తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నిధులు ఇవ్వడంలో కేంద్రం వివక్ష చూపిస్తోందా?

ఫొటో సోర్స్, TELANGANA CMO
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
నాలుగు రోజుల కిందట కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓ లేఖ రాశారు.
‘‘అడవుల విస్తీర్ణం పెంచేందుకు కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అండ్ అథారిటీ(కంపా) పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. 2019-20 నుంచి 2021-22 మధ్య కాలంలో రూ.3,110 కోట్లు తెలంగాణకు ఇచ్చింది. ఇందులో రూ.609 కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ ఖర్చు పెట్టలేదు’’ అని లేఖలో పేర్కొన్నారు.
దీనిపై తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించింది.
నీతి అయోగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం 2019-20 నుంచి 2021-22 మధ్య కాలంలో కంపా నిధులను ఎక్కువగా వాడుకున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ప్రకటించింది.
ఐఎస్ఎఫ్ఆర్(ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు) నివేదిక ప్రకారం తెలంగాణలో 2015 నుంచి 2021 మధ్య కాలంలో అటవీ విస్తీర్ణం 7.7శాతం పెరిగింది. 2019 నుంచి 2021 మధ్య ౩.07శాతం పెరిగింది.

ఫొటో సోర్స్, FACEBOOK/NARENDRA MODI
నిధులు సరిగా వాడుకోలేకపోయి ఉంటే ఈ స్థాయిలో అటవీ విస్తీర్ణం ఏ విధంగా పెరిగేదన్నది తెలంగాణ ప్రభుత్వ ప్రశ్న.
ఇదే విషయంపై తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలో అడవుల విస్తీర్ణం బాగా పెరిగింది. కంపా నిధులు వినియోగంలో తెలంగాణ పనితీరు బాగుందని కేంద్ర మంత్రులే పలుమార్లు పార్లమెంటులో అన్నారు. హరితహారం వంటి కార్యక్రమాలతో మొక్కల పెంపకం చేపట్టి అటవీ విస్తీర్ణం పెంచడంలో తెలంగాణ కీలకంగా నిలిచింది’’ అని బోయినపల్లి వినోద్ కుమార్ చెప్పారు.
ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఇచ్చే నిధుల విషయంపై చర్చకు మొదలైంది.
గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం నుంచి తగినంత ఆర్థిక సాయం రావడం లేదని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. ముఖ్యంగా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి ఎక్కువగా విమర్ళలు వస్తున్నాయి.
తమిళనాడు, తెలంగాణ, పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాలు కేంద్రం తక్కువగా నిధులు ఇస్తోందని పదేపదే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ గట్టిగా స్వరం వినిపించకపోయినా, వినతిపత్రాలు ఇచ్చి ఆదుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది.
అయితే, రాష్ట్రాలు మొత్తం చెల్లిస్తున్న పన్నుల ఆదాయం ఆధారంగా నిధుల కేటాయింపు ఉండదని నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK.COM/NKSINGH.MP
రాష్ట్రాలకు ఎంత నిధులివ్వాలి..?
15వ ఆర్థిక సంఘం ప్రతిపాదనలకు అనుగుణంగా రాష్ట్రాలకు నిధులు పంచుతున్నట్లు కేంద్రం చెబుతోంది.
ఈ ఆర్థిక సంఘం ప్రతిపాదనలు 2021-22 నుంచి 2025-26 వరకు అమల్లో ఉండనున్నాయి.
ప్రస్తుతం మొత్తం పన్నుల ఆదాయంలో 41శాతం రాష్ట్రాలకు కేంద్రం పంచుతోంది. ఇందులోనూ కోతలు పెడుతోందని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పే మాట.
ముఖ్యంగా కరోనావైరస్ మహమ్మారి ప్రబలిన తర్వాత కోతలు అధికమయ్యాయని వివిధ రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ఏటా కేంద్రానికి జమ అయ్యే కార్పొరేషన్, వెల్త్ ట్యాక్సు, సెంట్రల్ జీఎస్టీ, కస్టమ్స్, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్సు కలిపి ట్యాక్స్ పూల్‌లో జమ అవుతాయి.
ఇందులో 2023-24 సంవత్సరానికి రాష్ట్రాలకు పంచే రూ.10.21 లక్షల కోట్లుగా ఈ ఏడాది బడ్జెట్ లో అంచనా వేసింది.
ఈ నిధులతో పాటు వివిధ ప్రాయోజిత పథకాలకు కేంద్రం నిధులు ఇస్తుంది.
కేంద్ర వాటా నుంచే స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు, పంచాయతీలకు నేరుగా నిధులు ఇస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఏయే అంశాలు ప్రామాణికం అంటే..?
