బీఆర్ అంబేడ్కర్: అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రాజ్యాంగ రచనలో ఎలా కష్టపడేవారంటే....

ముసాయిదా కమిటీ సభ్యులతో అంబేడ్కర్

ఫొటో సోర్స్, VIJAY SURWADE'S COLLECTION, COURTESY NAVAYANA

ఫొటో క్యాప్షన్, ముసాయిదా కమిటీ సభ్యులతో అంబేడ్కర్
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

1949 నవంబరు 25న రాజ్యాంగం చివరి రీడింగ్ తర్వాత గొప్ప భారత్‌ నాయకుల్లో ఒకరైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవిష్యత్‌లో జరగబోయే పరిణామాలపై ఒక ప్రసంగం ఇచ్చారు.

‘‘1950 జనవరి 26న మనం వైరుధ్యాలతో నిండి జీవితాల్లోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో మనకు సమానత్వం ఉంటుంది. కానీ, సామాజిక, ఆర్థిక అంశాల్లో మాత్రం అసమానత్వం కనిపిస్తుంది’’అని అంబేడ్కర్ చెప్పారు.

ఆ రోజే రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారత్ సార్వభౌమ, గణతంత్ర, ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది.

బహుశా పాత నాగరికత ఒక కొత్త గణతంత్ర రాజ్యంగా అవతరించడంలో ఎదురయ్యే వైరుధ్యాలను ఆ రోజు అంబేడ్కర్ చెప్పి ఉండొచ్చు.

అంటరానితనంపై నిషేధం, బలహీన వర్గాల అభ్యున్నతికి చర్యలు, వయోజనులందరికీ ఓటు హక్కు, అందరికీ సమాన హక్కుల ప్రకటనలతో ఆయన రాజ్యాంగాన్ని సిద్ధంచేశారు.

299 మంది సభ్యులున్న రాజ్యాంగ సభ 1946 నుంచి 1949 మధ్య కల్లోలిత పరిస్థితుల నడుము మూడేళ్లపాటు దీని కోసం పనిచేసింది.

అప్పట్లో దేశాన్ని విభజించి పాకిస్తాన్‌ను కొత్త దేశంగా ఏర్పాటుచేయడంతో మానవ చరిత్రలో మునుపెన్నడూ చూడని భారీ వలసలు, అల్లర్లు, హింస చెలరేగాయి.

అదే సమయంలో అతి కష్టం మీద వందల కొద్దీ సంస్థానాలను భారత్‌లో విలీనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

న్యాయ కోవిదుడైన అంబేడ్కర్ ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్‌గా కొనసాగారు.

మహిళా ఉద్యమకర్తలతో అంబేడ్కర్

ఫొటో సోర్స్, VIJAY SURWADE'S COLLECTION, COURTESY NAVAYANA

ఫొటో క్యాప్షన్, మహిళా ఉద్యమకర్తలతో అంబేడ్కర్

ఆ సమయంలో అనారోగ్యం ఒకవైపు, స్వాతంత్ర ఉద్యమంనాటి విభేదాలు మరోవైపు వెంటాడుతున్నా.. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాల్లో ఒకటైన భారత రాజ్యాంగాన్ని ఎలా రచించారో ఆయన కొత్త ఆత్మకథ ‘ఎ పార్ట్ ఎపార్ట్’లో అశోక్ గోపాల్ వివరించారు.

రాజ్యాంగ నిర్మాతగా అంబేడ్కర్‌కు దేశవిదేశాల నుంచి ఎలా మద్దతు లభించిందో ఈ పుస్తకంలో పేర్కొన్నారు.

ఏడుగురు సభ్యుల ముసాయిదా కమిటీలో ఐదుగురు అగ్రకులాల వారున్నారు. అయితే, వీరు కమిటీకి అంబేడ్కర్ నేతృత్వం వహించేందుకు అంగీకరించారు.

భారత స్వాతంత్ర ఉద్యమానికి మద్దతు ప్రకటించిన ఐర్లాండ్ రాజ్యాంగ నిర్మాత ఏమన్ డీ వలేరా అప్పట్లో అంబేడ్కర్‌కు రాజ్యాంగ బాధ్యతలు అప్పగించాలని బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బ్యాటన్, భారత తొలి ప్రధాన మంత్రి జనహర్‌లాల్ నెహ్రూలకు సూచించారని గోపాల్ ఆ పుస్తకంలో రాశారు. అంబేడ్కర్‌కు ఎడ్వినా మౌంట్‌ బాటన్ రాసిన లేఖలో ఈ విషయాన్ని ప్రస్తావించారని పేర్కొన్నారు.

మరోవైపు రాజ్యాంగ బాధ్యతలను అంబేడ్కర్ తీసుకోవడంతో తనకు కూడా వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉందని ఎడ్వినా అభిప్రాయపడ్డారు. ‘‘ఇక్కడ అన్ని తరగతులకు, అన్ని వర్గాలకూ సమ న్యాయం చేయగల ఏకైక మేధావి మీరే’’అని ఆమె ఓ లేఖలో చెప్పారు.

1947 మార్చిలో వైస్రాయ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన, అంబేడ్కర్‌ల మధ్య ఎంతో విలువైన, ఆసక్తికర చర్చలు జరిగాయని గోపాల్ రాసుకొచ్చారు.

నెహ్రూ తొలి క్యాబినెట్‌లోని 15 మంది మంత్రుల్లో అంబేడ్కర్ పేరు చూసిన తర్వాత చాలా సంతృప్తిగా అనిపించిందని సీనియర్ బ్రిటిష్ అధికారితో వైస్రాయ్ చెప్పారు.

1947 మే నెలలో రాజ్యాంగ సభకు సమర్పించిన మొత్తం ముసాయిదాను అంబేడ్కర్ నేతృత్వంలోని కమిటీ ఆశాంతం క్షుణ్నంగా పరిశీలించింది.

దీన్ని సంబంధిత మంత్రులతోపాటు కాంగ్రెస్ పార్టీకి కూడా పంపించారు. వీటిలో కొన్ని సెక్షన్లను దాదాపు ఏడుసార్లు తిరగరాయాల్సి వచ్చింది.

భార్య శారదా కబీర్‌తో అంబేడ్కర్

ఫొటో సోర్స్, VIJAY SURWADE'S COLLECTION, COURTESY NAVAYANA

ఫొటో క్యాప్షన్, భార్య శారదా కబీర్‌తో అంబేడ్కర్

సవరణల తర్వాత ఆ ముసాయిదాను రాజ్యాంగ సభ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్‌కు అంబేడ్కర్ సమర్పించారు. ఆ తర్వాత మరో 20 ప్రధాన సవరణలు జరిగాయి. దీనిలో రాజ్యాంగ పీఠికను కూడా సవరించారు. దీనిలోనే న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వాలను రాజ్యాంగం ప్రసాదిస్తుందని పేర్కొన్నారు.

పీఠికలోనే ‘‘సౌభ్రాతృత్వం’’ను చేర్చడం అనేది పూర్తిగా అంబేడ్కర్ ఆలోచనేనని ‘అంబేడ్కర్ ప్రియాంబుల్: ఏ సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ద కానిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా’ పుస్తకాన్ని రచించిన ఆకాశ్ సింగ్ రాఠోడ్ వ్యాఖ్యలను గోపాల్ ఉటంకించారు.

రాజ్యాంగ నిర్మాణంలో చాలా బాధ్యతలను అంబేడ్కర్ తన భుజాలపై వేసుకున్నారు. అయితే, అప్పటికే ఆయన మధుమేహం, రక్తపోటుతో బాధపడేవారు. అయినప్పటికీ దాదాపు 100 రోజులపాటు అసెంబ్లీలో నిలబడి ఒక్కో నిబంధనను వివరించారు.

కొన్ని సవరణలను ఆమోదిస్తూ, మరికొన్ని సవరణలను ఆయన తోసిపుచ్చుతూ దానికి తగిన వివరణలు ఇచ్చేవారు.

అయితే, ఆ సమావేశాలకు అందరు సభ్యులు వచ్చేవారు కాదు. కమిటీ సభ్యుల్లో ఒకరైన టీటీ కృష్ణమాచారి 1948 నవంబరులో మాట్లాడుతూ.. ‘‘రాజ్యాంగ ముసాయిదా భారం చాలావరకు అంబేడ్కర్‌పైనే పడింది. ఎందుకంటే చాలా మంది అనారోగ్యం, ఇతర పనుల వల్ల కమిటీ సమావేశాలకు హాజరుకాలేదు. మరికొందరు మరణించారు కూడా’’అని చెప్పారు.

అంబేడ్కర్

ఫొటో సోర్స్, Getty Images

ఆ ముసాయిదాకు 7500పైగా సవరణలను సభ్యులు సూచించారు. వీటిలో 2,500ను ఆమోదించారు. అయితే, దీని కోసం పాటుపడిన వారిలో సినియర్ సివిల్ సర్వెంట్ ఎస్ఎన్ ముఖర్జీకి క్రెడిట్ దక్కుతుందని అంబేడ్కర్ చెప్పారు.

