పుంఛ్‌ ఘటన: కార్గిల్ యుద్ధంలో తండ్రి.. తీవ్రవాదులతో పోరులో కొడుకు మృతి

పుంఛ్ సెక్టార్ ఘటన

ఫొటో సోర్స్, SURINDER MAAN / BBC

జమ్మూ కశ్మీర్‌లోని పుంఛ్ జిల్లాలో ఏప్రిల్ 20న ఆర్మీ వాహనం మంటల్లో చిక్కుకోవడంతో ఐదుగురు సైనికులు మరణించారు. వాహనంపై తీవ్రవాదులు హ్యాండ్ గ్రనేడ్ విసరడంతో మంటలు చెలరేగాయని భారత సైన్యం తెలిపింది.

ఈ దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఐదుగురు జవాన్లు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. మరణించినవారిలో నలుగురు పంజాబ్‌కు చెందిన వారు.

పుంఛ్ జిల్లాలో తీవ్రవాదుల ఏరివేత కోసం నిర్వహిస్తున్న ఆపరేషన్‌లో భాగంగా ఈ జవాన్లను మోహరించారు.

తీవ్రంగా గాయపడిన మరో సైనికుడు రాజౌరిలోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సైన్యం తెలిపింది.

భారత సైన్యం ఒక ట్వీట్‌లో మరణించిన సైనికుల పేర్లను ఇచ్చింది.

హవల్దార్ మన్‌దీప్ సింగ్, లాన్స్ నాయక్ దేవాశిష్ బస్వాల్, లాన్స్ నాయక్ కుల్వంత్ సింగ్, సిపాయి హరికృష్ణ సింగ్, సిపాయి సేవక్ సింగ్‌లు ఆ ఐదుగురు సైనికులు.

ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఈ ఐదుగురు సైనికులకు నివాళులు అర్పించారు. వీరి త్యాగానికి భారత సైన్యం సెల్యూట్ చేస్తోందన్నారు.

దేశం కోసం తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఈ సైనికులు అత్యున్నత త్యాగం చేశారని ఆయన చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

పుంఛ్ సెక్టార్ ఘటన

ఫొటో సోర్స్, ANI

మృతుల్లో నలుగురు పంజాబీలు

మృతుల్లో హవల్దార్ మన్‌దీప్ సింగ్ పంజాబ్‌లోని లూథియానా జిల్లా చంకోయన్ కలాన్ గ్రామానికి చెందినవారు.

లాన్స్ నాయక్ కుల్వంత్ సింగ్ మోగా జిల్లాలోని చారిక్ గ్రామ నివాసి.

సిపాయి సేవక్ సింగ్ భటిండాలోని తల్వాండి సబో జిల్లాలోని బాగా గ్రామానికి చెందినవారు.

లాన్స్ నాయక్ దేబాశిష్ ఒడిశాలోని పూరీ నివాసి.

సిపాయి హరికిషన్ సింగ్ గురుదాస్‌పూర్ జిల్లా తల్వాండి భరత్ గ్రామ నివాసి.

హరికిషన్ సింగ్

27 ఏళ్ల హరికిషన్ సింగ్ 49 రాష్ట్రీయ రైఫిల్స్‌లో పనిచేసేవారు. ఆయన తండ్రి పేరు మంగళ్ సింగ్. ఆయన కూడా భారత ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు.

హరికిషన్‌కు భార్య దల్జీత్ కౌర్, రెండేళ్ల పాప ఉన్నారు. భార్య ప్రస్తుతం గర్భవతి.

హరికిషన్ సింగ్ 2017లో సైన్యంలో చేరారు. ఆయన మరణవార్త చేరడంతో తల్వండి భరత్‌లో విషాదం అలముకుంది.

"ముందు రోజే వీడియో కాల్ చేసి మేమంతా ఆయనతో మాట్లాడాం. మా పాప్ ఖుష్‌ప్రీత్ కౌర్‌తో చాలాసేపు వీడియో కాల్‌లో మాట్లాడారు" అని దల్జీత్ కౌర్ చెప్పారు.

ఫిబ్రవరి నెలలో కొన్ని రోజులు సెలవులపై ఇంటికి వచ్చారు. తరువాత మళ్లీ డ్యూటీలో చేరారు.

కుల్వంత్ సింగ్

కుల్వంత్ సింగ్ మృతితో మోగా జిల్లాలోని చారిక్ గ్రామం శోక సంద్రంలో మునిగింది.

ఆయన పెద్దనాన్న బీబీసీతో మాట్లాడుతూ "కుల్వంత్ సింగ్ తండ్రి బల్దేవ్ సింగ్ కార్గిల్ యుద్ధంలో మరణించారు" అని చెప్పారు.

