సొంత ప్రజలపై బాంబులు వేయించిన ప్రభుత్వం, మియాన్మార్‌లో 100 మందికి పైగా మృతి

ఫొటో సోర్స్, ANI
- రచయిత, జోనాథన్ హెడ్, నికోలస్ యాంగ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
మియన్మార్ అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. సొంత ప్రజలపై మియన్మార్ ప్రభుత్వం విమానాలతో దాడులు చేస్తూ హడలెత్తిస్తోంది.
తాజాగా మియన్మార్ మిలటరీ జరిపిన వైమానిక దాడుల్లో వంద మందికి పైగా మృతి చెందారు.
చనిపోయిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు ప్రాణాలతో బయటపడ్డ వారు చెప్పారు.
80 మృతదేహాలను తాము వెలికితీశామని ప్రాణాలతో బయటపడ్డ వారు బీబీసీతో చెప్పారు. అంతేకాదు, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
మిలటరీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించే ప్రజలున్న సాగింగ్ ప్రాంతంలోని పా జి గ్యి గ్రామంపై మియన్మార్ సైన్యం ఈ దాడులు చేసింది.
ప్రభుత్వం జరిపించిన ఈ దాడులను ఐక్యరాజ్యసమితి ఖండించింది.
మియన్మార్‌లో 2021 ఫిబ్రవరిలో సైనిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి తమల్ని వ్యతిరేకిస్తున్న వారిపై భయానకంగా వైమానిక దాడులు చేస్తోంది మిలటరీ ప్రభుత్వం.
అక్కడి మిలటరీ ప్రభుత్వాన్ని సాగింగ్ కమ్యూనిటీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ ప్రాంత ప్రజలు తమకంటూ సొంతంగా మిలటరీని, స్కూళ్లను, క్లినిక్‌లను ఏర్పాటు చేసుకున్నారు.
స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 7 గంటలకు ఒక మిలటరీ జెట్ వచ్చి, తమపై బాంబు వేసినట్లు ఆ గ్రామస్థులు చెప్పారు.
ఆ తర్వాత 20 నిమిషాల పాటు ఒక హెలికాప్టర్ గన్‌షిప్ తమ గ్రామంపై చక్కర్లు కొట్టిందన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను స్థానికులు అప్‌లోడ్ చేశారు. వాటిల్లో నేలపై పడిన ఉన్న మృతదేహాలు, మంటల్లో కాలుతోన్న పలు భవంతులు కనిపిస్తున్నాయి.
‘‘ఇంకా ఎవరైనా బతికుంటే దయచేసి మమ్మల్ని పిలవండి, మీకు సాయం చేసేందుకు మేమొస్తాం,’’ అని అంటూ ఈ దాడిలో గాయపడ్డ బాధితుల కోసం కొందరు అరుస్తూ వెళ్తున్నారు.
మృతదేహాలను లెక్కించాలని ప్రయత్నించినట్లు వారు చెప్పారు. కానీ, చాలా మృతదేహాలు ముక్కలు ముక్కలుగా తెగి పడటంతో లెక్కించడం కష్టమైందన్నారు.
రక్తంతో తడిచిన దుస్తులు, తగలబడిపోతున్న బైకులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
పా జి గ్యిలో దాడులను మిలటరీ ప్రభుత్వం ధ్రువీకరించింది.
‘‘అవును మేం వైమానిక దాడులు చేశాం’’ అని మిలటరీ జుంటా అధికార ప్రతినిధి జనరల్ జా మిన్ టున్ చెప్పారు. పా జి గ్యి పై ఎందుకు దాడి చేశారో కూడా ఆయన తెలిపారు.
స్థానిక వలంటీర్ డిఫెన్స్ ఫోర్స్‌కు చెందిన ఆఫీసును తెరుస్తోన్న సందర్భంగా ఈ గ్రామంపై తాము దాడులు చేసినట్లు చెప్పారు.
సరికొత్తగా ఏర్పాటు చేసిన పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్(పీడీఎఫ్) ఆఫీసు ప్రారంభోత్సవానికి పా జి గ్యి సమీపంలోని ప్రజలందరూ తరలి వచ్చారు. ఈ సమయంలోేన మిలటరీ ఈ దాడులు చేసింది.
మియన్మార్‌లో పలు ప్రాంతాల్లో మిలటరీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ పీడీఎఫ్ వాలంటీర్లు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ సంఘటన గురించి విని తాను వణికిపోయానని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషనర్ వోల్కర్ టర్క్ అన్నారు. అంతర్జాతీయ చట్టాల నిబంధనలను ఇది తీవ్రంగా ఉల్లంఘించడమేనని టర్క్ స్పష్టం చేశారు.
