దసరా రివ్యూ: ఒళ్లు జలదరించే ఆ 10 నిమిషాలతో నాని హిట్ కొట్టాడా?

ఫొటో సోర్స్, Actor Nani/Facebook
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
సినిమా ఫలితాలు ఎలా ఉన్నా నటుడిగా నాని కష్టం ఎప్పుడూ వృథా కాలేదు. ప్రతీ సినిమాలోనూ ఓ కొత్త నాని కనిపించాడు.
కానీ, ఏదో ఓ చిన్న లోటు. తను పూర్తి స్థాయి మాస్ హీరో అవ్వలేకపోయానన్న వెలితి. అందుకే నాని మరింత వెతికాడు. ఆ ప్రయత్నంలో భాగంగా రూపుదిద్దుకొన్న చిత్రం `దసరా`. ఈ సినిమాతో పాన్ ఇండియా వైపు నాని అడుగులేశాడు.
నాని కెరీర్‌లో అత్యధిక బడ్జెట్ ఈ సినిమాకే కేటాయించారు. అతని సినిమాల్లోకే ఎక్కువ రేటుకు అమ్మడుపోయిన సినిమా కూడా ఇదే. ఇన్ని ప్రత్యేకతల మధ్య `దసరా` ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి నాని కల నెరవేరిందా?
వీరపల్లి దోస్తులు
అది తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల ప్రాంతం. వీరపల్లి అనే చిన్న గ్రామం. అక్కడ మగాళ్లంతా తాగుడుకు బానిసలు. అక్కడ మద్యం వ్యసనం కాదు, అదో సంప్రదాయం. 'సిల్క్ బార్' అనేది మద్యం అమ్మే దుకాణం కాదు, అక్కడి రాజకీయాలకు వేదిక. సర్పంచ్‌గా గెలిచేవాళ్లకే ఆ బార్‌పై ఆధిపత్యం ఉంటుంది.
ఆ ఊరిలో ధరణి (నాని), సూరి (దీక్షిత్ శెట్టి), వెన్నెల (కీర్తి సురేష్) దోస్తులు. చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి ఉంటారు. ధరణికి వెన్నెలంటే ప్రాణం. అయితే, సూరిని వెన్నెల ప్రేమిస్తుంది.
సిల్క్‌బార్‌లో క్యాషియర్ ఉద్యోగం సంపాదిస్తే తప్ప కూతూర్ని ఇవ్వనని తెగేసి చెబుతుంది వెన్నెల తల్లి. అందుకే ఆ క్యాషియర్ ఉద్యోగం కోసం సూరి, ధరణి రంగంలోకి దిగుతారు. అదే, ఈ ముగ్గురి జీవితాలను మలుపు తిప్పుతుంది. ఒక అనుకోని విషాదం వీళ్ల జీవితాల్ని అలిమేస్తుంది. అదేంటి? దాని వల్ల ఏర్పడే పర్యవసనాలు ఏమిటి? అనేది వెండి తెరపై చూడాలి.
స్నేహం, ప్రేమ, త్యాగం, ప్రతీకారం వీటితో ముడిపడిన కథ ఇది. నిజానికి కొత్త కాన్వాస్ ఏం కాదు. చాలా సినిమాల్లో చూస్తున్నదే. అయితే దానికి బొగ్గు గనుల నేపథ్యాన్ని ఎంచుకొన్నాడు దర్శకుడు. కథని ‘‘రా అండ్ రస్టిక్’’గా చూపించాడు. దాంతో పాత కథకు కొత్త కళ వచ్చింది.
దర్శకుడు ఈ పాత్రల కోసం ఎంచుకున్న నటీనటులు మన ఊహకి కూడా అందరు. నానిలో ధరణిని, కీర్తిలో వెన్నెలని దర్శకుడు ఎలా ఊహించాడో అర్థం కాదు. ఆయా పాత్రల్లో నటీనటుల ఎంపిక, బ్యాక్ గ్రౌండ్, సాంకేతిక బలం ఇవన్నీ పాత కథే అన్న ఫీలింగ్ రాకుండా చేశాయి.

ఫొటో సోర్స్, Instagram/NameisNani
ఆ పది నిమిషాలూ...
సిల్క్ బార్ గురించి చెబుతూ ఈ కథని మొదలెట్టాడు దర్శకుడు. ఆ ఊరి జనం తాగుడుకు ఎంత బానిసలైపోయారో వివరిస్తూ ఒక్కో పాత్రనీ రివీల్ చేస్తూ కథలోకి మెల్లిగా లాక్కెళ్లాడు. ధరిణి, సూరి, వెన్నెల బాల్యం, వాళ్ల ప్రేమకథ, వీలైంతన షార్ట్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ ఊరి రాజకీయాలు పరిచయం చేశాడు. ఇవన్నీ తొలి 10 నిమిషాల్లో జరిగిపోతుంది.
ఈ ముగ్గురు స్నేహితులూ పెద్దవాళ్లయ్యాక మళ్లీ వాళ్ల మధ్య స్నేహానికే పెద్ద పీట వేశాడు. స్నేహం కోసం ధరణి చేస్తున్న త్యాగాన్నీ, స్నేహితుడిపై సూరి చూపిస్తున్న మమకారాన్నీ కళ్లకు కట్టాడు. క్యాషియర్ పోస్టు కోసం క్రికెట్ మ్యాచ్ ఆడటం, బార్‌లో గొడవ వీటితో కథ మంచి రసకందంలో పడుతుంది.
అక్కడి నుంచే హై ఎమోషన్లు ఒకదాని వెంట మరోటి వస్తుంటాయి. ఇంట్రవెల్ సీక్వెన్స్ అయితే వాటి తీవ్రతని మరింత పెంచేసింది. దాదాపు 10 నిమిషాల పాటు సాగే సీక్వెన్స్‌లో భయం, ఉత్కంఠ, వేదన ఇవన్నీ ఆవిష్కరించాడు దర్శకుడు.
బహుశా ఈ సీక్వెన్స్‌నే దర్శకుడు, నాని బలంగా నమ్మి ఉంటారు. ఫస్టాఫ్‌లో కాస్త ఒళ్లు జలదరించే ఎపిసోడ్ ఇదే! ఈ మొత్తం యాక్షన్ ఎపిసోడ్ ఛేజింగ్ తరహాలోనే సాగుతుంది. రెగ్యులర్ ఫైట్లకు దూరంగా ఈ యాక్షన్ సీన్ తీర్చిదిద్దారు. కారం చేడు ఊచకోత లాంటి దుర్ఘటనలు ఈ సీన్‌కి స్ఫూర్తి కావొచ్చు. ఓ హై ఎండ్‌తో ఇంట్రవెల్ కార్డు వేయడంతో... దసరాపై ఓ పాజిటీవ్ ఫీల్ వస్తుంది.

ఫొటో సోర్స్, Instagram/NameisNani
ఎమోషనల్ రైడ్
ఇలాంటి కథల్ని ద్వితీయార్థం డీల్ చేయడంచాలా కష్టం. ఎందుకంటే ఓ విషాదం తాలుకూ ప్రభావం తీవ్రంగా పడిన తరవాత ప్రేక్షకుల్ని మళ్లీ రిలాక్స్‌గా ఉంచడం మామూలు విషయం కాదు.
అందుకే దర్శకుడు కూడా దాని జోలికి పోలేదు. ఆడిటోరియంని అదే మూడ్‌లో ఉంచి కథ కొనసాగించాడు. పాత్రల్ని పక్క దారి పట్టనివ్వకుండా ఎమోషన్ చేజారిపోనివ్వకుండా కాపాడాడు.
ధరణి, చిన నంబి (షైన్ టామ్ చాకో) ఇంటికి వెళ్లడం, అక్కడ సీన్.. ఈ కథలో ఇంకో కోణం ఉందన్న విషయాన్ని చెబుతుంది. వెన్నెలను కాపాడుకోవడానికి ధరణి చేసే ప్రయత్నాలు హృద్యంగా ఉంటాయి. సెకండాఫ్‌లో పాటలకు చోటు లేదు. ఉంటే విషాద గీతాలే ఉండాలి.
కానీ..`చమ్కీల అంగీలేసి` అనే పాట కోసం కొంత స్పేస్ తీసుకున్నాడు దర్శకుడు. నిజానికి ఇది ప్రథమార్థంలో రావాల్సిన గీతం. వెన్నెల పెళ్లికి ఈ పాట వాడి ఉంటే ఇంకాస్త జోష్ వచ్చి ఉండేది. సినిమా అంతా ఓ సీరియస్ టోన్లో సాగుతున్నప్పుడు ఈ పాటని ఇరికించారన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆడియో పరంగా సూపర్ హిట్టయిన ఈ గీతం... అసందర్భంగా వచ్చి పడిన కారణంగా అంత జోష్ ఇవ్వలేకపోయింది.
