కింగ్ చార్లెస్ III: బ్రిటన్ రాజుకు పట్టాభిషేకం ఎందుకు నిర్వహిస్తున్నారు, అవసరమా అని ఎవరు అంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లారెన్ పాట్స్
- హోదా, బీబీసీ న్యూస్
చార్లెస్ 3 పట్టాభిషేకం మే 6న జరగబోతోంది. బ్రిటన్‌కు ప్రఖ్యాతి గాంచిన, అట్టహాసంగా జరిగే కవాతులతో ఇది మొదలవుతుంది.
అయితే, శతాబ్దాలనాటి కొన్ని మతపరమైన సంప్రదాయాలు కూడా దీనిలో ఉంటాయి. 2023లో వీటిని చూడటం కొంతమందికి కొత్తగా అనిపించొచ్చు. అసలు ఈ కార్యక్రమానికి ప్రాముఖ్యం ఏమైనా ఉందా? అసలు రాజుకు ఇది అవసరమా?
మరికొన్ని వారాల్లో బ్రిటన్‌లోని లక్షల మంది ఈ అరుదైన కార్యక్రమాన్ని చూడబోతున్నారు.
వీధుల్లో పార్టీలు, విపరీతంగా గుమిగూడే జనాలు, కోలహలమైన వేడుకలను మనం చూసే ఉంటాం. కానీ, రాజు లేదా రాణి పట్టభిషేకాన్ని మనం చూసి దాదాపు 70 ఏళ్లు అవుతోంది. ఆసక్తిని రేపే చాలా భిన్నమైన వేడుక ఇది.
మధ్య యుగాల తరహాలో ప్రమాణం చేయడం, 12వ శతాబ్దంనాటి స్పూన్‌తో పవిత్రమైన నూనె చల్లడం, 700 ఏళ్లనాటి కుర్చీపై రాజు కూర్చోవడం ఇలా చాలా ఘటనలకు ఇది వేదిక కాబోతోంది.
కొంతమంది నిపుణులు పట్టాభిషేకం కూడా పెళ్లి లాంటిదేనని చెబుతున్నారు. రాజు ఇక్కడ రాణికి బదులుగా దేశాన్ని పెళ్లి చేసుకుంటారని వివరిస్తున్నారు.
వెస్ట్‌మినిస్టెర్ అబేలో చార్లెస్ పట్టాభిషేకాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చే 2,000 మందిని మీరు చార్లెస్‌ను రాజుగా అంగీకరిస్తున్నారా? అని అడుగుతారు. ఆ తర్వాత ఆయనకు పట్టాభిషేక ఉంగరాన్ని తొడుగుతారు. ఆ తర్వాత రాజుగా ప్రమాణం ఉంటుంది.
ఇవన్నీ చూడటానికి కాస్త పురాతన సంప్రదాయాల్లా కనిపించొచ్చు. ఎందుకంటే గత 1000 ఏళ్లలో ఈ సంప్రదాయాలు పెద్దగా మారలేదు.
నిజానికి చట్ట ప్రకారం, ఇలాంటి పట్టాభిషేకం అవసరం లేదు. రాజు చనిపోతే ఆ తరువాత వరుసలో ఉండేవారు ఆటోమేటిక్‌గా రాజు లేదా రాణి అవుతారు.
‘‘ఇది లాంఛనప్రాయ కార్యక్రమం. రాజుగా ఆయన నిబద్ధతకు ఇది అద్దంపడుతుంది’’అని కింగ్స్ కాలేజీ లండన్‌కు చెందిన డా. జార్జి గ్రాస్ అన్నారు. ఆయన పట్టాభిషేకాలపై పరిశోధన చేస్తున్నారు.
‘‘చట్టాల అమలు, న్యాయ పరిరక్షణ’’ కోసం కృషి చేస్తానని రాజు ప్రతిన చేయడం అనేది అరుదైన ఘట్టమని జార్జి చెప్పారు.
‘‘అనిశ్చితితో కూడిన నేటి ప్రపంచంలో నాయకులు అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. దీంతో చట్టాలు, న్యాయ పరిరక్షణ చాలా ముఖ్యమని రాజు ప్రతిన చేయడం కీలక ఘట్టం లాంటిది’’అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, UNIVERSAL HISTORY ARCHIVE/GETTY IMAGES
పాత, కొత్తల కలయిక
ఆ తర్వాత జరిగే కార్యక్రమాలను పరిశీలిస్తే పట్టాభిషేకం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఇది మతపరంగానూ ప్రాధాన్యమున్న వేడుక. రాజు నుదురు, చేతులు, ఛాతీపై శిలువను ఉంచుతారు. పవిత్రమైన నూనెను శతాబ్దాలనాటి స్పూన్‌తో చల్లుతారు.
