దాస్ కా ధమ్కీ రివ్యూ: విష్వక్ సేన్ చేసిన ట్విస్టుల దండయాత్ర ఫలించిందా?

ఫొటో సోర్స్, VishwakSenActor/Twitter
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
రాముడు-భీముడు... రౌడీ అల్లుడు... గౌతమ్ నందా... మూడూ హిట్ సినిమాలే.
మూడింట్లోనూ హీరోలవి డ్యూయల్ రోల్సే. ఈ మూడు కథల్లోనూ ఓ కామన్ పాయింట్ ఉంది. కోటీశ్వరుడి ఇంటికి.. ఓ నిరుపేద వెళ్తాడు. కోటలాంటి ఆ ఇంటి పరిస్థితుల్ని చక్కబెడతాడు. అంతే కథ.
ఈ మూడు సినిమాలూ.. విభిన్నమైన కాలాల్లో వచ్చినా అలరించాయి. సినిమా చూస్తున్న వాళ్లకి సైతం.. ఇది చూసిన కథే అనే ఫీలింగ్ వచ్చినా, వాళ్లు ఎంజాయ్ చేశారు. దర్శకులు కూడా పాత కథకు కొత్త హంగులద్దారు.
`దాస్ కా ధమ్కీ` కూడా ఆ కోవలోనిదే. పైన చెప్పుకొన్న మూడు సినిమాల లక్షణాలు ఇందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, VishwakSenActor/Twitter
వెయిటర్ టూ మిలియనీర్
కృష్ణదాస్ (విష్వక్‌సేన్) అనాథ. తనకు ఇద్దరు స్నేహితులు (హైపర్ ఆది, మహేష్). ఓ స్టార్ హోటల్‌లో ఈ ముగ్గురూ వెయిటర్లుగా పని చేస్తుంటారు. జీవితంలో బాగా డబ్బులు సంపాదించాలని, తమకంటూ ఓ కుటుంబం ఉండాలన్నది వాళ్ల కల.
దాస్ కోటీశ్వరుడని భ్రమ పడి ప్రేమిస్తుంది కీర్తి (నివేదా పేతురాజ్). దాస్ కూడా తనకు డబ్బుందని కీర్తి దగ్గర బిల్డప్పులు ఇస్తాడు. చివరికి నిజం తెలిసి కీర్తి ఛీ కొడుతుంది. ఆ మరుసటి రోజే.. అనూహ్యంగా కృష్ణదాస్.. కోటీశ్వరుడైపోతాడు. ఓ కంపెనీకి సీఈవోగా మారిపోతాడు. ఇదంతా ఎలా జరిగింది? వెయిటర్ నుంచి మిలియనీర్‌గా కృష్ణదాస్ ఎలా మారాడు? అచ్చం కృష్ణదాస్‌లానే ఉన్న అజయ్ ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమా చూడాలి.
ఒకేలాంటి ఇద్దరు. ఒకరి స్థానంలోకి మరొకరు వెళ్లడం... ఇది మనకు చాలా అలవాటైపోయిన ఫార్ములానే. ఈ కథలు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. విష్వక్ మళ్లీ అలాంటి కథే ఎంచుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఓ పాత కథని తీసుకున్నానన్న విషయం విష్వక్‌కు తెలుసు. అందుకే.. ఆ పాత ఛాయలేం కనిపించకుండా ట్విస్టులతో మేకప్ వేశాడు. అవన్నీ పాత కథని కవర్ చేసేందుకు వేసుకొన్న ట్విస్టుల్లానే కనిపిస్తాయి. `దాస్ కా ధమ్కీ`లో అదే పెద్ద లోపం.
ఈ కథని ప్రారంభించిన విధానం సరదాగా ఉంటుంది. దాస్.. వెయిటర్‌గా పడే కష్టాలు, తన ఫస్ట్రేషన్, బాధ, కోపం అన్నీ చూపించేశారు. వెంటనే కీర్తిని ప్రవేశ పెట్టారు. కీర్తి.. కృష్ణదాస్ ప్రేమకథ పూర్తి స్థాయి సినిమాటిక్ లిబర్టీలతో సాగుతుంది. ఇలాంటి ట్రాకులు సైతం గతంలోనే చూశాం. ఇక్కడా అదే తంతు.
తాను ఓ కోటీశ్వరుడని నమ్మించడానికి విష్వక్ చేసే ప్రయత్నాలు సరదాగా అనిపించినా - చాలా చాలా పాత సినిమాలు, వాటిలోని సన్నివేశాలు ఒకదాని తరవాత మరోటి గుర్తొచ్చేస్తూంటాయి. యువతరాన్ని ఆకట్టుకొనే ప్రయత్నంలో భాగంగా రెండు మూడు సీన్లు కేటాయించారు. వాటి ప్రధాన లక్ష్యం యూత్‌తో కేకలు వేయించడమే. అలాంటి ట్రిక్కులు కొంతమేర ఫలితాన్ని ఇచ్చాయి. ఆ ధ్యాసలో పడి.. సెన్సార్ కత్తెరకు బలైపోయిన డైలాగులు చాలానే కొంచెం కొంచెంగా వినిపించేస్తుంటాయి. ఆ సంభాషణ అర్థం ఏమిటో, ఆంతర్యం ఏమిటో సగటు ప్రేక్షకుడికి అర్థం కాకుండా పోదు. అలాంటి డైలాగుల్ని సెన్సార్ సగం సగం వినిపించడం ఏమిటో..? పూర్తిగా తొలగిస్తే సమస్యే ఉండేది కాదు.
హైపర్ ఆది, మహేష్‌లు.. అప్పుడప్పుడూ పంచ్‌లు వేస్తూ... థియేటర్‌ని కాస్త హుషారుగా ఉంచే ప్రయత్నం చేశారు. రావు రమేష్ ఎంట్రీతో అజయ్ (మరో విష్వక్‌సేన్) అనే పాత్ర ఈ కథలో ఉందన్న విషయం ప్రేక్షకులకు తెలుస్తుంది. అక్కడి నుంచి.. కాస్త అటెన్షన్ మొదలవుతుంది.
కోటీశ్వరుడి ఇంటికి.. వెయిటర్ దాస్ వెళ్లడంతో అక్కడ కన్‌ఫ్యూజన్ డ్రామా మొదలవుతుంది. ఈ డ్రామాలో అక్కడక్కడ కాస్త ఫన్ పుట్టినా ఓవరాల్‌గా కన్‌ఫ్యూజన్ ఎక్కువై క్లారిటీ మిస్సయ్యింది. ఇంట్రవెల్ ముందొచ్చే ట్విస్టుతో కథ కాస్త కుదురుకున్నట్టు కనిపిస్తుంది. ఆ ట్విస్టు దాస్ పాత్రకే కాదు, థియేటర్లోని ప్రేక్షకులకీ కాస్త జర్క్ ఇస్తుంది.

ఫొటో సోర్స్, VishwakSenActor/Twitter
ట్రాక్ తప్పిన దాసు
ద్వితీయార్థంలో రాముడు - భీముడు టైపు కథ మొదలవుతుంది.
ఇక్కడ... ఫన్‌కి ఛాన్సు లేదు. ఎందుకంటే అప్పటి వరకూ సరదాగా గడిపేసిన దాస్ మీద కొన్ని బాధ్యతలు పడతాయి. వాటిని పరిష్కరించుకొనే క్రమంలో కథలో సీరియస్‌నెస్ వస్తుంది. ఈ మామూలు కథకు మేకప్ వేసే క్రమంలో సెకండాఫ్‌ల ట్విస్టుల దండయాత్ర మొదలవుతుంది.
నిజానికి ఏ కథలో అయినా మలుపులు అనేవి సహజంగా రావాలి. కానీ ఇక్కడ తెచ్చి పెట్టుకొన్న ట్విస్టులు అని తెలిసిపోతుంటాయి. ప్రేక్షకుల్ని మలుపులతో ఊపిరి ఆడనివ్వకుండా చేయాలనుకొన్నాడు దర్శకుడు. అక్కడి వరకూ ఓకే. కానీ ఆ ప్రయత్నంలో పడి.. క్యారెక్టర్ల ఆర్క్‌నీ, వాటి ఔచిత్యాన్నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకొంటూ వెళ్లిపోయాడు. దాంతో దాస్ ట్రాక్ తప్పేశాడు.
ఉదాహరణకు హీరోయిన్ పాత్ర ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటుంది. దాస్ కోటీశ్వరుడు అని నమ్మినప్పుడు తన దగ్గరకు వస్తుంది. వెయిటర్ అని తెలిసినప్పుడు వెళ్లిపోతుంది. మళ్లీ కోట్లు రాగానే వాలిపోతుంది. ఇదంతా.. పక్కన పెడితే, చివర్లో ఈ పాత్రని ముగించిన తీరు కూడా అతికినట్టు ఉండదు. ట్విస్టు కోసం ట్విస్టు రాసుకొన్నప్పుడు అనవసరమైన ఎమోషన్‌ని జోడించాల్సి వస్తుంది.
సినిమా అంతా అయిపోయిందనుకొన్న దశలో ఓ పబ్ సాంగ్ వచ్చి.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. అది కూడా భరిస్తే.. వెంటనే ఓ జైలు సీను వస్తుంది. దాస్ కా ధమ్కీకి సీక్వెల్ ఉందహో.. అని చెప్పడానికి తప్ప, ఆ సీన్ ఈ కథకు ఏ కోణంలోనూ ఉపయోగపడలేదు.

ఫొటో సోర్స్, VishwakSenActor/Twitter
బహు పాత్రాభినయం
ఈ సినిమా హీరో... డైరెక్టర్... నిర్మాత... రైటర్... ఇలా అన్ని పాత్రలు విష్వక్ సేన్ పోషించాడు. 30 ఏళ్లు నిండని హీరో ఒకేసారి ఇన్ని బాధ్యతలు నెత్తిమీద మోయడం నిజంగా సాహసమే. ఈ విషయంలో విష్వక్ గట్స్‌ను అభినందించాలి.
అయితే ఆ బరువును చివరి వరకూ మోయలేకపోయాడు. నటుడిగా తెరపై న్యాయం చేసినా తెర వెనుక దర్శకుడిగా మాత్రం విఫలమయ్యాడు. ఓ రెగ్యులర్ కథని, ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసేటట్టు చెప్పలేకపోయాడు. ట్విస్టుల్ని నమ్ముకొని, కథలో ఉండాల్సిన సోల్‌ని వదిలేశాడు.
పడిపోయిందే పిల్ల.. పాట హుషారుగా ఉంది. మామాబ్రోలో... కథానాయకుడి కష్టాల్నీ, జీవితంపై తన ఫిలాసఫీనీ పరిచయం చేశారు. పబ్ పాట గుర్తు పెట్టుకొనేలా లేదు. నేపథ్య సంగీతానికి సైతం యావరేజ్ మార్కులు పడతాయి.
విష్వక్ సొంత సినిమా ఇది. అందుకే ఖర్చుకి వెనుకంజ వేయలేదు. కొన్ని చోట్ల మాటలు డబుల్ మీనింగ్‌లో ధ్వనిస్తాయి. వాటిని వీలైనంత వరకూ పక్కన పెట్టే అవకాశం ఉన్నా, మొండిగా వాడేశాడు. కామెడీ కోసం లాజిక్కుల్ని పక్కన పెట్టేశారు. తొలి సగంలో ఇలాంటి సీన్లు చాలా కనిపిస్తాయి. ఇలాంటి కథతో... ఇంత పెద్ద బడ్జెట్‌తో.. తన కెరీర్‌లోనే రిస్కీ ప్రాజెక్ట్ చేశాడు విష్వక్.
మాస్‌కి నచ్చే అంశాలు, తన ఫ్యాన్స్ కోరుకునే విషయాలూ.. ఈ సినిమాలో జోడించినా వాటి ద్వారా కూడా విష్వక్ పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు.
ఇవి కూడా చూడండి:
- ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలు- పులివెందుల్లో జగన్-కు... కుప్పంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారా-
- తెలంగాణ- పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారం ఎలా జరిగింది-
- దళిత విద్యార్థులు పైలెట్ కావాలనుకుంటే రూ.3.72 లక్షల స్కాలర్ షిప్, నెలకు రూ.22 వేలు ఉపకారవేతనం ఇచ్చే ప్రభుత్వ పథకం
- ఆంధ్రప్రదేశ్- ఆ ఊరి పిల్లలు గుర్రాలపై సవారీ చేస్తూ బడికి వెళ్తున్నారు
- ఆరోగ్యం- ఏం తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది- విటమిన్ టాబ్లెట్లు మంచివేనా-
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








