మొఘల్ పాలనకు సంబంధించిన పాఠాలను సిలబస్ నుంచి ఎందుకు తొలగించారు, దీనిపై చర్చ ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జోయా మతీన్
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
మొఘల్ పాలకులకు సంబంధించిన అధ్యాయాలను పాఠ్యాంశాల నుంచి తొలగించడం చరిత్ర బోధనపై చర్చకు దారితీసింది.
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి గల ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్-ఎన్‌సీఈఆర్‌టీ’ కొత్తగా ప్రచురించిన పుస్తకాలతో ఈ చర్చ మొదలైంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) కింద పరీక్షలు రాసే విద్యార్థుల కోసం సిలబస్ మార్పులు, పుస్తకాలలో అంశాలను ఎన్‌సీఈఆర్‌టీ పర్యవేక్షిస్తుంది.
మహాత్మా గాంధీ హత్యకు సంబంధించిన కొంత కంటెంట్ తొలగించడం, గుజరాత్ రాష్ట్రంలో 2002 నాటి అల్లర్లకు సంబంధించిన ప్రస్తావనలను తొలగించడం వంటి మార్పులు చేశారు.
తాజా మార్పులు సిలబస్ హేతుబద్ధీకరణ ప్రక్రియలో భాగమేనని, ఇది విద్యార్థుల పరిజ్ఞానంపై ఎలాంటి ప్రభావం చూపబోదని ఎన్‌సీఈఆర్‌టీ చెప్తోంది. కోవిడ్ 19 తరువాత విద్యార్థులపై భారాన్ని తగ్గించే క్రమంలో చేసిన మార్పులని చెప్తోంది.
అయితే, విమర్శకులు మాత్రం దేశం విషయంలో విద్యార్థుల అవగాహనపై ఈ మార్పులు ప్రభావం చూపుతాయని అంటున్నారు.
ముఖ్యంగా మొఘల్ పాలకులకు సంబంధించిన ప్రస్తావనలను, అంశాలను తొలగిండచంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిందూ రైట్ వింగ్ గ్రూపులు చాలాకాలంగా వ్యతిరేకిస్తున్న చారిత్రక అంశాలనే ఎన్‌సీఈఆర్‌టీ తొలగించిందని విమర్శకులు ఆరోపించారు.
మొఘల్‌లు ఆక్రమణదారులని, వారు భారతీయ భూభాగాలను ఆక్రమించుకుని హిందూ సంస్కృతిని భ్రష్టుపట్టించారని రైట్ వింగ్‌కు చెందిన యాక్టివిస్ట్‌లు, చరిత్రకారులు భావిస్తుంటారు.
‘విభజన చాలా తీవ్రంగా ఉన్న కాలంలో విద్యార్థులు దేశ చరిత్ర గురించి నేర్చుకుంటున్నారు. అసౌకర్యంగా ఉన్నాయనుకున్న చారిత్రక అంశాలను తొలగించడం ద్వారా మేం విద్యార్థులను విమర్శనాత్మకంగా ఆలోచించేలా ప్రోత్సహించడం మానేశాం’ అన్నారు ‘సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్’ అధ్యాపకుడు, పొలిటికల్ ఇస్లాం అనే అంశంలో అధ్యయనం చేస్తున్న హిలాల్ అహ్మద్ అన్నారు.
అయితే, తాజా మార్పులకు మద్దతు పలుకుతున్నవారు మాత్రం ఈ చరిత్ర పాఠ్యపుస్తకాలలో ముస్లిం పాలకులకు ఇంతకుముందు అధిక ప్రాధాన్యం ఇచ్చారని, ఇప్పుడు దాన్ని సరిదిద్దుతున్నారని అంటున్నారు.
‘మొఘల్‌ల పాలన భారతదేశ చరిత్రలోని రక్తపాత అధ్యాయాలలో ఒకటి’ అని ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల కోసం వివిధ అధ్యాయాలు రాసిన చరిత్రకారుడు, విద్యావేత్త మఖాన్ లాల్ అన్నారు.
‘మొఘల్‌లకు బదులు మనం విజయనగరం సామ్రాజ్యం, చోళులు, పాండ్యుల గురించి మరింత రాయలేమా?’ అంటూ దక్షిణ భారతాన్ని పాలించిన హిందూ రాజవంశాల గురించి ఆయన మాట్లాడారు.
