వడదెబ్బ: ఎండలో ఆ సమయంలో ఎక్కువసేపు ఉంటే కోమాలోకి వెళ్లిపోతామా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, విష్ణుప్రకాశ్ నల్లతంబి
- హోదా, బీబీసీ ప్రతినిధి
విపరీతమైన దాహం
పొడి బారిన చర్మం
పగిలిన పెదవులు
పొడి నాలుక
మాట్లాడుతున్నప్పుడు తడబాటు
మూర్ఛ
కడుపు నొప్పి
తలనొప్పి
తల తిరగడం
ఛాతీలో చికాకు
జీర్ణ సమస్య
ప్రస్తుతం ఇలాంటి సమస్యలతో దేశంలో చాలా మంది బాధపడుతున్నారు. ఇవి వడదెబ్బ లక్షణాలు.
ఇటీవల మహారాష్ట్రలోని నవీ ముంబయిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన సభలో పాల్గొన్న 13 మంది వడదెబ్బకు గురై చనిపోయారు.
ఇలాంటి ప్రమాదం బారిన పడకుండా ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనుషులకు ప్రాణాపాయంగా మారే ఈ వడదెబ్బ అంటే ఏమిటి?
వేడి వాతావరణంలో పడే ఇతర ప్రభావాలేంటి? సూర్య కిరణాల నుంచి శరీరాన్ని ఎలా రక్షించుకోవాలి?
ఇలాంటి అనేక ప్రశ్నలకు జనరల్ ప్రాక్టీషనర్ డాక్టర్ భూపతి జాన్ సమాధానాలు ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
వడదెబ్బ అంటే ఏమిటి?
వడదెబ్బ అనేది శరీరం తీవ్రమైన వేడిని తట్టుకోలేనప్పుడు ఏర్పడే పరిస్థితి.
సాధారణ శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల ఫారన్‌హీట్ లేదా 37 డిగ్రీల సెల్సియస్.
శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే పెరిగి 104 డిగ్రీల ఫారన్‌హీట్ ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉన్నపుడు బయటకు వెళ్లడం,ఎండలో ఎక్కువ సమయం గడపడం వల్ల వడదెబ్బ తగులుతుంది.
సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.మెడిసిన్ వేసుకోవడం వల్ల చెమటలు పట్టడంతోపాటు శరీరంలోని వేడి తగ్గుతుంది.
కానీ వేసవిలో పొడి వాతావరణం కారణంగా కొన్నిసార్లు చెమట రాదు.
అలాగే శరీరం చెమట తొలగింపు వ్యవస్థ పని చేయడంలో విఫలమైతే,శరీరం వేడెక్కుతుంది.అప్పుడు వడదెబ్బ తగులుతుంది.
ఎండ దెబ్బకు జనం స్పృహతప్పి పడిపోతున్నారు.
ఇది కొన్నిసార్లు మరణానికి కూడా దారితీస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
కోమాలోకి వెళ్లే ముప్పు
శరీరం వేడెక్కినప్పుడు వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. క్రమంగా లక్షణాలు పెరుగుతుంటే వడదెబ్బకు గురవుతున్నామని గ్రహించవచ్చు.
ఎండలో ఎక్కువ సమయం గడపడం వల్ల పై లక్షణాలు కనిపిస్తే వడదెబ్బ తగిలిందని తెలుసుకోవచ్చు.
దీని ప్రభావం గరిష్ఠ స్థాయిలో ఉండి అపస్మారక స్థితికి చేరుకుంటే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది.
వడదెబ్బ తగిలితే ఏం చేయాలి?
శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫారన్‌హీట్‌కు మించి ఉన్నప్పుడు సమస్య వస్తుంది.
కాబట్టి ఎండలో ఎక్కువ సమయం గడిపే వారు వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే నీడలోకి వెళ్లాలి.
వీలైతే శరీర ఉష్ణోగ్రతను సాధారణ స్థితికి తీసుకురావడానికి ఎయిర్ కండిషనర్(ఏసీ) ఉపయోగించండి.
తల, ఛాతీ, నడుము, చేతులు, కాళ్లు , శరీరంలోని ఇతర భాగాలను ఐస్ లేదా గోరువెచ్చని గుడ్డతో రుద్దడం వల్ల శరీరంలోని వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
వెంటనే సరస్సు, చెరువు మొదలైన వాటిలో స్నానం చేయడం ద్వారా వడదెబ్బ కారణంగా మూర్ఛపోకుండా ఉండొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
వడదెబ్బ ఎవరికి ఎక్కువగా తగులుతుంది?
