తెలంగాణ: కార్పొరేట్ కాలేజీల్లో నిద్ర లేకుండా చదువులు.. ర్యాంకుల వేటలో ఇంటర్ విద్యార్థుల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందా?

మానసిక ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆలమూరు సౌమ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రైవేటు, కార్పొరేట్ రెసిడెన్షియల్ కాలేజీల్లో ఇంటర్ చదువుతున్న పిల్లలకు ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి చేయాలని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ యోచిస్తోంది.

కార్పొరేట్ కాలేజీల్లో తగినంత నిద్ర పోవడానికి కూడా సమయం ఇవ్వకుండా క్లాసులు పెట్టి విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నారని విద్యారంగ విశ్లేషకులు చాలా కాలంగా ఆందోళన వ్యక్తంచేస్తూనే ఉన్నారు.

ఇంజినీరింగ్, మెడిసిన్, ఐఐటీలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. వీటిల్లో ర్యాంకుల కోసం ఇంటర్మీడియట్ నుంచే ప్రిపరేషన్ మొదలుపెడతారు. తమ కాలేజీల్లో చేరితే ర్యాంకులు గ్యారంటీ అంటూ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు ఊదరగొడుతుంటాయి. ఇదంతా ఒక ప్రహసనం. ఇందులో ఫీజులేమీ తక్కువ కాదు.

వీటన్నిటి మధ్య విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని, సరిగా నిద్రపోక, ఆటవిడుపు కరువై మానసికంగా కుంగిపోతున్నారని నిపుణులు అంటున్నారు.

టీనేజర్లకు రోజుకు 9 నుంచి 10 గంటల నిద్ర అవసరమని డాక్టర్లు చెబుతున్నారు.

ఆ వయసులో వారు కీలకమైన అభివృద్ధి దశలో ఉంటారని, మెదడు, శరీరం అనేక మార్పులకు లోనవుతాయి. సరైన నిద్ర లేకపోతే డిప్రెషన్‌కు లోనుకావచ్చు లేదా చెడు వ్యసనాల దారి పట్టవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.

ఇంటర్ బోర్డు మార్గదర్శకాలు జారీ చేస్తే పరిస్థితుల్లో మార్పులు వస్తాయా? ప్రైవేట్ కాలేజీల విధానాల నియంత్రణ సాధ్యమేనా? 15-17 ఏళ్ల పిల్లలు రోజంతా చదువుతూ, తక్కువ నిద్రపోతే వారు ఎలాంటి ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది?

ఇంటర్ విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

టీనేజర్లు సరిగ్గా నిద్రపోకపోతే, ఆ ఫలితాలు వారి భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని 2020లో యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్‌లో నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. 15-24 ఏళ్ల మధ్య పిల్లలపై ఈ పరిశోధన చేశారు.

15 ఏళ్ల కుర్రాడు సరిగా నిద్రపోకపోతే, అప్పటికప్పుడు ఎలాంటి మానసిక అనారోగ్యం కనిపించకపోయినా 17 ఏళ్లు లేదా 21 ఏళ్లు వచ్చేసరికి డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఈ పరిశోధనలో తేలింది.

కార్పొరేట్ జూనియర్ కాలేజీ విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

పై పై మార్పులతో లాభం లేదు: నిపుణులు

ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ విద్యార్థులు విపరీతమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారన్న మాట వాస్తవమేనని విద్యారంగంలో నిపుణులు అంటున్నారు.

కార్పొరేట్ కాలేజీలను నియంత్రించడానికి ప్రభుత్వాలు ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకోవాలి గానీ, పైపై మార్పుల వల్ల సమస్య పరిష్కారం కాదని ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ రమేశ్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు.

"కార్పొరేట్ కాలేజీలను నియంత్రించడానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అవసరమైన, ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవట్లేదు.

మొదటగా, ప్రభుత్వ కాలేజీలను అభివృద్ది చేసి, గుణాత్మకమైన విద్యను అందిస్తే కార్పొరేట్ కాలేజీల హవా తగ్గుతుంది. అది కుదరకపోతే, కార్పొరేట్ కాలేజీ గవర్నింగ్ బాడీలలో తల్లిదండ్రులకు ముఖ్య పాత్ర కల్పించాలి.

మనకు ఒక చట్టం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దీనికి సంబంధించిన జీవో వచ్చింది. ప్రతి కాలేజీకి, స్కూలుకు ఒక గవర్నింగ్ బాడీ ఉంటుంది. ఇందులో ఆరుగురు సభ్యులు ఉంటారు. అందులో పేరెంట్స్ ప్రతినిధిగా ఒకరినే పెడుతున్నారు.

గవర్నింగ్ బాడీని విస్తరించాలి. వెయ్యి మంది విద్యార్థులు ఉన్నప్పుడు 50 మంది సభ్యులతో గవర్నింగ్ బాడీ పెట్టొచ్చు. అందులో 80 శాతం తల్లిదండ్రుల ప్రాతినిధ్యం ఉండాలి, అప్పుడు చర్చలు విస్తృతంగా జరుగుతాయి. అవసరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

సీట్లు, ర్యాంకుల గురించి కాలేజీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యాలు ఏం చేస్తున్నాయో తెలియడం లేదు. అందుకే గవర్నింగ్ బాడీలో తల్లిదండ్రుల ప్రాతినిధ్యం పెరిగితే ఇవన్నీ చర్చకు వస్తాయి" అని ఆయన చెప్పారు.

విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటోందని, దానివల్ల వారి మానసిక వికాసం దెబ్బతింటుందని, కాలేజీల మొత్తం విధానాల్లో మార్పులు వస్తే తప్ప సమస్య పరిష్కారం కాదని రమేశ్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు.

"ఐఐటీ లాంటి సంస్థల్లో రాష్ట్రాల వారీగా కోటా లేదు. ఇది పెద్ద సమస్య. రాష్ట్రాల జనాభా ప్రకారం కోటాలు ఉంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ వేలంవెర్రి కొంత తగ్గుతుంది. ఇప్పుడు ఐఐటీల్లో 50 శాతం మన రాష్ట్రాల విద్యార్థులే ఉంటున్నారు. దానివల్ల ఆరో క్లాసు నుంచి ఐఐటీ కోచింగ్, కొన్ని చోట్ల యూకేజీ నుంచే ఐఐటీ కోచింగ్ అని బోర్డులు పెడుతున్నారు. ఏడు, ఎనిమిది గంటల పని తరువాత ఎవరికైనా విశ్రాంతి కావాలి. అంతకుమించి చదువు చెబితే విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుంది తప్ప ప్రయోజనం ఉండదు" అని ఆయన అన్నారు.

"ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వాలు కాకపోతే ఇంకెవరు చేస్తారు? కానీ, ఎలాంటి మార్పులు తీసుకురావాలన్నదే సమస్య. దీనిపై అవగాహన ఉన్నట్టు కనిపించడం లేదు" అని రమేశ్ అన్నారు.

విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

నలిగిపోయేంత ఒత్తిడి మంచిదికాదు

పోటీ పరీక్షలు ఉండాలి, కొంత వరకు ఒత్తిడి ఉండాలి, కానీ అవి విద్యార్థుల సంపూర్ణాభివృద్ధిని దెబ్బతీసేలా ఉండకూడదని విద్యారంగ నిపుణులు, స్లేట్ ఎడ్యుకేషన్ సొసైటీ డైరెక్టర్ వాసిరెడ్డి అమర్నాథ్ అన్నారు.

"ఇంటర్మీడియట్ లైఫ్ టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. అంతకుముందు వరకు స్కూలు చదువు వేరు. ఇంటర్మీడియట్ రెండేళ్లలో చాలా వరకు భవిష్యత్తు నిర్ణయమైపోతుంది.

ఇప్పుడు దాదాపు పోటీ పరీక్షలన్నీ రాష్ట్ర స్థాయిలో కాకుండా దేశ స్థాయిలో జరుగుతున్నాయి. విపరీతమైన పోటీ ఉన్న మాట వాస్తవం. హైస్కూలు పిల్లల్లాగ నాలుగైదు గంటలు చదివితే పోటీ పడలేరన్న మాట నిజం. ఇంటర్‌లో కొంత ఎక్కువ శ్రద్ధ, ఎక్కువ సమయం వెచ్చించాల్సి ఉంటుంది. కానీ, మరీ రోజుకు 13-14 గంటలు చదువు ఏ కోణంలోనూ సమర్థనీయం కాదు.

కొంత ఒత్తిడి ఉండడం అవసరమే కానీ విద్యార్థులు నలిగిపోయేలా కాదు. కొంతవరకు పోటీతత్వాన్ని ప్రేరేపించి, వారిలో పట్టుదల కలిగేలా చేయాలిగానీ, మానసికంగా కుంగిపోయేంత ఒత్తిడి ఉండకూడదు. ఎనిమిది గంటల విద్య, ఒకటి రెండు గంటలు స్టడీ అవర్స్ పెట్టుకుంటే చాలు. ఎనిమిది గంటలు మించి చదువు చెప్పినా విద్యార్థుల బుర్రల్లోకి ఏమీ ఎక్కదు" అని ఆయన వివరించారు.

చదువులు

ఫొటో సోర్స్, Getty Images

ఐఐటీ సీటు జీవితానికి శుభం కార్డు కాదు: వాసిరెడ్డి అమర్నాథ్

15-17 ఏళ్ల విద్యార్థులలో హార్మోనల్ ఎదుగుదల ఉంటుందని, వారికి మానసికోల్లాసం కలిగించే ఆటవిడుపు కొంత కావాలని అమర్నాథ్ చెప్పారు.

"పరీక్షల ముందు నిద్రపోకుండా చదివారంటే అర్థముంది. కానీ, ఏడాది పొడవునా చదివితే మానసిక సమస్యలు వస్తాయి. కార్పొరేట్ కాలేజీల్లో వేల కొద్దీ విద్యార్థులు చేరుతారు. అందరికీ ఐఐటీ ర్యాంకులు రావు. రానివారి పరిస్థితి ఏమిటి? వారి మానసిక ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఇది ఆలోచించాల్సిన విషయం. రెండేళ్లు నిద్ర లేకుండా చదివేసి, భవిష్యత్తులో మానసిక ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటే అది సరైన విద్య అవుతుందా?" అని ఆయన ప్రశ్నించారు.

ఐఐటీలో సీటు వచ్చేస్తే జీవితానికి శుభం కార్డు పడినట్టు కాదని అమర్నాథ్ వ్యాఖ్యానించారు.

"సీటు వచ్చాక, అక్కడ చదవలేక వెనక్కొచ్చిన వారెందరో ఉంటారు. ఆ తరువాత ఇంకా ఎంతో జీవితం ఉంది. చేయాల్సిన పనులు, నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఎన్నో ఉంటాయి. కానీ, ఆ రెండేళ్ల మితిమీరిన చదువు వల్ల భౌతిక, మానసిక ఎదుగుదల దెబ్బతిని, జీవితంలో ఏ నిర్ణయం సరిగ్గా తీసుకోలేక మానసిక సమస్యలు ఎదుర్కొంటూ చాలా మంది సతమతమవుతున్నారు" అని ఆయన చెప్పారు.

మంచి చదువు ఉండాలి, మంచి సంస్థలో సీటు రావాలి, మంచి ఉద్యోగం రావాలి అని కోరుకోవడం తప్పు కాదని, ఆ కోరిక, ఆ పోటీతత్వం కూడా ఉండాలని అమర్నాథ్ ప్రస్తావించారు. అయితే మితిమీరిన శిక్షణ, నిద్రలేకుండా ఏళ్ల పాటు చదువు సరైన విధానం కాదన్నారు.

"ముప్పై ఏళ్లుగా ఈ కార్పొరేట్ కాలేజీలు రాజ్యమేలుతున్నాయి. ఇందులో చదువుతున్నవారికి సోషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, రాజకీయ జ్ఞానం ఇవన్నీ సున్నా అయిపోతున్నాయి. ఇది కాదు చదువు అంటే. సంపూర్ణాభివృద్ధి జరగట్లేదు" అంటూ అమర్నాథ్ విచారం వ్యక్తంచేశారు.

నిద్రలేమి

ఫొటో సోర్స్, Getty Images

మార్కెట్ డిమాండ్‌లో మార్పు రావాలి: బీపీ పడాల

కొందరు విద్యార్థులు స్వచ్ఛందంగా, ఇష్టపడే రోజుకు 15-16 గంటలు నిద్రపోకుండా చదువుకుంటారని, కానీ అదే విధానం వేల మంది విద్యార్థులపై రుద్దడం సరి కాదని హైదరాబాద్‌లోని రూట్స్ కొలీజియం చైర్మన్ బీపీ పడాల చెప్పారు.