`నువ్వెవరినైనా ప్రేమించావా` అని వెన్నెల ధరణిని అడిగిన సీన్.. ఎమోషన్ పరంగా హై ఇస్తుంది. కానీ, అది సరిపోదు. అక్కడ ఇంకాస్త సంఘర్షణ రాబట్టాల్సింది. వెన్నెలకు నిజం తెలిసిన విధానం కూడా చాలా కృతకంగా అనిపిస్తుంది.
ఈ సన్నివేశం కోసం సృజనాత్మక మదింపు జరగలేదేమో అనిపిస్తుంది. మనవూరి పాండవులు లాంటి కథ ఇది. అక్కడ ఓ పల్లెటూరిని ప్లైన్‌గా చూపించారు. ఇక్కడ బొగ్గు గనుల నేపథ్యాన్ని జోడించారు అంతే తేడా. నిజానికి ఈ కథని కూడా ప్లైన్‌గా, మామూలు నేపథ్యంలో చెప్పొచ్చు. కాకపోతే.. రొటీన్ అయిపోతుంది. ఇంత డార్క్‌నెస్ రాదు.

ఫొటో సోర్స్, Instagram/NameisNani
సుకుమార్ శిష్యుడి రంగస్థలం
ఇది సుకుమార్ శిష్యుడి సినిమా. కొన్ని విషయాల్లో ఆయన గురువుని ఫాలో అయ్యాడేమో అనిపిస్తుంది. ముఖ్యంగా రంగస్థలం రిఫరెన్సులు కనిపిస్తాయి. ఈ సినిమా కూడా రంగస్థలంలా పొలిటికల్ టచ్‌తో సాగే సినిమానే. ఆధిపత్య పోరే! రంగస్థలంలో అన్న హత్యకు ప్రతీకారం తీర్చుకొంటాడు హీరో.
ఇక్కడ కూడా ప్రతీకారమే. రంగస్థలంలో `ఓరయ్యో..` అంటూ సాగే విషాద గీతం ఉంది. ఇక్కడ కూడా అలాంటి చావు పాట ఉంది. రెండింటినీ పక్క పక్క పెట్టి చూస్తే ఒక్కటే థీమ్ అనిపిస్తుంది.
పతాక సన్నివేశాల్ని బాగా డీల్ చేశాడు దర్శకుడు. చాలా పెద్ద యాక్షన్ ఎపిసోడ్ అది. నరకాసుర వధ థీమ్‌తో దసరా నేపథ్యాన్ని బాగా వాడుకున్నాడు. అయితే, ఓ చోట మాత్రం `కాంతార` రిఫరెన్సులా అనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Instagram/NameisNani
నట విన్యాసాలు
నానిలోని నటుడ్ని మరో కోణంలో ఆవిష్కరించే సినిమా ఇది. ధరణి పాత్రలో నానిని చూస్తుంటే అష్టా చమ్మాలో నాని, భలే భలే మగాడివోయ్‌లో నాని, ‘‘అంటే సుందరానికి’’లో నాని అస్సలు కనిపించడు.
ఇప్పటి వరకూ నాని చేసిన ఏ సినిమా, అందులోని ఏ క్యారెక్టర్ కొంచెం కూడా గుర్తుకు రాదు. ఆ మసిలో ఆ బొగ్గు గునుల్లోనే పుట్టి, అక్కడే పెరిగిన ధరణి కనిపిస్తాడు. తనని తాను పూర్తిగా మార్చుకొని ఈ పాత్రలో ఇమిడిపోయాడు. ఒక్కో సీన్‌లో ఒక్కో కొత్త నాని కనిపించాడు.
నటుడిగా తనని పూర్తిగా సంతృప్తి పరిచిన సినిమా ఇదే కావొచ్చు. వెన్నెలగా కీర్తి.. నల్ల గులాబీలా మెరిసింది. నిజంగా తన పాత్రలో చాలా డెప్త్ ఉంది. తొలి సగంలో ఒకలా.. మలి సగంలో మరోలా కనిపించింది.
