కోహినూర్ వజ్రం మళ్లీ భారత్‌కు దక్కుతుందా? వలసపాలనలో చోరీ అయిన వారసత్వ సంపదను తిరిగి స్వదేశానికి తీసుకొస్తున్న ఇద్దరు గూఢచారులు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, చారుకేసి రామదురై
- హోదా, బీబీసీ ప్రతినిధి
వలస పాలనలో ఎన్నో కళాఖండాలు, పురాతన వస్తువులు విదేశాలకు అక్రమంగా తరలిపోవడంతో భారత్ గొప్ప వారసత్వ సంపదను కోల్పోయింది. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు భారత్ కోల్పోయిన సంపదను తిరిగి తీసుకొచ్చే పనిలో ఉన్నారు.
దీనిపై చారుకేసి రామదురై అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఆమె ఆ వజ్రాన్ని కిరీటంలో పెట్టుకుంటారా, లేదా?
కింగ్ చార్లెస్ - 3 పట్టాభిషేక ముహూర్తం సమీపిస్తుండటంతో భారత్ దృష్టి బ్రిటన్ రాణి మీదకు మళ్లింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆమె తలపై పడింది.
వివాదాస్పదంగా మారిన కోహినూర్ వజ్రాన్ని క్వీన్ మేరీ ధరిస్తారా? లండన్ రాజప్రసాదం టవర్ ఆఫ్ లండన్‌లో కొలువుదీరిన కోహినూర్ క్వీన్ కిరీటంలోకి చేరనుందా అని ఎవరైనా ఆశ్చర్యంతో ఎదురుచూస్తుంటే మాత్రం వారికి నిరాశ తప్పదు.
క్వీన్ మేరీ కోహినూర్ డైమండ్‌ను ధరించడం లేదని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఇప్పటికే ప్రకటించింది.
అయితే అందుకు కారణమేంటన్నది ప్యాలెస్ అధికారికంగా ప్రకటించలేదు. కోహినూర్ వజ్రంపై పూర్తి హక్కులు తమకే ఉంటాయని భారత్ చాలా కాలంగా చెబుతూ వస్తోంది.
ఇప్పుడు కోహినూర్ వజ్రాన్ని ధరించడం వల్ల భారత్‌తో దౌత్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న ఆందోళనలు ఉన్నాయి.
ఇది కోహినూర్ వజ్రం భారత్‌కు చెందినదేనని భావించే వారిని బుజ్జగించే చర్య కూడా కావొచ్చు.
1849లో పంజాబ్ రాష్ట్రాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకున్న సమయంలో క్వీన్ విక్టోరియాకు లొంగిపోయినప్పుడు కోహినూర్ వజ్రం బ్రిటిషర్ల చేతుల్లోకి వెళ్లిందని విశ్వసిస్తున్నారు.
కోహినూర్ డైమండ్ గురించి 1628లో తొలిసారి రికార్డుల్లో నమోదైనట్లు గుర్తించారు. భారత్‌కు అప్పటి వలస పాలకులకు మధ్య ఈ వివాదం నడుస్తూనే ఉంది.
కోహినూర్ డైమండ్‌ను తిరిగి ఇచ్చేయాలని భారత ప్రభుత్వం, భారతీయులు నిరంతరం డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
భారత వార్త పత్రిక మింట్ నిర్మొహమాటంగా ప్రచురించినట్టుగా కోహినూర్ డైమండ్‌ను భారత్ బహుమతిగా ఇచ్చిందనే భావనను బ్రిటిష్ పాలకులు కల్పించారు.
అయితే, దానిని స్వాధీనం చేసుకోవడం వెనక ఉన్న హింసాత్మక చరిత్ర గురించి అధికారికంగా ఎక్కడా ప్రస్తావించలేదు. అదే అసలు సమస్యగా మారింది.

