అమెరికా దౌత్యం విఫలమైన చోట చైనా ఎలా విజయం సాధించింది? చైనా వ్యూహాన్ని ప్రపంచం ఎలా చూస్తోంది?

చైనా, రష్యా అధ్యక్షులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా, రష్యా అధ్యక్షులు షీ జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్
    • రచయిత, టెస్సా వాంగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ నెల మొదటివారంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మేక్రాన్‌తో కలిసి తేనీటి విందారగిస్తూ యుక్రెయిన్‌లో శాంతి కోసం పిలుపునిచ్చారు. ఇది జరిగిన కొద్దిసేపటికే చైనా యుద్ధ విమానాలు తైవాన్‌పై ఎగురుతూ చక్కర్లు కొట్టాయి. సైనిక విన్యాసాలు చేస్తూ తైవాన్‌ను చుట్టుముట్టాయి.

మేక్రాన్ చైనా పర్యటన ఆ దేశ దౌత్య విధానంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా పరిగణిస్తున్నారు. ఇరు దేశాల నాయకులూ యుక్రెయిన్‌లో శాంతి నెలకొల్పాలంటూ చర్చలు జరిపారు.

ఆ మర్నాడే చైనా మూడు రోజుల మిలటరీ డ్రిల్ ప్రారంభించింది. సైనిక విన్యాసాలు చేస్తూ తైవాన్‌ను చుట్టుముట్టింది. తైవాన్‌తో పాటు దాని చుట్టుపక్కల సముద్ర జలాలను కీలక లక్ష్యాలుగా చేసుకొని డ్రిల్స్‌ కొనసాగించింది.

చైనా రెండు ముఖాల ధోరణికి ప్రపంచం విస్తుపోతోంది. ఓ పక్క అంతర్జాతీయ స్థాయిలో శాంతి కపోతం ఎగరేస్తూ, మరోపక్క తైవాన్‌పై కాలుదువ్వుతోంది.

ఈ తరహా వ్యూహాన్ని చైనా ఎంతకాలం కొనసాగించగలదు? ఇదీ ప్రశ్న.

మేక్రాన్‌, జిన్ పింగ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మేక్రాన్‌తో షీ జిన్‌పింగ్

చైనా దౌత్య వ్యూహం

కోవిడ్ ఏకాంతవాసం నుంచి బయట పడిన తరువాత చైనా దౌత్యపరంగా ఒక్క క్షణం వృథా చేయలేదు. గత కొద్ది నెలల్లో షీ జిన్‌పింగ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ని కలిశారు. బ్రెజిల్ అధ్యక్షుడు చైనాలో పర్యటించారు. మరి కొందరు దేశాధినేతలకు కూడా చైనా ఆతిథ్యమిచ్చింది. తమ దేశ ఉన్నత స్థాయి రాయబారిని యూరప్‌కు పంపించింది. యుక్రెయిన్ యుద్ధానికి 12 పాయింట్లతో పరిష్కార మార్గాన్ని సూచించింది.

సౌదీ అరేబియా, ఇరాన్‌లకు మధ్యవర్తిత్వం వహించింది. అది కూడా, మధ్య ప్రాచ్యంలో అమెరికా దౌత్యం విఫలమైన చోట చైనా కలుగజేసుకుని విజయం సాధించింది. చైనా దౌత్య విధానంలో ఇది ప్రముఖమైనదని నిపుణులు భావిస్తున్నారు.

అలాగే, అంతర్జాతీయ భద్రత, అభివృద్ధి కోసం పలు ప్రతిపాదనలకు తెరతీసింది. దీన్ని బట్టి చైనా "గ్లోబల్ సౌత్"ను ఆకర్షించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తోందని స్పష్టమవుతోంది. అంతకుముందు బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్‌తో అదే చేసింది. ఈ చొరవ కింద పలు దేశాల్లో కోట్ల కొద్ది ధనాన్ని వెచ్చించింది.

అంతేకాకుండా, అంతర్గతంగా దౌత్య బృందంలో పలు మార్పులు తీసుకొచ్చింది. వివాదాస్పద దౌత్యవేత్త జావో లిజియాన్‌ను పక్కనపెట్టి, ఓర్పుతో వ్యవహరించగల వాంగ్ యి, క్విన్ గ్యాంగ్ లాంటి వారిని ముందుకు తీసుకొచ్చింది. అయితే, దౌత్యవేత్తలు ఎప్పుడూ "పోరాట స్ఫూర్తిని" విడువకూడదని షీ జిన్‌పింగ్ ప్రోత్సహిస్తూనే ఉన్నారు.

ఈ విధానాలన్నీ "చైనా పునరుజ్జీవం"లో భాగం. షీ జిన్‌పింగ్ ఇటీవల అధ్యక్ష పదవిని అధిరోహించినప్పుడు "చైనా పునరుజ్జీవం, చైనా కల" గురించి మరోసారి స్పష్టం చేయడమే అందుకు ఉదాహరణ.

ఇదంతా "ఆధునికీకరణకు ఎన్నుకున్న మార్గం, శైలిలో చైనా నాయకత్వానికి ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది" అని చైనా నార్మల్ యూనివర్సిటీలో పాలిటిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో ప్రొఫెసర్ జాంగ్ షిన్ అన్నారు.

ఇది చైనా విధానాన్ని వ్యాప్తిచేయడం మాత్రమే కాదు, అంతర్జాతీయంగా ఆర్థిక సంబంధాలను కాపాడుకునే ప్రయత్నం కూడా.

"మంచి ఆర్థిక వ్యవస్థ లేకపోతే చైనా పునరుద్ధణ సాధ్యం కాదని షీ జిన్‌పింగ్‌కు బాగా తెలుసు" అని ఆసియా సొసైటీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌లో చైనీస్ రాజకీయాల్లో పరిశోధకుడు నీల్ థామస్ అన్నారు.

"చైనా దౌత్యపరంగా ప్రభావవంతంగా ఉండాలంటే, నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉండాలి. అందుకు పశ్చిమ దేశాలతో ఆర్థిక సంబంధాలు కొనసాగించాల్సిందే తప్ప వేరే మార్గం లేదు. దీని కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. కయ్యానికి కాలు దువ్వే విధానం నుంచి వెనక్కుతగ్గాలి" అన్నారాయన.

పుతిన్

ఫొటో సోర్స్, Reuters

చైనా దౌత్య విధానంలో మార్పుకు ప్రధాన కారణం, అన్నీ వైపులనుంచి తమను ముట్టడిస్తున్నారని ఆ దేశం భావించడమే. ఆధునిక సాంకేతికత చైనాకు చేరకుండా ఉండే ప్రయత్నాలూ జరుగుతున్నాయి.

పశ్చిమ దేశాలకు చైనాపై ఉన్న అనుమానాల కారణంగా ఆకుస్, క్వాడ్, వంటి రక్షణ సంబంధాలు బలమవుతున్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం చైనా చేతికి చిక్కకుండా ఉండేందుకు పావులు కదుపుతున్నారు.

అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు చైనాను అదుపు చేయడం, ముట్టడి, అణచివేతకు పూనుకుంటున్నాయని, అది తమ దేశాభివృద్ధికి తీవ్రమైన సవాళ్లను తెచ్చిపెడుతోందని మార్చిలో షీ జిన్‌పింగ్ ఆరోపించారు.

యుక్రెయిన్ యుద్ధం విషయంలో పశ్చిమ దేశాల వైఖరి, నాటోతో సంబంధాలు బలపడడం మొదలైన అంశాల కారణంగా చైనా అలా భావిస్తోందని కార్నెగీ చైనాలో నాన్-రెసిడెంట్ ఫెలో ఇయాన్ చోంగ్ అన్నారు.

"అమెరికాకు బలమైన స్నేహాలు ఉన్నాయని చైనా గుర్తించింది. ఇది తమను బంధిస్తున్నట్టు చైనీయులు భావిస్తున్నారు. అందుకే దాన్ని తెగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు" అన్నారు చోంగ్.

అందుకే చైనా "బహుళ ధృవ ప్రపంచం" వ్యూహంగా ముందుకు కదులుతోంది. ప్రపంచంలోని శక్తి అంతా ఒకే చోట పోగుపడకూదని, అమెరికా గుత్తాధిపత్యానికి ఇదే ప్రత్యామ్నాయమని చెప్పింది.

మేక్రాన్ చైనా పర్యటనలో ఇది ప్రస్ఫుటంగా కనిపించింది. యూరప్‌ను "స్వతంత్ర ధృవంగా" భావించాలని షీ జిన్‌పింగ్ మేక్రాన్‌కు సూచించారు.

మేక్రాన్ "వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి" గురించి మాట్లాడినప్పుడు దానికీ జిన్‌పింగ్ తలూపారు.

ప్రపంచంలో శక్తి వికేంద్రీకరణ గురించి చైనా వాదిస్తుంటే, ఇతరులు దాన్ని మరో విధంగా చూస్తున్నారు. అమెరికా చుట్టూ తిరుగుతున్న దేశాలను దారి మళ్లించడానికి, చైనా ప్రభావాన్ని పెంచుకోవడానికి పన్నిన వ్యూహంగా పరిగణిస్తున్నారు.

ఇరాక్, అఫ్గానిస్తాన్‌లో అమెరికా విదేశాంగ విధానం విఫలమైందని చైనా హైలైట్ చేస్తూ ఉంటుంది. అమెరికా చేతికి రక్తం మరకలు అంటుకున్నాయని సూచిస్తూ, తమకు అలాంటి మచ్చ లేదని, అందుకే ప్రపంచానికి నాయకత్వం వహించేందుకు అమెరికా కన్నా చైనా ఉత్తమమైనదని చెప్పే ప్రయత్నమది.

కమ్యూనిస్ట్ చైనా ఎప్పుడూ మరొక దేశంపై దండెత్తలేదు, పరోక్ష యుద్ధాల్లో పాల్గొనలేదని గొప్పలు చెప్పుకోవడం చైనాకు అలవాటే.

కానీ చైనా టిబెట్‌ను ఆక్రమించింది. వియత్నాంపై యుద్ధానికి వెళ్లింది. చైనాకు భారతదేశం సరిహద్దుల్లో ఘర్షణలు, దక్షిణ చైనా సముద్రంలో వివాదాలు ఉన్నాయి. తైవాన్‌ను ఎప్పటికైనా తమ దేశంలో కలుపుకోవాలని చూస్తోంది. అందుకు బలప్రయోగం చేయడానికి కూడా వెనుకాడబోమని చెప్పింది.

చైనా దౌత్య వ్యూహం

ఫొటో సోర్స్, PM'S OFFICE OF JAPAN/TWITTER

చైనా చూపిస్తున్న సామరస్య ధోరణి పనిచేస్తోందా?

గ్లోబల్ సౌత్‌లో, లేదా అటు చైనాకు, ఇటు అమెరికాకు దగ్గర కాని దేశాలు చైనా వ్యూహాన్ని స్వాగతించవచ్చు.

చైనా నిర్బంధం కాని మధ్యవర్తిత్వ వ్యూహాన్ని రూపొందిస్తోందని, దీనికి విస్తృతంగా ఆమోదం లభించవచ్చని డాక్టర్ జాంగ్ అభిప్రాయపడ్డారు.

అలాగే, చైనా మైత్రీ వ్యూహం నిరంకుశ ప్రభుత్వాలు ఉన్న దేశాలకు ఇంపుగా ఉండవచ్చు.

"చాలా దేశాలు ప్రజాస్వామ్యం, మానవ హక్కుల మీద దృష్టి పెట్టవు. అలాంటి వాటికి చైనా గ్లోబల్ గవర్నెన్స్‌లో ఛాంపియన్‌లా కనిపించవచ్చు" అన్నారు డాక్టర్ థామస్.

ఆ దేశాలు చైనాతో చేయి కలుపుతాయా అన్నది సందేహమే. ఆ పని చేయకుండా ఆపే కొన్ని విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు ఐక్యరాజ్యసమితిలో అనేక దేశాలు యుక్రెయిన్‌పై చైనా దాడిని ఖండించాయి. కానీ, చైనా ఆ పని చేయలేదు.

అమెరికాకు సంప్రదాయ మిత్రదేశాలు, యూరప్ దేశాలు, చైనా మైత్రీభాషణను ఎలా మేనేజ్ చేయాలా అని ఆలోచిస్తున్నాయి.

కొందరు చైనా మాటలకు ఊగిసలాడకుండా స్థిరమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఉదాహరణకు, యూరోపియన్ కమీషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, మేక్రాన్‌తో కలిసి బీజింగ్‌కు వెళ్లినప్పుడు జిన్‌పింగ్‌తో కఠిన స్వరంతో మాట్లాడారు.

చైనాతో ఆర్థిక సంబంధాలు కాపాడుకోవాలనే ఆసక్తి ఉన్న దేశాలు చైనా మాటలను విశాల దృక్పథంతో చూస్తున్నాయి.

మేక్రాన్‌కు చైనాలో ఆడంబరమైన ఆతిథ్యం అందింది. చైనా ఆయన్ను భారీ మిలటరీ పరేడ్‌తో స్వాగతించింది. మేక్రాన్ దక్షిణాన గ్వాంగ్‌జౌ నగరాన్ని సందర్శించినప్పుడు అసాధారణంగా జిన్‌పింగ్ కూడా ఆయనతోపాటు వెళ్లారు. మేమిద్దరం "మంచి స్నేహితులం" అన్న సంకేతాన్ని ఇచ్చారు.

పర్యటన తరువాత మేక్రాన్ మీడియాతో మాట్లాడుతూ, తైవాన్ విషయంలో తలదూర్చడానికి, తనది కాని వివాదాన్ని నెత్తిన ఎక్కించుకోవడానికి యూరప్‌కు ఆసక్తి లేదన్నారు.

అమెరికాకు మిత్రదేశంగా ఉండడం అంటే దానికి సామంతులుగా మారడం కాదని మేక్రాన్ తన మాటలను సమర్థించుకున్నారు.

తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ అమెరికా పర్యటన

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ అమెరికా పర్యటన

ఇదంతా చూస్తుంటే జిన్‌పింగ్ అందుకున్న మైత్రీ రాగం పనిచేస్తున్నట్టే కనిపిస్తోంది.

అమెరికా, చైనాల మధ్య కీచులాటకు యూరప్ రంగంగా మారినట్టు కనిపిస్తోందని, యూరప్ ఎవరికి మద్దతిస్తుందో వాళ్లు అగ్రస్థానంలో నిలుస్తారని డాక్టర్ థామస్ అన్నారు.

అయితే, ప్రస్తుతానికి యూరప్ నాయకుల్లో మేక్రాన్ ఒక్కరే జిన్‌పింగ్‌కు అనుకూలంగా మాట్లాడారు. మేక్రాన్ వ్యాఖ్యలు యూరప్‌లో విమర్శలకు దారితీశాయి.

తైవాన్‌పై యూరోపియన్ యూనియన్ గట్టి వైఖరిని స్పష్టం చేసేందుకు జర్మనీ తమ విదేశాంగ మంత్రిని చైనాకు పంపింది.

యూరప్.. అమెరికా, చైనాల మధ్య ఊగిసలాడుతున్నప్పటికీ, "అమెరికాతో స్నేహమే తమకు లాభదాయకమని యూరప్‌కు తెలుసు" అని డాక్టర్ థామస్ అన్నారు.

చైనా మైత్రీ రాగం తైవాన్ దగ్గరకొచ్చేసరికి ఆగిపోతోంది.

తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ అమెరికా పర్యటనకు స్పందనగా చైనా మూడు రోజుల పాటు సైనిక విన్యాసాలు చేస్తూ 70 యుద్ధవిమానాలు, 11 నౌకలతో తైవాన్‌ను చుట్టుముట్టింది. తైవాన్ ప్రభుత్వానికి ఈ ఆపరేషన్ "గట్టి హెచ్చరిక" అని కూడా చెప్పింది.

ఇటీవలి సంవత్సరాలలో చైనా తమ వైమానిక రక్షణ జోన్‌లోకి తరచూ చొరబడుతోందని, ప్రతీ నెలా వందల కొద్దీ చైనా విమానాలు తమ గగనతలంలో ఎగురుతూ కనిపిస్తున్నాయని తైవాన్ తెలిపింది.

ఇలాంటి చర్యలు చైనా శాంతిదూత అవతారానికి మచ్చతెస్తాయని విశ్లేషకులు అంటున్నారు. ఇవి రక్షణ వ్యూహాలని చైనా చెబుతున్నా, ఆర్మీ దూకుడు చర్యలు అని ఇతర దేశాలు అంటున్నాయి.

తైవాన్‌పై యుద్ధం ప్రకటిస్తే పరిణామలు అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయని డాక్టర్ చోంగ్ అంటున్నారు.

తైవాన్ ప్రపంచంలోని 60 శాతం సెమీకండక్టర్లను ఉత్పత్తి చేస్తోంది. యూరప్, ఆసియాలను కలిపే సబ్‌మరీన్ టెలికమ్యూనికేషన్స్, షిప్పింగ్ లేన్స్ తైవాన్ గుండానే వెళుతున్నాయి.

తైవాన్‌పై యుద్ధం ప్రకటిస్తే, ఆసియాలో అనిశ్చితిని తీసుకొచ్చిందని తమపై అభియోగం మోపుతారన్న సంగతి చైనాకు బాగా తెలుసు.

అందుకే ఇప్పుడప్పుడే తైవాన్‌పై దాడిచేయకపోవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే, ఇలాంటి సైనిక విన్యాసాల వలన అపార్థాలు చోటుచేసుకుని అమెరికాతో యుద్ధానికి తెరతీయవచ్చు. చైనా దాడికి దిగితే, తైవాన్‌కు పూర్తిగా సహకరిస్తామని అమెరికా వెల్లడించింది.

"షీ జిన్‌పింగ్ చైనా దౌత్య విధానాలను మార్చుకుంటూనే, తైవాన్‌పై పటిష్టమైన వైఖరితో ఉండాలన్న యత్నం చేస్తున్నారు. ఇలా రెండు పడవల మీద ప్రయాణం రాను రాను కష్టమవుతుంది. తైవాన్‌పై చైనా దాడికి దిగుతుందని ఇప్పటికే చాలా దేశాలు ఆందోళనపడుతున్నాయి" అని డాక్టర్ థామస్ అన్నారు.

చైనా అగ్రదేశంగా ఎదగాలని ప్రయత్నిస్తోంది. కానీ, దాని చర్యలను ప్రపంచం వేయి కళ్లతో పరిశీలిస్తుంటుంది. రెండు పడవల మీద ప్రయణం కష్టమే. శాంతి లేదా యుద్ధం.. ఏ పక్షం వహించాలో చైనా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)