‘‘చాలా సున్నితమైన అంశాలను సరళమైన భాషలో చెప్పేందుకు ఆయన సాయం చేశారు’’అని అంబేడ్కర్ పేర్కొన్నారు.

బలహీన బర్గాల ప్రతినిధిగా, రెబెల్ ఇమేజ్ ఉన్న నాయకుడిగా అంబేడ్కర్‌కు గుర్తింపు ఉన్నప్పటికీ, రాజ్యాంగ విషయంలో అన్ని వర్గాలకూ ప్రాతినిధ్యం కల్పించేందుకు ఆయన ప్రయత్నించారు.

అయితే, బలహీన వర్గాలకు ప్రత్యేక ప్రతినిధుల కోసం విడిగా ఓటింగ్‌కు ఆయన ప్రతిపాదనలు చేశారు. దీన్ని మైనారిటీ కమిటీ తోసిపుచ్చింది. ప్రధాన పరిశ్రమలను జాతీయం చేయాలనే ప్రతిపాదన కూడా ముందుకు వెళ్లలేదు.

1946 డిసెంబరులో రాజ్యాంగ సభ తొలిసారి సమావేశమైనప్పుడు అంబేడ్కర్ మాట్లాడుతూ.. ‘‘నేడు మనం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వర్గాలుగా విడిపోయాం. మనం ఒకరితో మరొకరు పోరాడుతున్నారు. అలాంటి ఒక శిబిరానికి నేను నాయకుడిననే విషయాన్ని కూడా నేను అంగీకరిస్తున్నాను’’అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, అంబేడ్కర్ దళిత జనోద్ధారకుడు, రాజ్యాంగ నిర్మాత... అంతేనా?

ఏదో ఒక గ్రూపు లేదా వర్గానికి కాకుండా అన్ని వర్గాలకూ సమన్యాయం జరిగేందుకు అంబేడ్కర్ పోషించిన తీరు ఆయనలో దార్శనికతకు అద్దంపడుతోందని గోపాల్ రాసుకొచ్చారు.

ఇవన్నీ కలిపి చూస్తే, రాజ్యాంగ నిర్మాత అని అంబేడ్కర్‌ను కొనియాడటం ముమ్మాటికీ సరైనదేనని ఆయన చెప్పారు.

‘‘ఎందుకంటే ఆయన రాజ్యాంగం మొత్తాన్ని కలిపి చూశారు. ఒక్కో నిబంధనకు దగ్గరుండి తుదిరూపం ఇచ్చారు’’అని ఆయన వివరించారు.

రాజ్యాంగానికి అంబేడ్కర్ పైలట్‌లా పనిచేశారని ఆ తర్వాత కాలంలో రాజేంద్ర ప్రసాద్ కూడా కొనియాడారు.

1956 డిసెంబరు 6న, 63 ఏళ్ల వయసులో అంబేడ్కర్ మరణించడంతో అప్పటి ప్రధాన మంత్రి నెహ్రూ మాట్లాడుతూ.. ‘‘రాజ్యాంగ నిర్మాణం కోసం అంతలా పనిచేసివారు వేరొకరు ఉండరు’’అని వ్యాఖ్యానించారు.

ఏడు దశాబ్దాల తర్వాత నేటికీ భారత్‌లోలోని ప్రజాస్వామ్యాన్ని కొన్ని సమస్యలు వేధిస్తున్నాయి. మతాల పేరుతో చిచ్చు పెట్టడం, సామాజిక అసమానతలు లాంటివి భవిష్యత్‌పై సందేహాలు రేకెత్తిస్తున్నాయి.

అయితే, సవరించిన రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినప్పుడు అంబేడ్కర్ ఇచ్చిన మరో ప్రసంగ ప్రారంభ వ్యాఖ్యాలను మనం ఇప్పుడు గుర్తుచేసుకోవాలి.

‘‘భారత్‌లోని మైనారిటీలు మెజారిటీ పాలనను అంగీకరించారు. ఇప్పుడు ఆ మెజారిటీనే తన బాధ్యతలను తెలుసుకోవాలి. వివక్షకు చూపకూడదని అర్థం చేసుకోవాలి’’అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, అంబేడ్కర్: ‘కులాంతర వివాహాలు, కలిసి భోజనాలు చేయడం వల్ల కుల వ్యవస్థ అంతం కాదు’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)