శాకుంతలం మూవీ రివ్యూ: శకుంతలగా సమంత, భరతుడి పాత్రలో అల్లు అర్హ మెప్పించారా?

ఫొటో సోర్స్, Face book/Sri Venkateswara Creations
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
కాళిదాసు రచించిన శృంగారభరిత నాటకం ‘‘అభిజ్ఞాన శాకుంతలం’’.
ఇదో మహా కావ్యం. సాహిత్యలోకంలో అభిజ్ఞాన శాకుంతలంకు గొప్ప స్థానం ఉంది.
ఈ కావ్యంలో శృంగారం ఉంది. విరహం ఉంది. వేదన ఉంది. ఓ బిడ్డ కోసం తల్లి పడే తాపత్రయం ఉంది. స్త్రీ సాధికారికత, ఆత్మాభిమానం ఉన్నాయి.
ఇప్పుడు ఈ మహా కావ్యాన్ని వెండి తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు గుణశేఖర్.
సమంతని కథానాయికగా ఎంచుకోవడం, సాంకేతిక నిపుణుల్ని కూడా ఆయా రంగాల్లో పేరుగాంచిన వాళ్లని తీసుకోవడంతో శాకుంతలంపై అంచనాలు పెరిగాయి.
మరి, ఈ దృశ్య కావ్యం ఎలా ఉంది? కాళిదాసు కావ్యానికి గుణశేఖర్ న్యాయం చేశాడా, లేదా?

ఫొటో సోర్స్, facebook/Sri Venkateswara Creations
ఓ గొప్ప ప్రేమ కథ
సాహిత్యంపై, మన ఇతిహాసాలపై ఏమాత్రం పరిచయం ఉన్నా సరే శకుంతల కథని కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
అయినప్పటికీ ఒక్కసారి ఈ కథని రేఖామాత్రంగా గుర్తు చేసుకుందాం. మేనకకు విశ్వామిత్రుడి కలిగిన సంతానం శకుంతల (సమంత). పుట్టినప్పుడే అనాథ అయిపోతుంది. కణ్వ మహర్షి తన సొంత కూతురిలా శకుంతలని పెంచి పోషిస్తాడు.
శకుంతల యవ్వన దశకు వస్తుంది. హస్తినాపుర రాజు దుష్యంతుడు (దేవ్ మోహన్) ఓరోజు కణ్వ మహర్షి ఆశ్రమానికి వస్తాడు. తొలి చూపులోనే శకుంతలని ప్రేమిస్తాడు. శకుంతలకు కూడా దుష్యంతుడిపై ప్రేమ కలుగుతుంది.
ఇద్దరూ గాంధర్వ వివాహం చేసుకుంటారు. శారీరకంగానూ ఒక్కటవుతారు. మరుసటి రోజు హస్తినకు తిరిగి వెళ్తాడు దుష్యంతుడు.
త్వరలోనే తిరిగి వచ్చి, అంతఃపురానికి తీసుకెళ్తానని మాట ఇస్తాడు. శకుంతల గర్భవతి అవుతుంది.
దుష్యంతుడిని వెదుక్కుంటూ హస్తినకు వెళ్తుంది. అయితే, దుర్వాస మహర్షి శాపం వల్ల దుష్యంతుడు శకుంతలని మర్చిపోతాడు. `నీవెవరో నాకు తెలీదు` అని నిండు సభలో అవమానిస్తాడు.
ఆ అవమాన భారంతో రాజ్యం విడిచి వెళ్లిపోతుంది శకుంతల. ఆ తరవాత ఏం జరిగింది? దుష్యంతుడికి గతం గుర్తొచ్చిందా? శకుంతలను మళ్లీ ఎప్పుడు ఎలా కలిశాడు? అనేదే కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం.
అభిజ్ఞాన శాకుంతలం గొప్ప శృంగార కావ్యం. అయితే ఈ కథలో శృంగారం ఒక్కటే కాదు, మహిళ తాలూకు ఆత్మాభిమానం కూడా ఉంది.
దుష్యంతుడు నిండు సభలో ‘నువ్వెవ్వరో నాకు తెలీదు’ అన్నప్పుడు శకుంతల కుంగిపోదు. ఎలాగైనా సరే, దుష్యంతుడి మనసు గెలుచుకోవాలని తాపత్రయ పడదు.
కాళ్లపై పడి నువ్వే నా దిక్కు అని రోదించదు. ఎదిరిస్తుంది. అక్కడ స్త్రీ పాత్ర తాలూకు ఔచిత్యం నిలబడుతుంది. ఆ కోణంలో చూస్తే ప్రతీ స్త్రీ ఆత్మస్థైర్యం.. అభిజ్ఞాన శాకుంతలం.

ఫొటో సోర్స్, facebook/Sri Venkateswara Creations
విజువల్ ట్రీట్
ఈ కావ్యాన్ని గుణశేఖర్ శృంగార కావ్యంగా మాత్రమే చూడలేదు. ఈ కథని ఓ విజువల్ వండర్‌గా చూపించే అవకాశం ఉందని గట్టిగా నమ్మాడు.
సినిమా ప్రారంభంలో పులిని వేటాడే దుష్యంతుడి వీరోచిత విన్యాసం, మదపుటేనుగుని మట్టి కరిపించే సందర్భం, యుద్ధ సన్నివేశం ఇలా ప్రతీ చోటా విజువల్ ట్రీట్ ఇవ్వడానికి ప్రయత్నించాడు.
ఉదాహరణకు, శకుంతల పరిచయ సన్నివేశమే తీసుకుందాం. శకుంతల అందాన్ని చూసి తుమ్మెదలన్నీ తనని ఓ పువ్వులా భ్రమించి, మకరందం తోడుకోవాలని ఆశతో ఆమెపై దాడి చేస్తాయి అంటూ అభిజ్ఞాన శాకుంతలంలో వర్ణించాడు కాళిదాసు.
దానికి ఏమాత్రం తగ్గకుండా ఆ ఊహని తెరపై ఆవిష్కరించాడు గుణశేఖర్. కణ్వ మహర్షి ఆశ్రమంలో ఆడుకునే జింకలు, పరిగెత్తే కుందేళ్లు, విహరించే నెమళ్లు, మంచు కొండలు ఇలా ఏ కోణంలో చూసినా రంగుల హరివిల్లులా ఉంటుంది.
ప్రతీ సీన్‌నీ కళ్లకు హాయి గొలిపే గ్రాఫిక్స్ లో రంగరించాడు గుణశేఖర్. హస్తినాపుర కోటని కళ్లముందుకు తీసుకొచ్చే సందర్భంలోనూ గుణశేఖర్ ఊహ, సృజనా శక్తి అబ్బుర పరుస్తుంది.
అవన్నీ త్రీడీలో ఇంకొంచెం బాగుంటాయి. గ్రీన్ మేట్‌లో తీసిన సన్నివేశాలే అయినప్పటికీ ఆ కంపోజింగ్ ఆకట్టుకుంటుంది.

ఫొటో సోర్స్, FaceBook/Sri Venkateswara Creations
ఇది ఎవరి కథ?
విజువల్ గా పక్కన పెడితే, స్క్రీన్ ప్లే పరంగా గుణశేఖర్ కాస్త ఇబ్బంది పడ్డాడేమో అనిపిస్తుంది. ఇది శకుంతల కథ. కాకపోతే దుష్యంతుడి కోణంలో కథ మొదలవుతుంది.
శకుంతల పాత్రనీ, ఆమె స్వభావాన్నీ పూర్తిగా ప్రేక్షకులకు పరిచయం చేయకుండానే కథ మొదలెట్టేశాడు గుణశేఖర్. దాంతో ఇది దుష్యంతుడి కథేమో అనే భావన ప్రేక్షకులకు కలుగుతుంది.
ఎన్ని చెప్పినా, ఇది శకుంతల కథ. శకుంతల కోణంలో సాగితే ఆ పాత్రపై ప్రేమ, సానుభూతి కలుగుతాయి. నిండు సభలో శకుంతలకు అవమానం జరిగినప్పుడు ఆ పాత్రపై ప్రేక్షకులకు సానుభూతి కలగదు.
ప్రజలు రాళ్లతో కొట్టి, రాజ్యం నుంచి తరిమేస్తున్నప్పుడు అయ్యో అనిపించదు. దానికి కారణం, శకుంతల పాత్రని ప్రేక్షకులకు పూర్తిగా పరిచయం చేయకపోవడమే.
శకుంతల, దుష్యంతుడు గాంధర్వ వివాహం చేసుకునేటప్పుడు, శారీరకంగా ఒకటైపోతున్నప్పుడు ఆ సీన్ కూడా బలంగా రాసుకోవాల్సింది.
ఆ రెండు పాత్రల్లో ఒకరిపై ఒకరికి అక్కడ మోహం తప్ప, ప్రేమ కనిపించదు. అదో ప్రధానమైన లోపం. చివర్లో శకుంతలని వెదుక్కొంటూ దుష్యంతుడు వచ్చిన్పపుడు కూడా బలమైన సంభాషణలు రాసుకోవాల్సింది.
స్త్రీ పాత్ర తాలూకు ఔచిత్యం, ఆత్మాభిమానం బయటపడే అరుదైన సందర్భం అది. దాన్ని దర్శకుడు వాడుకోలేకపోయాడు.
సినిమా మొత్తం చూస్తున్నప్పుడు అది దుష్యంతుడి కథ అనిపిస్తుంది తప్ప శకుంతల కథ అనిపించదు.