మన దేశంలో మూడంచెల ఫెడరల్ వ్యవస్థ అమల్లో ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
సహజంగా కేంద్రం ఇచ్చే నిధులు ‘ఇన్‌కం డిస్టెన్స్’ అనే ప్రామాణికత ఆధారంగా ఉంటుందని బెంగళూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎన్.ఆర్.భానుమూర్తి చెప్పారు.
ఈ విషయంపై ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ఇన్‌కం డిస్టెన్స్ ప్రామాణిత ప్రకారం చూస్తే తక్కువ వేగంతో అభివ్రద్ధి చెందుతున్న రాష్ర్టాల కంటే వేగంగా అభివ్రద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కొంత తక్కువ నిధులు వస్తుంటాయి.
జనాభా సహా ఎన్నో అంశాలు పరిగణనలోకి తీసుకుని నిధుల కేటాయింపు జరుగుతుంది.
అలాగని కేవలం జనాభా ప్రకారమే నిధులు ఇస్తారని కూడా ఉండదు. ఎందుకంటే అలా చూస్తే బిహార్ కంటే మహారాష్ర్టకు ఎక్కువ నిధులు ఇవ్వాలి. అందుకే ఇన్‌కం డిస్టెన్స్ అనేది కీలకమవుతుంది’’ అని భానుమూర్తి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కేంద్రంపై తరచూ విమర్శలెందుకు..?
నిధులు పంపిణీ చేసే విషయంలో 15వ ఆర్థిక సంఘం కొన్ని సూచనలు చేసింది.
దీని ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలని సూచించింది.
రాష్ట్రాలకు ఉన్న ఆదాయ వనరులు, 2011 జనాభా లెక్కలు, అటవీ విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులు, పన్నుల పరిస్థితి ఆధారంగా నిధులు ఇవ్వాలని సూచించింది.
ఆయా ప్రతిపాదనల ప్రకారమే నిధుల కేటాయింపు జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. కొన్ని రాష్ట్రాలకు నిధులు ఎక్కువగా ఇస్తున్నారన్న విమర్ళలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి.
ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున, ఎక్కడై రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉందో.. లేదా ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆయా రాష్ట్రాలకు నిధులు ఎక్కువగా ఇస్తున్నారనే విమర్శలు వస్తూనే ఉన్నాయి.
‘‘మనమంతా ఫెడరల్ వ్యవస్థలో భాగం. అన్ని రాష్ట్రాలను పరిగణనలోకి నిధులు కేటాయింపు జరుగుతుంది. సహజంగా ఈక్విలైజేషన్ ప్రిన్సిపల్ ఆధారంగా ఉంటుంది.
గత ప్లానింగ్ కమిషన్లను గమనిస్తే ఎక్కువగా గాడ్గిల్ ఫార్ములాను అనుసరించారు. పేదరికం, జనాభా, విస్తీర్ణం ఆధారంగానే నిధుల పంపిణీ జరిగేది.
అలా చూసినా పేద రాష్ర్టానికి ఎక్కువగా నిధులు వస్తుంటాయి. అంతేకానీ, ఆదాయం ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు నిధులు ఇవ్వడం సరైన విధానం కాదు’’ బీబీసీతో చెప్పారు ఎన్ఆర్ భానుమూర్తి.

ఫొటో సోర్స్, Getty Images
ట్యాక్సులు ఎక్కువ కడితే ఎక్కువ నిధులివ్వాలా..?
కేంద్రం నుంచి రాష్ట్రాలకు ప్రధానంగా నాలుగు మార్గాలలో నిధులు వెళుతుంటాయి. ప్రధానంగా ట్యాక్సుల ద్వారా వచ్చిన ఆదాయం నుంచి తప్పనిసరిగా పంపిణీ చేయాల్సి ఉంటుంది.
ఇది కాకుండా పథకాల ఆధారంగా, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, ఇతర గ్రాంట్లు(బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా) కేంద్రం నిధులు ఇస్తుంటుంది.
నిధుల కేటాయింపు విషయంపై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఎకనామిక్స్ ప్రొఫెసర్ చిట్టెడి కృష్ణారెడ్డి బీబీసీతో మాట్లాడారు.
‘‘ప్లానింగ్ కమిషన్ ప్రతిపాదనల ఆధారంగా నిధుల కేటాయింపు జరుగుతుంది. అంతేకానీ, ట్యాక్సులు ఎక్కువ కడుతున్నాం. అయినా నిధులు ఇవ్వడం లేదని సరైన స్టేట్ మెంట్ కాదు. పేద రాష్ట్రాలకు నిధులు కేటాయించాల్సి ఉంటుంది.
అలాగే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల విషయానికి వస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులే కాకుండా సొంత వనరులు ఉంటాయి. అందుకే ఆయా రాష్ట్రాలు అభివ్రద్ధి సాధించేందుకు వీలుంటుంది’’ అని అన్నారు.
