తంగరాజు సుప్పయ్యను సింగపూర్‌లో ఉరి తీశారు... ఐక్యరాజ్యసమితి వద్దన్నా పట్టించుకోని అధికారులు

ఫొటో సోర్స్, TRANSFORMATIVE JUSTICE COLLECTIVE
- రచయిత, జోయెల్ గింటో, ఫ్రాన్సిస్ మావో
- హోదా, బీబీసీ న్యూస్, సింగపూర్
సింగపూర్‌కు కేజీ గంజాయిని అక్రమంగా తరలించారనే కేసులో దోషిగా తేలిన తంగరాజు సుప్పయ్యకు ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున ఉరిశిక్షను అమలు చేశారు.
బుధవారం తెల్లవారుజామున చాంగి జైలులో తంగరాజు సుప్పయ్యను ఉరి తీసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. తంగరాజు సుప్పయ్య వయస్సు 46 ఏళ్లు.
ఆయనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ సుప్పయ్య కుటుంబ సభ్యులు, ఐక్యరాజ్య సమితి యాక్టివిస్టులు విజ్ఞప్తులు చేసినప్పటికి సింగపూర్ అధికార యంత్రాంగం ఉరి శిక్షను అమలు చేసింది.
నేరం చేయలేదనే బలమైన ఆధారాలు లేకపోవడంతో తంగరాజు సుప్పయ్య ఈ కేసులో ఇరుక్కుపోయి దోషిగా తేలారని, ఆయనకు విచారణ సమయంలో కూడా పరిమితంగా లీగల్ మద్దతు లభించిందని యాక్టివిస్టులు చెబుతున్నారు.
చట్టాలకు లోబడే ఆయనకు ఈ శిక్ష విధించామని, ఏప్రిల్ 26న దీన్ని అమలు చేయబోతున్నట్లు అంతకుముందే సింగపూర్ అధికార యంత్రాంగం చెప్పింది.
డ్రగ్స్ కేసులో 2022లో మానసికంగా స్థిమితంగా లేని ఒక వ్యక్తికి ఈ శిక్ష విధించిన తర్వాత, మళ్లీ ఉరిశిక్షను ఎదుర్కొన్న వ్యక్తి తంగరాజు సుప్పయ్య.
సింగపూర్‌లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు ఉన్నాయి. సమాజాన్ని సంరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని సింగపూర్ చెబుతోంది. అందుకు ఇలాంటి చట్టాలు అవసరమని అంటోంది.
తంగరాజు సుప్పయ్య కుటుంబ సభ్యులు, యాక్టివిస్టులు ఆయనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ సింగపూర్ అధ్యక్షుడు హలిమా యాకోబ్‌కు చివరి నిమిషంలో లేఖ రాశారు.
బ్రిటిష్ బిలియనీర్ సర్ రిచర్డ్ బ్రాన్సన్ కూడా ఉరిశిక్షను నిలిపివేయాలని, ఈ కేసును సమీక్షించాలని కోరారు.
‘‘నాకు తెలుసు నా సోదరుడు ఎలాంటి తప్పూ చేయలేదు. ఈ కేసును సమీక్షించాలని నేను కోర్టును ప్రాధేయపడుతున్నాను’’ అని తంగరాజు సోదరి లీలా సుప్పయ్య న్యూస్ కాన్ఫరెన్స్‌లో రిపోర్టర్లకు తెలిపారు.
కేజీ గంజాయి సింగపూర్ తరలించారని...
తంగరాజు మలేసియా నుంచి సింగపూర్‌కు కేజీ గంజాయిని అక్రమంగా తరలించారనే అభియోగాలతో 2013లో కోర్టు ఉరిశిక్ష విధించింది.
డెలివరీ సమయంలో తంగరాజును పోలీసులు పట్టుకోకపోయినా, ఈ గంజాయిని సింగపూర్ తరలించేందుకు కోఆర్డినేట్ చేసిన బాధ్యత ఆయనదేనని ప్రాసిక్యూటర్లు తెలిపారు.
డెలివరీ చేసిన వ్యక్తి వాడిన రెండు ఫోన్ నెంబర్లను ట్రేస్ చేస్తే, అవి తంగరాజువేనని తెలిసిందన్నారు.
అయితే ఈ కేసుతో సంబంధమున్న వారితో కమ్యూనికేట్ అయిన వ్యక్తిని తాను కాదని తంగరాజు వాదిస్తున్నారు.