వృద్ధులు, చిన్న పిల్లలకు వడదెబ్బ ఎక్కువగా తగులుతుంది.
ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారు ఎక్కువసేపు ఎండలో ఉన్నప్పుడు వడదెబ్బ బారిన పడతారు.
ఎనిమిదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు కూడా డీహైడ్రేషన్, వడదెబ్బ వల్ల అనారోగ్యానికి గురవుతారు.
మధుమేహం, అధిక రక్తపోటు, థైరాయిడ్ లాంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వ్యక్తులకు వడదెబ్బ ప్రమాదం ఎక్కువ.
ఎండలో ఎక్కువ సేపు పనిచేసేవారికి కూడా వడదెబ్బ తగలొచ్చు.
సాధారణంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వేడి ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఎండలో ఉన్నవారిలో కొందరు వడదెబ్బ తగిలి చనిపోయిన సందర్భాలూ ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
వేసవి ఎసిడిటీ అంటే ఏమిటి?
వేసవిలో వేడిమి వల్ల వచ్చే ఎసిడిటీని జీర్ణ రుగ్మత అని కూడా అంటారు.
వేసవిలో అధిక వేడి కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు ఎసిడిటీని పెంచి శరీరంలో అనేక అసౌకర్యాలను కలిగిస్తాయి.
గుండెల్లో మంట,నోటి దుర్వాసన మొదలైన సమస్యలూ వస్తాయి.
ఎండాకాలంలో కొంత మందిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
సాధారణంగా వేసవిలో శరీరంలో వేడి పెరుగుతుంది. కడుపులో సమస్యలు ఏర్పడతాయి.
ఈ సమస్యను ఎదుర్కోవడానికి చల్లని ఆహారాన్ని తీసుకోవడం అవసరం.
రోజూ తీసుకునే దానికంటే ఎక్కువ నీరు,కూరగాయలు, పండ్లు తీసుకోవాలి.
సాధారణంగా 2 నుంచి 2.5 లీటర్ల నీరు తాగే వారు వేసవిలో రోజూ కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. అప్పుడే శరీరంలో నీటిశాతం తగ్గదు.
పాలు,పెరుగు, మజ్జిగ వంటి పదార్థాలను తీసుకుంటూ ఉండాలి.
ఇలా చేస్తే శరీరంలోని వేడి తగ్గడమే కాకుండా ఎసిడిటీ ఎక్కువ కాకుండా ఉంటుంది.
నీరు ఎక్కువగా ఉండే పండ్లను ఆహారంతోపాటు తీసుకోవడం ద్వారా శరీరంలోని వేడిని అదుపులో ఉంచుకోవచ్చు.
క్రమం తప్పకుండా మంచినీళ్లు తాగడం వల్ల పొట్టలో పీహెచ్ స్థాయి స్థిరంగా ఉంటుంది. దీంతో వేడి వాతావరణంలో జీర్ణక్రియ లోపాలు,గుండెల్లో మంట వంటి సమస్యలు రావు.
వేడి వాతావరణంలో వేడి ఆహారాన్ని తినాలనుకుంటే తక్కువగా తినాలి. అలాగే ఆహారంలో నూనె తక్కువగా ఉండటం వల్ల ఎసిడిటీని దూరం చేసుకోవచ్చు.
వేసవిలో మీ దగ్గర లభించే సీజనల్ పండ్లను తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.
ఇవి కూడా చదవండి:
- ఆవు, గేదె పాలే తాగాలా? గాడిద, గుర్రం, ఒంటె పాలకు డిమాండ్ ఎందుకు పెరుగుతోంది? బీపీ, డయాబెటిస్, ఆటిజం తగ్గించే పాలు ఉంటాయా
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
- భారత్, నేపాల్ మధ్య పైప్‌లైన్ ఎందుకు వేస్తున్నారు?
- అమెరికా: పొరపాటున డోర్‌బెల్ కొట్టినందుకు టీనేజర్ తలపై రివాల్వర్‌తో కాల్పులు
- ప్రపంచంలోని 70 శాతం పులులు భారత్‌లోనే.. పులులకు అటవీ ప్రాంతం సరిపోకపోతే ఏం జరుగుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














