అగ్నిప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ప్రాణాలతో బయటపడడం ఎలా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, డాక్టర్ ప్రతిభాలక్ష్మి
- హోదా, బీబీసీ కోసం
అగ్ని ప్రమాదాలు రకరకాలుగా సంభవిస్తుంటాయి. వంటగది మొదలుకొని పెద్ద పెద్ద కాంప్లెక్స్‌లలో జరిగిన ఎన్నో అగ్నిప్రమాదాలను మనం చూశాం.
వీటిలో ప్రమాదవశాత్తు జరిగేవే ఎక్కువ. అయితే, కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యా యత్నాలు కూడా ఇలాంటి ప్రమాదాలకు దారి తీస్తుంటాయి.
అయితే, ఇలాంటి ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు ఏం చేయాలి? సురక్షితంగా ఎలా బయటపడాలి? మంటల్లో గాయపడితే చేయాల్సిన చికిత్స ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
పరిగెత్తకూడదు..
వంట గదిలో గానీ, దేవుడి దగ్గర పెట్టిన దీపం వల్ల కానీ, దీపావళి సమయంలో పెట్టే దీపాల నుంచి కానీ, పొరపాటున బట్టలకు మంట అంటుకుంటే, కంగారులో పరిగెత్తకూడదు.
గాలికి మంట ఇంకా ఎక్కువ అవుతుంది అని గుర్తు పెట్టుకోవాలి. ఆ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ముందుగా ఒక దుప్పటి గానీ, నీరు కానీ పోసి ఆ మంటను ఆర్పే ప్రయత్నం చేయాలి.
అలాగే నిప్పు లేదా, అగ్నికి కారణమైన ఆ స్థలానికి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేయాలి. వెంటనే ఆ బట్టలను తొలిగించి, కాలిన గాయాల మీద నీరు పోయడం మంచిది.

ఫొటో సోర్స్, Getty Images
ఐస్ పెట్టకూడదు
ఇంట్లో ఏమైనా చిన్న కాలిన గాయాలు అయినప్పుడు, వెంటనే ఆ భాగాన్ని 10 నిమిషాల పాటు చల్లటి నీటి కింద పెట్టాలి. అలా అని ఆ గాయాల మీద ఐస్ పెట్టకూడదు.
తరవాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోని, శుభ్రమైన చేతులతో ఏదైనా యాంటీసెప్టిక్ క్రీమ్ రాసుకోవాలి. మట్టి, పేస్టులు వంటివి, లేదా నూనెలు పెట్టకూడదు.
నీటి బుడగలు రావడం అనేది కాలిన గాయం కేవలం ఉపరితలం మీదనే ఉంది అని తెలియచేస్తుంది. కాబట్టి అలా నీటి బుడగలు అయితే కంగారు పడకూడదు. వాటిని పగలకొట్ట కూడదు. వాటిని శుభ్రంగా పగలకొట్టక పోతే ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఒక సారి వైద్యులను సంప్రదించడం మంచిది.

ఫొటో సోర్స్, Getty Images
ఇన్ఫెక్షన్ల ముప్పుతో జాగ్రత్త..
ఎక్కువ కాలినట్లైతే శుభ్రమైన క్లాత్ లేదా బ్యాండేజీ కట్టి, వీలైనంత తొందరగా, ఆసుపత్రికి తీసుకెళ్లాలి. కాలిన గాయాల వల్ల కన్నా, వాటి వల్ల కలిగే ఇన్ఫెక్షన్ల వల్ల ప్రాణాపాయం ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి.
కాలిన గాయాల వల్ల 20 శాతం మాత్రమే ప్రాణాపాయం ఉంటుంది. వాటిలో సంభవించే ఇన్ఫెక్షన్ వల్ల 80 శాతం మరణాలు సంభవిస్తాయి.
అందుకే శుభ్రమైన బట్టలు, కుదిరితే ఏదైనా క్రిమి సంహారక మందులతో (డెటాల్‌తో) ఉతికిన బట్టలు వేయాలి. వారు పడుకునే, కప్పుకునే బట్టలను కూడా అలాగే అత్యంత పరిశుభ్రంగా ఉంచాలి.
వైద్యుల సలహా మేరకు యాంటిబయోటిక్స్ క్రమం తప్పకుండా వాడాలి. వాటితో పాటు గాయాలు త్వరగా మానడానికి విటమిన్లు, అవసరమైన లవణాల కోసం పళ్లు తినాలి. అలాగే మాంసకృత్తులు బాగా ఉన్న ఆహారం తినడం వల్ల గాయాలు త్వరగా మానిపోతాయి.

ఫొటో సోర్స్, Science Photo Library
ఆహారం ముఖ్యం..
వేడి నూనె, లేక వేడి నీరు పడడం వల్ల చిన్న పిల్లలకు కూడా గాయాలు అవుతుంటాయి. వారి శరీర ఉపరితల ప్రదేశం తక్కువ ఉండడం వల్ల, కొంచం నూనె లేక నీరు వల్ల అయ్యే గాయాలు కూడా ఎక్కువ సమస్య అయ్యే ప్రమాదం ఉంటుంది.
ఇవి కాలిన గాయాలకు ఏ మాత్రం తక్కువ కాదు. ఈ గాయాలలో కూడా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు చాలా అధికమే. అందుకే వీటిని పరిశుభ్రంగా ఉంచుతూ, తగిన యాంటీసెప్టిక్ క్రీమ్ పెడుతూ, దుమ్ము పడకుండా, బట్టలు లేక ఇతర ఏ కారణాల వల్ల కూడా ఇన్ఫెక్షన్ సోకకుండా చూసుకోవాలి.
అలాగే రోగ నిరోధక శక్తి పెరిగే లాగా, గాయం త్వరగా మానే లాగా ఆరోగ్యకరమైన ఆహారం అందించాలి. గాయాలు పూర్తిగా మానిన తరవాత ఒక వేల ఏదైనా మరక లేక వైకల్యం మిగిలిపోతే, దానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి సవరించే అవకాశం ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
పొగే ఎక్కువ ప్రమాదం...
పెద్ద పెద్ద అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు అగ్ని కన్నా, పొగ వల్ల ప్రాణాపాయం జరిగే అవకాశాలు ఎక్కువ. అందుకే పెద్ద పెద్ద భవనాలలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు, అందులో పేరుకు పోయే పొగ వల్ల, లోపల ఉన్న వారు, ఊపిరి అందక, ఉక్కిరి బిక్కిరి అయ్యి మరణిస్తారు.
కాబట్టి అలాంటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు, కంగారు పడకుండా, సమయస్ఫూర్తితో అలోచించి వ్యవహరించాలి. పొగ గదిలోని పైన భాగంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి, పొగ బాగా ఉన్న సందర్భంలో, వెంటనే, మోకాళ్ళ మీద వంగి, చిన్న పిల్లల లాగా బయటకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. దాని వల్ల పొగ తీవ్రత నుంచి తప్పించుకోగలరు.
ఏ మాత్రం అవకాశం ఉన్నా, ముక్కుకు ఒక శుభ్రమైన వస్త్రాన్ని అడ్డుగా పెట్టుకోవడం మేలు. అవకాశం ఉంటే ఆ వస్త్రాన్ని తడిగా చేసి పెట్టుకోవడం మరీ మంచిది.
ఉదాహరణకు, ఏదైనా భవనంలో అగ్ని ప్రమాదం సంభవిస్తే, దగ్గర్లో ఉండే పరదాలు, దుప్పట్లు, టవల్లు, వంటివి ఏవైనా తీసుకొని, కుదిరితే తడిపి, ముక్కలుగా చేసి తలా ఒకటి ముక్కుకి అడ్డుగా పెట్టుకొని బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తే, ప్రాణాలు కాపాడుకునే అవకాశాలు ఎక్కువ.
కాపాడేందుకు వెళ్లేటప్పుడు కూడా జాగ్రత్త..
అలాంటి ప్రమాదాలు పెద్దయెత్తున జరిగినప్పుడు, లోపల ఉన్న వారిని కాపాడే ప్రయత్నంలో వెళ్ళేవారు, ముందుగా తమ భద్రత చూసుకోవాలి.
ఎదుటి వారి ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాన్ని అపాయంలో పెట్టుకోవడం వల్ల ఏమీ లాభం ఉండదు. కాబట్టి ముక్కుకు ఏదైనా వస్త్రాన్ని అడ్డుగా పెట్టుకొని లోపలికి వెళ్ళితే ఎదుటి వారిని కాపాడే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా పిల్లలు ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఇంట్లో అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకోవాలి. భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా, ముందుగా నియమాలను అతిక్రమించకుండా, నిర్మాణాలు చేసుకోవాలి.
నోట్: ఈ వ్యాసం నిర్దిష్టమైన సమస్య మీద స్థూలమైన అవగాహన కోసం మాత్రమే
(రచయిత వైద్యురాలు)
ఇవి కూడా చదవండి:
- ఆవు, గేదె పాలే తాగాలా? గాడిద, గుర్రం, ఒంటె పాలకు డిమాండ్ ఎందుకు పెరుగుతోంది? బీపీ, డయాబెటిస్, ఆటిజం తగ్గించే పాలు ఉంటాయా
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
- భారత్, నేపాల్ మధ్య పైప్‌లైన్ ఎందుకు వేస్తున్నారు?
- అమెరికా: పొరపాటున డోర్‌బెల్ కొట్టినందుకు టీనేజర్ తలపై రివాల్వర్‌తో కాల్పులు
- హీట్ వేవ్స్: భారత్‌లో వేలాది మంది ప్రాణాలు తీస్తున్న వడగాడ్పులను ఎదుర్కోవడం ఎలా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















