కిబితూ: భారత్‌లోని చివరి గ్రామం నుంచి చైనాకు మోదీ ప్రభుత్వం పంపుతున్న సందేశం ఏమిటి?

అమిత్ షా

ఫొటో సోర్స్, FB/Amit Shah

ఫొటో క్యాప్షన్, కిబితూ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా
    • రచయిత, రాఘవేంద్ర రావు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గాల్వన్ వ్యాలీలో 2020లో భారత్, చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ ఘర్షణలో మరణించిన భారత సైనికుల్లో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన సైనికాధికారి కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు ఒకరు.

తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అరుణాచల్ ప్రదేశ్‌లో రెండు రోజులు పర్యటించారు. ఈ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది.

భారత భూభాగాలను ఎవ్వరూ ఆక్రమించలేరని అమిత్ షా చెప్పారు. చైనా పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రం అంజావ్ జిల్లాలోని సరిహద్దు గ్రామమైన కిబితూలో రూ. 4,800 కోట్ల వ్యయంతో చేపట్టిన ‘‘వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్‌’’ను అమిత్ షా ప్రారంభించారు.

భారత భూభాగాలను ఆక్రమించే రోజులు పోయాయని ఆయన వ్యాఖ్యానించారు. కనీసం సూది మొన పరిమాణంలోని భూమిని కూడా ఎవరూ ఆక్రమించలేరని, ఎందుకంటే భారత భూభాగ రక్షణను ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్(ఐటీబీపీ ) దళం, భారత సైన్యం చూసుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు.

అమిత్ షా

ఫొటో సోర్స్, AMIT SHAH

2022 డిసెంబర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో చైనా, భారత్ సైనికుల మధ్య గొడవ జరిగింది.

చైనా ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాలకు చైనీస్ పేర్లను పెట్టింది.

చైనా పౌర వ్యవహారాల శాఖ, దక్షిణ టిబెట్ ప్రాంతంలోని అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన కొన్ని ప్రాంతాలను చూపుతున్న మ్యాపుతో పాటు చైనా పేర్లు పెట్టిన 11 ప్రాంతాల జాబితాను విడుదల చేసింది. ఇందులో అరుణాచల్ ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌కు సమీపంలోని ఒక పట్టణం కూడా ఉంది.

భారత భూభాగాల పేర్లను చైనా మార్చడాన్ని భారత్ ఖండించింది.

అరుణాచల్ ప్రదేశ్‌ ప్రాంతాల పేర్లను మార్చుతూ చైనా విడుదల చేసిన మూడో జాబితా ఇది. స్థలాలకు, ప్రామాణిక భౌగోళిక పేర్లను ఇవ్వాలంటూ చైనా మూడోసారి ఈ ప్రయత్నం చేసింది.

2017లో కూడా అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు ప్రాంతాల పేర్లను, 2021 డిసెంబర్‌లో 15 ప్రాంతాల పేర్లను మార్చేందుకు చైనా ప్రయత్నించింది.

అమిత్ షా

ఫొటో సోర్స్, AMIT SHAH

వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి?

కేంద్ర ప్రభుత్వం 2022-23 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాలకు గానూ, రూ. 4,800 కోట్ల వ్యయంతో 'వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్'కు ఆమోదం తెలిపింది.

ఇందులో 2,500 కోట్ల రూపాయలను రోడ్ల నిర్మాణం కోసం కేటాయించారు.

సరిహద్దు గ్రామాల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, స్వగ్రామాల్లోనే వారు జీవనం సాగించేలా ప్రోత్సహించడం వంటి చర్యల ద్వారా సరిహద్దు గ్రామాల్లో వలసలను నిరోధించి సరిహద్దు భద్రతను మెరుగుపరచడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.

అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్ ప్రాంతాల్లో ఉత్తర సరిహద్దు వెంట ఉన్న 19 జిల్లాల్లోని 2,967 గ్రామాలను 'వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్' కింద సమగ్ర అభివృద్ధి చేయడం కోసం గుర్తించారు.

అమిత్ షా

ఫొటో సోర్స్, AMIT SHAH

మొదటి దశలో ప్రాధాన్య ప్రాతిపదికన అభివృద్ధి చేయనున్న 662 గ్రామాల్లో 455 గ్రామాలు అరుణాచల్ ప్రదేశ్‌లోనే ఉన్నాయి.

ఈ కార్యక్రమం కింద కేంద్ర, రాష్ట్ర ప్రాయోజిత పథకాలను 100 శాతం అమలు చేసేలా బ్లాక్, పంచాయతీ స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలను ఆయా జిల్లాల యంత్రాంగాలు సిద్ధం చేస్తాయి.

గ్రామాల అభివృద్ధికి రోడ్డు కనెక్టివిటీ, తాగునీరు, సౌర, పవన శక్తితో తయారు చేసే విద్యుత్, మొబైల్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, పర్యటక కేంద్రాలు, బహుళ ప్రయోజన కేంద్రాలు, ఆరోగ్య మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఈ కార్యక్రమం కింద అభివృద్ధి చేస్తారు.

"గోల్డెన్ జూబ్లీ బోర్డర్ లైటింగ్ ప్రోగ్రాం" కింద అరుణాచల్ ప్రదేశ్‌లోని తొమ్మిది మైక్రో హైడల్ ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు.

అమిత్ షా

ఫొటో సోర్స్, STRDEL

కిబితూ ప్రత్యేకత ఏంటి?

భారత్-చైనా సరిహద్దుకు కిబితూ చాలా దగ్గరగా ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్‌‌లో చాలా దూరంలో ఉన్న సర్కిల్ హెడ్‌క్వార్టర్స్‌లో కిబితూ ఒకటి.

దిల్లీ నుంచి దాదాపు 2,700 కి.మీ. దూరంలో, అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ నుంచి దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో కిబితూ ఉంటుంది.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ ప్రాంతంలో జనాభా సంఖ్య దాదాపు 1,900.

వాస్తవాధీన రేఖకు చాలా దగ్గరగా ఉండే కిబితూ ప్రాంతంలో 1962లో భారత్-చైనా మధ్య యుద్ధం జరిగింది.

అందుకే కిబితూ ప్రాంతంలో ‘‘వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్‌’’ను హోం మంత్రి అమిత్ షా ప్రారంభించడాన్ని ఒక వ్యూహాత్మక సందేశంగా పరిగణిస్తున్నారు.

1962 నాటి యుద్ధాన్ని ప్రస్తావిస్తూ అమిత్ షా ఇలా అన్నారు. ‘‘1962 అక్టోబర్ 21న అప్పటి కుమావూ రెజిమెంట్‌కు చెందిన ఆరుగురు అధికారులు చూపించిన ధైర్యసాహసాలే భారత భూమిని రక్షించాయి.

సంఖ్యాపరంగా వారు తక్కువే. ఆయుధాలు కూడా తక్కువే. అయినా, కిబితూ యుద్ధంలో భారత సైన్యం చూపించిన శౌర పరాక్రమాలు చాలా గొప్పవని 1963లో టైమ్ మ్యాగజీన్ ఒక కథనంలో రాసింది’’ అని ఆయన చెప్పారు.

కిబితూను భారతదేశంలోని చివరి గ్రామంగా భావిస్తారు. దీని గురించి అమిత్ షా మాట్లాడుతూ- కిబితూ భారత్‌లోని చివరి గ్రామం కాదని, ఇది భారత్‌లోని మొదటి గ్రామమని వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ఇప్పుడు ఎలా ఉంది?

చైనా వ్యూహం ఏమిటి?

భారత సైన్యానికి చెందిన రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్‌బీ అస్థానా భారత రక్షణ, వ్యూహాత్మక వ్యవహారాలలో నిపుణుడు.

చైనా ఏం చేసినా భారత్‌ దానికి తగిన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అస్థానా చెప్పారు.

‘‘చైనా వ్యూహం ఆక్రమణలను పెంచడం. ఈ పథకం ప్రకారం చైనా మొదట రోడ్లను నిర్మిస్తుంది. తర్వాత వాటికి సమీపంలో కొన్ని గ్రామాలను ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత సరిహద్దు చట్టాలను ఆమోదించి అక్కడి భూమిని తమదిగా చెప్పుకుంటుంది. ఒకవేళ చైనా ఇలా చేస్తే భారతదేశం కూడా అలాగే చేయాల్సి ఉంటుంది. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలకు ఉపాధి లభించేలా, వారు వలస వెళ్లకుండా రోడ్లు, హైడల్ ప్రాజెక్టులను నిర్మించాలి.

సరిహద్దు ప్రాంతాల్లో మరిన్ని గ్రామాలను ఏర్పాటు చేసి, అక్కడి ప్రజలు కూడా అభివృద్ధిని అనుభవించేలా పెట్టుబడులు పెట్టడమే వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ లక్ష్యం’’ అని అస్థానా వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)