తైవాన్‌ను చుట్టుముట్టే రిహార్సల్స్ చేస్తున్న చైనా

చైనా మిలటరీ డ్రిల్

ఫొటో సోర్స్, BBC/China Central Television

తైవాన్‌ను చుట్టుముట్టే రిహార్సల్‌ను చైనా చేస్తోంది. మూడూ రోజుల సైనిక విన్యాసాల్లో భాగంగా ఈ సన్నాహాలను చేస్తోంది.

తైవాన్ ప్రభుత్వానికి ఈ ఆపరేషన్ "గట్టి హెచ్చరిక" అని చైనా వ్యాఖ్యానించింది.

తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన కొన్ని గంటల తరువాత చైనా సైనిక విన్యాసాలు ప్రారంభించింది.

71 చైనా సైనిక విమానాలు, తొమ్మిది నౌకలు తైవాన్ జలసంధి మధ్యస్థ రేఖను దాటి వెళ్లినట్లు తైవాన్ రక్షణ శాఖ తెలిపింది.

ఈ రేఖ చైనా, తైవాన్ భూభాగాల మధ్య ఉన్న అనధికారిక విభజన రేఖ.

చైనా నౌకల్లో ఒకటి పెయింటన్ ద్వీపాన్ని సమీపించినప్పుడు డెక్ నుంచి ఒక రౌండ్ కాల్పులు జరిపిందని రాయిటర్స్ వార్తాసంస్థ వెల్లడించింది. తైవాన్ చేరుకోవడానికి చైనాకు అత్యంత సమీపంలో ఉన్న ప్రాంతం ఇది.

తైవాన్‌ను చక్రవ్యూహంలో బంధించే విధంగా సైన్యం ముందుకు కదులుతూ, పెట్రోలింగ్‌ చేస్తూ మిలటరీ డ్రిల్స్ నిర్వహిస్తోందని చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది.

"దీర్ఘ-శ్రేణి రాకెట్ ఫిరంగులు, నౌకా విధ్వంసక సాధనాలు, క్షిపణి బోట్లు, వైమానిక దళ ఫైటర్లు, బాంబర్లు, జామర్లు, రీఫ్యూయలర్లు" అన్నిటినీ చైనా సైన్యం మోహరించిందని చెప్పింది.

తైవాన్
ఫొటో క్యాప్షన్, తైవాన్ ఒకప్పుడు తమ దేశంలో భాగమని, అది ఎప్పటికైనా తిరిగి దేశంలో విలీనం కావాల్సిందేనని చైనా భావిస్తోంది.

తైవాన్ ఒకప్పుడు తమ దేశంలో భాగమని, అది ఎప్పటికైనా తిరిగి దేశంలో విలీనం కావాల్సిందేనని చైనా భావిస్తోంది. అవసరమైతే, బలప్రయోగం చేసి కలిపేసుకోవాలన్న ఆలోచనలో ఉంది.

కానీ, తైవాన్ తమది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన దేశమని, తమకు సొంత రాజ్యాంగం, సొంత నాయకులు ఉన్నారని చెబుతుంది.

తైవాన్‌తో పునరేకీకరణ తప్పక నెరవేరాల్సిన లక్ష్యమని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గతంలో అన్నారు.

చైనా తరచూ తైవాన్ చుట్టుపక్కల డ్రిల్స్ నిర్వహిస్తూ ఉంటుంది. కానీ, "చుట్టుముట్టడం" అనేది తైవాన్ అధ్యక్షురాలి అమెరికా పర్యటనకు స్పందనగా భావిస్తున్నారు.

బుధవారం సాయ్ ఇంగ్-వెన్ అమెరికా హౌస్ స్పీకర్ కెవిన్ మెకార్తీని కలిశారు.

చైనా నుంచి నిరంతర ముప్పును ఎదుర్కొంటున్న నేపథ్యంలో, తైవాన్ ప్రభుత్వం అమెరికా సహా ఇతర ప్రజాస్వామ్య దేశాలతో కలిసి పనిచేస్తుందని శనివారం శాయ్ ఇంగ్-వెన్ స్పష్టం చేశారు. హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మైఖేల్ మెక్‌కాల్ నేతృత్వంలో తైపీలో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

తైవాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే దిశగా అమెరికా యోచిస్తోందని, అయితే అది యుద్ధం కోసం కాకుండా, శాంతి కోసమని మెక్‌కాల్ తెలిపారు.

షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, షీ జిన్‌పింగ్

తైవాన్ రాజధాని తైపీలో ప్రజలు చైనా తాజా యుక్తులతో కలవరపడినట్టు కనిపించలేదు.

"తైవాన్ ప్రజలు దీనికి అలవాటు పడిపోయారు. మళ్లీ మొదలెట్టార్రా బాబూ అనుకుంటారు" అని జిమ్ సాయ్ అనే స్థానికుడు చెప్పారు.

"తైవాన్ తమదేనన్నట్టు వాళ్లు చుట్టుముడుతుంటారు. మాకిది అలవాటైపోయింది" అని మైఖేల్ చాంగ్ అనే మరో పౌరుడు అన్నారు.

"వాళ్లు దాడి చేస్తే ఎలాగూ తప్పించుకోలేం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం" అన్నారాయన.

చైనా సైనిక విన్యాసాలు సోమవారం వరకు కొనసాగుతాయని పీఎల్ఏ ఈస్ట్రన్ థియేటర్ కమాండ్ చెప్పింది.

చైనా చర్యలపై శాంతియుతంగా, హేతుబద్ధంగా, గట్టిగా స్పందిస్తామని తైవాన్ రక్షణ శాఖ తెలిపింది.

"వివాదాలను పెంచడం, దేశ సార్వభౌత్వాన్ని కాపాడుకోవడానికి ఘర్షణపడడం" తమ సూత్రం కాదని స్పష్టం చేసింది.

చైనా 2022 ఆగస్టులో కూడా వారం రోజుల పాటు తైవాన్ చుట్టూ భారీ సైనిక డ్రిల్ నిర్వహించింది. అప్పటి అమెరికా హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైపీ పర్యటనకు స్పందనగా ఈ చర్యలు చేపట్టింది. ఫైటర్ జెట్లు, యుద్ధవిమానాలను మోహరిస్తూ బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది.

ఇవి కూడా చదవండి: