ఆస్ట్రేలియా: బ్రిటన్ రాజు ఫొటో లేకుండానే కొత్త కరెన్సీ నోట్లు

డాలర్ ఆస్ట్రేలియా

ఫొటో సోర్స్, RESERVE BANK OF AUSTRALIA

ఆస్ట్రేలియాలో ముద్రిస్తున్న కొత్త 5 డాలర్ల నోటు మీద కింగ్ చార్లెస్-3 ఫొటో ఉండదని ఆ దేశ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది.

"ఆదివాసీ ఆస్ట్రేలియన్ల సంస్కృతి, చరిత్ర"కు నివాళిగా కొత్త నోట్లు ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా (ఆర్బీఏ) తెలిపింది.

ప్రస్తుత ఐదు డాలర్ల నోటు మీద క్వీన్ ఎలిజబెత్ II చిత్రం ఉంది. గత ఏడాది రాణి మరణం తర్వాత రాచరికం మీద ఆస్ట్రేలియాలో చర్చ మొదలైంది.

"ఆస్ట్రేలియా ప్రభుత్వంతో సంప్రదింపుల అనంతరం రిజర్వ్ బ్యాంక్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది" అని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

"5 డాలర్ నోటు డిజైన్‌కు సంబంధించి ఆదివాసీ ఆస్ట్రేలియన్లతో బ్యాంక్ సంప్రదింపులు జరుపుతోంది. కొత్త నోటు రూపకల్పన, ముద్రణకు చాలా సంవత్సరాలు పడుతుంది.

అప్పటివరకు ప్రస్తుత ఐదు డాలర్ నోటు కొనసాగుతుంది. కొత్త నోటు జారీ చేసిన తర్వాత కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు’’ అని సెంట్రల్ బ్యాంక్ స్పష్టంచేసింది.

ప్రస్తుతం ఇతర కరెన్సీ నోట్ల డిజైన్ మార్చే ఆలోచన లేదని ఆర్బీఏ ప్రతినిధి బీబీసీకి తెలిపారు.

కొత్త ఐదు డాలర్ల నోటను ఎప్పుడు విడుదల చేయాలో కూడా ఇంకా నిర్ణయించలేదని చెప్పారు.

ఈ నిర్ణయాన్ని ఆస్ట్రేలియా ఆదివాసీలు స్వాగతిస్తున్నారు.

బ్రిటిషర్లు రావడానికి 65 వేల సంవత్సరాల ముందు నుంచే ఆస్ట్రేలియా ఆదివాసీలు నివసిస్తున్నట్లు ఇటీవల పరిశోధనల్లో తేలింది.

బ్రిటన్

ఫొటో సోర్స్, BANK OF ENGLAND

బ్రిటన్ చక్రవర్తి ఆస్ట్రేలియాకూ అధిపతే

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా బ్రిటన్ వెలుపల ఉన్న 12 ఇతర కామన్వెల్త్ దేశాలకు బ్రిటీష్ చక్రవర్తి అధిపతి.

అయితే ఈ రాచరికం పేరుకు మాత్రమే. చక్రవర్తి నేరుగా ఆయా దేశాల పాలనలో భాగం పంచుకోరు. ఆ దేశ ప్రభుత్వం సూచించిన వ్యక్తిని గవర్నర్ జనరల్‌గా చక్రవర్తి నియమిస్తారు. గవర్నర్ జనరల్ చక్రవర్తి తరఫున ఆ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తారు.

ఆస్ట్రేలియన్ బ్యాంక్ నోట్ల సిరీస్‌లలో కనీసం ఒక డిజైన్‌లోనైనా బ్రిటిష్ రాజు లేదా రాణి చిత్రం కనిపిస్తుంటుంది.

ఇప్పటికే చాలా ఆస్ట్రేలియా కరెన్సీ డిజైన్లలో ఆదివాసీ సంస్కృతి అద్దం పట్టే కళలకు స్థానం కల్పించారు.

1999 ప్రజాభిప్రాయ సేకరణలో ఆస్ట్రేలియన్ ఓటర్లు బ్రిటిష్ చక్రవర్తిని దేశాధినేతగా ఉంచాలని కోరుకున్నారు.

2021లో ఆస్ట్రేలియా జాతీయ గీతాన్ని సవరించింది. "యంగ్ & ఫ్రీ" అనే పదాల స్థానంలో "వన్ & ఫ్రీ " అనే కొత్త పదాలను చేర్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)