ఫొటో సోర్స్, Metropolitan Museum of Art
''వజ్రం ధరించండి... మిగిలినవి ఇచ్చేయండి''
కోహినూర్ వ్యవహారంతో కొత్త చర్చ మొదలైంది.
వాణిజ్యం పేరుతో వచ్చి పరిపాలన సాగించిన వలస పాలకులు తీసుకెళ్లిన మెరిసే రాళ్ల గురించి మాత్రమే కాదు, చాలా వనరుల గురించి కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన 'వేర్ ది డైమండ్, గివ్ బ్యాక్ ది రెస్ట్' (వజ్రం ధరించండి, మిగిలినవి వెనక్కి ఇచ్చేయండి) కథనం సూచిస్తోంది.
అలాంటి వెలకట్టలేని సాంస్కృతిక కళారూపాలను తిరిగి తీసుకొచ్చేందుకు ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్ సంస్థ కృషి చేస్తోంది.
భారత్ నుంచి దొంగిలించిన, అక్రమంగా తరలించిన కళాఖండాలను వెనక్కి తీసుకురావడం కోసం ఈ సంస్థ పనిచేస్తోంది.
మ్యూజియంలు, ఇతర ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉన్న ఇలాంటి కళారూపాలను, కళాఖండాలను వెనక్కి తెచ్చేందుకు కృషి చేస్తోంది.
షిప్పింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఎస్ విజయ్ కుమార్, పబ్లిక్ పాలసీ ఎక్స్‌పర్ట్ అనురాగ్ సక్సేనా భారత్ ప్రైడ్ ప్రాజెక్ట్‌ను 2013లో ప్రారంభించారు.
ప్రపంచంలోని పలు దేశాలకు తరలిపోయిన భారత కళాఖండాలను తిరిగి తీసుకొచ్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.
అప్పటికే భారత్‌కు చెందిన కళారూపాలను తెచ్చేందుకు కుమార్ పదేళ్లుగా కృషి చేస్తున్నారు.
భారత్ ప్రైడ్ ప్రాజెక్ట్ కోసం ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న కొద్దిమంది వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. వారు ఆన్‌లైన్‌లోనే ఎక్కువగా మాట్లాడుకుంటారు.
ఆ వాలంటీర్ల సాయంతో కోట్ల విలువైన పురాతన వస్తువులను ఆస్ట్రేలియా, సింగపూర్, జర్మనీ, యూకే, యూఎస్ వంటి దేశాల నుంచి ఈ ఇద్దరు గూఢచారులు భారత్‌కు తీసుకొచ్చారు.
ఇటీవల ఆస్ట్రేలియా నేషనల్ గ్యాలరీ 18 కోట్ల రూపాయల విలువైన పురాతన కళాఖండాలను భారత్‌కు అప్పగించడంలోనూ వారి కృషి ఉంది.
ఆ కళాఖండాలను స్మగ్లర్ సుభాష్ కపూర్ అక్రమంగా విదేశాలకు తరలించారు. వాటిని ఆస్ట్రేలియా నేషనల్ గ్యాలరీ తిరిగి భారత్‌కు అప్పగించింది.
బ్రిటిష్ వలస పాలనలో తరలిపోయిన కళాఖండాలు, ఆ తర్వాతి కాలంలో ఆలయాలు, ఇతర ప్రదేశాల నుంచి దొంగిలించిన, అక్రమంగా తరలించిన పురాతన విగ్రహాలు, వారసత్వ సంపదను తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా వారు పనిచేస్తున్నారు.

ఫొటో సోర్స్, IPP
'భారత సంపద'ను వాళ్ళు ఎలా తిరిగి తీసుకొస్తారు?
కుమార్ చెన్నైలో ఉంటారు. సక్సేనా సింగపూర్‌లో ఉంటున్నారు. కనిపించకుండా పోయిన విగ్రహాలను వెతికి తీసుకురావడం, ఆక్షన్ హౌసెస్‌లో స్టింగ్ ఆపరేషన్లు ఎలా చేయాలి అనే విషయాలను ఇద్దరూ చర్చించకుంటారు.
భారత్ నుంచి తరలిపోయిన కళాఖండాలు ఎక్కడెక్కడున్నాయనే సమాచారం ఉంటుంది.
కానీ, వాటిని తిరిగి తీసుకొచ్చేందుకు, ఆ విషయాలను చూసుకునేందుకు అధికారులెవరూ లేకపోవడమే కొరతని వాళ్లు చెబుతున్నారు.
అలాంటి సమస్యలను గమనించిన కుమార్ కళారూపాలను తెచ్చేందుకు కృషి చేస్తున్నారు.
1970 నుంచి 2012 వరకు భారత ప్రభుత్వం అలాంటి 19 కళాఖండాలను తిరిగి తీసుకురాగలిగింది. కానీ, కుమార్, సక్సేనా చొరవతో గత పదేళ్లలో 600 కళాఖండాలు దేశానికి తీసుకురాగలిగారు.
అయితే, వాళ్లు పురాతన కళలను బతికించాలనే తపనకే పరిమితం కాలేదు. అందుకోసం తగిన పేపర్ వర్క్, సంక్లిష్టమైన పనులను నేర్పుగా సాధించేందుకు శ్రమిస్తారు.
కళారూపాలను తీసుకురావడంలో దేశాల మధ్య ఎదురయ్యే న్యాయ, భద్రతాపరమైన సమస్యలు, లా అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, కస్టమ్స్ ఇలా అనేక ఇబ్బందులను అధిగమించాల్సి ఉంటుందని కుమార్ చెప్పారు.
''గతంలో అవి దేశం దాటినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. కాబట్టి మేం ఆ పని చేస్తున్నాం'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Metropolitan Museum of Art
'దేవుళ్ల విగ్రహాలను అవమానించినట్లు గుర్తించాను'
''ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్ ఒక సంస్థ కంటే ఎక్కువ. అదో వ్యవస్థ. మాకు డబ్బులు ఉండవు. ఉద్యోగులు ఉండరు. ఎలాంటి అధికారం ఉండదు.'' అని సక్సేనా చెప్పారు. కొద్దిగా గౌరవంగా ఉన్నప్పటికీ అవేవీ ఉండవని ఆయన అన్నారు.
వేలం సంస్థలు, మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలతో ఉత్తర ప్రత్యుత్తరాలు, వారసత్వ కళాఖండాలను స్వదేశానికి చేర్చేందుకు అధికారక సంస్థలను అనుసంధానం చేయడం వంటి పనులను వాలంటీర్లు పర్యవేక్షిస్తారు.
వారు బయటికి వెళ్లి, సోషల్ నెట్‌వర్క్ ద్వారా సపోర్టర్ల నుంచి సమాచారం సేకరిస్తారు. నిజంగానే ఆ వస్తువు లేదా కళాఖండం దొంగతనానికి గురైందని ధ్రువీకరించుకున్నాక, ప్రభుత్వాన్ని సంప్రదిస్తారు.
ఎక్కడైతే ఈ వస్తువు ఉంటుందో ఆ మ్యూజియంపైనా లేదా ప్రభుత్వాలపైనా ఒత్తిడి తీసుకొస్తారు.
ఆసియా, ఆఫ్రికాలోని పేద దేశాల నుంచి విలువైన కళలను, కళాఖండాలను దొంగతనం చేసి, వాటిని వలసదారులు లేదా ఇటీవల కాలంలో స్మగ్లర్లు పశ్చిమంలోని ధనిక దేశాలకు తరలించారు.
ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే ఉద్యోగులు కొంతమంది భారత్‌లోని అత్యంత విలువైన వేలాది వస్తువులను భారత్ నుంచి దొంగలించి బ్రిటన్‌కు తరలించారని ‘‘ది అనార్కీ: ది ఈస్ట్ ఇండియా కంపెనీ, కార్పొరేట్ వయొలెన్స్, ది పిల్లేజ్ ఆఫ్ ఆన్ ఎంపైర్’’ అనే పుస్తకంలో రచయిత, చరిత్రకారుడు విలియం డాల్రింపుల్ రాశారు.
‘దేవుళ్ల విగ్రహాలను అవమానిచినట్లు నేను గుర్తించాను. ఈ విగ్రహాలను బహిరంగంగా కాక్‌టైల్ పార్టీలలో వేలం వేసేవారు. ప్రైవేట్ బెడ్‌రూమ్‌లు, గార్డెనల్లో ఉంచేవారు.’ అని విజయ్ కుమార్ అన్నారు.
గోల్డెన్ మమ్మీని దొంగిలించారు
వలస పాలకులు కాలం తర్వాత కూడా, కళాఖండాల మల్టి బిలియన్ డాలర్ల బ్లాక్ మార్కెట్ ఇంకా వెలుగొందుతూనే ఉంది.
2018 మెట్ గలాలో నటి కిమ్ కర్దాషియాన్ గోల్డ్ గౌన్ వేసుకుని, మెరుస్తోన్న గోల్డెన్ మమ్మీ వద్ద నిల్చుని ఒక ఫోటో దిగారు. ఈ ఫోటో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఆ ఫోటో ద్వారా ఈజిప్ట్ నుంచి దొంగతనానికి గురైన ఈ మమ్మీని గుర్తించారు. 2011 ప్రజా ఉద్యమ కాలంలో ద న్ని దొంగతనం చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గుండా జర్మనీలోకి తీసుకెళ్లారు.
ఆ తర్వాత దీన్ని న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ కొనుగోలు చేసింది. తప్పుడు డాక్యుమెంట్ల కోసం 4 మిలియన్ డాలర్లను చెల్లించిన మెట్ చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో, మీడియా ఒత్తిడితో ఆ మమ్మీని ఈజిప్ట్‌కి తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది.
అయితే, ఈ మ్యూజియానికి ఇంత పెద్ద మొత్తంలో నష్టమొచ్చిందా అని బాధపడే ఎవరైనా ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి.
1970 యునెస్కో సదస్సు కళాఖండాల అక్రమ ట్రేడ్‌కు ముగింపు పలకాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అయినప్పటికీ మెట్, ది బ్రిటీష్ మ్యూజియం లాంటి పెద్ద పెద్ద మ్యూజియాలు ఇంకా కళాఖండాల దొంగల నుంచి ఈ వస్తువులను కొనుగోలు చేస్తున్నాయి.
కళాఖండాలను దొంగతనం చేసి, విక్రయించే ఇండియన్ అమెరికన్ ఆర్ట్ స్మగ్లర్ సుభాష్ కపూర్‌కి కూడా జైలు శిక్ష పడింది.
‘‘మ్యూజియాలు కొనుగోలు చేయడం ఆపితే, దొంగతనాలు ఆగుతాయి’’ అనే శీర్షికతో న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 2020లో రాసిన కథనంలో, పురాతన వస్తువుల మూలాలను కంటికి రెప్పలా కాపాడాల్సి ఉందని మ్యూజియాలకు కుమార్ పిలుపునిచ్చారు.

ఫొటో సోర్స్, IPP
కళాఖండాల అక్రమ తరలింపు
పురాతన కళాఖండాలను దక్కించుకోవడంలో పెద్ద పెద్ద మ్యూజియాల మధ్య పోటీ విపరీతంగా ఉంటుంది.
కపూర్‌ను పోలీసులు పట్టుకున్న తర్వాత కూడా ఆయనతో సంబంధం ఉన్న పలు విగ్రహాలు, స్టాట్యూలు ఇంకా ఆర్ట్ గ్యాలరీలు, క్యూరియో షాపులలో దర్శనమిస్తున్నాయని కుమార్ తెలిపారు.
