారు.

హిమాయత్ సాగర్ డ్యామ్
ఫొటో క్యాప్షన్, హిమాయత్ సాగర్ డ్యామ్

జీవో 69లో ఏముంది?

జీవో నం.69 తీసుకువచ్చిన క్రమంలో ప్రభుత్వం కొన్ని కీలక అంశాలు ప్రకటించింది.

హైదరాబాద్ తాగునీటి అవసరాలకు హిమాయత్ సాగర్, గండిపేట రిజర్వాయర్లు వనరులుగా లేవని ప్రభుత్వం అందులో పేర్కొంది.

జీవో నం.111లోని పేరా 3లో నిర్దేశించిన నిబంధనలు ఎత్తివేస్తున్నట్లు జీవో నం.69లో స్పష్టం చేసింది. రెండు జలాశయాల్లోని నీటి నాణ్యత ఏ మాత్రం దెబ్బతినకుండా చూడాలని షరతు విధించింది.

ఇందుకు వివిధ ప్రాంతాల్లో డిసెంట్రలైజ్డ్ మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ) ఏర్పాటు చేయాలి.

శుద్ధి చేసిన నీటిని ఆయా రిజర్వాయర్లలోకి చేరకుండా ప్రత్యేక మళ్లింపు కాల్వలు నిర్మించాలి.

భూగర్భ నీటి నాణ్యత పాడవ్వకుండా నిర్వహణ ఉండాలి.

వ్యవసాయం కారణంగా వచ్చే కాలుష్యాన్ని తగ్గించే చర్యలుండాలి.

దీనిపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది.

జీవో నం.111

కమిటీ నివేదిక ఇచ్చిందా?

ఈ కమిటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన మున్సిపల్ విభాగం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, నీటి పారుదల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, జలమండలి ఎండీ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కారదర్శి, హెచ్ ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్ కమిటీ సభ్యులుగా ఉన్నారు.

రెండు రిజర్వాయర్లు కాలుష్యం బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలి.

గ్రీన్ జోన్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి తీసుకోవాల్సిన చర్యలు, లే అవుట్లకు ఇవ్వాల్సిన అనుమతులు, డైవర్షన్ కాల్వల నిర్మాణం తదితర అంశాలపై నివేదిక ఇవ్వాల్సి ఉంది.

ఈ నివేదికను వీలైనంత త్వరగా ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇది జరిగి ఏడాది అయినా, నేటికీ కమిటీ నివేదిక ఇవ్వలేదు.

దీనిపై ఫిబ్రవరిలో అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

"జంట జలాశయాలను కాలుష్యం బారిన పడకుండా కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. ఈ విషయంపై తెలంగాణ హైకోర్టుకు కూడా నివేదించాం. ఇప్పటికే హైకోర్టులో కేసు నడుస్తోంది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఇప్పటికే అనేకసార్లు భేటీ అయింది" అని చెప్పారు.

కమిటీ నివేదిక త్వరగా ఇవ్వాలని, గ్రామాల్లో భూమి వినియోగంపై ఏదో ఒకటి తేల్చాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి: