కొకైన్: ఏకంగా జలాంతర్గాములనే తయారు చేసి రవాణా చేస్తున్నారు, ఎక్కడంటే...

నార్కో-సబ్
ఫొటో క్యాప్షన్, నార్కో-సబ్ లోపలికి వెళ్లి చూసేందుకు స్పానిష్ పోలీసులు బీబీసీకి అనుమతిచ్చారు
    • రచయిత, నిక్ బీక్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దక్షిణ అమెరికా నుంచి యూరప్‌కు కొకైన్ తీసుకొచ్చిన తొలి జలాంతర్గామి (సబ్‌మరీన్) "నార్కో-సబ్" ఎక్కాను. ఇది 20 మీటర్ల పొడవు ఉంది. కార్బన్ ఫైబర్‌తో సొంతంగా, స్వదేశంలో తయారుచేసుకున్నది.

పైకి ఎక్కి ట్యాంకు మూత తీసి లోపలికి దిగాను. గతంలో ఈ సబ్ మరీన్‌లో ముగ్గురు వ్యక్తులు 27 రోజుల పాటు గడిపారు. వారికి పగలు, రాత్రి ఈ డబ్బాలాంటి జలాంతర్గామిలోనే గడిచింది. అట్లాంటిక్ మహాసముద్రంలో వారు అప్పట్లో ప్రయాణించారు.

మరీన్ లోపల ఇరుకుగా, ఊపిరి ఆడనట్టు ఉంది. గోడలకున్న పగుళ్ల నుంచి సూర్యకిరణాలు లోపలికి చొచ్చుకుని వస్తున్నాయి. స్టీరింగ్ వీల్, తుప్పు పట్టిన ఇగ్నిషన్, కొన్ని డయల్స్ కనిపిస్తున్నాయి.

ఇందులో కొన్ని రోజులు గడిపితే ప్రాణం పోయేలాగే ఉంది. మరీన్ ప్రయాణిస్తున్నప్పుడు ఇంజిన్ వేడి, శబ్దం చికాకు పెట్టి ఉండవచ్చు. సబ్‌మరీన్‌లో 20,000 లీటర్ల ఇంధనం ఫైర్ అవుతుండేది.

ఈక్వెడార్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు, ఒక మాజీ స్పానిష్ బాక్సర్ కలిసి బ్రెజిల్ అడవుల నుంచి బయలుదేరి మొదట అమెజాన్ నది వెంబడి ప్రయాణించారు.

వాళ్ల దగ్గర తినడానికి కొన్ని ఎనర్జీ బార్స్, చేపలు, ప్లాస్టిక్ సంచులు ఉన్నాయి. ఆ సంచులను టాయిలెట్ అవసరాల కోసం ఉపయోగించాలన్నది వారి ప్రణాళిక.

వీటితో పాటు, టన్నుల కొద్దీ కొకైన్, సుమారు రూ. 1,232 కోట్లు విలువైనది ఉంది.

అయితే, ఈ స్మగ్లింగ్ వాళ్లనుకున్నంత రహస్యంగా, సులభంగా సాగలేదు.

2019లో జరిగిన ఈ సబ్‌మరీన్ ప్రయాణాన్ని బ్రిటన్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీ (ఎన్‌సీఏ)తో సహా పలు ఏజెన్సీలు ట్రాక్ చేశాయి.

గలీసియా తీరానికి సమీపంలో ఈ జలాంతర్గామిని వెంబడించారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకోవడంలో భాగంగా జరిగిన ఈ ఆపరేషన్‌కు గుర్తుగా అవిలా లోని స్పానిష్ పోలీసు అకాడమీ కార్ పార్కింగ్‌లో ఆ సబ్‌మరీన్‌ను ఒక జ్ఞాపికలా నిలబెట్టారు.

కొకైన్‌
ఫొటో క్యాప్షన్, సుమారు రూ. 1,232 కోట్ల విలువైన కొకైన్‌ను ఈ మరీన్ ద్వారా అక్రమ రవాణా చేశారు

అయితే, ఇది ముగిసిన చరిత్ర కాదు. రహస్యంగా, చాప కింద నీరులా విస్తరిస్తున్న స్మగ్లింగ్‌కు సంకేంతం.

ఒక నెల క్రితమే, స్పెయిన్‌లోని గలీసియా తీరంలో ఇలాంటిదే మరో సబ్‌మరీన్‌ను పట్టుకున్నారు.

"స్మగ్లింగ్‌కు సబ్‌మరీన్‌లను వాడడం కొత్తేం కాదు. 20 ఏళ్లకు పైగా ఆఫ్రికా, యూరప్‌లకు చేసుకోవడానికి వీటిని వాడుతున్నారు. అయితే, ఈ రెండు మేం పట్టుకున్న తొలి సబ్‌మరీన్‌లు. నీటి అడుగున ఉన్న వీటిని గుర్తించడం చాలా కష్టం" అని స్పానిష్ నేషనల్ పోలీస్‌లోని నార్కో బ్రిగేడ్ చీఫ్ కమీషనర్ ఆంటోనియో మార్టినెజ్ డువార్టే చెప్పారు.

అమెరికా తరువాత అతిపెద్ద కొకైన్ మార్కెట్ యూరప్. కోవిడ్ తరువాత వేగంగా విస్తరిస్తోంది కూడా. అందుకే వందలాది హోంమేడ్ సబ్‌మరీన్లను యూరప్ వైపు తరలిస్తున్నారు.

అట్లాంటిక్ మధ్యలో కానరీ దీవులు, అజోర్స్ సమీపంలో కొకైన్ జలాంతర్గాముల డంపింగ్ యార్డ్ ఉందని చెబుతున్నారు. తమ పని విజయవంతంగా పూర్తిచేసుకున్న తరువాత మరీన్‌లను అక్కడ ముంచేస్తున్నారు.

దక్షిణ అమెరికా అడవుల్లో, ఎక్కువగా గయానా, సురినామ్‌ ప్రాంతాల్లో ఈ జలాంతర్గాములను తయారుచేస్తున్నారు. మరీన్‌లు రహస్యంగా కొకైన్‌ను చేరవేసిన ప్రతిసారి వారు సంబరాలు చేసుకుంటుండవచ్చు.

వాటిలో రెండు సబ్‌మరీన్‌లను పట్టుకోవడం స్పెయిన్ పోలీసులకు పండుగ. ఎన్నో ఏళ్లుగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునే చర్యలు చేపడుతున్నా మరీన్‌లను పట్టుకోలేకపోయారు.

"ఇది చాలా ముఖ్యమైన ఆపరేషన్. యూరప్‌లో మొదటిసారి ఒకటిన్నర టన్నుల కొకైన్ ముద్దను స్వాధీనం చేసుకున్నాం" అని స్పానిష్ అధికారులు చెప్పారు.

పచ్చి కోకా ముద్దను కొకైన్‌గా మార్చే ల్యాబ్‌ను కూడా కనుగొన్నారు.

స్పానిష్ పోలీసు అకాడమీ కార్ పార్కింగ్‌లో ఉంచిన సబ్‌మరీన్‌
ఫొటో క్యాప్షన్, స్పానిష్ పోలీసు అకాడమీ కార్ పార్కింగ్‌లో ఉంచిన సబ్‌మరీన్‌

"స్పెయిన్ నుంచి ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్పానిష్ ముఠాలతో చేతులు కలిపిన కొలంబియా, మెక్సికో నేరస్థుల మధ్య సంబంధాలు కూడా ఈ ఆపరేషన్‌లో బయటపడ్డాయి" అని చీఫ్ కమిషనర్ డువార్టే చెప్పారు.

ల్యాబ్‌లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి అక్కడున్న సాధనాలను చూపించారు స్పానిష్ పోలీసులు.

పచ్చి కోకా పేస్ట్, బ్యారెళ్ల కొద్దీ రసాయనాలు, మైక్రోవేవ్, హైడ్రాలిక్ ప్రెస్, స్కేల్స్.. ముద్దను పౌడర్‌గా చేసేందుకు కావాల్సినవన్నీ అక్కడ ఉన్నాయి. మరో పక్క, కొకైన్ పౌడర్ ప్యాకెట్లు ఉన్నాయి. అవన్నీ నేరస్థుల రహస్య కార్యకలాపాలకు చిహ్నాలు.

కొకైన్ దిగుమతి చేసుకునేవాళ్లు ఒక్కొక్క పార్సిల్‌కు 30 నుంచి 35 వేల డాలర్లు (సుమారు రూ.28,75,407) చెల్లిస్తారని, దీనికి రెట్టింపు ధర పెట్టి అమ్ముతారని ఒక అధికారి చెప్పారు.

వీటిల్లో కొన్ని రసాయనాలు కలుపుతారు. అనస్థీషియా, కెఫిన్, గ్లూకోజ్ లాంటివి కలుపుతారు. దాన్ని బట్టి వాళ్ల లాభాలు ఉంటాయి.

గలీసియా ప్రాంతంలోని పొంటెవెడ్రా నగరంలో ఉన్న ఈ ల్యాబ్ 95 శాతం స్వచ్ఛతతో రోజుకు 200 కిలోల కొకైన్ ఉత్పత్తి చేయగలదని పోలీసులు తెలిపారు.

వేగంగా విస్తరిస్తున్న మాదక ద్రవ్యాల ప్రపంచానికి ఈ సబ్‌మరీన్, ల్యాబ్ ఉదాహరణలు.

2020-2021 మధ్య కొకైన్ ఉత్పత్తి మూడు వంతులు ఐక్యరాజ్యసమితి డ్రగ్ ఏజెన్సీ తెలిపింది. 2016 తరువాత ఇదే రికార్డు స్థాయి పెరుగుదల.

ల్యాబ్‌లో దొరికిన కొకైన్ ప్యాకెట్లు
ఫొటో క్యాప్షన్, ల్యాబ్‌లో సూపర్ మ్యాన్ లోగోతో దొరికిన కొకైన్ ప్యాకెట్లు

బెల్జియంలోని ఆంట్వెర్ప్ ఓడరేవులో డ్రగ్స్ సప్లయి జోరుగా సాగుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

2022లో ఈ పోర్టు నుంచి రికార్డు స్థాయిలో 110 టన్నుల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ నౌకాశ్రయానికి చేరుకునే కొకైన్‌లో కేవలం 10 శాతాన్ని మాత్రమే స్వాధీనం చేసుకున్నారని, మిగిలినది బ్రిటన్ సహా యూరప్‌లోని అన్ని మూలలకు పంపిణీ చేయడానికి నెదర్లాండ్స్‌కు చేరుకుంటుందని అంచనా.

కొకైన్ అక్రమ రవాణా సునామీలా సప్లయ్ అవుతోందని, దీని మీద పోరాటం జరిపి గెలవడం చాలా కష్టమని పోర్టులో కస్టమ్స్ హెడ్ అన్నారు.

దీనివల్ల ఆంట్వెర్ప్ నగరంలో హింస, నేరాలు పెరిగిపోతున్నాయి. జనవరిలో, ఈ నగరంలో కొకైన్ వ్యాపారంతో సంబంధం ఉన్న ముఠాల మధ్య కాల్పుల్లో 11 ఏళ్ల బాలిక మరణించింది.

బెల్జియం న్యాయ మంత్రి విన్సెంట్ వాన్ క్వికెన్‌బోర్న్‌ను కిడ్నాప్ చేసేందుకు డచ్ క్రిమినల్స్ స్కెచ్ వేస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన ఇంటి బయట తుపాకులు నిండిన కారు దొరికింది.

కొకైన్ పరిశ్రమ నియంత్రణ చేయలేని స్థాయికి విస్తరించిందని బెల్జియంలో టాప్ ఇన్వెస్టిగేటివ్ జడ్జిలలో ఒకరైన మిచెల్ క్లైజ్ అన్నారు.

ముఠాల సంపద, ప్రభావం కోర్టుల దాకా వ్యాపిస్తోందని ఆయన అన్నారు.

"మనీ లాండరింగ్, అవినీతి అన్ని వ్యవస్థలకు వ్యాపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో క్రిమినల్ ముఠాలకు ఎలా కంట్రోల్ చేయగలుగుతాం? ఇది చేతులు దాటిపోయింది" అని మిచెల్ క్లైజ్ అన్నారు.

యూరప్‌లో బెల్జియం కొకైన్ సంక్షోభమే అతిపెద్ద సమస్యగా మారింది. మునుపెన్నడూ లేని విధంగా అంతర్జాతీయ ముఠాలు ప్రత్యర్థులతో కలిసి పనిచేస్తున్నాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తోంది.

యూరప్ తరువాత, ఆసియా, ఆఫ్రికాలకు కూడా తమ సామ్రాజ్యాన్ని విస్తరించే అవకాశం ఉందని ఐరాస సూచించింది.

(అదనపు రిపోర్టింగ్: బ్రూనో బోయెల్‌పేప్)

ఇవి కూడా చదవండి: