హైదరాబాద్‌: 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం గురించి 10 ఆసక్తికర అంశాలు

అంబేడ్కర్

ఫొటో సోర్స్, Prudhvi Chowdary

హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్ ఒడ్డున, కొత్త సచివాలయం పక్కన భారీ అంబేడ్కర్ విగ్రహం ప్రారంభానికి సిద్ధమైంది.

2016 ఏప్రిల్ 14న అప్పటికి బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగులు భారీ విగ్రహం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.

ఆ విగ్రహం అంబేడ్కర్ 132వ జయంతి నాడు ఆవిష్కారం కాబోతోంది. విగ్రహం విశేషాలు పది పాయింట్లలో...

అంబేడ్కర్
అంబేడ్కర్ విగ్రహంలో ఒక భాగం

ఫొటో సోర్స్, Prudhvi Chowdary

  • దీనిని దేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహంగా చెబుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ విగ్రహం ఎత్తు 125 అడుగులు. వెడల్పు 45.5 అడుగులు.
  • ఈ విగ్రహం బరువు 465 టన్నులు ఉంటుంది. దీని కోసం 96 టన్నుల ఇత్తడి వాడారు.
  • విగ్రహం ఖర్చు రూ.146 కోట్లు. ఈ ప్రాజెక్టులో మొత్తం 791 టన్నుల స్టీల్ వాడారు.
  • ఈ విగ్రహం ఉన్న పీఠం ఎత్తు 50 అడుగులు, వెడల్పు 172 అడుగులు. పార్లమెంటు ఆకారంలో నిర్మించిన పీఠం లోపల సందర్శనాలయం ఉంటుంది.
  • 11.04 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. అందులో 2.93 ఎకరాల్లో థీమ్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు.
    అంబేడ్కర్ విగ్రహం

    ఫొటో సోర్స్, Prudhvi Chowdary

    అంబేడ్కర్

    ఫొటో సోర్స్, Prudhvi Chowdary

    • ప్రాజెక్టు స్థలంలో విగ్రహమే కాకుండా, పీఠం కింద ఒక లైబ్రరీ, మ్యూజియం, జ్ఙాన మందిరం, అంబేడ్కర్ జీవిత ముఖ్య ఘట్టాల ఫోటో గ్యాలరీ ఉంటాయి.
    • విగ్రహావిష్కరణ సందర్భంగా 125 అడుగుల విగ్రహానికి సరిపోయేంత భారీ పూలమాలను.. గులాబీ, చామంతి, తమలపాకులతో ప్రత్యేకంగా చేయించి దాన్ని కూడా క్రేన్ సాయంతో అంబేడ్కర్ మెడలో వేయాలని ప్రణాళిక వేశారు.
    • మహారాష్ట్రకు చెందిన రామ్ వంజీ సుతార్ ఈ విగ్రహం రూపొందించారు. కేపీసీ కంపెనీ కాంట్రాక్టు సంస్థ. విగ్రహం దిల్లీలో తయారు చేసి విడి భాగాలుగా తెచ్చి హైదరాబాద్ లో అమర్చారు.
    • కార్యక్రమ ముఖ్య అతిథిగా అంబేడ్కర్ మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్ వస్తున్నారు. ప్రారంభోత్సవం బౌద్ధ సంప్రదాయంలో చేస్తారు. భారీ సంఖ్యలో జన సమీకరణ కూడా చేస్తున్నారు. వారికి పెద్ద ఎత్తున భోజన ఏర్పాట్లు చేశారు. (అంబేడ్కర్ హిందూ మతం నుంచి బౌద్ధ మతానికి స్వయంగా మారడంతో పాటూ, పెద్ద సంఖ్యలో అనుచరులను బౌద్ధంలోకి మార్చారు. దీంతో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ బౌద్ధ సంప్రదాయంలో చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.)
    • పక్కనే ఉన్న సచివాలయానికి కూడా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని పేరు పెట్టారు. (నిజానికి కొత్త పార్లమెంటుకు అంబేడ్కర్ పేరు పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ, బీజేపీని డిమాండ్ చేసింది. దానికి ప్రతిగా కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెడతారా? అని బీజేపీ వేసిన చాలెంజ్ తీసుకున్న కేసీఆర్, సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టారు.)
    అంబేడ్కర్ విగ్రహం

    ఏపీలో రూ.380 కోట్లకు పెరిగిన అంబేడ్కర్ స్మృతివనం నిర్మాణ వ్యయం

    మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో అంబేడ్కర్ స్మృతివనం పనులు నత్తనడకన సాగుతున్నాయి.

    స్మృతివనం నిర్మాణ వ్యయం రూ.268 కోట్ల నుంచి రూ.380 కోట్లకు చేరిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి, అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఛైర్మెన్ మేరుగు నాగార్జున వెల్లడించారు.

    విజయవాడలో వేల కోట్ల రూపాయల విలువైన పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ భూములను అంబేడ్కర్ స్మృతివనం నిర్మాణానికి కేటాయించడంతో పాటు రూ.268 కోట్లను మంజూరు చేశారని తెలిపారు.

    అయితే స్మృతివనంలో చిరస్థాయిగా నిలిచిపోయేలా మరికొన్ని భవనాలను నిర్మించాలని, స్మృతివనం ప్రాంగణాన్ని అత్యాధునిక పద్ధతుల్లో సుందరీకరించాలని నిర్ణయించడంతో అదనంగా మరో రూ.106 కోట్లను మంజూరు చేశామని చెప్పారు.

    విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనం నిర్మాణ పనులు
    ఫొటో క్యాప్షన్, విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనం నిర్మాణ పనులు

    ఇది కాకుండా పురపాలక శాఖ కూడా మరో రూ.6 కోట్లను స్మృతివనం పనులకు మంజూరు చేసిందని ఈ లెక్కన ప్రస్తుతం అంబేడ్కర్ స్మృతివనం నిర్మాణ వ్యయం రూ.380 కోట్లకు చేరిందని వివరించారు.

    విగ్రహావిష్కరణ పూర్తయ్యే సమయానికి అంచనా వ్యయం రూ.400 కోట్లు దాటే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

    125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం హరియాణలో జరుగుతుండగా దానికి సమాంతరంగా పీడబ్ల్యుడీ గ్రౌండ్స్ లో స్మృతివనం పనులు రాత్రీ పగలూ జరుగుతున్నాయని జరుగుతున్నాయన్నారు.

    ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి నాటికి స్మృతివనం పనులను పూర్తి చేయాలనుకున్నా అనివార్య కారణాలతో జులై నాటికి స్మృతివనం పనులను పూర్తి చేసి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని నాగార్జున తెలిపారు.

    అంబేడ్కర్ జీవిత చరిత్రకు సంబంధించిన అంశాలను ప్రదర్శించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

    స్మృతివనంలో భాగంగా నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్ నిర్మాణపనులను వేగవంతం చేయాలని, మరింత ఎక్కువ మంది కార్మికులను ఈ పనుల్లో వినియోగించాలని సూచించారు.

    వీడియో క్యాప్షన్, హైదరాబాద్: నగరంలో రూపుదిద్దుకుంటున్న భారీ అంబేడ్కర్ విగ్రహం

    ఇవి కూడా చదవండి:

    (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)