రెండు నెలల క్రితమే కుల్వంత్ సింగ్ తన కుటుంబాన్ని కలవడానికి సొంతూరికి వచ్చారు.

కుల్వంత్ సింగ్ 14 ఏళ్ల క్రితం భారత సైన్యంలో చేరారని ఆయన పెదనాన్న తెలిపారు.

వీడియో క్యాప్షన్, వీడియో: నాడు తండ్రి కార్గిల్ యుద్ధంలో మరణిస్తే.. నిన్న కొడుకు పుంఛ్ దాడిలో కన్నుమూశారు

మన్‌దీప్ సింగ్

లూథియానాకు చెందిన 39 ఏళ్ల హల్దార్ మన్‌దీప్ సింగ్ మృతి చెందారన్న సమాచారాన్ని భారత సైన్యం ఫోన్ ద్వారా ఆయన కుటుంబానికి అందించింది.

మన్‌దీప్ సింగ్‌కు తల్లి, భార్య, చిన్న పిల్లలు ఉన్నారు. ఆయన తండ్రి చనిపోయారు.

సేవక్ సింగ్

గురుసేవక్ సింగ్ తండ్రి గురుచరణ్ సింగ్. తల్లి, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.

సేవక్ సింగ్ 2018లో సైన్యంలో చేరారు. 20 రోజుల క్రితమే సెలవుల తరువాత విధుల్లో చేరారు.

హరికిషన్ సింగ్ (ఎడమ), మన్‌దీప్ సింగ్ (కుడి)

ఫొటో సోర్స్, Gurpreet Singh Chawla, GURMINDER GAREWAL

ఫొటో క్యాప్షన్, హరికిషన్ సింగ్ (ఎడమ), మన్‌దీప్ సింగ్ (కుడి)

భగవంత్‌ మాన్‌ సంతాపం

మృతి చెందిన సైనికులకు పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ నివాళులర్పించారు.

"రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఐదుగురు సైనికుల్లో నలుగురు సైనికులు పంజాబ్‌కు చెందినవారు. తీవ్రవాదుల దాడిలో మరణించిన అమరవీరులకు నివాళులు" అని ట్వీట్ చేశారు.

ఏప్రిల్ 20 గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో జవాన్ల వాహనంపై తీవ్రవాదులు గ్రెనేడ్ విసిరారని, వాహనం కాలిపోవడానికి అదే కారణమై ఉండొచ్చని సైన్యం ఉత్తర కమాండ్ ప్రధాన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

రాష్ట్రీయ రైఫిల్స్

ఫొటో సోర్స్, TAUSEEF MUSTAFA

రాష్ట్రీయ రైఫిల్స్

రాష్ట్రీయ రైఫిల్స్ భారత సైన్యంలో ఉన్నత శిక్షణ పొందిన తీవ్రవాద నిరోధక దళం. జమ్మూ కశ్మీర్‌లో తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి 1990లో దీన్ని ఏర్పాటుచేశారు.

రాష్ట్రీయ రైఫిల్స్‌లో భారత సైన్యంలోని వివిధ రెజిమెంట్‌లకు చెందిన సైనికులు ఉన్నారు.

దీని ప్రధాన కార్యాలయం జమ్మూ కశ్మీర్‌లో ఉంది. ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ, తీవ్రవాదంపై పోరులో రాష్ట్రీయ రైఫిల్స్ కీలక పాత్ర పోషించింది.

విపత్తులను ఎదుర్కొనే ధైర్యం, నిబద్ధత ఉన్న బృందం అని భారత ప్రభుత్వం అనేకసార్లు ప్రశంసించింది.

రాష్ట్రీయ రైఫిల్స్ జమ్మూ కశ్మీర్‌లో 'తీవ్రవాదుల నిర్మూలన', ఆయుధాలు, మందుగుండు సామగ్రి రికవరీ, అనుమానితుల అరెస్టు వంటి పలు విజయవంతమైన ఆపరేషన్లు చేపట్టింది.

స్థానిక ప్రజలకు సహాయం అందించడంలో కూడా చురుకుగా ఉంటుంది.

అయితే, జమ్మూ కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలను కొన్నిసార్లు ఎదుర్కొంది. రాష్ట్రీయ రైఫిల్స్ ఈ ఆరోపణలను తిరస్కరించింది. తమ బృందం చట్ట పరిధిలో పనిచేస్తుందని, మానవ హక్కుల సూత్రాలను అనుసరిస్తుందని స్పష్టంచేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)