యుక్రెయిన్ యుద్ధం: బ్రిటన్, నార్వే పరిసరాల్లో రష్యా 'ఘోస్ట్ షిప్స్' .. అక్కడేం జరుగుతోంది?

వీడియో క్యాప్షన్, వీడియో: ఉత్తర సముద్రంలో విధ్వంసక చర్యలకు పాల్పడేందుకు రష్యా నౌకలు తిరుగుతున్నాయనే ఆరోపణలు.. రష్యా స్పందన ఏమిటి?
    • రచయిత, గోర్డాన్ కొరెరా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉత్తర సముద్రంలో పవన్ విద్యుత్ వ్యవస్థలు(విండ్‌ ఫామ్స్), కమ్యూనికేషన్ కేబుల్‌లను దెబ్బతీసేందుకు రష్యా పథకం పన్నుతోందని యూరప్‌లోని కొన్ని మీడియా కథనాలు చెబుతున్నాయి.

డెన్మార్క్, ఫిన్లాండ్, నార్వే, స్వీడన్ ప్రభుత్వ మీడియా సంస్థల సంయుక్త పరిశోధనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆ పరిశోధన ప్రకారం ఫిషింగ్ ట్రాలర్లు, పరిశోధన నౌకల పేరుతో రష్యా ట్రాలర్లు, నౌకలు అక్కడ మోహరించి ఉన్నాయి.

నీటి అడుగున గూఢచర్యానికి వినియోగించే పరికరాలు ఆ ట్రాలర్లు, నౌకల్లో ఉన్నాయి. విద్రోహ చర్యకు పాల్పడేందుకు ముఖ్యమైన లక్ష్యాలను అవి గుర్తిస్తున్నాయని ఆ పరిశోధన చెబుతోంది.

బ్రిటన్ జలాల్లో రష్యా నౌకలు తిరుగుతున్నాయని బ్రిటన్ అధికారులకు తెలుసని బీబీసీ భావిస్తోంది.

ఈ పరిశోధనాత్మక కథనాల్లో మొదటి భాగాన్ని బుధవారం డెన్మార్క్‌లో డీఆర్, నార్వేలో ఎన్‌ఆర్‌కే, స్వీడన్‌లో ఎస్వీటీ, ఫిన్‌లాండ్‌లో వైలే ప్రజలకు అందించనున్నాయి.

ఓడపై రైఫిల్‌తో నిల్చున్న వ్యక్తి

ఫొటో సోర్స్, MORTEN KRUGER, DR.

డెన్మార్క్ ఏం చెబుతోంది?

పాశ్చాత్య దేశాలతో పూర్తిస్థాయి ఘర్షణ ఏర్పడితే ఏం చేయాలనేది దృష్టిలో ఉంచుకొనే రష్యా ఈ సన్నాహాలు చేస్తోందని డెన్మార్క్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు తెలిపారు.

ఈ సన్నాహాలకు రష్యా చాలా ప్రాధాన్యం ఇస్తోందని, రష్యా ప్రణాళికను నేరుగా మాస్కో నుంచి నియంత్రిస్తున్నారని నార్వే నిఘా విభాగం అధిపతి ఈ నివేదికలో తెలిపారు.

'నార్డిక్' జలాల్లో రష్యా ఘోస్ట్ షిప్‌లు ట్రాన్స్‌మిటర్లు ఆపేసుకొని తిరుగుతున్నాయని యూరోపియన్ మీడియా సంస్థలు చెబుతున్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో ఇతరులకు తెలియకుండా ఉండేందుకే ఇలా చేస్తున్నాయని అంటున్నాయి. రష్యన్ కమ్యూనికేషన్లను ఇంటర్‌సెప్ట్ చేస్తే విషయం బయటపడిందని చెబుతున్నాయి.

అడ్మిరల్ వ్లాదిమిర్స్కీ అనే రష్యన్ నౌకపై మీడియా సంస్థల నివేదిక ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.

రష్యా అధికారికంగా ఈ నౌకను 'ఎక్స్‌పీడిషనరీ ఓషనోగ్రాఫిక్ షిప్' అని చెబుతోంది. అంటే ఇది నీటి అడుగున పరిశోధనలు చేసే నౌక. కానీ వాస్తవానికి ఇది రష్యా గూఢచారి నౌక అని యూరోపియన్ మీడియా చెబుతోంది.

బ్రిటన్, నెదర్లాండ్స్ తీర ప్రాంతంలోని ఏడు విండ్ ఫామ్‌ల సమీపంలో ఈ నౌక కదలికలను గుర్తించేందుకు తాము బ్రిటన్ మాజీ నౌకాదళ నిపుణుడి సేవలు ఉపయోగించుకొన్నట్టు ఈ మీడియా సంస్థల డాక్యుమెంటరీ తెలిపింది. రష్యన్ ఓడ విండ్ ఫామ్‌‌ల వద్దకు చేరుకోగానే ఇది వేగం తగ్గిస్తుందని చెప్పింది. ట్రాన్స్‌మిటర్‌ను ఆపేసి ఇది ఒక నెలపాటు సంచరించింది.

సముద్రంలోని విండ్ మిల్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సముద్రంలోని విండ్ మిల్స్

ఒక విలేఖరి ఒక చిన్న పడవలో నౌకను చేరుకోవడానికి ప్రయత్నించారు. అయితే నౌకపై ఓ ముసుగు ధరించిన వ్యక్తి సైనిక రైఫిల్‌తో నిల్చుని కనిపించారు.