ఆయన ఫోన్లలో ఒకదాన్ని తాను పోగొట్టుకున్నట్లు తంగరాజు చెప్పారు. రెండో ఫోన్ తనది కాదని తంగరాజు కొట్టిపారేస్తున్నారు.
మాదక ద్రవ్యాలను తమ దేశంలో సరఫరా చేసే వారికి సింగపూర్ గరిష్ఠంగా ఉరిశిక్ష విధిస్తుంది. కొరియర్స్‌కు కాస్త చిన్న శిక్షలు విధిస్తుంది.
ఈ డెలివరీని కోఆర్డినేట్ చేసింది తంగరాజుదేననే ప్రాసిక్యూషన్ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకొంది. దీనివల్ల ఆయనకు శిక్ష తగ్గే అవకాశం లేకుండా పోయింది.
తంగరాజుకు అవసరమైన ఇంటర్‌ప్రెటర్ యాక్సస్‌ను కల్పించలేదని యాక్టివిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆయన కుటుంబ సభ్యులకు మంచి న్యాయవాది దొరక్కపోవడంతో, చివరి అప్పీల్‌లో తంగరాజు తనకు తాను సొంతంగా వాదించుకున్నారని చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
‘కొడుకు చనిపోతాడని ఆ తల్లికి తెలియదు’
‘‘అతను చనిపోతాడన్న విషయం అందరికీ అర్ధమైంది. కానీ, ఒక మనిషిని కోల్పోవడాన్ని జీర్ణించుకోవడం అంత సులభం కాదు’’ అని కోకిలా అన్నామలై అన్నారు.
తంగరాజును మరణ శిక్ష నుంచి తప్పించడానికి ఉద్యమించిన వారిలో ఆమె ఒకరు.
తంగరాజు చివరి క్షణాల గురించి కోకిల తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు.
సింగపూర్ జైల్లో ఉన్న తంగరాజును చూపించేందుకు అతని తల్లి పాప (ఇది ఆమె పేరు)ను జైలుకు తీసుకెళ్లినట్లు కోకిల బీబీసీకి చెప్పారు.
‘‘జైలుకు వెళ్లే దారిలో ఆమె చాలా ఉత్సాహంగా మాట్లాడారు. చాలా రోజుల తర్వాత కొడుకును కలవబోతున్న ఒక తల్లి మానసిక స్థితిని మనం అర్ధం చేసుకోవచ్చు. కుటుంబం కోసం ఆమె ఎన్నో కష్టాలు పడ్డారు. 18 సంవత్సరాలు రోడ్డు స్వీపర్‌గా పని చేశారు’’ అని కోకిల వెల్లడించారు.
“మరుసటి రోజు కొడుకుకు ఉరివేయబోతున్నారన్న విషయం ఆమెకు తెలియదు. కొడుకు తనతో బాగా మాట్లాడాడని, పుట్టిన రోజు, పెళ్లి రోజుల గురించి చెప్పి తంగరాజు చాలా సంతోషంగా తనతో మాట్లాడాడని ఆమె చెప్పింది. ఆమె ఆ మాటలు చెబుతుంటే చాలా బాధ కలిగింది. ఇక ముందు ఆమె తన కొడుకుతో మాట్లాడలేదన్న నిజం తెలిశాక నేను షాకయ్యాను’’ అని కోకిలా అన్నామలై అన్నారు.
జైలు అధికారులు ఖైదీల చివరి కోరిక తీర్చాలి...కానీ...
సాధారణంగా సింగపూర్‌లో మరణ శిక్ష ఎదుర్కొంటున్నవారికి శిక్ష అమలు విషయం వారం రోజుల ముందు కుటుంబ సభ్యులకు తెలియజేస్తారు.
ఈ సందర్భంగా ఖైదీల చిన్న చిన్న కోరికలను నెరవేర్చడం అధికారుల బాధ్యత. శిక్ష పడిన ఖైదీలు తమ ఇష్టమైన దుస్తులు ధరించి ఫొటోలు దిగేందుకు అనుమతిస్తారు.
వారికిష్టమైన ఆహారాన్ని కుటుంబం నుంచి తెప్పించుకుని తినవచ్చు. తంగరాజుకు కూడా చికెన్ రైస్, బిర్యానీ, ఐస్‌క్రీమ్‌లాంటివి తెప్పించుకుని తిన్నారు.
గత నాలుగు నెలలుగా ఎక్కువగా తినడం వల్ల తన బరువు పది కిలోలు పెరిగిందని, అందుకే రోజుకు ఒకసారి మాత్రమే తింటున్నానని తంగరాజు చెప్పినట్లు సోదరి లీల వెల్లడించారు.
"బరువు పెరిగితే, ఉరి వేసినప్పుడు నేను చనిపోవడానికి ఎక్కువ సమయం పడుతుందా?" అని కుటుంబ సభ్యులను అడిగేవారని లీల వెల్లడించారు.
అతను అన్న మాటలను జీవితాంతం మర్చిపోలేమని లీల అన్నారు.
తంగరాజు చనిపోవడానికి ముందు ఫొటో దిగడానికి ఇష్టపడలేదు. అయితే కుటుంబ సభ్యులు బలవంతం చేయడంతో ఫొటో దిగడానికి ఒప్పుకున్నారు.
‘‘కుటుంబ సభ్యులను అడిగి కుటుంబంతో దిగిన తన పాత ఫొటోలను తెప్పించుకుని వాటి చూసి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఆ ఫొటోలను చూసిన తర్వాత తనకు నిద్రపట్టలేదని చెప్పాడు’’ అని లీల చెప్పారు.
తంగరాజు చివరి కోరిక తీరలేదు: కోకిల
"తంగరాజు తనకు ఇష్టమైన సంగీతం వినడానికి అనుమతి సంపాదించాడు. అయితే, సీడీల కోసం డబ్బు వృథా చేయవద్దని, ఆ డబ్బును కుటుంబానికి ఇవ్వాలని కోరుకున్నాడు.’’ అని కోకిల చెప్పారు.
మలేషియాలోని సెలంగోర్ దేవాలయం నుంచి హనుమాన్ జపమాల, కుంకుమ కావాలని కోరాడు. తాము వాటిని సిద్ధం చేశామని, కానీ, అధికారులు అతనికి అందించేందుకు ఒప్పుకోలేదని కోకిల చెప్పారు.
‘‘అతని ప్రాణాలే పోతున్నాయి. అలాంటప్పుడు ఈ చిన్న చిన్న కోరికను ఎందుకు నెరవేర్చ కూడదు’’ అని తంగరాజు కుటుంబ సభ్యులు కోరారు.
"ఉరి వేయడానికి ముందు, శిక్షను అమలు చేసే స్థలాన్ని జైలు గార్డులు మీకు చూపిస్తారని, అమలు చేసే విధానాన్ని వివరిస్తారని తంగరాజు తన కుటుంబ సభ్యులకు చెప్పారు. ఇంతకు ముందు ఏ ఖైదీకి కూడా తన కుటుంబీకులకు ఇలాంటి సమాచారం ఇచ్చి ఉండరని నేను అనుకుంటున్నాను’’ అని కోకిల అన్నారు.
శిక్ష అమలు తర్వాత, జైలు నిర్వాహకులు తంగరాజు వస్తువులను అతని కుటుంబానికి ఇచ్చారు. వారు ఆ విషయం వారు నాకు చెబుతున్నప్పుడు వారి గొంతులో వణుకు నాకు అర్ధమైంది’’ అని కోకిల అన్నారు.
"తంగరాజు దుస్తులు, పెళ్లయినప్పుడు ధరించిన ఉంగరం, చెప్పులు, అతని చేతికి కట్టిన పవిత్రమైన తాడు అతనికి కుటుంబానికి ఇచ్చారు’’అని కోకిల చెప్పారు.
తలారి అనుభవాలు
సింగపూర్‌లో మరణశిక్ష పడి, ఏడేళ్ల జైలు జీవితం గడిపి, విడుదలైన వ్యక్తితో తాను మాట్లాడినట్లు కోకిల బీబీసీకి చెప్పారు. ఉరిశిక్ష పడిన ఖైదీలు ఇచ్చే జైలు విందు గురించి ఆయన వివరించారు.
‘‘రేపో ఎల్లుండో చనిపోయే వ్యక్తి ఇవ్వబోయే విందును మనం ఎలా తినగలం.’’ అని ఆయన అన్నారు.
"అలా వడ్డించిన అన్నం, నీరు తీసుకోవడం ఒక భయానకమైన అనుభవం’’ అని ఆయన చెప్పినట్లు కోకిల వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- కెంటన్ పాట్స్: పెర్ల్ హార్బర్ దాడిలో మృతదేహాలను సేకరించిన వ్యక్తి... ఇప్పుడెలా మరణించారంటే
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- కేశవానంద భారతి: ఈ ఆధ్యాత్మిక గురువును ‘రాజ్యాంగ రక్షకుడు’ అని ఎందుకన్నారంటే
- ఐపీఎల్: DRS అంటే 'ధోనీ రివ్యూ సిస్టమ్'.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














