తైవాన్‌ను 70 యుద్ధవిమానాలు, 11 నౌకలతో చుట్టుముట్టిన చైనా

రాయిటర్స్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, తైవాన్ చుట్టూ తిరుగుతోన్న చైనా విమానం
    • రచయిత, మ్యాట్ మర్ఫీ, క్రిస్టీ కూనీ
    • హోదా, బీబీసీ న్యూస్

చైనా రెండోరోజు సైనిక విన్యాసాల (రిహార్సల్స్) సమయంలోనూ తైవాన్‌ను చుట్టుముట్టింది. తైవాన్‌తో పాటు దాని చుట్టుపక్కల సముద్ర జలాలను కీలక లక్ష్యాలుగా చేసుకొని డ్రిల్స్‌ను కొనసాగించింది.

తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్, అమెరికా పర్యటనకు స్పందనగా చైనా ఈ రిహార్సల్స్‌ను మొదలుపెట్టింది. గతవారం ఆమె అమెరికాలో పర్యటించారు. తైవాన్ ప్రభుత్వానికి ఈ ఆపరేషన్ ‘‘గట్టి హెచ్చరిక’’ అని చైనా వ్యాఖ్యానించింది.

తైవాన్‌ను చైనా చుట్టుముట్టిన నేపథ్యంలో, చైనా కాస్త సంయమనం పాటించాలని అమెరికా కోరింది.

దాదాపు 70 చైనా విమానాలు ఆదివారం తమ దేశం మీద తిరిగాయని తైవాన్ వెల్లడించింది.

పదకొండు చైనా నౌకలు కూడా కనిపించాయని తెలిపింది.

చైనా

తైవాన్, చైనా భూభాగాల మధ్య అనధికార విభజన రేఖ అయిన ‘‘తైవాన్ స్ట్రెయిట్ మీడియన్ లైన్’’ను దాటి 45 యుద్ధ విమానాలు, తైవాన్ వైమానిక రక్షణ గుర్తింపు జోన్‌ భాగంలోకి వెళ్లినట్లు శనివారం తైవాన్ చెప్పింది.

చైనా ఈ ఆపరేషన్‌ను ‘‘జాయింట్ స్వర్డ్’’ అని పిలుస్తోంది. ఇది సోమవారం వరకు కొనసాగుతుంది.

ఈ ఆపరేషన్‌పై తైవాన్ అధికారులు ఆగ్రహంగా ఉన్నారు.

చైనా సైనిక విన్యాసాలను నిర్వహించడానికి తైవాన్ అధ్యక్షురాలు సాయ్, అమెరికా పర్యటనను సాకుగా చూపుతోందని శనివారం తైవాన్ అధికారులు అన్నారు. చైనా నిర్వహిస్తున్న ఈ విన్యాసాల వల్ల తమ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, భద్రత తీవ్రంగా దెబ్బతిందని విమర్శించారు.

డ్రిల్స్ మొదటిరోజున చైనా యుద్ధనౌక ఒకటి, తైవాన్‌కు అత్యంత సమీపంలో ఉండే పింగ్టాన్ ద్వీపంలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక రౌండ్ పాటు కాల్పులు జరిపింది.

చైనా రిహార్సల్స్

ఫొటో సోర్స్, BBC/CHINA CENTRAL TELEVISION

ఈ మేరకు తైవాన్ సముద్ర వ్యవహారాల కౌన్సిల్ ఒక వీడియో ఫుటేజీని విడుదల చేసింది. అందులో దాని ఓడల్లో ఒకటి, చైనా యుద్ధనౌకను అనుసరించడం కనిపిస్తుంది. ఏ ప్రాంతంలో చైనా యుద్ధనౌకను తమ ఓడ అనుసరించిందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.

‘‘మీరు ఈ రీజియన్‌లో శాంతి, స్థిరత్వం, భద్రతలకు తీవ్రంగా హాని చేస్తున్నారు. దయచేసి తిరిగి వెళ్లిపోండి. ఒకవేళ మీరు ముందుకు అలాగే కొనసాగితే మేం చర్యలు తీసుకుంటాం’’ అని ఒక సెయిలర్ చెప్పడం ఆ వీడియో ఫుటేజీలో కనిపిస్తుంది.

మరో వీడియోలో ‘డి హువా’ అనే తైవాన్ యుద్ధనౌకతో పాటు కోస్ట్‌గార్డ్ నౌక తిరగడం కనిపించింది. ఇది చైనా నౌకతో ‘ముఖాముఖి’ అని ఒక కోస్ట్‌గార్డ్ ఆఫీసర్ అన్నారు.

శనివారం సాయంత్రం ముగిసిన సైనిక వ్యాయామాలు, ఆదివారం ఉదయం యుద్ధ విమానాల సార్టీలతో మళ్లీ మొదలయ్యాయని తైపీ అధికారులు చెప్పారు.

షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Reuters

తైవాన్ అధ్యక్షురాలి అమెరికా పర్యటనను దుర్వినియోగం చేయవద్దని, తైవాన్‌లో శాంతి, యథాతథ స్థితికి ఇబ్బంది కలిగించవద్దని చైనాను అమెరికా కోరింది.

‘‘చైనా చర్యలను అమెరికా నిశితంగా పర్యవేక్షిస్తోంది. ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పడానికి అమెరికా వద్ద తగిన వనరులు, సామర్థ్యాలు ఉన్నాయని’’ అమెరికా ప్రభుత్వ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.

బుధవారం సాయ్ ఇంగ్-వెన్, అమెరికా హౌస్ స్పీకర్ కెవిన్ మెకార్తీని కలిశారు.

చైనా నుంచి నిరంతర ముప్పును ఎదుర్కొంటున్న నేపథ్యంలో, తైవాన్ ప్రభుత్వం అమెరికా సహా ఇతర ప్రజాస్వామ్య దేశాలతో కలిసి పనిచేస్తుందని శనివారం సాయ్ ఇంగ్-వెన్ స్పష్టం చేశారు. హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మైఖేల్ మెక్‌కాల్ నేతృత్వంలో తైపీలో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

తైవాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే దిశగా అమెరికా యోచిస్తోందని, అయితే అది యుద్ధం కోసం కాకుండా, శాంతి కోసమని మెక్‌కాల్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)