దళిత ఐఏఎస్ కృష్ణయ్య హత్య: 'కారుపై వేల మంది రాళ్ల దాడి చేశారు, బయటకు లాగి చిత్రవధ చేశారు’ - భార్య ఉమ

కృష్ణయ్య, ఉమ
ఫొటో క్యాప్షన్, కాలేజీలో కృష్ణయ్య, ఉమ కలుసుకున్నారు
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ

బిహార్‌లో దళిత ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్య హత్య జరిగి 30 ఏళ్లు అవుతోంది. కృష్ణయ్య హత్యకు కొన్ని గంటల ముందు చివరిసారిగా ఆయనతో మాట్లాడిన మాటలు ఇప్పటికీ ఆయన భార్య ఉమా కృష్ణయ్యకు బాగా గుర్తున్నాయి.

కృష్ణయ్య హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఆనంద్ మోహన్ సింగ్ ఈ వారంలో జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో ఈ తెలుగు సివిల్ సర్వెంట్ హత్య ఉదంతం మరోసారి తెరపైకి వచ్చింది.

హత్యకు గురైన సమయంలో కృష్ణయ్య బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆ రోజు 1994 డిసెంబర్ 4. హాజిపూర్‌లో ముఖ్యమైన మీటింగ్‌కు హాజరు కావడం కోసం దంపతులు ఇద్దరూ ఉదయం 5 గంటలకే నిద్ర లేచారు. గోపాల్‌గంజ్ నుంచి హాజిపూర్‌ 131 కి.మీ దూరంలో ఉంటుంది.

‘‘ఆ రోజు ఉదయం చలి విపరీతంగా ఉంది. అయినప్పటికీ, ఆయన చలిలో వాకింగ్ చేస్తున్నారు. జలుబు చేస్తుందేమోననే ఆందోళనతో ఆయన్ను ఇంట్లోకి రావాలని పిలిచాను. నా గురించి భయపడకు. చాలా మంది పేద ప్రజలు కనీసం స్వెట్టర్లు కూడా లేకుండా ఈ చలిలో అలాగే పడుకుంటున్నారు. నేను స్వెట్టర్ వేసుకున్నా, వెచ్చదనం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా. నాకేం కాదు’’ అని ఆయన బదులు ఇచ్చినట్లు ఉమ గుర్తు చేసుకున్నారు.

ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత, ఆసుపత్రిలో రక్తసిక్తమై ఉన్న కృష్ణయ్య మృతదేహం ముందు ఆమె నిల్చున్నారు.

ఉమా కృష్ణయ్య
ఫొటో క్యాప్షన్, ఉమ భర్త కృష్ణయ్య 1994 డిసెంబరులో బిహార్‌లో హత్యకు గురయ్యారు.

‘‘ఆయన ముఖంపై, శరీరంపై చాలా గాయాలు అయ్యాయి’’ అని వణుకుతున్న గొంతుతో ఆమె చెప్పారు.

జర్నలిస్టు వర్గాల్లో, సహోద్యోగుల్లో కృష్ణయ్య ఒక నిజాయతీపరుడైన అధికారి, మంచి అడ్మినిస్ట్రేటర్ అనే పేరు ఉంది.

హాజిపూర్‌ మీటింగ్ ముగించుకొని తిరిగి వస్తుండగా ఒక మూక ఆయన కారును ఆపింది. అంతకుముందు రోజే గ్యాంగ్‌స్టర్ చోటన్ శుక్లా మరణించారు. శుక్లా మరణాన్ని నిరసిస్తూ వారు ఆయన కారును అడ్డగించారు.

నిరసనకారుల గుంపులో వేల మంది శుక్లా మద్దతుదారులు ఉన్నారు. వారంతా కృష్ణయ్య కారుపై రాళ్లతో దాడి చేసి, ఆయన్ను కారు నుంచి బయటకు లాగి కొట్టడం మొదలుపెట్టారు.

‘‘గోపాల్‌గంజ్ జిల్లా కలెక్టర్‌గా కృష్ణయ్య పనిచేశారు. శుక్లా హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని కృష్ణయ్య చెబుతూనే ఉన్నారు. ఆ హత్య గోపాల్‌గంజ్ పక్క జిల్లాలో జరిగింది. అక్కడ జరిగిన దానితో తనకు సంబంధం లేదని ఆ గుంపుకు చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ, ఆ గుంపు ఆయనను చిత్రవధ చేసింది. ఒక వ్యక్తి, కృష్ణయ్య తలపై కాల్చాడు. ఆ తర్వాత నేరం జరిగిన ప్రదేశంలో రక్తసిక్తమైన కృష్ణయ్య మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు’’ అని పాట్నాలోని సీనియర్ జర్నలిస్ట్ అమర్‌నాథ్ తివారీ చెప్పారు.

కృష్ణయ్య హత్యతో ఉమ జీవితం తలకిందులైంది. కృష్ణయ్యపై మూక దాడి చేసిన తీరు, క్రూరత్వం చూసి దేశమంతా నివ్వెరపోయింది. జాతీయ మీడియా పతాక శీర్షికల్లో ఈ ఘటన నిలిచింది.

ఆనంద్ మోహన్ సింగ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కృష్ణయ్య హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్, గురువారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు

కృష్ణయ్యపై దాడి చేసి కాల్చేయాలని మూకను ప్రేరేపించినట్లు ఆనంద్ మోహన్ సింగ్‌పై అభియోగాలు నమోదయ్యాయి. అప్పుడు ఆయన బిహార్ అసెంబ్లీలో శాసనసభ్యుడుగా ఉన్నారు.

2007లో స్థానిక కోర్టు ఆనంద్ మోహన్ సింగ్‌ను దోషిగా నిర్ధరించి మరణశిక్ష విధించింది. సంవత్సరం తర్వాత, పాట్నా కోర్టు మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. పాట్నా కోర్టు నిర్ణయాన్ని 2012లో సుప్రీంకోర్టు సమర్థించింది.

బిహార్ జైలు మాన్యువల్ ప్రకారం విధుల్లో ఉన్న అధికారిని హత్య చేసిన కేసులో దోషులను ముందస్తు విడుదల చేయకూడదు. ఈ నిబంధన వల్లే ఆనంద్ మోహన్ సింగ్ ఇంతకాలం విడుదల కాలేకపోయారు.

కానీ, ఈ నెల మొదట్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం, జైలు మాన్యువల్‌ను మార్చింది. ముందస్తు విడుదలను అడ్డుకునే నిబంధనను తొలగించింది. ఆనంద్ మోహన్ సింగ్‌తో పాటు మరో 27 మంది ఖైదీలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

బిహార్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష రాజకీయ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విమర్శించారు.

ఆనంద్ మోహన్ విడుదలను 2022 ఆగస్టులో గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చాలా మంది పోల్చి చూస్తున్నారు.

2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ఒక ముస్లిం మహిళపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడటంతోపాటు ఆమె కుటుంబ సభ్యులను క్రూరంగా చంపిన కేసులో దోషులను విడుదల చేయాలని నిరుడు ఆగస్టులో గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ కేసులో దోషులు 14 ఏళ్లకు పైగా జైలులో గడిపారని, వారి వయస్సుతోపాటు ఇతర కారణాలను చూపిస్తూ దోషుల విడుదలకు ప్రభుత్వ ప్యానెల్ ఒకటి ఆమోదం తెలిపిందని గుజరాత్ అధికారులు తెలిపారు.

జేడీయూ అధ్యక్షుడు లలన్ సింగ్‌తో ఆనంద్ మోహన్

ఫొటో సోర్స్, FB/VHETAN ANAND

ఫొటో క్యాప్షన్, జేడీయూ అధ్యక్షుడు లలన్ సింగ్‌తో ఆనంద్ మోహన్

ఆనంద్ మోహన్ విడుదలను పునఃసమీక్షించాలి: సివిల్ సర్వెంట్ల సంఘం

ఆనంద్ మోహన్ సింగ్ విడుదల నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని బిహార్ ప్రభుత్వాన్ని సివిల్ సర్వెంట్ల సంఘం కోరింది.

‘‘ఇలాంటి నిర్ణయాలు, ప్రభుత్వ అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. ప్రభుత్వ ఆదేశాలను పలుచన చేస్తాయి. న్యాయ నిర్వహణను అపహాస్యం చేస్తాయి’’ అని ట్విట్టర్‌లో సివిల్ సర్వెంట్ల సంఘం ఆందోళన వ్యక్తంచేసింది.

బిహార్ ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఇది చట్టవిరుద్ధమేమీ కాదని చెప్పింది.

‘‘ఆనంద్ మోహన్ శిక్షను అనుభవించారు. చట్టబద్ధంగా విడుదలవుతున్నారు’’ అని విలేఖరులతో ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ అన్నారు.

ఈ నిర్ణయం, రాజకీయాలతో ముడిపడి ఉందని జర్నలిస్ట్ అమర్‌నాథ్ తివారీ అభిప్రాయపడ్డారు.

‘‘బిహార్‌లో అగ్రవర్ణమైన రాజ్‌పుత్ కమ్యూనిటీపై ఆనంద్ మోహన్ ప్రభావం ఉంటుంది. రాష్ట్ర జనాభాలో రాజ్‌పుత్‌లు 4 శాతం ఉంటారు. నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్ వచ్చే ఎన్నికల్లో ఆనంద్ మోహన్ మద్దతును కోరుకుంటున్నారు’’ అని బీబీసీతో తివారీ చెప్పారు.

రాజకీయాలను పక్కన పెడితే, బిహార్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కృష్ణయ్య కుటుంబానికి అయిన పాత గాయాలను మళ్లీ రేపింది.

పేద దళిత కుటుంబానికి చెందిన కృష్ణయ్యను 1981లో హైదరాబాద్‌లోని ఒక కాలేజీలో తొలిసారి కలిసినట్లు ఆయన భార్య ఉమ చెప్పారు. తాము ఐదేళ్లు ప్రేమించుకొన్నామని,ఆ తర్వాత పెళ్లి చేసుకున్నామని చెప్పారు. కృష్ణయ్య మరణించే సమయానికి వారికి నాలుగు, ఐదున్నరేళ్ల వయస్సున్న ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.

వీడియో క్యాప్షన్, వీడియో: నితీశ్‌కుమార్‌కు ఇవి చివరి ఎన్నికలా? ఆయన ప్రస్థానం ఎలా సాగింది?

కృష్ణయ్య చనిపోయిన మరుసటి రోజు పిల్లలతో కలసి ఆమె హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు. ఆ తర్వాత కుటుంబ పోషణ కోసం ఉపాధ్యాయురాలిగా చేరారు.

ఆనంద్ మోహన్ సింగ్‌ను దోషిగా తేల్చి శిక్ష వేయడంతో ఆమె కాస్త ఊరట చెందారు. కానీ, ఇప్పుడు ఆయన జైలు నుంచి బయటకు రావడంతో ఆమె నిరాశ వ్యక్తం చేశారు.

‘‘నా భర్త ఒక ప్రభుత్వ అధికారి. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే హత్యకు గురయ్యారు. ఆయన్ను చంపిన వారిని ఎలా విడుదల చేస్తారు? ప్రభుత్వం పునరాలోచన చేయాలి.

ఇది సమాజంలో తప్పుడు సంకేతాలను పంపుతుంది. నేరస్థులను ప్రోత్సహిస్తుంది. దారుణ హత్య చేసినా మళ్లీ బయటకు రావొచ్చనే భావన నేరస్థుల్లో కలుగుతుంది’’ అని ఆమె అన్నారు.

తన భర్త హంతకులను తిరిగి జైలుకు పంపడంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసినట్లు ఉమ చెప్పారు.

ఏప్రిల్ 27న ఆనంద్ మోహన్ సింగ్ జైలు నుంచి విడుదల అయ్యారు. కృష్ణయ్య కూతురు పద్మ, వార్తాసంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ ఆనంద్ మోహన్ విడుదలతో తమ కుటుంబం అంతా నిరుత్సాహానికి గురైందన్నారు.

‘‘దీనిపై మరోసారి ఆలోచించాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను కోరుతున్నా. ఇది కేవలం ఒక కుటుంబానికే కాదు, దేశం మొత్తానికి అన్యాయం చేసినట్లే’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

కోర్టులో ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తామని పద్మ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)