మియన్మార్ నుంచి మణిపుర్‌ వలస వచ్చిన తమిళ ప్రజల కథ

తమిళ మహిళ
    • రచయిత, రాఘవేంద్ర రావ్
    • హోదా, బీబీసీ కోసం

భారతదేశానికి ఈశాన్యాన అంతర్జాతీయ సరిహద్దుల సమీపంలో ఒక దక్షిణ భారత దేవాలయం ఉండడం ఆశ్చర్యానికి గురి చేసే విషయమే.

ఆ ప్రాంతంలో 3,000 మంది తమిళులు నివసిస్తున్నారని తెలిస్తే, మరింత ఆశ్చర్యం కలగక మానదు.

ఆ ప్రాంతమే మణిపుర్‌లో భారత-మియన్మార్ సరిహద్దుల్లో ఉన్న మోరే గ్రామం.

అక్కడ అనేక దశాబ్దాలుగా నివసిస్తున్న తమిళ ప్రజలు మణిపుర్ సంస్కృతిలో భాగమైపోయారు.

మోరే‌లో ఉన్న శ్రీ అంగ్లపరమేశ్వరి శ్రీ మునేశ్వరర్ దేవాలయంలోని విశాలమైన ప్రాంగణం అక్కడ ఉన్న తమిళ ప్రజల ఉనికిని తెలియజేస్తుంది.

ఈ దేవాలయం సరిగ్గా భారత-మియన్మార్ సరిహద్దుల్లో ఉంది. ఈ ఆలయ ప్రాంగణం ఇరు దేశాల మధ్య ఉన్న "నో మెన్స్ లాండ్"కు ఆనుకుని ఉంది.

మణిపుర్‌లోని మోరెలో ఉన్న దక్షిణ భారత ఆలయం

తమిళ ప్రజలు మణిపుర్ ఎలా చేరుకున్నారు

బర్మా (ప్రస్తుత మియన్మార్) ఆంగ్లేయుల పాలనలో ఉన్నప్పుడు బ్రిటిష్ వారు అనేకమంది తమిళ ప్రజలను వేతన కార్మికులుగానూ, ఇతర రకాలైన పనుల కోసం అక్కడకు తీసుకువెళ్లారు.

1948లో బర్మాకు స్వతంత్రం లభించినప్పటికీ తమిళులతో సహా అనేకమంది భారతీయులు అక్కడే స్థిరపడడానికి ఇష్టపడ్డారు.

కానీ, 1962లో బర్మా ప్రజాస్వామ్య పాలన నుంచి సైనిక పాలనకు మళ్లినప్పుడు, అక్కడ నివసిస్తున్న భారత ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అక్కడ ఉండడం కష్టమైపోయింది.

బర్మా సైనిక ప్రభుత్వం భారతీయుల ఆస్తులను జప్తు చేయడమే కాక, స్వాతంత్ర్యానంతరం వాళ్లకు లభించిన హక్కులను కూడా కాలరాసింది. భారతీయుల పట్ల వివక్షా ధోరణి అవలంబించింది.

అప్పటి రంగూన్‌లో పుట్టి ఎనిమిదేళ్ల వయసులో మోరేకు వలస వచ్చిన కె. బి. మణియం తన చిన్నప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

"1964లో అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రంగూన్ వచ్చి భారత ప్రజలను కలిశారు . వారంతా భారతదేశానికి తిరిగి వచ్చేయాలని ఆశపడుతున్నట్లు నెహ్రూతో చెప్పారు. నెహ్రూ ఓడను పంపించారు. భారతీయులను వెనక్కు రప్పించే కార్యక్రమం మొదలైంది. తమిళ ప్రజలు కూడా ఇలాగే వెనక్కు వచ్చేశారు.

బర్మా నుంచి వచ్చిన వారికి భారత ప్రభుత్వం శరణార్థి శిబిరాలను ఏర్పాటు చేయడమే కాక, పునరావాసం కల్పించింది. కానీ, అక్కడి నుంచి తమిళ ప్రజలు తమిళనాడు వెళ్లి స్థిరపడడానికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి" అని ఆయన వివరించారు.

ప్రస్తుతం మణియం మోరేలోని తమిళ దేవాలయ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.

అనేక సంవత్సరాలు బర్మాలో నివసించడం వల్ల తమిళ ప్రజల జీవన విధానం, ఆహరపు అలవాట్లు మారిపోయాయని, వారి వద్ద ఎలాంటి ఆదయ వనరులు లేకపోవడంతో బర్మా నుంచి వారితో పాటు తీసుకొచ్చిన వస్తువులను అమ్మి జీవనం సాగించేవారని మణియం చెప్పారు.

"బర్మా నుంచి వచ్చిన ప్రజలు ఈ కొత్త వాతావరణంలో స్థిరపడలేకపోయారు. చాలామంది తమిళ ప్రజలు తిరిగి బర్మా వెళిపోవాలని నిశ్చయించుకున్నారు. మణిపుర్‌లోని మోరేలో ఉంటే.. అక్కడి నుంచి సులువుగా సరిహద్దులు దాటుకుని మళ్లీ బర్మా వెళిపోవచ్చని భావించారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన అజాద్ హింద్ ఫౌజ్ (ఐఎన్ఏ) ఈ ప్రాంతం మీదుగానే వెళ్లింది. తమిళ సమాజంలో అనేకమంది వృద్ధులు అందులో భాగంగా ఉండేవారు. వారందరికీ ఇక్కడి నుంచి బర్మా వెళ్లే అన్ని మార్గాల గురించి క్షుణ్ణంగా తెలుసు.

అందువల్ల బర్మా వెళ్లడం కోసం తమిళ ప్రజలు తమిళనాడు నుంచి మణిపుర్ వచ్చేశారు. వాళ్లు మణిపుర్‌లో స్థిరపడడానికి రాలేదు. బర్మా వెళిపోవాలన్న ఉద్దేశంతోనే వచ్చారు" అని మణియం చెప్పారు.

1964లో 12 తమిళ కుటుంబాలు రెండు సమూహాలుగా మణిపుర్ వచ్చాయి. ఏడు కుటుంబాలు ఒక సమూహంగా, ఐదు కుటుంబాలు మరొక సమూహంగా వచ్చినట్లుగా సమాచారం.

ఏడు కుటుంబాల బృందం సరిహద్దు దాటి బర్మాలో ప్రవేశించడానికి ప్రయత్నించింది. అయితే, అక్కడి సైనిక ప్రభుత్వం వారిని బంధించి ఒక నెలపాటూ ఒక పాఠశాలలో ఖైదు చేసింది.

తరువాత వారిని మోరే పోలీసులకు అప్పగించారు. వారిని తిరిగి తమిళనాడు వెళ్లమని చెప్పి, భారత పోలీసులు వారిని ఇంఫాల్ పంపించారు.

కేబీఎస్ మణియమ్

ఇంఫాల్‌లో వారు ఒక ధర్మశాలలో విడిది చేసినప్పుడు, ఒక దక్షిణ భారత అధికారిని కలిశారు.

మోరే భారతదేశంలో భాగమని వాళ్లు అక్కడే నివసించవచ్చని ఆయన వీరికి చెప్పారు. మోరే నుంచి పోలీసులు మిమ్మల్ని వెళ్లమనకుండా నేను చూసుకుంటానని హామీ కూడా ఇచ్చారు.

"అలా ఆ ఏడు కుటుంబాలు మోరే తిరిగి వచ్చాయి. ఆ దక్షిణ భారత అధికారి, మోరే గ్రామ అధికారితో మాట్లాడి వారికి ఆహారం, వసతి ఏర్పాటు చేశారు. ఇదే కోవాలో రెండో సమూహంలోని ఐదు కుటుంబాలు కూడా బర్మాలోకి ప్రవేశించబోయి, పట్టుబడి మళ్లీ మోరే వచ్చి చేరారు" అని మణియం తెలిపారు.

అలా ఆ 12 కుటుంబాలు మోరేలో స్థిరపడ్డాయి. తమిళనాడులోని వారి బంధువులకు లేఖ రాస్తూ వారు ఇక్కడ హాయిగా ఉన్నారని, బర్మా బోర్డర్‌లోనే ఉన్నారని తెలియజేశారు.

"వాళ్లు మాకు ఉత్తరాలు రాసి బర్మాలో ఎలాంటి ఆహారం దొరుకుతుందో అదే ఇక్కడా దొరుకుతుందని చెప్పారు. వారి మాటలతో ఒక్కొక్కటిగా బర్మా నుంచి తమిళనాడు వచ్చిన తమిళ కుటుంబాలు మోరే చేరాయి. అలా మోరేలో తమిళ ప్రజల సంఖ్య పెరిగింది. ఒక సమయంలో మోరేలో తమిళులు సంఖ్య 10,000కు చేరుకుంది" అని మణియం వివరించారు.

మోరేకు మొట్టమొదట వచ్చిన తమిళులు అక్కడ ఉన్న ఒక మర్రిచెట్టుకు పూజలు చేసేవారు. క్రమంగా మిగతా తమిళ సమాజం కూడా ఆ చెట్టును పూజించడం మొదలుపెట్టింది. అలా ఆ ప్రాంతం పెద్దది అయి, అక్కడ ఒక పెద్ద దేవాలయం నిర్మించారు.

తమిళ ప్రజలు మోరేలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు?

"1992లో తిరుగుబాటు ధోరణి ప్రారంభమైనప్పుడు.. నాగ, కుకి వర్గాల మధ్య జాతి విభేదాలు పొడ జూపి సంఘర్షణలకు దారి తీయడం తమిళ ప్రజల జీవితాలపై ప్రభావం చూపింది. 1995లో తమిళ, కుకి ప్రజల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత మెల్లిమెల్లిగా మోరే నుంచి తమిళ ప్రజలు వలస బాట పట్టారు" అని మణియం చెప్పారు.

ప్రస్తుతం మోరేలో 3,000 మంది తమిళ ప్రజలు నివసిస్తున్నారు.

ఎన్ని సమస్యలున్నప్పటికీ మోరే ప్రజలు తమిళులను ఆహ్వానించారని, హృదయానికి దగ్గరగా తీసుకుని సహాయపడ్డారని మణియం తెలిపారు.

"మా భాష, ఆహారం, సంస్కృతి భిన్నమైనవి అయినప్పటికీ ఇక్కడి ప్రజలు మమ్మల్ని దగ్గరకు తీసుకున్నారు. వారి సహకారం లేకపోతే మేము ఇక్కడ స్థిరపడడం అసాధ్యం" అని ఆయన అన్నారు.

"మావాళ్లల్లో చాలామంది తమ బంధువులను కలుసుకోవడానికి, వ్యాపారం చేయడానికి, లేదా దేవాలయం చూడ్డానికి బర్మా వెళ్లి వస్తుంటారు. మాకు బర్మా భాష బాగా వచ్చు. అందువల్ల మాకు బర్మా వెళ్లి వ్యాపారం చేయడం సులభమే.

కోవిడ్ వల్ల ఇప్పుడు రాకపోకలు తగ్గాయి. మియన్మార్‌లో ఇప్పటికీ సుమారు 10 లక్షల మంది తమిళ ప్రజలు నివసిస్తున్నారు. 800 కన్నా ఎక్కువ దక్షిణ భారత దేవాలయాలు ఉన్నాయి" అని మణియం చెప్పారు.

ఆలయం

తమిళ ప్రజలు స్థానిక మోరే సంస్కృతిలో ఎలా ఇమిడిపోయారు?

దశాబ్దాలుగా మోరేలో నివసిస్తున్న తమిళ ప్రజలు అక్కడి సంస్కృతిలో అంతర్భాగమైపోయారు.

తమిళ, స్థానిక మోరే ప్రజల మధ్య వివాహాలు కూడా జరిగాయి. అక్కడ తమిళ పిల్లల కోసం ప్రారంభించిన పాఠశాలలో ఇప్పుడు స్థానిక మోరే పిల్లలు కూడా చదువుతున్నారు. ఈ పాఠశాలలో మొదట్లో తమిళంలో మాత్రమే బోధించేవారు. ఇప్పుడు ఇంగ్లిష్‌లో కూడా చెప్తున్నారు.

1969లో అక్కడ తమిళ సంఘం ఏర్పడించి. తమిళులకు సహాయపడడం, వారి భాష, సంస్కృతి, ఆచారాలను కొనసాగించడం ఈ సంఘం లక్ష్యం.

ప్రస్తుతం మియన్మార్‌లో చెలరేగుతున్న హింస కారణంగా భారతదేశానికి వలస వస్తున్న శరణార్థుల పట్ల మోరేలోని తమిళ ప్రజలు సహానుభూతి చూపిస్తున్నారు.

"వాళ్లూ మనుషులే. సైనిక పాలన కారణంగా వాళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడకు వచ్చిన వారిని ఆదరించాలి. మనందరం కూడా వారికి సహాయం అందించాలి. వారికి ఆహారం, వసతి ఏర్పాటు చేయాలి" అని మణియం అభిప్రాయపడ్డారు.

అయితే, మోరేలో స్థిరపడిన తమిళ ప్రజలకు మళ్లీ మియన్మార్ వెళ్లే ఉద్దేశం లేదని, మనదేశంలో ప్రజాస్వామ్యం ఉందని, భారతీయ పౌరులుగా వారికి అన్ని హక్కులూ లభిస్తున్నాయని, అలాంటప్పుడు మళ్లీ బర్మా వెళ్లాల్సిన అవసరం ఏముందని వారు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)