అయితే, ఇది భారతదేశ సామరస్య గతాన్ని తగ్గించి చూపే తరహా అవగాహన అనేది మరికొందరి వాదన.
‘మొఘలులు చాలా హింసాత్మకంగా ఉండేవారన్న వాదన ఇప్పుడు ఎక్కువవుతోంది.. నిజానికి రాజ్యాధికారం చెలాయించడంలోనే హింస అనేది అంతటా ఉంది. అయితే, మొఘల్‌లు ప్రాథమికంగా రాజులుగా కాకుండా హిందువులను వేధించడానికే తాము ఉన్నామన్నట్లుగా ఉండేవారు’ అని చరిత్రకారుడు, రచయిత మను ఎస్ పిళ్లై చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కాగా ఈ సిలబస్ మార్పులపై జరుగుతున్న చర్చ అంతా అనవసరమని అన్నారు ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ దినేశ్ సక్లానీ. అంతేకాదు, మొఘల్‌ల చరిత్ర ఇప్పటికీ పాఠశాల విద్యార్థుల సిలబస్‌లో ఉందని అన్నారు. అయితే, ఆయనతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించగా మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు తాను అందుబాటులో ఉండబోవడం లేదని ఆయన తెలిపారు.
భారత్‌లో చరిత్ర పాఠ్యాంశాలను సవరించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ వివిధ ప్రభుత్వాల కాలంలో పాఠ్యపుస్తకాలను సవరించారు.
కంటెంట్, అభ్యాస ఫలితాల మధ్య సమతుల్యత సాధించేందుకు పాఠ్యపుస్తకాల సమీక్ష అనేది సాధారణమేనని అహ్మద్ చెప్పారు. ‘చరిత్ర ఎప్పటికీ ముగిసిపోయేది కాదు. చరిత్ర ఎప్పటికీ అసంపూర్ణమే. అలాగే చరిత్ర పాఠ్య పుస్తకాలు ఉండాలి. అందుకే వాటిని నిరంతరం సమీక్షిస్తుంటారు’ అన్నారు అహ్మద్.
అయితే, ఈ సమీక్షలు పరిజ్ఞానాన్ని పణంగా పెట్టేలా ఉండరాదని ఆయన సూచించారు.
ఎలాంటి ఉద్రిక్తతలు, వైరుధ్యాలకు అవకాశం ఉందన్న సూచనలేమీ లేకుండానే సమాచారాన్ని నిలిపివేయడమనేది బోధనపరమైన సమస్యలకు తెరతీస్తుంది అని ప్రస్తుతం తొలగించిన పాఠ్యాంశాల గురించి అహ్మద్ అభిప్రాయపడ్డారు.
చరిత్ర అంటే కేవలం పాలకులకు సంబంధించింది కాదని.. రాజవంశాలు, యుద్ధాలకు అతీతంగా పాలన తీరు, సంస్కృతిని చూడగలగడమే చరిత్ర అని అన్నారు.
‘కాబట్టి ఏదైనా ఏకపక్షంగా తొలగిస్తే అది అసందర్భంగా, వక్రీకరణగా మారుతుంది’ అన్నారు ప్రొఫెసర్ అహ్మద్.
12వ తరగతి చరిత్ర పుస్తకాలలోని ‘కింగ్స్ అండ్ క్రానికల్స్: ది మొఘల్ కోర్ట్స్’ అనే అధ్యాయాన్ని సిలబస్ నుంచి ఎన్‌సీఈఆర్‌టీ తొలగించింది.
30 పేజీలలో ఉన్న ఈ అధ్యాయం మొఘల్ పాలనను వివరించేది. మొఘల్‌ల చరిత్ర, ఆ కాలంలో భిన్న జాతులు, భిన్న మతాల ప్రజలతో మొఘల్‌ల రాజ్యం ఎలా ఉండేదో ఈ అధ్యాయంలో వివరించారు.
కాగా అందులో చారిత్రక విలువ ఏమీ లేదంటూ తొలగింపును సమర్థించారు మఖాన్ లాల్.
‘ఇది ఒక అధ్యాయం మాత్రమే. దీన్ని తొలగించడం అంటే మొఘల్‌ల చరిత్రలను పాఠ్యాంశాల నుంచి తొలగించినట్లు కాదు’ అన్నారు లాల్.

ఫొటో సోర్స్, Getty Images
దేశంలోని పాఠ్య పుస్తకాలలో మొఘల్‌ల క్రూరత్వం గురించి తక్కువగా రాశారని, హిందూ రాజులతో పోల్చినప్పుడు వారికి చాలా ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని లాల్ అన్నారు. మొఘల్‌ల చరిత్రను వక్రీకరించి చెప్తూ దశాబ్దాలుగా ప్రాచీన భారతీయ సంస్కృతి, విలువలను అవమానించారని లాల్ అన్నారు.
‘కానీ, ఇప్పుడు భారతీయులు ఆ పాత లెక్కలను సరిచేస్తున్నారు’ అన్నారు లాల్.
చరిత్ర అనేది పోటీ కానప్పటికీ.. ఇలాంటి భావోద్వేగ ప్రతిపాదనలు రాజకీయాలలో, ప్రజల్లో పట్టు సాధించడానికి తోడ్పడతాయని మను పిళ్లై అన్నారు.
‘వ్యక్తులను ఓ వైపు, మరోవైపు చెడ్డ మొఘల్‌లను కలిపి చూపించే భారతీయ హిందూ చరిత్రపై ఇలాంటి ఒత్తిడి ఉంది’ అన్నారు పిళ్లై.
కానీ క్రూరత్వం మొఘల్‌లకు మాత్రమే పరిమితమైన లక్షణం కాదని పిళ్లై చెప్పారు. రాజులు సాధారణంగానే హింసాత్మకమైన వ్యక్తులని, 19వ శతాబ్ద కాలంలో అధికార సాధనకు హింస ఒక మార్గంగా ఉండేది అని చెప్పారు.

ఫొటో సోర్స్, PICTURES FROM HISTORY
మహాత్మా గాంధీ జన్మించడానికి ఒక దశాబ్ద కాలం ముందు చివరి మొఘల్ రాజు పదవీచ్యుతుడయ్యారని.. మొఘల్ చక్రవర్తి ఉన్నప్పుడే దాదాబాయి నౌరోజీ వంటి జాతీయవాదులు యుక్తవయస్సులో ఉన్నారని పిళ్లై చెప్పారు.
మొఘలుల చరిత్ర మొన్నమొన్నటిది కావడం వల్ల వారి గురించి ఎక్కువ తెలుసని.. 13వ శతాబ్దం నాటి చోళులతో పోల్చితే మొఘల్‌ల కాలానికి సంబంధించిన రికార్డులు, ఆధారాలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయంటారు పిళ్లై.
‘పుస్తకాలలోని చరిత్రను పూర్తిగా చెరిపేయడానికి బదులు ఆ సంక్లిష్టతలను అర్థం చేసుకునే అవకాశం విద్యార్థులకు కల్పించడం అవసరం’ అని పిళ్లై అభిప్రాయపడ్డారు.
భారతీయ చరిత్రలోని ప్రాచీన కాలాన్ని హిందూ యుగంగా, మధ్యయుగాన్ని ముస్లింల కాలంగా భావించే వలసవాద దృక్ఫథాన్ని ఇప్పుడు కొందరు మళ్లీ చెప్తుండడం విడ్డూరమని అహ్మద్ అన్నారు.
చరిత్రలోని కీలక భాగాలను ఏకపక్షంగా తొలగిస్తే ఫార్మల్ ఎడ్యుకేషన్‌లో ఒకరకమైన శూన్యత ఏర్పడుతుందని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆవు, గేదె పాలే తాగాలా? గాడిద, గుర్రం, ఒంటె పాలకు డిమాండ్ ఎందుకు పెరుగుతోంది? బీపీ, డయాబెటిస్, ఆటిజం తగ్గించే పాలు ఉంటాయా
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
- భారత్, నేపాల్ మధ్య పైప్‌లైన్ ఎందుకు వేస్తున్నారు?
- అమెరికా: పొరపాటున డోర్‌బెల్ కొట్టినందుకు టీనేజర్ తలపై రివాల్వర్‌తో కాల్పులు
- హీట్ వేవ్స్: భారత్‌లో వేలాది మంది ప్రాణాలు తీస్తున్న వడగాడ్పులను ఎదుర్కోవడం ఎలా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