"క్లాసుల్లో విశ్లేషణ తక్కువగా, బట్టీ పట్టే విధానం ఎక్కువగా ఉంటోంది. టీచర్లు టైం టేబిల్ ప్రకారం పాఠం చెప్పుకుంటూ వెళ్లిపోతారు. విద్యార్థుల సందేహాలు తీర్చేందుకు వాళ్లకు సమయం ఉండదు. టీచర్లపైనా పని భారం చాలా ఎక్కువగా ఉంటోంది. కొందరు విద్యార్థులు ఇష్టపడి రోజంతా చదువుకుంటారు. అలాంటివారు పది శాతం కూడా ఉండరు. కానీ, మిగతా వేల మంది విద్యార్థులు కూడా అలాగే చదవాలని ఒత్తిడి పెడితే, అది వారి మానసిక ఎదుగుదలను దెబ్బతీస్తుంది" అని ఆయన అన్నారు.

ప్రభుత్వాలు మార్గదర్శాకాలను జారీచేసినా, కాలేజీలు వాటిని పాటిస్తున్నాయా, లేదా అని పర్యవేక్షించే విధానం లేకపోతే ఎన్ని మార్పులు తీసుకొచ్చినా లాభం లేదని ఆయన చెప్పారు.

ప్రభుత్వాలు మార్పులు చేపట్టినా, మార్కెట్‌లో మార్పు రాకపోతే వేలంవెర్రి తగ్గదని పడాల అభిప్రాయపడ్డారు.

"మార్కెట్ డిమాండ్‌లో, తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పులు వస్తే తప్ప విద్యార్థులకు ఈ బాధలు తప్పవు" అన్నారాయన.

విద్య

ఫొటో సోర్స్, Getty Images

టీనేజర్లకు ఎంత నిద్ర అవసరం?

తగినంత నిద్రపోకుండా చదివితే పెద్దగా ప్రయోజనం ఉండదని నిపుణుల మాటలను బట్టి స్పష్టమవుతోంది.

టీనేజీలో ఉన్న పిల్లలకు రోజుకు కనీసం 8 గంటల నిద్ర అవసరమని, నిద్రపోకుండా చదవడం వలన విద్యార్థులకు కలిగే లాభాల కంటే నష్టాలే ఎక్కువని డాక్టర్ ప్రతిభాలక్ష్మి చెబుతున్నారు.

"సరిపడా నిద్ర శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం. ముఖ్యంగా విద్యార్థులు రోజూ ఎనిమిది గంటల నిద్రపోకపోతే, రోజంతా ఉత్సాహంగా ఉండలేరు. చదువును ఒత్తిడిగా భావించి, అధిక సమయం చదివే ప్రయత్నంలో సరిపడా నిద్రపోక పోవడం వల్ల నష్టపోతారు. అలసట, నీరసం వారి ఉత్పాదకతను తగ్గించేస్తాయి. ఏకాగ్రతతో చదవలేక పోవడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గి, చదివినవి గుర్తుండకపోయే ప్రమాదం ఉంది."

నిద్రలేమి సమస్యకు ముఖ్య కారణం స్లీప్ హైజిన్ లోపించడమని ఆమె వివరించారు.

స్లీప్ హైజిన్ పాటించడం అంటే ప్రతి రోజూ ఒకే సమయానికి పడుకుని, ఒకే సమయానికి నిద్ర లేవడం.

"స్లీప్ హైజిన్ వల్ల మన సర్కేడియన్ రిథమ్(జీవ గడియారం) చక్కగా ఉంటుంది. అంతే కాక, నిద్రకు ఉపక్రమించడానికి కనీసం కొన్ని గంటల ముందు స్క్రీన్ చూడకుండా ఉండడం మంచిది.

స్క్రీన్ నుండి వెలువడే కాంతి కిరణాల వల్ల, మెలటోనిన్ తగ్గిపోయి నిద్ర లేమి కలుగవచ్చు. రోజూ ఎనిమిది గంటల గాఢ నిద్ర పోయే విద్యార్థులు నిద్రాహారాలు మాని చదివే వారి కన్నా, మంచి ఫలితాలను పొందగలరు" అని డాక్టర్ ప్రతిభాలక్ష్మి వివరించారు.

సర్కేడియన్ రిథమ్ అనేది మన మెదడులో ఉండే 24 గంటల అంతర్గత గడియారం. ఇది వాతావరణంలో తేలికపాటి మార్పులకు ప్రతిస్పందిస్తూ మనం తెలివిగా ఉండే, నిద్రపోయే చక్రాలను నియంత్రిస్తుంది.

ఇవి కూడా చదవండి: