పాకిస్తాన్ నాసిరకం ఆయుధాలు అమ్మిందా, యుక్రెయిన్ ఏం చెప్పింది?

యుక్రెయిన్ సైనికులు

పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆయుధాలు నాసిరకంగా ఉన్నాయని యుక్రెయిన్ మిలిటరీ కమాండర్ చెప్పారు.

యుక్రెయిన్ కమాండర్ వ్యాఖ్యలతో రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్‌కి పాకిస్తాన్ ఆయుధాలు సరఫరా చేసిందని గతంలో వచ్చిన వాదనలు మరోమారు తెరపైకి వచ్చాయి. గతంలో రష్యా కూడా పాకిస్తాన్‌పై అలాంటి ఆరోపణలు చేసింది.

అయితే, యుక్రెయిన్‌కి ఆయుధాలు సరఫరా చేశారన్న వాదనలను పాకిస్తాన్ విదేశాంగ శాఖ తిరస్కరించింది.

యుక్రెయిన్‌కి ఆయుధాలు సరఫరా చేయలేదని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలూచ్ బీబీసీకి చెప్పారు.

''యుక్రెయిన్ - రష్యా యుద్ధంలో పాకిస్తాన్ తటస్థంగా ఉంది. యుక్రెయిన్‌కి పాక్ ఎలాంటి ఆయుధాలు పంపలేదు'' అని ముంతాజ్ చెప్పారు.

గతంలో యుక్రెయిన్‌తో పాకిస్తాన్‌కి మెరుగైన సంబంధాలున్నాయని, ఆ విషయం గుర్తుంచుకోవాలని ఆమె అన్నారు.

యుద్ధవాహనాలు

పాకిస్తాన్ ఏం చెబుతోంది?

యుక్రెయిన్ ఆర్మీ 17వ ‘‘ట్యాంక్ బ్రిగేడ్’’ కమాండర్ వొలొదిమిర్ బీబీసీ రక్షణ వ్యవహారాల ప్రతినిధి జొనాథన్ బెల్‌తో మాట్లాడారు. తమ వద్ద ఆయుధాలు అయిపోయాయని, ప్రస్తుతం ఇతర దేశాల నుంచి వస్తున్న ఆయుధాలపై ఆధారపడ్డామని చెప్పారు.

యుక్రెయిన ఆర్మీ చెక్ రిపబ్లిక్, రొమేనియా, పాకిస్తాన్ నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

మరోవైపు యుక్రెయిన్ ఆర్మీ వాదనలను పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలూచ్ కొట్టిపడేశారు. ఆమె బీబీసీతో మాట్లాడారు.

యుక్రెయిన్ - రష్యా యుద్ధంలో పాకిస్తాన్ తటస్థ వైఖరి అవలంబిస్తోందని, యుక్రెయిన్‌కి ఎలాంటి ఆయుధాలు పంపలేదని ముంతాజ్ చెప్పారు.

యుక్రెయిన్‌తో పాకిస్తాన్‌కు గతంలో మెరుగైన రక్షణ సంబంధాలు ఉన్నాయని, అంతమాత్రాన ఆయుధాలు సరఫరా చేసినట్టు కాదని ఆమె అన్నారు.

పాకిస్తాన్ సైనికులు

ఫొటో సోర్స్, AFP

బీబీసీ ప్రతినిధి జొనాథన్ బెల్ ప్రస్తుతం యుక్రెయిన్‌లో ఉన్నారు. ఆ దేశ ఆర్మీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రాంతం నుంచి ఆయన రిపోర్ట్ చేస్తున్నారు. యుక్రెయిన్ ఆర్మీకి చెందిన 17వ ట్యాంక్ బ్రిగేట్ కమాండర్‌తో జొనాథన్ మాట్లాడారు.

పాకిస్తాన్ సహా ఇతర దేశాల నుంచి సరఫరా అవుతున్న వార్ రాకెట్స్ గురించి యుక్రెయిన్ ఆర్మీ కమాండర్ మాట్లాడారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన రాకెట్స్ అంత నాణ్యమైనవి కావని ఆయన అన్నారు.

యుక్రెయిన్ ఇలాంటి వాదనలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఈ సంవత్సరం జనవరిలోనూ యుక్రెయిన్‌కి చెందిన కొన్ని మీడియా సంస్థలు అలాంటి కథనాలను ప్రచురించాయి.

అయితే, ఆయుధాల సరఫరాపై యుక్రెయిన్, పాకిస్తాన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

పాకిస్తాన్ నుంచి ఆయుధాలు అందాయనే వార్తలపై వ్యాఖ్యానించలేమని యుక్రెయిన్ విదేశాంగశాఖ జనవరిలో బీబీసీకి తెలిపింది.

యుక్రెయిన్ సైనికుడు

పాకిస్తాన్ రక్షణ నిపుణులు ఏమంటున్నారు?

రక్షణ శాఖ వ్యవహారాలకు సంబంధించి యుక్రెయిన్‌తో పాకిస్తాన్‌కి గతంలో మంచి సంబంధాలు ఉన్నాయని, అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని పాకిస్తాన్ రక్షణ వ్యవహారాల నిపుణుడు, రక్షణ శాఖ మాజీ సెక్రటరీ జనరల్ నయీం ఖలీద్ లోధి బీబీసీకి చెప్పారు.

అయితే ఈ యుద్ధంలో యుక్రెయిన్‌కి ఆయుధాలు పంపించే అవకాశాలు లేవని ఆయన అన్నారు. పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి వ్యాఖ్యలను నయీం సమర్థించారు.

యుక్రెయిన్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాహనాలు, ట్యాంకులు, వాటి విడిభాగాల సరఫరా గతంలో జరిగిందని, అయితే అది అంత వరకే పరమితమని ఆయన చెప్పారు.

యూరప్, ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాలకు పాకిస్తాన్ చాలాకాలంగా ఆయుధాలను ఎగుమతి చేస్తోందని, యుక్రెయిన్‌కి మాత్రం ఆయుధాలు సరఫరా చేయలేదన్నారు.

అయితే, ఆ అవసరం రాలేదని మాత్రం నయీం చెప్పలేదు.

యుక్రెయిన్ ఆర్మీ కమాండర్ వాదనపై నయీం స్పందించారు. ''యుక్రెయిన్‌కి ఆయుధాలు, ఆయుధ సామగ్రిని పాకిస్తాన్ ఎగుమతి చేయలేదని బలంగా చెప్పగలను'' అని ఆయన అన్నారు.

అయితే, '' ఆయుధాలు పాకిస్తాన్ ఎగుమతి చేసిన దేశాల నుంచి యుక్రెయిన్‌కి చేరి ఉండొచ్చు'' అని నయీం వ్యాఖ్యానించారు.

ఈ యుద్ధంలో యుక్రెయిన్‌కి యూరప్‌లోని చాలా దేశాలు ఆయుధాలు సరఫరా చేశాయన్నది అందరికీ తెలిసిన విషయమే.

యుక్రెయిన్ యుద్ధం ప్రారంభం నుంచి పాకిస్తాన్ తటస్థ వైఖరితోనే ఉంది. '' లోపాయికారిగా అలాంటి పనులు చేయకూడదని మాకు తెలుసు'' అని నయీం అన్నారు.

యుక్రెయిన్ కమాండ్ చేసిన నాసిరకం ఆయుధాల వాదనపై నయీం మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన ఆయుధాలను ఉత్పత్తి చేస్తోందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వాటిని పరీక్షించడంతో పాటు తమ ఆర్మీకి కూడా అవే ఆయుధాలను సరఫరా చేస్తోందని నయీం చెప్పారు.

యుక్రెయిన్ కమాండర్ వాదనలో నిజం లేదన్నారు నయీం. ఏ దేశం నుంచి అయినా గడువు ముగిసిన ఆయుధాలు యుక్రెయిన్‌కి చేరి ఉండొచ్చని ఆయన అన్నారు.

మల్టీ - బ్యారెల్ రాకెట్ జీవిత కాలం 8 నుంచి 10 ఏళ్లని, అయితే వాటిని ప్రయోగించే రాకెట్ కింది భాగంలోని ప్రొపెల్లెంట్ జీవిత కాలం కేవలం రెండేళ్లేనని ఆయన చెప్పారు.

''నేను స్వయంగా ఆ రాకెట్లను ప్రయోగించాను. అవి పూర్తి సామర్థ్యంతో వాటి లక్ష్యాన్ని ఛేదించాయి'' అని నయీం చెప్పారు.

సైనిక వాహనం

ఫొటో సోర్స్, Getty Images

రెండు దేశాల రక్షణ సంబంధాలు గతంలో ఎలా ఉండేవి?

పాకిస్తాన్, యుక్రెయిన్ మధ్య దాదాపు మూడు దశాబ్దాలు రక్షణ సంబంధాలున్నాయి.

రక్షణ ఒప్పందంలో భాగంగా 1997 - 1999 మధ్య యుక్రెయిన్ 320 టి-80 యుద్ధ ట్యాంకులను పాకిస్తాన్‌కు విక్రయించింది. ఈ ఒప్పందం కారణంగా భారత్, యుక్రెయిన్ మధ్య సంబంధాలు కొన్నేళ్లు దెబ్బతిన్నాయి.

అయినప్పటికీ, యుక్రెయిన్ రెండు దేశాలతోనూ మంచి సంబంధాలను కొనసాగిస్తూ వచ్చింది. ఇండియా, పాకిస్తాన్ వివాదంలో తటస్థంగా ఉంటూ వచ్చింది.

యుక్రెయిన్‌తో రక్షణ సంబంధాలు పాకిస్తాన్‌కు ఎప్పుడూ ప్రధానమే.

90లలో పాకిస్తాన్‌కు విక్రయించిన 320 యుద్ధ ట్యాంకుల రిపేర్లకు సంబంధించి 2010లో ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది.

ఆ తర్వాత సుమారు రూ.4,900 కోట్ల విలువైన ఒప్పందాలపై 2016 నవంబర్‌లో పాకిస్తాన్, యుక్రెయిన్ సంతకం చేశాయి.

పాకిస్తాన్‌లో ఏర్పాటు చేసిన యుక్రెయిన్‌ మలిషెవ్ ప్లాంట్‌‌లో యుద్ధ ట్యాంకులకు రిపేర్లు చేసే పనులు ప్రారంభమయ్యయని 2017లో యుక్రెయిన్ మిలిటరీ ఒక ప్రకటనలో తెలిపింది. 320 ట్యాంకులకు రిపేర్లు చేయనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)