‘‘ఈ ప్రక్రియలతో రాజు మతాధికారి స్థాయికి చేరతారు’’అని డా. గ్రాస్ చెప్పారు. ఈ కార్యక్రమం రాజు చర్చికి కూడా అధిపతి అని మనకు తెలియజేస్తుందని ఆయన వివరించారు.
‘‘ఇది ఒక పశ్చిమ దేశాల క్రైస్తవ కార్యక్రమం. దేవుడి దయ రాజుపై ఉంటుందని ఇది చాటిచెబుతుంది’’అని పట్టాభిషేకాలపై పార్లమెంటరీ రీసెర్చ్ పేపర్‌ను రాసిన డాక్టర్ డేవిడ్ టోరెన్స్ చెప్పారు.
‘‘రాజు సర్వోన్నతమైన పాలకుడని అందరికీ దీని ద్వారా ఇంగ్లండ్ చర్చి గుర్తు చేస్తుంది’’ అని డేవిడ్ వివరించారు.

ఫొటో సోర్స్, KEYSTONE/GETTY IMAGES
‘‘ఈ మతపరమైన కార్యక్రమం ప్రైవేటుగా జరుగుతుంది. ఎందుకంటే ఆ సమయంలో రాజు లేదా రాణి శరీరంపై తక్కువ బట్టలు ఉంటాయి. అందుకే దీన్ని ప్రైవేటుగా నిర్వహిస్తారు’’ అని రాయల్ స్టడీస్ నెట్‌వర్క్ డైరెక్టర్ డాక్టర్ ఎలీనా ఉడాకెర్ చెప్పారు.
1953లో రాణి ఎలిజబెత్ పట్టాభిషేకం తరహాలోనే నేడు కూడా ఈ కార్యక్రమానికి కెమెరాలను దూరం పెట్టే అవకాశముంది.
గతంలో ఉపయోగించిన నూనెను కొన్ని పట్టాభిషేకాల్లో ఉపయోగిస్తుంచారు. కానీ, నేడు దీని కోసం ప్రత్యేకంగా నూనె తయారుచేశారు.
ఇదివరకు పునుగు పిల్లి, స్పెర్మ్ వేల్స్ (ఒకజాతి తిమింగలం) నూనెలను దీని కోసం ఉపయోగించేవారు. కానీ, జంతువుల జోలికి వెళ్లకుండా ఆలివ్‌లతో ఈ నూనె సిద్ధంచేశారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా నేడు ఈ నూనెలోనూ మార్పులు చేసినట్లుగా కనిపిస్తోందని డా. ఉడాకెర్ చెప్పారు. ‘‘సమాజంలో మార్పులను పరిగణలోకి తీసుకోవడంతోపాటు సంప్రదాయాలకూ ప్రాధాన్యం ఇస్తున్నట్లు దీనితో తెలుస్తోంది’’అని వివరించారు.
‘‘గతాన్ని పక్కన పెట్టిపెట్టి భవిష్యత్‌కు బంగారు బాటలు వేసేందుకు రాజుకు దక్కే అవకాశమే ఈ పట్టాభిషేకం. ఇలాంటి కొన్ని పురాతన సంప్రదాయాలతో తన పదవి ఏళ్లనాటిదని అందరికీ గుర్తుచేసినట్లు అవుతుంది’’అని ఉడాకెర్ అన్నారు.

ఫొటో సోర్స్, PATRIARCHATE OF JERUSALEM AND BUCKINGHAM PALACE
ప్రజలు ఏమంటున్నారు?
ప్రపంచ దేశాల్లో పట్టాభిషేకాల్లో చాలా మార్పులు వచ్చినప్పుడు ఇంకా పురాతన సంప్రదాయాలను అనుసరించడం ఎందుకని రిపబ్లిక్ అనే సంస్థ ప్రతినిధి గ్రాహమ్ అన్నారు. ఎన్నికైన నాయకుడే దేశానికి అధిపతిగా ఉండాలని ఈ సంస్థ డిమాండ్ చేస్తుంది.
‘‘గతంలో ఏం జరిగిందో చాలా మందికి తెలియదు. అయినా ఇది సంప్రదాయం కాదు. రాజ్యాంగ పరంగానూ దీనికి విలువ లేదు. దీన్ని నిర్వహించాల్సిన అవసరమూ లేదు. ఇది జరిగినా లేదా జరగకపోయినా చార్లెస్ రాజుగానే కొనసాగుతారు’’అని గ్రాహమ్ చెప్పారు.
నిజానికి పాలన కొనసాగించడానికి పట్టాభిషేకమే అవసరం లేదు. ఎడ్వర్డ్ 8 లాంటి కొందరు ఇలాంటి కార్యక్రమం లేకుండానే పాలన మొదలుపెట్టారు. యూరప్‌లోని కొన్ని దేశాలు ఎప్పుడో పట్టాభిషేకాలను పక్కన పెట్టేశాయి.
‘‘1953లో పట్టాభిషేకం తర్వాత బ్రిటన్‌లోని మతపరంగా చాలా మార్పులు వచ్చాయి. పాత చర్చి సంప్రదాయంలో నేడు కార్యక్రమాన్ని నిర్వహిస్తే, చాలా మందిని తమను దూరం పెడుతున్నట్లుగా భావించొచ్చు’’అని నేషనల్ సెక్యులర్ సొసైటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టీఫెన్స్ ఏవన్స్ అన్నారు.
ఈ వేడుకలోని కార్యక్రమాలు అప్పటి ప్రజలకు సుపరిచితమై ఉండొచ్చు, కానీ, నేటి ప్రజల్లో ఇవి చాలా మందికి తెలియక పోవచ్చని డాక్టర్ టోరెన్స్ అన్నారు. కానీ, ఇలాంటి వేడుకలకు వచ్చే ప్రజల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుందోని గణాంకాలు చెబుతున్నట్లు ఆయన చెప్పారు.
‘‘రాణి మరణించినప్పుడు మతపరమైన సంప్రదాయాలు చాలానే నిర్వహించారు. వీటికి వచ్చే ప్రజలను చూసి ప్యాలెస్ ఆశ్చర్యపోయింది’’అని ఆయన చెప్పారు.
‘‘అయితే, క్రైస్తవ సంప్రదాయాలను కొంతవరకు పక్కన పెడితే, నేడు బ్రిటన్‌లో అన్ని మతాలకు చెందిన వారున్నారు అనే అంశాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు అవుతుంది’’అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, GETTY/SOPA IMAGES
21వ శతాబ్దపు పట్టాభిషేకమేనా?
అయితే, పట్టాభిషేకంలోని ప్రధాన ఘట్టాలు ఒక మతంతోనే ఇప్పటికీ ముడిపడివున్నట్లు తెలుస్తోందని సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ మోడ్రన్ మోనార్కీ డైరెక్టర్, ప్రొఫెసర్ అన్నా వైట్‌లాక్ అన్నారు.
‘‘పట్టాభిషేకంలోని కీలక ఘట్టాలు ఇంగ్లండ్ చర్చి అధికారాన్ని చాటిచెబుతున్నాయి. కొన్ని సంప్రదాయాలను మనం మార్చలేం కూడా. ఇక్కడ మనకు భిన్నత్వం కనిపించదు. బ్రిటన్‌లోని భిన్న మతాలు, భిన్న జాతులకు ఇది అద్దం పట్టడం లేదు’’అని ప్రొఫెసర్ వైట్‌లాక్ అన్నారు.
అయితే, పట్టాభిషేకాన్ని ఆధునికంగా మార్చేందుకు కొన్ని మార్పులు చేశారనే వాదనతో ప్రొఫెసర్ వైట్‌లాక్ అంగీకరిస్తున్నారు. కొత్త సంగీతాన్ని ముందుగానే సిద్ధం చేయడం, భిన్న వర్గాల ప్రతినిధులను ఆహ్వానించడం లాంటి మార్పులను ఆమె ఉదహరించారు. అయితే, ఇవన్నీ పైపైన మార్పులేనని ఆమె అభిప్రాయపడ్డారు.
‘‘ఏదైనా అర్థవంతమైన మార్పు కనిపించాలంటే.. ఈ ప్రక్రియలను సమూలంగా మార్చాలి. ఇక్కడ ఇంగ్లండ్ చర్చి అధికారాలకు కోత పెట్టడం, రాచరికంపై ప్రజాభిప్రాయ సేకరణ లాంటివి అవసరం. అయితే, సమీప కాలంలో ఇలాంటి మార్పులు వచ్చే అవకాశం లేదు’’అని ఆమె అన్నారు.
