ఆంధ్రప్రదేశ్: 'అమ్మా నాన్నలను చంపేస్తానని బెదిరించి కిడ్నీ తీసుకున్నాడు' - బీబీసీతో విశాఖ బాధితుడు
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
తల్లిదండ్రులను చంపేస్తామని బెదిరించి పెందుర్తిలోని ఒక ఆసుపత్రిలో తన కిడ్నీని నాలుగు నెలల క్రితం తీయించేశారని పోతినమల్లయ్య పాలెం పీఎస్‌లో వినయ్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
వినయ్ కుమార్ ప్రస్తుతం విశాఖపట్నం, మధురవాడలోని వాంబే కాలనీలో నివాసం ఉంటున్నారు.
బాధితుడి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు పెందుర్తిలోని తిరుమల ఆసుపత్రిలో విచారణ జరిపారు.
అనంతరం ఇవాళ ఉదయం ఆసుపత్రికి చెందిన వైద్యుడు జి. పరమేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు.
అలాగే బాధితుడు వినయ్ కుమార్ ఇంటికి వైద్య బృందం వెళ్లి ఆయనకు పరీక్షలు నిర్వహించారు.
అతడి ఆరోగ్య పరిస్థితిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తున్నట్లు డీఎంహెచ్ఓ జగదీష్ తెలిపారు.

‘మద్యం మత్తులో ఒప్పుకున్నా’
అసలు ఈ సంఘటనలో ఏం జరిగిందనే విషయంపై బాధితుడు వినయ్ కుమార్‌తో బీబీసీ మాట్లాడింది. వైన్ షాపులో పరిచయమైన కామరాజు అనే వ్యక్తి, కిడ్నీ అమ్మితే డబ్బులు వస్తాయని చెప్పాడని, కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో తాను తన కిడ్నీ ఇచ్చేందుకు ఒప్పుకున్నానని వినయ్ కుమార్ బీబీసీతో చెప్పారు.
“మా అమ్మ, నాన్న ఇద్దరూ కూలీ పనులకు వెళ్తారు. నేను కారు డ్రైవర్ గా పని చేస్తున్నా. మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఏదైనా వ్యాపారం చేద్దామని, దానికి డబ్బుల కోసం ఆలోచిస్తున్నాం. ఆ సమయంలో మద్యం మత్తులోనే కామరాజుకి ఈ విషయాలన్ని చెప్పాను. ఇద్దరం డిసెంబర్ మొదటివారంలో మద్యం తాగుతూ మాట్లాడుకున్నాం. వెంటనే కిడ్నీ అమ్మితే డబ్బులు వస్తాయని విషయాన్ని చెప్పాడు. నేను మద్యం మత్తులో ఒప్పుకున్నా. ఒక కిడ్నీకి రూ. 8.5 లక్షలు ఇస్తానని కామరాజు చెప్పాడు. అలాగే కేజీహెచ్ సమీపంలోని ఒక ఆసుపత్రిలో కొన్ని పరీక్షలు చేయించాడు” అని వినయ్ కుమార్ చెప్పారు.

‘విషయం తెలిసి హైద్రాబాద్ పంపించేశారు’
వైద్య పరీక్షలు చేయించుకోవడతో నేను కిడ్నీ అమ్ముతున్నాననే విషయం మా తల్లిదండ్రులకు తెలిసింది.
దాంతో నన్ను హైదరాబాద్ లోని మా మేనత్త ఇంటికి పంపించేశారు. నేను అక్కడే కూలీ పనులకు వెళ్తూ ఉండేవాడిని.
అయితే, నేను హైదరాబాద్‌లో ఉన్నాననే విషయం తెలుసుకున్న కామరాజు వెంటనే వచ్చి కిడ్నీ ఇవ్వకపోతే మా తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు.
అతనే నాకు రూ. 500 పంపిస్తే...నేను వెంటనే హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చాను. నన్ను రైల్వే స్టేషన్ నుంచే పెందుర్తి తిరుమల ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. 2022 డిసెంబర్ 17వ తేదీన ఆపరేషన్ చేసి నా కిడ్నీ తీసేశారు.

‘మా నాన్నే తీసుకెళ్లారు’
ఆపరేషన్ జరిగిన తర్వాత నన్ను ఎవరు పట్టించుకోలేదు. కనీసం మందులు కూడా ఇవ్వలేదు. వారం రోజుల పాటు ఆ ఆసుపత్రిలోనే ఉన్నాను. ఆ తర్వాత విషయం మా ఇంట్లో వాళ్లకి చెప్పాను. దాంతో మా నాన్న ఆసుపత్రికి వచ్చారు. నా పరిస్థితి చూసి ఏడ్చారు. నన్ను క్యాబ్ లో మా ఇంటికి తీసుకుని వెళ్లారు. అప్పటి నుంచి కామరాజుని డబ్బులు కోసం అడుగుతూనే ఉన్నాను. కానీ ఇవ్వలేదు.
‘కూలీ డబ్బులు రూ. 5 లక్షలు, దళారులకు రూ. 2.5 లక్షలు’
నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడే కామరాజు మా ఇంటికి వచ్చి రూ. 5 లక్షలు డబ్బులు ఇచ్చినట్లు ఒక వీడియో తీసి, అందులో రూ. 2.5 లక్షలు ఇచ్చి మిగతా డబ్బులు పట్టుకుని వెళ్లిపోయారు. ఇంత డబ్బు ఎక్కడిదని మా నాన్న అడిగితే, మీ అబ్బాయి హైదరాబాద్‌లో చేసిన పని డబ్బులు అని చెప్పారు.
అలాగే దళారులకు కొంత డబ్బు ఇవ్వాలని చెప్పి రూ. 2.5 లక్షలు పట్టుకుని వెళ్లిపోయారు. మా తల్లిదండ్రులను చంపేస్తామని బెదిరించి నా కిడ్నీని తీసుకోవడమే కాకుండా...ఇస్తానన్న డబ్బులు కూడా మొత్తం ఇవ్వలేదు. ఆ విషయమే కామరాజును అడిగి అడిగి విసిగిపోయి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాను. కామరాజుతో పాటు శ్రీను, ఇలియన్ అనే మరో ఇద్దరు కూడా నన్ను బెదిరించిన వారిలో ఉన్నారు.

‘పోలీసుల అదుపులో డాక్టర్’
పెందుర్తిలో కిడ్నీ ఆపరేషన్ జరిగిందని బాధితుడు చెబుతున్న తిరుమల ఆసుపత్రి వైద్యుడు జి. పరమేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆయన తనకు ఈ కేసుకు సంబంధం లేదని అంటున్నారు.
“కిడ్నీ మార్పిడి యూనిట్ మా వద్ద లేదు. నేను ఆర్థోపెడిక్ సర్జన్‌ను. మా ఆసుపత్రిలో సర్జరీ సెక్షన్ కూడా ఇంకా ప్రారంభం కాలేదు. కేసు విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి” అని పరమేశ్వరరావు చెప్పారు.

విచారణ జరుగుతోంది: డీసీపీ
ఈ కేసులో విచారణ జరుగుతోందని, తిరుమల ఆసుపత్రి యాజమానిని విచారిస్తే మరిన్ని వివరాలు బయటపడే అవకాశముందని డీసీపీ విద్యాసాగర్ బీబీసీకి చెప్పారు.
కామరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని...కామరాజుతో పాటు అతడికి సహకరించిన శ్రీను, ఇలియాన్ అనే మరో ఇద్దరు వ్యక్తుల కోసం ప్రత్యేక పోలీసులు బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.

‘వినయ్ కుమార్ నడవలేకపోతున్నారు’
జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు వైద్యాధిక బృందం ఒకటి మధురవాడలోని బాధితుడు వినయ్ కుమార్ ఇంటికి వెళ్లి అతడి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. అతడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు కొన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ అంశంపై డీఎంహెచ్‌ఓ జగదీష్ బీబీసీతో మాట్లాడారు.
“వినయ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. కాకపోతే కాళ్లు, చేతులు బలహీనంగా ఉండటంతో అతడు నడిచేందుకు ఇబ్బంది పడుతున్నాడు. అతనికి మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. వినయ్ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు పంపుతాం” అని డీఎంహెచ్‌వో జగదీష్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆనంద్ మోహన్ సింగ్: తెలుగు ఐఏఎస్ అధికారి హత్య కేసులో నేరస్థుడిని ఎందుకు విడుదల చేస్తున్నారు?
- స్వర్గానికి వెళ్లడానికి ఆకలితో చావాలని చెబితే దాదాపు 100 మంది ప్రాణాలు తీసుకున్నారు... ఆ అడవిలోని రహస్య ప్రదేశంలో ఏం జరుగుతోంది?
- నరేంద్ర మోదీ- సత్యపాల్ మలిక్: రిలయన్స్ కాంట్రాక్ట్‌ను ఈ మాజీ గవర్నర్ అప్పట్లో ఎందుకు రద్దు చేశారు?
- మూల కణాల మార్పిడి: క్యాన్సర్‌తోపాటు హెచ్ఐవీ నుంచి కోలుకున్న అమెరికన్ కథ
- 'చివరి లాటరీ టికెట్'తో రెండున్నర కోట్లు గెలుచుకున్న 89 ఏళ్ల రిక్షావాలా
( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