ఇదే నౌక గత ఏడాది నవంబర్ 10న స్కాట్లాండ్ తీర ప్రాంతంలో కనిపించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఫిబ్రవరిలో నెదర్లాండ్స్ ఇంటెలిజెన్స్ సర్వీస్ సముద్ర మౌలిక సదుపాయాలను దెబ్బతీసే సన్నాహాలపై ఒక హెచ్చరికను జారీ చేసింది.

నెదర్లాండ్స్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధిపతి ఉత్తర సముద్రంలోని ఒక విండ్ ఫామ్ సమీపంలో రష్యన్ నౌకను గుర్తించినట్లు చెప్పారు. ఇది సముద్ర లక్ష్యాలను గుర్తిస్తుంది.

జనరల్ జాన్ స్విల్లెన్స్ మాట్లాడుతూ- "గత కొన్ని నెలలుగా రష్యాకు చెందినవారు ఉత్తర సముద్రంలో ఇంధన వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు మేం కనుగొన్నాం. మేం ఈ ప్రయత్నాలను మొదటిసారి చూశాం" అన్నారు.

సున్నితమైన లక్ష్యాలపై నిఘా పెట్టడం కొత్త విషయం కాదు. పాశ్చాత్య దేశాలు కూడా రష్యాకు వ్యతిరేకంగా ఇలాంటి కార్యకలాపాలను నిర్వహిస్తాయి.

సంక్షోభం సంభవించినప్పుడు, కొన్ని దారులు అందుబాటులో ఉండాలనేది దీని ఉద్దేశం.

పాశ్చాత్య దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఇంధన ప్లాంట్లను దెబ్బతీయడం ద్వారా భయాందోళనలను వ్యాప్తి చేయడం వీటిల్లో ఒకటి.

అయితే, సమాచారాన్ని సేకరించడం కంటే నేరుగా చర్యలకు దిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

గత సంవత్సరం స్వాల్‌బార్డ్‌లో సముద్ర డేటా కేబుల్‌ను కత్తిరించడం వెనుక అటువంటి నౌక ఉండే అవకాశాలకు ఈ నివేదిక బలాన్నిస్తోంది.

ఈ కేబుల్ శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య గ్రౌండ్ స్టేషన్‌కు అనుసంధానించి ఉంది.

నార్వేజియన్ పోలీసులు మాట్లాడుతూ మానవ కార్యకలాపాలే కారణమని తాము నమ్ముతున్నామని, అయితే దానికి ఇంకా ఎవరినీ బాధ్యులను చేయలేదని చెప్పారు.

పుతిన్

ఫొటో సోర్స్, EPA

డాక్యుమెంటరీపై రష్యా ఏమంటోంది?

డాక్యుమెంటరీలో చేసిన ఆరోపణలను బుధవారం రష్యా అధికారులు తోసిపుచ్చినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.

డాక్యుమెంటరీపై నార్డిక్ దేశాల్లోని రష్యన్ రాయబారులను డాక్యుమెంటరీ రూపకర్తలు సంప్రదించగా నార్వేలో మాత్రం స్పందించారు.

రష్యాపై గూఢచర్యం, హ్యాకర్ల దాడులు, ఇతర రహస్య కార్యకలాపాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ చూపకుండా ఆరోపణలు చేయడం నార్వే అధికారులకు అలవాటుగాా మారిందని నార్వేలో రష్యా దౌత్యవేత్త టీమురాజ్ రమిష్విలి చెప్పారు.

రష్యన్ నౌకలు నార్వేజియన్ నిబంధనలను అనుసరిస్తున్నాయని, నార్వేజియన్ జలాల్లో ప్రయాణించే హక్కు ఉందని ఆయన చెప్పారు.

ఈ ఏడాది ఏప్రిల్ 13న గూఢచర్యం ఆరోపణలపై 15 మంది రష్యన్ అధికారులను నార్వే బహిష్కరించింది. యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అధికారుల బహిష్కరణకు సంబంధించిన తాజా కేసు ఇది.

2022 అక్టోబరులో షెట్లాండ్ దీవుల్లో కేబుల్ కట్‌ చేయడాన్ని పోలీసులు పెద్ద ఘటనగా భావిస్తున్నారు.

ఈ సంఘటన ఈ ద్వీపం ప్రధాన భూభాగం నుంచి కమ్యూనికేషన్ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసింది. అయితే అప్పట్లో ఈ ఘటనకు మత్స్యకారులే బాధ్యులన్నారు.

ఇటీవల రష్యా గ్యాస్‌ను యూరప్‌కు రవాణా చేయడానికి నిర్మించిన నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్ దెబ్బతిన్న సంఘటన చోటుచేసుకుంది.

అప్పట్లో చాలా మంది రష్యాదే బాధ్యత అంటూ ఆరోపించారు.

అయితే ఈ ఘటనలో యుక్రెయిన్ అనుకూల అంశాల ప్రమేయంపై కూడా ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ వ్యవహారంపై విచారణ సాగుతోంది.

రష్యా సైనిక గూఢచార సంస్థ అయిన జీఆర్‌యూ విధ్వంసం సృష్టించడం, ప్రత్యర్థులపై విష ప్రయోగాలు రెండూ చేయగల నేర్పరి.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)