పెళ్లి రోజున ఆడిన తీన్ మార్ చూస్తే కీర్తిలో మంచి డాన్సర్ ఉంది అనిపిస్తుంది. చిన్నదే అయినా, చెప్పుకోదగిన మరో స్త్రీ పాత్ర పూర్ణది. భర్త దురాగతాల్ని సహిస్తూ, భరిస్తూ, మరో ఆడది అన్యాయం అయిపోకూడదని భావించే పాత్ర అది. చాలా హుందాగా నటించారామె. ఝూన్సీ కొన్ని సన్నివేశాల్లోనే కనిపించినా, పేరుకి తగ్గట్టుగా వీరావేశం ప్రదర్శించారు.
సాయికుమార్‌కి ఇలాంటి పాత్రలు అలవాటే. సముద్రఖని మిస్ కాస్టింగ్. కేవలం ఒక డైలాగ్ చెప్పడానికే ఆయన్ని తీసుకొన్నారేమో అనిపిస్తుంది. ఎత్తు పళ్ల సెటప్ కూడా సూట్ కాలేదు. దీక్షిత్ శెట్టి ఫ్రెండ్ క్యారెక్టర్‌లో రాణించాడు. తనకీ మంచి మార్కులు పడతాయి. అయితే, ఈ ప్లేసులో ఓ తెలుగు హీరో ఉండి ఉంటే ఆ ఇంపాక్ట్ ఇంకోలా ఉండేదేమో అనిపిస్తుంది.

ఫొటో సోర్స్, facebook/nani
సాంకేతిక సొబగు
కొన్ని సాదా సీదా కథలు, ప్రతిభావంతుల చేతిలో పడితే ఎలా మారతాయో చెప్పడానికి `దసరా` ఓ పెద్ద ఉదాహరణ. సంగీతం ఛాయాగ్రహణం, ప్రొడక్షన్ డిజైనింగ్, సెట్ వర్క్ ఇవన్నీ నూటికి నూరుశాతం న్యాయం చేశాయి. నల్లగా, మసి పట్టిన బొగ్గు గనుల నేపథ్యం ఇది. కొన్ని లొకేషన్ల చుట్టే కథ నడుస్తుంది.
అయినా కూడా చూడముచ్చటగా తీర్చిదిద్దారు. తెలంగాణ సంప్రదాయాల్ని బలంగా వాడుకొన్నారు. మాటలు సాధారణంగానే ఉన్నాయి. సినిమాటిక్ ఎక్స్‌ప్రెషన్ తక్కువ. దాదాపు అందరూ ప్యూర్ తెలంగాణ మాండలికంలోనే మాట్లాడారు.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల టెక్నికల్ టీమ్ నుంచి తనకు ఏం కావాలో అది బలంగా రాబట్టుకొన్నాడు. ఈ విషయంలో దర్శకుడికి మంచి మార్కులు పడతాయి. ఓ సాధారణమైన కథని సాంకేతిక నిపుణుల అండతో... ఓ మంచి సినిమాగా మలచగలిగాడు.
అయితే, ఈ సినిమాలో పాన్ ఇండియా స్టఫ్ అందా? అని అడిగితే సంతృప్తికరమైన సమాధానం రాదు. తెలుగు ప్రేక్షకుల వరకూ, నాని అభిమానుల వరకూ ఈ ప్రయత్నం ఓకే. పాన్ ఇండియా స్థాయిలో మెరవాలంటే అద్భుతం జరగాలి.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్: వీధుల్లోకి లక్షల మంది ఎందుకు వస్తున్నారు... వారి ఆగ్రహానికి కారణం ఏంటి?
- గవర్నర్ పోస్టును రద్దు చేయాలా? వారి పనితీరుపై విమర్శలెందుకు?
- గోరుముద్ద, మన ఊరు-మన బడి పథకాలు ఉన్నా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పిల్లలు ఎందుకు బడి మానేస్తున్నారు?
- కేరళ క్రైస్తవులు అంత్యక్రియల్లో ఫొటోలు ఎందుకు తీయించుకుంటారు?
- రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు కారణమైన పూర్ణేశ్ మోదీ ఎవరు? ఆయనకు నరేంద్ర మోదీకి సంబంధం ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















