విశాఖ రుషికొండపై నిర్మాణాలు: హైకోర్టు కమిటీ ఏం తేల్చింది, తెలుగు మీడియా కథనాలు ఏం చెబుతున్నాయి?

రుషికొండపై నిర్మాణాలు
    • రచయిత, శంకర్ వడిసెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రుషికొండ హాట్ టాపిక్‌గా మారింది. మైనింగ్ సహా వివిధ కారణాలతో పలు చోట్ల కొండలను పిండిచేస్తున్నా పట్టించుకోని రాజకీయ పక్షాలు రుషికొండ విషయంలో మాత్రం ప్రత్యేక ఆసక్తి ప్రదర్శిస్తుంటాయి.

దానికి ప్రధాన కారణం విశాఖపట్నాన్ని పాలనా కేంద్రంగా ప్రకటించడమే కాకుండా, దానికి అనుగుణంగా ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలకు రుషికొండ కేంద్రంగా మారడం.

వాస్తవానికి రుషికొండపై ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ( ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో హరిత రిసార్ట్స్ నిర్మాణం జరిగి దాదాపు పదేళ్లవుతోంది.

అయితే, ఏపీటీడీసీ రిసార్ట్స్‌ను ఆధునికరిస్తున్నామంటూ ప్రకటించిన ప్రభుత్వం వాటిని తొలగించి, అక్కడ కొత్తగా నిర్మాణాలు చేపట్టింది.

పర్యాటకం పేరు చెప్పినప్పటికీ, కొత్త భవనాల నిర్మాణం పాలనా అవసరాలకు అనుగుణంగా ఉండడంతో వివాదం తలెత్తింది. పర్యావరణ విధ్వంసం అంటూ ఫిర్యాదులు వచ్చాయి.

ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించకపోవడంతో ఈ వివాదం ముదిరింది. చివరకు ప్రతిపక్ష నేతల పర్యటనలకు కూడా అడ్డంకి చెప్పడంతో అనుమానాలు బలపడ్డాయి.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌తో పాటుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వరకూ వివాదం వెళ్లింది.

ఏపీ హైకోర్టు 2022 నవంబర్ 3న ఇచ్చిన ఆదేశాల మేరకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పడింది. రుషికొండ వివాదం పూర్వాపరాలను పరిశీలించిన కమిటీ తన నివేదికను సమర్పించింది.

ఈ నివేదికపై ఏప్రిల్ 13 నాటి మీడియా కథనాల్లో భిన్నమైన వాదనలు వినిపించాయి.

అక్రమాలు జరిగినట్టు నిర్ధరణ అయిందని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు రాస్తే, అందుకు భిన్నంగా నిర్మాణం నిబంధనలకు అనుగుణంగా సాగుతోందంటూ సాక్షి, ప్రజాశక్తి ప్రచురించాయి. ఇంతకీ ఏది నిజం?

కళింగ బ్లాక్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కమిటీ నివేదికలో కళింగ బ్లాకులో అనుమతులకు మించి నిర్మాణం జరిగిందని తెలిపారు

రిపోర్టులో ఏముంది?

ఉన్నత స్థాయి నిపుణుల బృందం 42 పేజీలతో కూడిన పరిశీలన నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా విచారణ జరగబోతోంది. తదుపరి విచారణ ఏప్రిల్ 26న జరుగుతుంది.

క్షేత్రస్థాయిలో పరిశీలించిన నిపుణుల బృందం నివేదికలో అనేక అంశాలు ప్రస్తావించింది. అందుకు ఆధారాలు కూడా సమర్పించింది.

ముఖ్యంగా సీఆర్‌జెడ్ నిబంధనలు, అక్కడి నుంచి తీసుకున్న అనుమతుల ప్రకారం నిర్మాణం జరుగుతుందా లేదా అన్నది పరిశీలించింది.

రుషికొండపై సీఆర్ జెడ్ నిబంధనల మేరకు ఇచ్చిన అనుమతి పరిధిలోనే నిర్మాణాలు జరుగుతున్నట్టు కమిటీ తేల్చింది. అదే సమయంలో బ్లాకుల పరిధిలో అనుమతికి భిన్నంగా మార్పులు చేసినట్టు గుర్తించింది.

వాటికి తోడుగా కొండ ఎగువకి కొంత మేర తవ్వకాలు, తవ్విన మట్టిని డంప్ చేసిన ప్రాంతం కూడా నిబంధనలకు విరుద్ధమని కమిటీ పేర్కొంది.

అనుమతి పొందిన దాని ప్రకారం మొత్తం 7 బ్లాకుల్లో 19,969 చదరపు మీటర్ల బిల్టప్ ఏరియా నిర్మాణం జరగాల్సి ఉండగా, 15364 చదరపు మీటర్ల మేర నిర్మాణాలు ఉన్నట్టు తెలిపింది.

సీఆర్ఎఫ్‌ అనుమతులు మాత్రం 13,793 చ. మీ కు మాత్రమే తీసుకున్నట్టు పేర్కొంది.

చోళ, పల్లవ బ్లాకుల నిర్మాణం జరపలేదని, వేంగి, ఈస్ట్రన్ గంగా బ్లాకులు కలిపి నిర్మించారని తెలిపింది. కళింగ బ్లాకు నిర్మాణం అనుమతులు పొందిన దానికి మించి జరిగిందని తేల్చింది.

అంతేగాకుండా, కమిటీ సర్వే చేసిన మేరకు సీఆర్ జెడ్ పరిధిలోని 16.515 ఎకరాలు, సీఆర్ జెడ్ బయట ఉన్న 1.45 ఎకరాల భూమిని వినియోగించినట్టు గుర్తించింది.

మొత్తం 17.965 ఎకరాలు వినియోగంలో ఉన్నాయని స్పష్టం చేసింది. అలాగే, రుషికొండ దక్షిణభాగంలోనూ, మరికొన్ని చోట్ల కూడా తవ్విన మట్టితో నింపేసినట్టు గుర్తించింది.

ఈనాడు, ప్రజాశక్తి పత్రికల్లో రుషికొండ వివాదంపై వార్తలు

ఫొటో సోర్స్, Eenadu, Prajasakti

ఫొటో క్యాప్షన్, ఈనాడు, ప్రజాశక్తి పత్రికల్లో రుషికొండ వివాదంపై ప్రచురించిన వార్తలు

మీడియా కథనాలు

రుషికొండలో ఉల్లంఘనలు నిజమేనంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రధానంగా రాస్తూ, కమిటీ రిపోర్టులో అతిక్రమణలను ప్రస్తావించాయి.

సాక్షిలో మాత్రం అనుమతి తీసుకున్న దానికంటే తక్కువ విస్తీర్ణంలోనే నిర్మాణాలు అని రాసింది. ప్రజాశక్తి సైతం అనుమతించిన మేరకే నిర్మాణాలు అంటూ రాసింది.

ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఆధ్వర్యంలో అయిదుగురు ఉన్నతాధికారులతో కూడిన సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు.

మార్చి 13న ఈ కమిటీ రుషికొండ ప్రాంతాన్ని పరిశీలించింది. తమ పరిశీలనలో భాగంగా తీసిన ఫొటోలు, శాటిలైట్ చిత్రాలను కూడా నివేదికలో పొందుపరిచారు.

మొత్తం 61 ఎకరాల విస్తీర్ణమున్న కొండపై 5.18 ఎకరాల లోపే నిర్మాణాలు జరుగుతున్నట్టు కమిటీ నిర్ధరించింది.

మరో 4.7 ఎకరాల్లో చేయాల్సిన ల్యాండ్ స్కేప్, హార్డ్ స్కేప్ పనులు ప్రారంభం కాలేదని కమిటీ గుర్తించింది. నివేదికలోని ఈ అంశాలను సాక్షి, ప్రజాశక్తి ప్రస్తావించాయి.

ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రం మరో కోణాన్ని మాత్రమే ప్రస్తావించాయి. ముఖ్యంగా కొండ ఎగువ భాగానికి తవ్వకాలు జరగడం, బ్లాకుల నిర్మాణంలో అనుమతులు లేకుండా మార్పులు జరగడం, మట్టితో నింపిన ప్రాంతంతో కలిపి 17.965 ఎకరాలు విస్తీర్ణంలో కార్యకలాపాలు ఉండడాన్ని ప్రధానంగా పేర్కొన్నాయి.

కమిటీ నివేదికలో ఈ అంశాలన్నీ ఉన్నాయి. కానీ మీడియా కథనాల్లో మాత్రం ఎవరికి కావాల్సిన భాగాన్ని వారు తీసుకున్నట్టు స్పష్టమవుతోంది.

పాలక, ప్రతిపక్షాలు కూడా అదే రీతిలో స్పందిస్తున్నాయి. తమ వాదనలకు బలమైన అంశాలను మాత్రమే ప్రస్తావిస్తున్నాయి.

కమిటీ నివేదికలో వేంగి బ్లాకులో అనుమతులకు మించి నిర్మాణం జరిగిందని తెలిపారు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కమిటీ నివేదికలో వేంగి బ్లాకులో అనుమతులకు మించి నిర్మాణం జరిగిందని తెలిపారు

కోర్టు తీర్పులను కూడా అంతే...

రుషికొండ తవ్వకాలపై వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీతో సంతృప్తి చెందకుండా, హైకోర్టు జోక్యంతో కేంద్ర ప్రభుత్వ అధికారులతో కూడిన కమిటీ రంగంలో దిగింది.

ఈ కమిటీ సమగ్రంగా పరిశీలించి, ఆధారాలతో కూడిన నివేదిక సమర్పించింది.

కాగా, ఆ రిపోర్టులోని అంశాలను ఎవరికి నచ్చిన రీతిలో వారు ప్రచారం చేసుకోవడం ఆసక్తిగా మారింది.

"వర్తమానంలో అధికారిక నివేదికలు, ఆఖరికి కోర్టు తీర్పులు కూడా పూర్తిగా పాఠకులకు చేరే అవకాశం లేదు. ఎవరికి నచ్చిన భాగాన్ని వారు అందించేందుకు సిద్ధమయిపోతున్నారు. వార్తల్లో కొంత భాగాన్నే చెబుతూ, చూపిస్తూ అందరినీ మభ్యపెట్టవచ్చని భావిస్తున్నారు. దీనివల్ల చివరకు మీడియా మీద విశ్వసనీయత సన్నగిల్లుతోంది. సోషల్ మీడియా కారణంగా ఆయా కథనాల అసలు సారాంశం బయటకు వస్తున్నప్పటికీ, ఇలాంటి అరకొర అంశాలు ప్రచురించడం మాత్రం మీడియా సంస్థలకు తగదు" అని ఐ అండ్ పీఆర్ శాఖ లో రాష్ట్రస్థాయి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి రిటైర్ అయిన ఆర్.ఫణేశ్వర రావు అభిప్రాయపడ్డారు.

రెండు దశాబ్దాల క్రితం ఇలాంటి పరిస్థితి లేదని, ఇప్పుడు పెరుగుతోందని, ఇది మరింత విశృంఖలమయ్యే ప్రమాదం కూడా ఉందని ఆయన అన్నారు.

ఫిబ్రవరిలో గ్రీన్ మ్యాట్‌తో కప్పిన రుషికొండ
ఫొటో క్యాప్షన్, ఫిబ్రవరిలో గ్రీన్ మ్యాట్‌తో కప్పిన రుషికొండ

'హైకోర్టు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం'

విశాఖ జిల్లా యండాడ పరిధిలోని సర్వే నెం. 19లో ఉన్న ఈ భూముల్లో జరుగుతున్న కార్యకలాపాలు టూరిజం అభివృద్ధి కోసమంటూ ఏపీటీడీసీ చెప్పిన దానికి భిన్నంగా సాగుతున్నట్టు స్పష్టమవుతోంది.

కాటేజీలు, ఇతర వసతి గృహాల మాదిరిగా నిర్మాణాలు లేవనే అంశం బహిర్గతమయ్యింది.

రుషికొండపై పర్యావరణ నిబంధనలు పాటించడం లేదని తాము చేస్తున్న వాదనను బలపర్చేలా ఈ నివేదిక ఉందని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అభిప్రాయపడుతున్నారు.

ఈ కేసులో విశాఖ తూర్పు ఎమ్మెల్యేతో పాటుగా, విశాఖకు చెందిన జనసేన కార్పోరేటర్ పీవీఎల్ఎన్ మూర్తి యాదవ్ కూడా హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు.

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారు.

"ప్రభుత్వం, ఏపీటీడీసీ అడ్డగోలుగా వ్యవహరించాయి. జీవీఎంసీ కూడా నిబంధనలు పాటించలేదు. రుషికొండను ఛిద్రం చేసేలా తవ్వకాలు, నిర్మాణాలు చేశారు. ఈ విషయాలను హైకోర్టు నియమించిన కమిటీ తేల్చింది. కాబట్టి తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. రుషికొండను పరిరక్షించాలని, విశాఖ పర్యాటకాభివృద్ధికి దోహదపడే అంశాలను కాపాడాలన్నదే మా ఉద్దేశం" అని ఎమ్మెల్యే రామకృష్ణబాబు బీబీసీతో అన్నారు.

రుషికొండ

ప్రచారానికి, వాస్తవానికి పొంతన లేదు...

రుషికొండను తవ్వేస్తున్నారంటూ ఇన్నాళ్లుగా చేస్తున్న ప్రచారానికి, వాస్తవానికి పొంతనలేదన్న సంగతి ఇప్పటికైనా గ్రహించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు.

"పరిమితి మేరకు నిర్మాణాలు జరుగుతున్నాయి. అవసరాల రీత్యా ఆ స్థలంలో బ్లాకుల ప్లాన్ కొంత మారి ఉండొచ్చు. కానీ పరిధికి మించి తవ్వకాలు గానీ, అదనపు భవనాల నిర్మాణం కానీ జరగడం లేదు. మట్టితో నింపిన భాగం కూడా నిర్మాణాలు పూర్తికాగానే యధాస్థితికి వస్తుంది. కాబట్టి ప్రతిపక్షాల విమర్శల్లో పస లేదని కమిటీ నివేదికలో పేర్కొనడం ఆహ్వానించదగ్గ అంశం. ప్రభుత్వం ప్రజావసరాల కోసం చేస్తున్న నిర్మాణాలను అడ్డుకోవడానికి చేస్తున్న యత్నాలు ఇక సాగవు" అని ఆమె దీమా వ్యక్తం చేశారు.

వీడియో క్యాప్షన్, అమ్మఒడి: పిల్లలను బడికి పంపి, ప్రభుత్వం నుంచి ఏటా రూ.15 వేలు పొందడం ఎలా?

మీడియా కథనాలను తప్పుబట్టిన ప్రభుత్వం

రుషికొండపై అధికారుల నివేదిక గురించి కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు పూర్తి సత్యదూరమని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ మేరకు ఏపీటీడీసీ ఎండి కన్నబాబు ఓ ప్రకటన విడుదల చేశారు.

"రుషికొండలో నిర్మాణ కార్యకలాపాల కోసం 20 ఎకరాల భూమిని ఏపీటీడీసీ వినియోగించుకుందని పిటిషనర్లు ఆరోపించారు. మా కౌంటర్‌ అఫిడవిట్‌ హైకోర్టు ముందు ఉంది. 9.88 ఎకరాల భూమిని మాత్రమే నిర్మాణానికి వినియోగించినట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు" అని ఆ ప్రకటనలో ఆయన వివరించారు.

‘‘ఈ భూమిని చేర్చి కొండవాలు నిలబడడానికి వీలుగా 3.86 ఎకరాల స్లోప్‌ ఏరియాను తీసుకోవడం జరిగింది. మరో 3.30 ఎకరాలను తవ్విన మట్టిని డంపింగ్‌ కోసం వినియోగించాం. ఈ క్రమంలో జాయింట్‌ కమిటీ తమ నివేదికలో ప్రాజెక్టు ఏరియా 9.88 ఎకరాలు, స్లోప్‌ ఏరియా 3.86 ఎకరాలుగా నిర్ధరించింది. డంపింగ్‌ కోసం 3.30 ఎకరాలను వినియోగించినట్టుగా ఏపీటీడీసీ పేర్కొనగా, కమిటీ మాత్రం 4.225 ఎకరాలు వినియోగించినట్టు తన నివేదికలో పేర్కొంది’’అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణ దృష్ఠ్యా ఇది ఏ మాత్రం అభ్యంతరకరం కాదని ఆ ప్రకటనలో కన్నబాబు వివరించారు.

ప్రభుత్వ, ప్రతిపక్షాల వాదనలతో పాటుగా మీడియా కథనాలు ఎలా ఉన్నప్పటికీ, కమిటీ నివేదిక చేతికి అందడంతో రుషికొండ వివాదానికి త్వరలోనే హైకోర్టులో ముగింపు పలికే అవకాశం ఉంది. తుది తీర్పు ఎలా ఉంటుందన్నది కీలకాంశంగా ఉంది.

ఇవి కూడా చదవండి: