విరాట్ కోహ్లీ 'అహంకారి' అని వ్యాఖ్యానించిన ఆస్ట్రేలియా మీడియా తీరు మారిందా?

విరాట్ కోహ్లి

ఫొటో సోర్స్, NITIN SRIVASTAVA/BBC

    • రచయిత, నితిన్ శ్రీవాస్తవ
    • హోదా, బీబీసీ ప్రతినిధి, మెల్‌బోర్న్ నుంచి

విరాట్ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదివారం మెల్‌బోర్న్ క్రికెట్ మైదానం (ఎంసీజీ)లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. గతంలో కోహ్లి అంటే నచ్చనివారు కూడా ఈ ఇన్నింగ్స్ తర్వాత విరాట్‌ను అభిమానిస్తున్నారు.

ఆస్ట్రేలియా మీడియాలో కూడా కోహ్లి గురించే చర్చ నడుస్తోంది. అక్కడి చాలా వార్తాపత్రికలు కోహ్లి ఆటతీరును పొగుడుతూ మొదటి పేజీల్లో వార్తలు ప్రచురించాయి.

విరాట్ కోహ్లికి, ఆస్ట్రేలియా మీడియాకు మధ్య సంబంధం చాలా పాతది. విరాట్ పట్ల కాస్త కఠినంగానే ఆస్ట్రేలియా మీడియా వ్యవహరించేది.

'అహంకారం', 'ఓర్పు ఉండదు', 'క్షమాపణ చెప్పడంపై నమ్మకం లేని వ్యక్తి' అనే వ్యాఖ్యల్ని ఆస్ట్రేలియా మీడియా నుంచి కోహ్లి గతంలో ఎదుర్కొన్నాడు.

న్యూజీలాండ్‌తో సిరీస్ సందర్భంగా ఒక కెప్టెన్‌గా బ్యాట్స్‌మెన్‌గా కోహ్లి పేలవ ప్రదర్శనపై ఆస్ట్రేలియా మీడియా విమర్శలు గుప్పించింది. అదే సిరీస్‌లో హాగ్లీ ఓవల్ స్టేడియంలో టామ్ లాథమ్ అవుటైన తర్వాత కోహ్లి, ప్రేక్షకుల వైపు వేలు చూపించడాన్ని తప్పుపడుతూ ఆస్ట్రేలియా మీడియా వార్తలు ప్రచురించింది. ఇలా ఏ విషయంలోనూ కోహ్లిని వదల్లేదు.

'ఆస్ట్రేలియన్' వార్తాపత్రికకు చెందిన ప్రముఖ క్రికెట్ రచయిత పీటర్ లైలర్ మాట్లాడుతూ... ''నేను విరాట్‌కు పెద్ద అభిమానిని. కానీ, ఆయన ప్రవర్తనతో నిరాశ చెందాను. వీటి గురించి భవిష్యత్‌లో ఆలోచించినప్పుడు తను తప్పుగా ప్రవర్తించినట్లు కోహ్లి గ్రహిస్తాడు'' అని అన్నారు.

ఆదివారం రాత్రి పాకిస్తాన్‌పై భారత్ గెలుపొందిన తర్వాత అదే వార్తా పత్రిక... ''విరాట్ కోహ్లి మాస్టర్‌క్లాస్ ఇన్నింగ్స్'' అనే శీర్షికతో వార్తను ప్రచురించింది. అదే సమయంలో అశ్విన్ జారవిడిచిన క్యాచ్ గురించి, అతను చేసిన డైవ్ గురించి కూడా విమర్శలు వచ్చాయి. తరవాత వాటిని ఉపసంహరించుకున్నారు.

విరాట్ కోహ్లి

ఫొటో సోర్స్, Getty Images

గతంలో విమర్శలు

ఆస్ట్రేలియాకు చెందిన మరో ప్రముఖ వార్తాపత్రిక 'హెరాల్డ్ సన్'‌ గురించి చూద్దాం. ఈ పత్రిక, కోహ్లిని పొగడటంతో పాటు తీవ్రంగా విమర్శించింది కూడా.

2020లో భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటించింది. వన్డే సిరీస్‌లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా కోహ్లి ప్రదర్శనని ఈ వార్తా పత్రికకు చెందిన క్రికెట్ రచయిత సామ్ ల్యాండ్స్‌బర్గర్ తీవ్రంగా విమర్శించారు. చివరిసారి భారత్, ఆస్ట్రేలియాలో పర్యటించిన సందర్భంలో కూడా కోహ్లిపై ఇలాంటి విమర్శలు వినిపించాయి.

''భారత్ సిరీస్‌ను కోల్పోయే స్థితిలో ఉంటే, కోహ్లి ప్రయోగాలు చేయాలని చూస్తున్నాడు'' అంటూ 2020లో ఈ పత్రిక రాసింది.

విరాట్ కోహ్లి

ఫొటో సోర్స్, SCREENGRAB

ఇప్పుడు పొగడ్తలు..

ఇప్పుడు ఎంసీజీలో పాక్‌పై భారత్ విజయానంతరం... కోహ్లీ సిక్సర్ బాదుతున్న ఫొటోను మొదటి పేజీలో ప్రచురించిన 'హెరాల్డ్ సన్' దానికి 'కింగ్ కోహ్లి, ఎంసీజీని జయించాడు' అనే శీర్షికను పెట్టింది.

''ఎంసీజీలో జరిగిన మ్యాచ్ చూడటం కోసం ప్రపంచం నలుమూలల నుంచి వేలాదిమంది అభిమానులు తరలి వచ్చారు. ఇది దేశ ఆర్థికవ్యవస్థకు, వ్యాపారానికి మంచి చేస్తుంది'' అని రాసుకొచ్చింది.

కోహ్లీకి, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 'క్రికెట్ ఆస్ట్రేలియా'కు మధ్య మంచి సంబంధాలు లేవనే విషయం కూడా అందరికీ తెలుసు.

2017లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. బెంగళూరు టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తీసుకున్న రివ్యూను కోహ్లి ప్రశ్నించాడు. ఆ తర్వాత ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సదర్లాండ్ స్పందిస్తూ ''కోహ్లికి సారీ చెప్పడం తెలియదనుకుంటా'' అని అన్నారు.

విరాట్ కోహ్లి

ఫొటో సోర్స్, NITIN SRIVASTAVA/BBC

కానీ, ఇప్పుడు ఆస్ట్రేలియా వార్తా పత్రికలు కేవలం కోహ్లి ఘనత గురించే మాట్లాడటం మొదలుపెట్టాయి.

''2016 టి20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్స్ కంటే ఈ ఇన్నింగ్స్ చాలా విలువైనది అని కోహ్లి అన్నాడు. క్రికెట్ ప్రపంచంలోని ప్రముఖ ఆటగాళ్లలో ఒకరైన కోహ్లి ఈ మాట చెప్పడం నిస్సందేహంగా చాలా పెద్ద విషయం'' అని 'ద సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్'కు చెందిన డేనియల్ బ్రేటిగ్ రాశారు.

వీడియో క్యాప్షన్, #T20WorldCup: పాకిస్తాన్‌పై భారత్ విజయం తరువాత మెల్‌బోర్న్‌లో అభిమానుల సంబరాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)