పురాతన కళాఖండాలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉండటంతో, భారత్ వంటి దేశాల నుంచి అక్రమంగా ఈ వస్తువులు తరలివెళ్లడం జరుగుతూనే ఉంది.
ముఖ్యంగా డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకుండా, ప్రభుత్వ సాయంతో వీటిని దేశం దాటిస్తున్నారు.
‘‘ప్రతి ఏడాది మనం దాదాపు వెయ్యి వరకు అత్యంత విలువైన పురాతన వస్తువులను కోల్పోతున్నాం’’ అని కుమార్ తెలిపారు.
దేవాలయాలు, పురావస్తు ప్రదేశాలు, చిన్న చిన్న మ్యూజియాల నుంచి విలువైన కళాఖండాలను అక్రమంగా తరలించే దానిలో వాటిల్లో పనిచేసే వారి ప్రమేయం కూడా ఉంటోంది.
సాధారణంగా వలసరాజ్యాల కాలంలో దోపిడికి గురైన వాటితో పోలిస్తే ప్రస్తుతం దొంగతనానికి గురైన లేదా ఇతర దేశాలకు తరలించిన కళాఖండాలను ఐపీపీ తేలిగ్గా ట్రాక్ చేయగలుగుతుంది.
ఐపీపీ, రిటర్నింగ్ హెరిటేజ్, ఆర్ట్ రికవరీ వంటి పలు గ్రూప్‌ల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియాలకు ఈ వస్తువుల గురించి ఒత్తిడి పెరుగుతోంది.
కళాఖండాల పునరుద్ధరణపై ఇటీవల న్యూయార్క్ టైమ్స్ ఒక కథనం రాసింది. దీనిలో ఎన్నో ఏళ్లుగా స్కాలర్లు అభివృద్ధి చేసిన ఈ మ్యూజియం సేకరణలను తిరిగి ఇచ్చేయడంపై పలు ఆందోళనలు వ్యక్తం చేసింది.
అయితే, ఈ వాదనల్లో ఉన్న ప్రాథమిక లోపం ఏంటంటే ఇవి కేవలం చూసి ఎంజాయ్ చేసేందుకు తీర్చిదిద్దిన కళాఖండాలు కావు. వీటిని దొంగలించడానికి ముందు ఎన్నో తరాల వారు వీటిని కొలిచారు.
‘‘చాలా కమ్యూనిటీలు నమ్మకానికి, గుర్తింపుగా వీటిని వాడారు. వీటికి సాంస్కృతిక, భావోద్వేగ ప్రాధాన్యముంది. ఈ విగ్రహాలకు అభిషేకాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు నూతన వస్త్రాలతో అలకరించేవారు. ఇలా పూజించడం ద్వారా వారికి అపారమైన శక్తి వస్తుందనే నమ్మకం.’’ అని సక్సేనా వివరించారు.
'ఏ గుడిలో నుంచి దొంగిలించారో... ఆ గుడిలోకే తీసుకొచ్చారు'
కుమార్, సక్సేనా ఇద్దరూ కూడా దొంగతనానికి గురైన విగ్రహాలను భారత్‌కు తీసుకొచ్చిన సంతోషకరమైన క్షణాలను వివరించారు.
ఎక్కడి నుంచైతే వాటిని దొంగిలించారో ఆ గుళ్లలో వాటిని సంప్రదాయబద్ధంగా నెలకొల్పిన క్షణాలను గుర్తుచేసుకున్నారు.
వలసవాదులు అక్రమంగా తీసుకెళ్లినప్పటికీ ఈ కళాఖండాలు వాటి కీర్తిని, ప్రాాభవాన్ని ఏ మాత్రం కోల్పోవని కుమార్ అన్నారు.
అనితా ఆనంద్‌తో కలిసి కోహ్-ఇ-నూర్ అనే పుస్తకాన్ని రాసిన డాల్రింపుల్.. కళాఖండాలలో ఉన్న అసమానతలను గురించి విమర్శించారు.
‘‘నాజీలు దొంగిలించిన యూదుల కళారూపాల సంగతేంటని ఎవరినైనా అడిగితే, ప్రతి ఒక్కరూ 'అవును వాటిని తిరిగి సొంతదారులకు ఇచ్చేయాల'ని చెబుతారు.
అయితే, వందల ఏళ్ల క్రితం భారత్ నుంచి దొంగతనానికి గురైన వాటి గురించి ఇదే విధంగా ఎందుకు చెప్పలేకపోతున్నారని 2017లో స్మిత్‌సోనియన్ మ్యాగజీన్‌కి రాసిన దానిలో డాల్రింపుల్ ప్రశ్నించారు.
కొన్ని సార్లు ప్రయత్నాలు విఫలమైనప్పుడు, వారు అసాధారణ వ్యూహాలను అనుసరిస్తూ ఉంటారు.
కొన్నేళ్ల క్రితం ఒక యువ ఐపీపీ వాలంటీర్ బ్రిటీష్ ఇండియన్ల బృందం లండన్ మ్యూజియాలకు వెళ్లి, అక్కడ ఆ వస్తువులకు పక్కన చిన్న ప్రింటెడ్ కార్డులను పెట్టింది.
దానిపై, ‘‘నేను భారత్ నుంచి తీసుకొచ్చాను. నాకు సాయం చేయండి. బ్రిటీష్ వారు నన్ను కిడ్నాప్ చేశారు’’ అని రాస్తారు.
అహింసా మార్గంలో జరిపిన ఈ నిరసనలు బాగా వైరల్ కూడా అయ్యాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి అధికారులు ఈ వస్తువుల తరలింపుపై చర్చలకు దిగిరావాల్సి వచ్చింది.
ఐపీపీ ఎంపిక చేసిన హ్యాష్‌ట్యాగ్‌లలో ఒకటి #BringBackOurGods కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందింది. అయితే, ఐపీపీకి ఎలాంటి ఆధ్యాత్మిక లేదా రాజకీయ ప్రమేయం లేదని కుమార్ తెలిపారు.
పలు మతాలకు చెందిన కళారూపాలను తాము రికవరీ చేశామని ఆయన చెప్పారు. ఐపీపీ విధానం భారత్‌కు సరిహద్దు దేశాలైన శ్రీలంక, నేపాల్‌కు కూడా స్ఫూర్తిదాయకంగా మారాయని, వారు కూడా వారి సాంస్కృతిక వారసత్వ పునరుద్ధరణకు దీన్ని అనుసరిస్తున్నారు.
కోల్పోయిన గౌరవాన్ని, సంపదను భారత్ తిరిగి పొందాలని ఆల్ ది ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్ ఆశిస్తోందని కుమార్ తెలిపారు. చరిత్ర ఎప్పుడూ తన భౌగోళిక ప్రాంతానికే చెందుతుందని సక్సేనా అన్నారు.
ఇవి కూడా చదవండి
- సూడాన్‌లో ఏం జరుగుతోంది? మిలిటరీ, పారా మిలిటరీ మధ్య యుద్ధం ఎందుకు?
- అతీక్ అహ్మద్, అష్రఫ్ హత్య: వారిని కాల్చి చంపిన నిందితుల నేర చరిత్ర ఏమిటి?
- లూసిడ్ డ్రీమింగ్ : మనం కోరుకున్న కలలు కనొచ్చా? ఎలా?
- సుప్రీంకోర్టు: స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లను అనుమతిస్తుందా, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఆశ ఏంటి?
- 'సైన్స్ ఆఫ్ మనీ': డబ్బును అర్థం చేసుకుంటే సగం కష్టాలు తగ్గినట్టే... ఎలాగంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














