హంతకులు పుడతారా, తయారవుతారా? ఒక మనిషి మరో మనిషిని ఎందుకు చంపుతారు?

నేరస్థుడి ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

హత్యలు చాలా విషాదకర ఘటనలు. కానీ మన చుట్టూ నిత్యం ఎన్నో హత్యలు జరుగుతుంటాయి. ఒక మనిషి మరో మనిషిని ఎందుకు హత్య చేస్తారు? హత్యకు ప్రేరేపించేదేంటి? ఆవేశమా? లేక అదో జన్యుపరమైన సమస్యా? హంతకులు పుడతారా? హంతకులుగా మారతారా?

ఇలాంటి ప్రశ్నలు చాలా మంది మదిలో మెదులుతుండొచ్చు. వీటికి సమాధానం కనుగొనేందుకు చాలా పరిశోధనలు జరిగాయి.

హంతకుల మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు మైఖేల్ మోస్లే వారిపై పరిశోధన చేస్తున్నారు.

సైంటిఫిక్ క్రిమినాలజీకి ఫాదర్‌గా చెప్పే సీజర్ లాంబ్రొసొ 1870లలో నేరస్థుల మనస్తత్వంపై అధ్యయనం చేశారు. ఇటలీలోని ట్యురిన్ జైల్లో ఉన్న ఖైదీలను అధ్యయనం చేశారు.

మానవ పరిణామక్రమంలో వచ్చిన మార్పులను అర్థం చేసుకోవడంలో నేరస్థులు వెనకబడ్డారని ఆయన గుర్తించారు. ఆదిమ మానవుడి తరహాలో ఉండే వారి ప్రవర్తన మనిషి పరిణామక్రమానికి తిరోగమనమని ఆయన అభిప్రాయపడ్డారు.

పుర్రెలు

ఫొటో సోర్స్, Alamy

మనిషి ముఖం ఆకారం, కోతిన పోలిన పొడవాటి చేతులను బట్టి నేరస్థులను గుర్తించొచ్చని కొన్నేళ్ల అధ్యయనం తర్వాత సీజర్ లాంబ్రొసొ నిశ్చితాభిప్రాయానికి వచ్చారు.

''నేరస్థుడి చెవులు పెద్దవిగా ఉంటాయి. ముక్కు సూటిగా పైకి లేచి ఉన్నట్లు ఉంటుంది. దొంగల ముక్కు ఫ్లాట్‌గా ఉంటుంది. హంతకుల ముక్కు వేటాడే పక్షి అక్విలిన్ ముక్కులా ఉంటుంది'' అని ఆయన తన అధ్యయనంలో రాశారు.

కానీ నేరస్వభావం ఉన్న వారిని గుర్తించడం డాక్టర్ లాంబ్రొసొ చెప్పినంత సులభం కాదు. ఆయన జరిపిన శాస్త్రీయ పరిశోధనలు కూడా అపఖ్యాతిపాలయ్యాయి.

అయితేేే నేరస్థులు, మరీముఖ్యంగా హంతకుల ఆలోచనలు మిగిలిన వారితో పోలిస్తే ఎందుకు తేడాగా ఉంటాయనేది తెలుసుకునేందుకు శతాబ్దానికి పైగా జరిగిన పరిశోధనలకు లాంబ్రొసొ పరిశోధనలు నాంది పలికాయి.

1980లలో అందుబాటులోకి వచ్చిన ఫంక్షనల్ బ్రెయిన్ స్కానింగ్ అసలు మెదడులో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

హంతకుల మెదళ్లలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు స్కానింగ్ చేశారు.

హంతకుడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హంతకుల ఆలోచనలు మిగిలిన వారితో పోలిస్తే ఎందుకు తేడాగా ఉంటాయనేది పరిశోధకులు పరిశీలించారు.

బ్రిటిష్ న్యూరోసైంటిస్ట్, ప్రొఫెసర్ అడ్రియన్ రైన్ తొలిసారి కాలిఫోర్నియాలో ఈ అధ్యయనం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హింసాత్మక వ్యక్తులు, హంతకులపై జరిపిన ఈ అధ్యయనంలో మెదడులోని గోల్డెన్ స్టేట్ ఆయన్ను ఆకర్షించింది.

హంతకుల మెదడు ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు తీసిన స్కానింగ్‌లపై ప్రొఫెసర్ రైన్, ఆయన బృందం కొన్నేళ్ల పాటు అధ్యయనం చేసింది. హంతకుల మెదళ్లలో వచ్చే మార్పులు దాదాపుగా ఒకేలా ఉన్నాయని వారి అధ్యయనంలో తేలింది.