ఫొటో సోర్స్, FaceBook/Sri Venkateswara Creations
పాత్రలకు న్యాయం జరిగిందా?
సమంతకు ఇది చాలెంజింగ్ రోల్. తన పాత్ర వరకూ బాగా నటించింది కూడా. ఆమె ఆహార్యం, నటించిన పద్ధతి బాగున్నాయి.
అయితే శకుంతల అంటే ఓ మెరుపు. ఆమె ఓ శృంగార నాయిక. ఆ స్థాయి సౌందర్యం ఆ పాత్ర నుంచి రాబట్టలేకపోయారని అనిపిస్తుంది.
తొలి సన్నివేశాల్లో ఆమెకు సంభాషణలు చాలా తక్కువ. హస్తినాపురంలో ప్రవేశించాక నిండు సభలో, గర్భిణిగా ఉన్నప్పుడు ఆమెకు బలమైన సంభాషణలు చెప్పే అవకాశం దక్కింది. దాన్ని సమంత బాగానే ఉపయోగించుకొంది కూడా.
దుష్యంతుడిగా దేవ్ మోహన్ ఆహార్యం బాగుంది. కాకపోతే. ఆ పాత్రలో తెలుగు తెరకు తెలిసిన నటుడ్ని తీసుకొంటే బాగుండేదేమో అనిపిస్తుంది.
దుర్వాస మహర్షి పాత్రకు మోహన్ బాబు పర్‌ఫెక్ట్. ఎందుకంటే ఆయనకు ముక్కుమీద కోపం. ఆ పాత్రకు తగిన నటుడ్నే తీసుకున్నారు. గౌతమిది చిన్న పాత్రే.
మిగిలిన వాళ్లు అలా కనిపించి, ఇలా మాయమవుతారు. మేకప్‌ల వల్ల కొంతమంది నటుల్ని గుర్తు పట్టడం కూడా కష్టమైంది.
భరతుడి పాత్రలో కనిపించిన అల్లు అర్హ ( అల్లు అర్జున్ కూతురు) స్క్రీన్ అప్పీరియన్స్ ఆకట్టుకుంటుంది. బన్నీ కుమార్తె కాబట్టి భరతుడి పాత్రకి స్క్రీన్ టైమ్ పెంచారేమో అని కూడా అనిపిస్తుంది.

ఫొటో సోర్స్, FaceBook/Sri Venkateswara Creations
సాంకేతిక హంగులెలా ఉన్నాయి?
2డీలో తీసి, ఆ తరవాత త్రీడీలో కన్వర్ట్ చేసిన సినిమా ఇది. త్రీడీ సినిమా అంటే అదనపు ఆకర్షణ ఉండడం సహజమే.
అయితే త్రీడీ ఎఫెక్టులు అనుకున్నంత స్థాయిలో పండలేదు. కొన్ని ఇమేజ్‌లు ఇబ్బంది కరంగా కనిపిస్తాయి. మణిశర్మ పాటలు సో...సోగా ఉన్నాయి.
నేపథ్య సంగీతం కూడా అంతే. సీజీలకు చాలా పెద్ద పని పడింది. చాలా చోట్ల సీజీలు వావ్ అనిపిస్తాయి. కానీ యుద్ధ సన్నివేశాల్లో మాత్రం ఆ పనితనం తేలిపోయింది.
బడ్జెట్ లేకపోవడమో, లేదంటే సమయం లేకపోవడం వల్లో కానీ.. ఇంపాక్ట్ చూపించలేకపోయాయి.
సినిమా ఎంత విజువల్ మీడియా అయినా సరే, ఎమోషన్‌ని క్యారీ చేయడం చాలా అవసరం. ఈ సినిమాలో అదే లోపించింది.
శకుంతల కథని దుష్యంతుడి కోణంలో చూపించడం వల్ల శకుంతల వైపు నుంచి కథ చూసే అవకాశం ప్రేక్షకుడికి కలగలేదు. అది ప్రధామైన లోపం. దాంతో శకుంతల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.
ఇవి కూడా చదవండి:
- అమెరికా ‘టాప్ సీక్రెట్’ డాక్యుమెంట్లను ఎవరు, ఎందుకు లీక్ చేశారు?
- మిషన్ వాత్సల్య: తల్లిదండ్రులు లేని పిల్లలకు నెలకు రూ.4,000 ఆర్థిక సాయం, దరఖాస్తుకు 15వ తేదీ వరకు గడువు
- ఆమెను టీనేజీలోనే కిడ్నాప్ చేశారు, రూ. 51 వేలకు అమ్మేశారు, పాత షెడ్డులో అత్యంత దీనంగా..
- ముసిరి: మసాలా దినుసులకు పేరుగాంచిన ఈ దక్షిణాది రేవు పట్టణం ఎలా మాయమైంది?
- ఐపీఎల్- ఇంపాక్ట్ ప్లేయర్: ఈ కొత్త ఆప్షన్ రిజర్వు ఆటగాళ్లకు వరంలా ఎలా మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