‘‘బహుశా తర్వాత వచ్చే ప్రిన్స్ విలియమ్స్ ఇలాంటి పట్టాభిషేకాన్ని ఆమోదించకపోవచ్చు. అయితే, నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు’’అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, WPA POOL
అయితే, వేరే మార్గాల్లో దీన్ని ఆధునిక బాట పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని డా. గ్రాస్ భావిస్తున్నారు. ఇక్కడ ఆయన ఖర్చు గురించి ప్రధానంగా ప్రస్తావించారు.
‘‘ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేటప్పుడు పట్టాభిషేకాలను అంత అట్టహాసంగా నిర్వహించలేదు. దీనికి జార్జ్ 6 పట్టాభిషేకమే ఉదాహరణ. ఆర్థిక మందగమన సమయంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం కూడా ఖర్చును తగ్గించేందుకు తన తల్లి పట్టాభిషేకానికి హాజరైన అతిథుల సంఖ్యలో నాలుగో వంతు మందినే ఆహ్వానించారు’’అని ఆయన అన్నారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ప్రజలు సతమతం అవుతున్నప్పుడు, పట్టాభిషేకం కోసం మిలియన్ల పౌండ్లు వృథా చేయడం ఎందుకని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు కల్చర్, మీడియా, స్పోర్ట్స్ విభాగాలు ఎంత ఖర్చు అవుతుందో అంచనాలు వెల్లడించలేదు. అయితే, ఖర్చులేకుండా అయ్యే పరిస్థితి ఉండదనేది సుస్పష్టం.
గత ఏడాది రాణి అంత్యక్రియలకు ఎంత ఖర్చు అయ్యిందో కూడా ఇప్పటివరకు బయటకు వెల్లడించలేదు. 2002లో రాణి తల్లి అంత్యక్రియలకు దాదాపు 5.4 మిలియన్ల పౌండ్లు (రూ.55.18 కోట్లు) ఖర్చు అయ్యింది.
అయితే, ఆ రెండు మరణాల సమయంలో ప్రజల అభిప్రాయాలను చూస్తే, రాచరికంపై ప్రజల్లో ఇంకా ఆసక్తి ఉందని తెలుస్తోంది.
సెప్టెంబరులో జరిగిన రాణి ఎలిజబెత్ అంత్యక్రియలను చూసేందుకు దాదాపు 2,50,000 మంది వరుసలో నిలబడ్డారు. ఆమె తల్లి అంత్యక్రియలకు కూడా అలానే వచ్చారు. బ్రిటన్‌లోని ఆరు కోట్ల జనాభాతో పోలిస్తే, ఇది తక్కువగానే అనిపించొచ్చు. కానీ, దాదాపు 40 శాతం మంది టీవీల్లో ఈ కార్యక్రమాలను వీక్షించారు.
అయితే, నేడు పట్టాభిషేకాన్ని కూడా అలానే ప్రజలు చూస్తారా? అనేది అనుమానమేనని ప్రొఫెసర్ వైట్‌లాక్ అన్నారు.
‘‘అట్టహాసంగా జరిగే ఈ వేడుకను కొంతమంది చూస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ, ఎలాంటి ఎన్నికలు లేకుండానే కేవలం ఆ వంశంలో పుట్టినందుకే రాజుగా నియమించడం, ఆయన సర్వోన్నతుడని ప్రకటించడం అనేది నేటి బ్రిటన్ ఆదర్శాలను ప్రతిబింబిచడం లేదు’’అని వైట్‌లాక్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆవు, గేదె పాలే తాగాలా? గాడిద, గుర్రం, ఒంటె పాలకు డిమాండ్ ఎందుకు పెరుగుతోంది? బీపీ, డయాబెటిస్, ఆటిజం తగ్గించే పాలు ఉంటాయా
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
- భారత్, నేపాల్ మధ్య పైప్‌లైన్ ఎందుకు వేస్తున్నారు?
- అమెరికా: పొరపాటున డోర్‌బెల్ కొట్టినందుకు టీనేజర్ తలపై రివాల్వర్‌తో కాల్పులు
- హీట్ వేవ్స్: భారత్‌లో వేలాది మంది ప్రాణాలు తీస్తున్న వడగాడ్పులను ఎదుర్కోవడం ఎలా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