తెలుగు రాష్ట్రాల కంటే వాటికే ఎక్కువ..
ఈ ఏడాదిలో బడ్జెట్లో పెట్టిన సెంట్రల్ ట్యాక్సు పూల్ నుంచి ఏయే రాష్ట్రాలకు ఎంత ఇవ్వనున్నారో ఒక్కసారి గమనిస్తే.. అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్, బిహార్‌కు ఎక్కువ నిధులు దక్కాయి.
ఉత్తర్ ప్రదేశ్‌కు రూ.183237 కోట్లు.. తర్వాత బిహార్ కు రూ.102737 కోట్లు ట్యాక్సు పూల్ నుంచి పంపిణీ చేయాలని కేంద్రం ప్రతిపాదించింది.
ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.41,338 కోట్లు ప్రతిపాదించింది. తెలంగాణకు రూ.21,470 కోట్లు ఇవ్వాలనే ప్రతిపానదలు ఉన్నట్లు పేర్కొంది.
రాష్ట్రాలకు అదనపు ఆదాయం ఉందా..?
కేంద్రం నుంచి వచ్చే నిధులతోపాటు పన్నులు, ఎక్సైజ్, వాహనాలపై పన్ను, స్టాంపు డ్యూటీ, రిజిస్ర్టేషన్ ఫీజు, భూముల నుంచ వచ్చే రెవెన్యూ, ఇతర పన్నుల నుంచి రాష్ట్రాలకు రెవెన్యూ వస్తుంది.
అలాగే 2017 జులై ఒకటో తేదీన జీఎస్టీ అమల్లోకి వచ్చింది. ఇందులో ఎస్జీఎస్టీ నిధులు నేరుగా రాష్ట్రాలకే వెళుతుంటాయి.
దీనివల్ల కేంద్రం నుంచి ఎప్పుడైనా కాస్త అటూఇటూగా నిధులు తక్కువగా వచ్చినా, సొంత ఆదాయం ఉంటుంది కనుక కొంతమేర నెట్టుకు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.
నిధులు ఇచ్చినప్పుడు వాడుకోకపోతే మురిగిపోతాయా..?
కొన్ని సార్లు రాష్ట్రాలకు ఇచ్చిన నిధులు మురిగిపోయాయనే వింటుంటాం..
అసలు నిధులు మురిగిపోవడం అంటే ఏమిటి..? అనే ప్రశ్న చాలా మందిలో వస్తుంటుంది.
ఏదైనా ఒక కార్యక్రమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తే అది ఆ పద్దు కింద మార్చి 31.. అంటే ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఖర్చు చేయాలి.
లేకపోతే ఆ పద్దు కింద వాడుకునే అవకాశం ఉండదు.
నిధుల విడుదల నిలిచిపోతుంది. అవి సహజంగానే సేవింగ్స్ ఖాతాలోనో.. మరొక పద్దులోనూ ప్రభుత్వం చూపిస్తుంది.
ఇలా వాడుకోలేకపోతే, నిధులు మురిగిపోయినట్లుగా చెబుతారు.
జల్ శక్తి అభియాన్ కింద ఖర్చు చేయని వివరాలు కేంద్రం గతంలో ప్రకటించిందని ప్రొఫెసర్ చిట్టెడి కృష్ణారెడ్డి బీబీసీకి చెప్పారు.
‘‘ప్రతి రూపాయి ఖర్చు చేయాలంటే రాష్ట్రమైనా, కేంద్రమైనా.. అసెంబ్లీలో లేదా లోక్‌సభలో అనుమతి తప్పనిసరి. పలానా పద్దు కింద ఖర్చు పెడుతున్నామని ప్రతిపాదనలు ఇస్తారు.
అలా ఖర్చు పెట్టలేనప్పుడు మరుసటి ఏడాదికి సంబంధించి కొత్త ప్రతిపాదనలు వస్తాయి. పాత ప్రతిపాదనలకు విలువ ఉండదు.
మురిగిపోవడం అంటే ఏదైనా పద్దు కింద కేటాయిస్తే, నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత ఖర్చు చేయడానికి ఉండదు’’ అని కృష్ణారెడ్డి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- స్వధార్ గృహ: కష్టాల్లో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచే ఈ పథకం ఎలా పని చేస్తుంది?
- ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం పదే పదే ఎందుకు మాట మారుస్తోంది...
- రామప్ప ఆలయం: ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ఈ గుడి ప్రత్యేకతలేంటి
- సుప్రీంకోర్టు: స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లను అనుమతిస్తుందా, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఆశ ఏంటి?
- సూడాన్‌లో ఏం జరుగుతోంది? మిలిటరీ, పారా మిలిటరీ మధ్య యుద్ధం ఎందుకు?
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