‘‘ ఫిబ్రవరి 1, 2021 నుంచి భారీ ఎత్తున జరుగుతోన్న మానవ హక్కుల ఉల్లంఘన, వేధింపులకు మిలటరీ, దాని సంబంధిత మిలిషియాలే పూర్తి బాధ్యత అనడానికి సరైన ఆధారాలు ఉన్నాయి. వారి చర్యలు కొన్ని మానవత్వానికి మచ్చ, యుద్ధనేరం కిందికి వస్తాయి’’అని ఆయన అన్నారు.
ఇప్పటి వరకు అంతర్యుద్ధంలో వేలాది మంది ప్రజలు మరణించగా, 14 లక్షల మంది తమ ప్రాంతం నుంచి వలసపోయారు. దేశ జనాభాలో సుమారు మూడోవంతు మందికి మానవతా సాయం అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
తమను వ్యతిరేకిస్తోన్న గ్రామాలపై బాంబులు వేసేందుకు మియన్మార్ ప్రభుత్వం రష్యా, చైనా ఎయిర్‌క్రాఫ్ట్‌లపై ఎక్కువగా ఆధారపడుతోంది.
ఎందుకంటే, తమ దళాలకు రోడ్డు మార్గం గుండా వెళ్లడం కష్టతరం అవుతుండటంతో ఆ దేశాల ఎయిర్‌క్రాఫ్ట్‌లను వీరు వాడుతున్నారు.
ల్యాండ్‌మైన్స్, అత్యాధునిక పేలుడు పదార్థాల (ఐఈడీలు)తో దాడులకు పాల్పడుతున్నారు. వైమానిక దాడుల్లో భారీ సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు.
ఫిబ్రవరి 2021 నుంచి జనవరి 2023 వరకు సైన్యం కనీసం 600 వరకు వైమానిక దాడులు నిర్వహించిందని బీబీసీ పరిశీలనలో తేలింది.
ఆర్మ్‌డ్ కాన్‌ఫ్లిట్ లొకేషన్ అండ్ ఈవెంట్ డేటా ప్రాజెక్ట్ నుంచి సేకరించిన గణాంకాలను బీబీసీ విశ్లేషించింది.

ఫొటో సోర్స్, Getty Images
అక్టోబర్ 2021 నుంచి సెప్టెంబర్ 2022 మధ్యలో ఈ తరహా దాడుల్లో 155 మంది పౌరులు మరణించినట్లు బహిష్కరణకు గురైన నేషనల్ యూనిటీ ప్రభుత్వం తెలిపింది.
అధికారం నుంచి దిగిపోయిన తర్వాత వీరు తిరుగుబాటు గ్రూప్‌లను ఏర్పాటు చేశారు.
కొచిన్ రాష్ట్రంలో తిరుగుబాటుదారుల గ్రూప్ నిర్వహించిన ఒక సమ్మేళనంలో అక్టోబర్‌లో ఎయిర్‌ఫోర్స్ చేసిన బాంబు దాడుల్లో సుమారు 50 మంది చనిపోయారు.
ఈ సమ్మేళనంలో పాల్గొన్న వారిపై మూడు బాంబులను వేసింది ఎయిర్‌పోర్స్.
గత నెలలో సెంట్రల్ మియన్మార్‌లో లెట్ యెట్ కోన్ గ్రామంలోని ఒక స్కూల్‌పై జరిపిన వైమానిక దాడిలో ఐదుగురు పిల్లలు మరణించగా, పలువురు చిన్నారులు గాయపడ్డారు.
పా జి గ్యిలో మరణాల సంఖ్యపై ఒక స్పష్టత వస్తే, ప్రస్తుతం జరుగుతోన్న అంతర్యుద్ధంలో అత్యంత ఘోరమైన సంఘటనల్లో ఇదొకటిగా నిలవనుంది.
తిరుగుబాటు గ్రూప్‌లు చేపడుతోన్న ఉగ్రవాద కార్యకలాపాలపై తమ ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుందని గత నెలలో మిలటరీ ప్రభుత్వానికి అధినేత అయిన జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా ‘టాప్ సీక్రెట్’ డాక్యుమెంట్లను ఎవరు, ఎందుకు లీక్ చేశారు?
- మిషన్ వాత్సల్య: తల్లిదండ్రులు లేని పిల్లలకు నెలకు రూ.4,000 ఆర్థిక సాయం, దరఖాస్తుకు 15వ తేదీ వరకు గడువు
- ఆమెను టీనేజీలోనే కిడ్నాప్ చేశారు, రూ. 51 వేలకు అమ్మేశారు, పాత షెడ్డులో అత్యంత దీనంగా..
- ముసిరి: మసాలా దినుసులకు పేరుగాంచిన ఈ దక్షిణాది రేవు పట్టణం ఎలా మాయమైంది?
- ఐపీఎల్- ఇంపాక్ట్ ప్లేయర్: ఈ కొత్త ఆప్షన్ రిజర్వు ఆటగాళ్లకు వరంలా ఎలా మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