భావోద్వేగాలను నియంత్రించే మెదడులోని ముందు భాగం ప్రీఫ్రంటల్ కార్టెక్స్ పనితీరు తగ్గడం, అలాగే భావోద్వేగాలను పుట్టించే మెదడులోని మరో భాగం అమిగ్దలా మరింత ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు.

అందువల్ల హంతకులు ఎక్కువగా ఆవేశానికి, ఆగ్రహానికి గురవుతారని, అదే సమయంలో తమపై తాము నియంత్రణ కోల్పోతారని అధ్యయనంలో గుర్తించారు.

ప్రొఫెసర్ జిమ్ ఫాలన్
ఫొటో క్యాప్షన్, హింసకు ప్రేరేపించే భయంకరమైన జన్యువులు చాలా ఉన్నాయని ప్రొఫెసర్ జిమ్ ఫాలన్‌ గుర్తించారు. ఆయనలోనూ హింసకు సంబంధించిన జన్యువులు ఉన్నాయి. కానీ ఆయన హింసాత్మకంగా వ్యవహరించరు.

ఎందుకలా జరుగుతుంది?

చిన్నతనంలో హింసకు గురవడం వల్ల వారి మెదడుకు భౌతికంగా నష్టం జరుగుతుందని, ప్రత్యేకంగా మెదడులోని ముందుభాగం దారుణంగా దెబ్బతింటుందని రైన్ అధ్యయనంలో గుర్తించారు. అందువల్ల వారు హంతకులుగా మారే అవకాశం ఉందని ఈ అధ్యయనం చెబుతోంది.

జైల్లో ఉన్న ఖైదీల్లో డొంటా పేజ్ ఒకరు. 24 ఏళ్ల యువతిని పేజ్ దారుణంగా హత్య చేశాడు. తలుపులు పగలగొట్టి ఇంట్లోకి చొరబడిన డొంటా పేజ్‌ను ఆ యువతి పట్టుకుంది. దీంతో ఆమెను దారుణంగా హతమార్చి జైలుకి వెళ్లాడు.

అయితే, పేజ్ చిన్నతనంలో చాలా హింసకు గురయ్యాడు. తల్లి అతన్ని తీవ్రంగా హింసించేవారు. వయసు పెరిగే కొద్దీ ఆమె పెట్టే హింస కూడా పెరిగింది. ఎలక్ట్రిక్ వైర్లు, షూస్, చేతిలో ఏది ఉంటే వాటితో అతన్ని కొట్టేవారు. ఇదేమీ అప్పుడప్పుడూ జరిగే వ్యవహారం కాదు. దాదాపు రోజూ ఆయన్ను కొడుతూనే ఉండేవారు.

''పసితనంలో జరిగే భౌతిక హింస మెదడుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. మెదడు దెబ్బతినేందుకు దారితీస్తుంది. అది అతన్ని క్రూరమైన చర్యలకు ప్రేరేపిస్తుంది'' అని రైన్ చెప్పారు.

క్రిమినాలజీ

ఫొటో సోర్స్, Other

జన్యు లోపం వల్ల నేర ప్రవర్తన

1993లో నెదర్లాండ్స్‌‌కు చెందిన ఓ కుటుంబంపై జరిపిన అధ్యయనంతో పరిశోధనలో పురోగతి సాధించారు. ఆ కుటుంబంలోని మగాళ్లందరికీ నేరచరిత్ర ఉండడానికి ఒక జన్యువు లోపమే కారణంగా గుర్తించారు. పదిహేనేళ్ల పాటు జరిపిన పరిశోధనలో ఈ విషయాన్ని గుర్తించారు.

ఆ జన్యువు ఎంఏఓఏ అనే ఎంజైమ్‌ను ఉత్పత్తి చేస్తుంది. అది ఆవేశాన్ని నియంత్రించడంలో ముఖ్యపాత్ర పోషించే న్యూరోట్రాన్స్‌మిటర్స్‌ స్థాయులను నియంత్రిస్తుంది. ఈ ఎంఏఓఏ ఎంజైమ్ ఉత్పత్తి తగ్గడం, లేదా ప్రభావవంతగా పనిచేయకపోవడం వల్ల హింసాత్మక ప్రవర్తనకు దారితీస్తుందని గుర్తించారు. ఆ జన్యువు వారియర్ జీన్‌గా మారుతుందని తేలింది.

దాదాపు 30 శాతం మంది మగవారిలో ఈ వారియర్ జీన్ ఉంటుంది. అయితే, చిన్నతనంలో ఏం జరిగిందనే దానిపై ఆ జన్యువు ప్రభావం ఆధారపడి ఉంటుంది.

హంతకులు, వారి కుటుంబాలపై జన్యుపరమైన పరిశోధనలు చేసిన కాలిఫోర్నియా యూనివర్సిటీలో సైకియాట్రీ ప్రొఫెసర్ జిమ్ ఫాలన్ ఆశ్చర్యకరమైన విషయాలను గుర్తించారు. మనుషుల్లో హింసాత్మక ప్రవర్తనకు జన్యుసంబంధం ఉందని తేల్చారు. హింసకు ప్రేరేపించే భయంకరమైన జన్యువులు చాలా ఉన్నాయని ఫాలన్ గుర్తించారు.

మెదడు లోపలి భాగం

ఫొటో సోర్స్, Science Photo Library

''ప్రమాదకరమైన జన్యువులు ఉన్న వ్యక్తులు హంతకులుగా మారతారు. వారిలో నాకున్న వాటి కంటే తక్కువ ఉన్నాయి. దాదాపుగా అవన్నీ నాలో ఉన్నాయి. కానీ జిమ్ హంతకుడు కాదు. ఆయనో గౌరవప్రదమైన ప్రొఫెసర్'' అని ఆయన అన్నారు.

తనకు హింసాత్మక ప్రవర్తన కలిగిన వారసత్వం ఉన్నప్పటికీ సంతోషకరమైన బాల్యం కారణంగానే అలాంటి లక్షణాలు లేవనేది ఆయన భావన. ప్రమాదకరమైన జన్యువులు ఎక్కువగా ఉండి, చిన్నతనంలో హింసకు గురైతే వారిలో నేర ప్రవర్తనకు ఎక్కువ అవకాశం ఉందని ఆయన చెప్పారు.

''ఒకవేళ మీలో ప్రమాదకరమైన జన్యువులు ఉన్నప్పటికీ, చిన్నతనంలో హింసకు గురికాకుండా ఉంటే మీలో అంత హింసాత్మక ప్రవర్తన ఉండకపోవచ్చు. ఒక జన్యువు తనకు తానుగా మనిషి ప్రవర్తనపై ఎక్కువ ప్రభావం చూపలేదు. అయితే కొన్ని నిర్దిష్టమైన పరిస్థితుల వల్ల వచ్చే ప్రవర్తనలో చాలా తేడా ఉంటుంది'' అని జిమ్ తెలిపారు.

జన్యుపరమైన కారణాలు, బాల్యంలో హింసకు గురవడం అనేవి 'కిల్లర్ కాంబినేషన్'. అందువల్ల హంతకులు పుడతారు, హంతకులుగా తయారవుతారు కూడా. ఈ రెండూ జరిగే అవకాశాలున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

హింసాత్మక ప్రవర్తనకు దారితీసే సామాజిక, జన్యు కారణాలను అర్థం చేసుకునేందుకు అధునాతన అవగాహన ఉన్నప్పటికీ, ఆ విషయ పరిజ్ఞానం మనకు ఎలా ఉపయోగపడుతుందనేదే ప్రశ్న.

హింసాత్మక ప్రవర్తనను తగ్గించడమెలా అనే విషయాలపై పరిశోధకులు ఎక్కువగా దృష్టి పెట్టారు. ఆవేశాన్ని నియంత్రించడంలో పాజిటివ్ పేరెంటింగ్ నైపుణ్యాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది.

హింసాత్మక ప్రవర్తన గురించి అవగాహన ఉండడంతో అలాంటి ప్రవర్తనకు సంబంధించిన హెచ్చరికలు కనిపిస్తే ఆలస్యం కాకుండా ముందుగానే గుర్తించే అవకాశం ఉంది.

లాంబ్రొసొ ఏం తేల్చారు?

19వ శతాబ్దానికి చెందిన ఇటాలియన్ ఫిజీషియన్ సీజర్ లాంబ్రొసొ నేరస్థుల పుర్రెలపై అధ్యనం చేశారు. రూపాన్ని బట్టి నేరస్థులను గుర్తించొచ్చని తేల్చారు.

"నేర ప్రవర్తన పెంపొందడంలో చుట్టూ ఉన్న పరిస్థితుల కంటే జన్యుపరమైన కారణాలే ప్రధానం. నేరస్థుల మెదడు సాధారణ వ్యక్తుల మెదడుకి చాలా తేడా ఉంటుంది. నేరస్థుల భౌతిక, మానసిక ప్రవర్తనలో ఆదిమ జాతి ఆనవాళ్లు గుర్తించారు. నేరస్థుల్లో పెద్ద పెద్ద పళ్లు, విశాలంగా ఉండే నుదురు, వెడల్పాటి చెవులు, దవడ ఎగుడుదిగుడుగా ఉండడం లాంటివి కనిపిస్తాయి" అని గుర్తించారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)