విరూపాక్ష రివ్యూ: ఈ థ్రిల్లర్‌తో సాయి ధరమ్ తేజ్ హిట్ కొట్టారా? సుకుమార్ స్క్రీన్ ప్లే పనిచేసిందా?

వీడియో క్యాప్షన్, వీడియో: విరూపాక్ష రివ్యూ
    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

ఘోర రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత సాయి ధరమ్‌ తేజ్‌ నుంచి వచ్చిన చిత్రం.. ఆయన తొలి మిస్టరీ థ్రిల్లర్.. సుకుమార్ స్క్రీన్ ప్లే..

ఇలా చాలా ప్రత్యేకతలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘విరూపాక్ష’.

విరూపాక్ష ప్రచార చిత్రాలు థియేటర్‌లో సినిమా చూడాలనే కుతూహలాన్ని పెంచాయి.

మరి ఇంతలా ఆసక్తిని కలిగించిన 'విరూపాక్ష' ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది?

విరూపాక్ష సినిమాలో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మేనన్

ఫొటో సోర్స్, SVCCofficial/Twitter

ఫొటో క్యాప్షన్, క్షుద్ర పూజల చుట్టూ తిరిగే విరూపాక్ష కథలో సూర్య (సాయి ధరమ్ తేజ్ ), నందినిని (సంయుక్త మేనన్) ప్రేమ కథ కీలకం.

రుద్రవనం మరణాల వెనక ఎవరున్నారు?

రుద్రవనం అనే మారుమూల పల్లెటూరిలో 1980లు, 1990ల నేపథ్యంలో సాగే కథ ఇది. ఊళ్లో వరుసగా అనుమానాస్పద మరణాలు సంభవిస్తాయి. వాటి వెనక మర్మం ఏమిటనేది అంతుచిక్కదు. ఊరి మీద ఎవరైనా ‘చేతబడి’ చేయించారా? ఈ చావులకు కారణాలు ఏమిటి? అనే అంశాల చుట్టూ సాగే కథ విరూపాక్ష.

ఈ చిత్రం జోనర్‌కు తగినట్టుగా ఆడియన్స్‌లో ఆసక్తిని రేకెత్తించడంలో, తెరపై ఒళ్లు జలదరించే వాతావరణాన్ని సృష్టించడంలో కొత్త దర్శకుడు కార్తీక్ దండు విజయవంతమయ్యారు.

వెంకటాచలాన్ని, ఆయన భార్యను గ్రామస్థులు సజీవంగా దహనం చేసిన సన్నివేశంతో మొదలైన కథ విరామం వరకూ అంతే ఆసక్తికరంగా కొనసాగుతుంది.

రుద్రవనంలో సంభవించే వరుస మరణాలు ప్రేక్షకులకు అంతుచిక్కని అనుభూతిని కలిగిస్తాయి. ఈ మరణాల వెనుక ఎవరున్నారనే ఆలోచనల్లో పడేస్తాయి.

ప్రచార చిత్రంలో సాయి ధరమ్ తేజ్

ఫొటో సోర్స్, YouTube/Sri Venkateswara Cine Chitra

క్షుద్రపూజల కథలో ఓ ప్రేమకథ

చేతబడి, తాంత్రిక విద్యలు, క్షుద్రపూజలు చుట్టూ నడిచే ఈ కథలో ఓ ప్రేమకథ కనిపిస్తుంది.

రుద్రవనంలోకి వచ్చిన సూర్య (సాయి ధరమ్ తేజ్ ), నందినిని (సంయుక్త మేనన్) చూసి ఇష్టపడతాడు. అసలు కథలో ఈ ప్రేమకథ కీలకమైనది. అయితే ఈ ప్రేమకథను ఇంకా బలంగా చూపించి ఉంటే ముగింపు ఇంకా ప్రభావవంతంగా ఉండేదేమో!

విరూపాక్ష

ఫొటో సోర్స్, YouTube/Sri Venkateswara Cine Chitra

అష్టదిగ్బంధనంలోకి ఆలస్యంగా కథానాయకుడు

రుద్రవనంలో వరుస చావుల తర్వాత ఈ మిస్టరీని చేధించడానికి ఎవరూ ముందుకురారు.

తన అక్క పార్వతి (యాంకర్ శ్యామల) చావు తర్వాత కూడా సూర్య రుద్రవనం విడిచి వెళ్ళిపోవడానికే మొగ్గు చూపుతాడు కానీ, ఊళ్లో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ప్రయత్నించడు.

చివరికి తను ప్రేమించిన అమ్మాయికి ఆపద వస్తే కానీ ‘అష్టదిగ్బంధనం’ దాటే పరిస్థితి రాదు.

ఈ పరిణామాలను మామూలు కోణంతో చూస్తే పర్వాలేదు. హీరో కోణం నుంచి చూస్తే కొంత నిరాశ చెందొచ్చు.

విరూపాక్ష సినిమా

ఫొటో సోర్స్, Insta/jetpanja

ఊహకు అందని మలుపులు

రుద్రవనం చావుల వెనుక కారణాలను ద్వితీయార్ధంలో ఒళ్ళు జలదరించే రీతిలో దర్శకుడు చూపించారు.

వెంకటాచలం కథను వెతుక్కుంటూ వెళ్లి సూర్య తెలుసుకునే నిజాలు, ఆ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

పశుతత్వ క్షుద్ర ప్రయోగం, భైరవ నేపథ్యం గగుర్పాటు కలిగిస్తాయి.

విరూపాక్ష కథకు మూలమైన ముడిసరుకు అంతా ద్వితీయార్ధంలోనే ఉండటం వల్ల చాలా సన్నివేశాలను వాయిస్ ఓవర్‌తోనే నడిపేసిన అనుభూతి కలుగుతుంది.

హీరో నిజాలు తెలుసుకునే క్రమం కూడా చాలా సులువుగా తేల్చేసినట్టు అనిపిస్తుంది.

ద్వితీయార్ధంలో వచ్చే రెండు మలుపులు ప్రేక్షకుల ఊహకు అందవు. ఇలా ప్రేక్షకుల ఊహాశక్తిపై విరూపాక్ష పైచేయి సాధిస్తుంది.

సినిమా ముగిశాక, ఒక ఆసక్తికర మిస్టరీ థ్రిల్లర్ చూశామనే అనుభూతితో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వచ్చేలా చేయడంలో విరూపాక్ష బృందం విజయవంతమయ్యింది.

కుదిరిన సుకుమార్ స్క్రీన్‌ ప్లే

సుకుమార్‌కు ‘లాజిక్‌’తో మ్యాజిక్ చేయడం తెలుసు. అయితే విరూపాక్ష- తర్కానికి, శాస్త్రీయ దృక్పథానికి విరుద్ధంగా, మూఢనమ్మకాలు, దుష్ట శ‌క్తులు, చేతబడి, ఆత్మల చుట్టూ తిరిగే కథ. అయితే ఇందులోనూ సుకుమార్ ముద్ర కనిపిస్తుంది.

పార్వతి పాత్రకు చెవిపోటు, నందిని పాత్రకు మూర్ఛ, నందిని, సూర్యకు ఇచ్చిన లాకెట్- ఇవన్నీ సుకుమార్ స్క్రీన్ ప్లేలో చక్కగా కుదిరాయి.

చివర్లో ప్రేమ గురించి సూర్య, నందిని మాట్లాడుకునే మాటల్లో సుకుమార్ వినిపిస్తారు.

విరూపాక్ష సినిమా

ఫొటో సోర్స్, Twitter / Sai Dharam Tej

విరూపాక్ష అంతరార్థం ఏమిటి?

సాధారణంగా ప్రతి కథలో మంచి, చెడు ఉంటాయి.

మంచిని హీరోయిజం అంటే చెడును విలనిజం అంటాం.

విరూపాక్ష కథలో మంచి చెడుల గురించి మాట్లాడితే మూఢనమ్మకాలనే చెడుగా(విలన్ ) చూపించారు దర్శకుడు కార్తీక్.

ఇలాంటి మూఢ న‌మ్మకాలను విశ్వసించే కొన్ని గ్రామాలు వార్తల్లో ఇప్పటికీ కనిపిస్తుంటాయి.

విరూపాక్ష సినిమా

ఫొటో సోర్స్, Insta/jetpanja

పాత్రకు తగినట్టుగా సాయిధరమ్‌ తేజ్ నటన

ఒక హీరోగా సాయిధరమ్‌ తేజ్ ఏ లెక్కలూ వేసుకోకుండా చేసిన చిత్రమిది. కథను బలంగా నమ్మితేనే ఇలాంటి సినిమాలు సాధ్యపడతాయి.

ఆయన ఎలాంటి హీరోయిజమూ లేకుండా సూర్య పాత్రకు తగినట్లుగా కనిపించారు.

అఘోరాలు, తాంత్రికుల చుట్టూ నడిచే సన్నివేశాల్లో, భైరవ కోసం అన్వేషించే క్రమం, క్లైమాక్స్‌లో గ్రామస్థులతో సూర్య చేసే పోరాటం మెప్పిస్తాయి.

ఘోర రోడ్డు ప్రమాదం వల్ల సాయి ధరమ్ తేజ్ పూర్తిస్థాయి వ్యాయామానికి దూరం కావడంతో ఈ చిత్రంలో కాస్త బొద్దుగా కనిపిస్తారు.

రెండు కీలక స్త్రీ పాత్రలు

సంయుక్త మేనన్ పోషించిన నందిని పాత్ర విరూపాక్ష కథలో మరో బలమైన, కీలకమైన పాత్ర. రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాదిది.

నటనకు అవకాశమున్న ఈ పాత్రలో సంయుక్త చక్కగా అభినయించారు.

పతాక సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది.

మరో కీలకమైన స్త్రీ పాత్ర యాంకర్ శ్యామలది. ఈ కథలో కావాల్సిన థ్రిల్, హారర్‌ను యాడ్ చేసింది శ్యామల.

గ్రామ పూజారిగా కనిపించిన సాయి చంద్ మరోసారి తన స్క్రీన్ ప్రజన్స్‌తో ఆకట్టుకున్నారు. ఆయన ఉండటం ఈ కథకు మరింత బలాన్ని ఇచ్చింది.

గ్రామ సర్పంచ్ హరిచంద్ర ప్రసాద్ పాత్రలో రాజీవ్ కనకాల నటన బావుంది.

అబ్బాయిరాజు పాత్రలో కనిపించిన సునీల్ మరోసారి ఆకట్టుకున్నారు.

అఘోరాగా కనిపించిన అజయ్‌ది కూడా కీలకమైన పాత్రే.

బ్రహ్మాజీ, అభినవ్ గోమటం.. మిగతా పాత్రధారులంతా పరిధి మేర కనిపించారు.

నేపథ్య సంగీతం, కెమెరా

నిర్మాణ విలువలు విరూపాక్ష చిత్రాన్ని మరోస్థాయిలో నిలబెట్టాయి.

థ్రిల్లర్స్‌లో నేపథ్య సంగీతం పాత్ర చాలా ఎక్కువ. ఇందులో అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం ప్రభావంతంగా వుంది. చాలా సన్నివేశాలను నేపథ్య సంగీతం ఎలివేట్ చేసింది.

నచ్చావులే పాట 80లనాటి మెలోడిని గుర్తుకు తెస్తుంది.

థ్రిల్లర్ జోనర్‌కు తగిన టోన్‌ను తెరపై సృష్టించడంలో కెమరామెన్ షామ్‌దత్ మంచి పనితనం కనబరిచారు.

రాత్రి వేళల్లో తీసిన సన్నివేశాలన్నీ టెర్రిఫిక్‌గా ఉన్నాయి.

1980లు, 1990ల నాటి పరిస్థితులరు రీక్రియేట్ చేయడంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగా కృషి చేసింది.

నమ్మకాలు, మూఢ న‌మ్మకాలు, చేతబడి, ప్రేమ, పగ ఇలా చాలా అంశాలు ఉన్న ఈ కథను హారర్ టచ్ ఉన్న ఉత్కంఠభరిత థ్రిల్లర్‌గా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు కార్తీక్ విజయవంతమయ్యారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)