వృద్ధులకు కళ్లద్దాలు, ఊతకర్ర, వీల్ చైర్.. ఉచితంగా ఇచ్చే పథకం గురించి తెలుసా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎ. కిశోర్‌బాబు
- హోదా, బీబీసీ కోసం
వృద్ధులకు ఊతకర్ర, వీల్ చైర్, కళ్లద్దాలు, వినికిడి యంత్రాలు, సిలికాన్ ఫోమ్ కుషన్, కట్టుడు పళ్లు లాంటి పరికరాలను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. దీని కోసం రాష్ట్రీయ వయోశ్రీ యోజన పథకాన్ని అమలు చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించే ఈ పథకం కింద లబ్ధి పొందడానికి ఉండాల్సిన అర్హతలు, విధి విధానాలు ఏమిటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? తదితర వివరాలన్నీ తెలుసుకుందాం.
ఏమిటీ పథకం?
2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో మొత్తం 10.38 కోట్ల మంది వృద్ధులు ఉన్నారు. వారిలో 60శాతానికి పైగా వయోజనులు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2026 సంవత్సరానికి దేశంలో వయోజనుల సంఖ్య 17 కోట్లకు దాటుతుందనేది ప్రభుత్వ అంచనా.
ఈ వయోజనుల్లో కూడా చాలా మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారే. వీరిలో చాలా మంది వృద్ధాప్య సంబంధిత సమస్యలైన చూపు మందగించడం, వినికిడి లోపం, పళ్లు ఊడటం, అంగవైకల్యం (Locomotor disability) లాంటి సమస్యలతో బాధపడుతున్నవారే ఉన్నారు.
దేశంలో 60 సంవత్సరాల వయసు పైబడిన పేద వయోజనులకు ఊతకర్రలు (వాకింగ్ స్టిక్స్), కళ్లజోడు, కట్టుడు పళ్లు, చక్రాల బండి లాంటి పరికరాలన్నీ కూడా పూర్తీ ఉచితంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం 2017 ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ వయోశ్రీ యోజన (ఆర్‌వీవై) పథకాన్ని ప్రారంభించింది.
కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత (మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ విభాగం ఈ పథకం అమలును పర్యవేక్షిస్తుంది.
ఈ పథకం ద్వారా 2023 ఫిబ్రవరి 7వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా 2,88,928 మంది వృద్ధులకు వివిధ రకాల పరికరాలను అందజేశామని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రకటించింది.
ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 7,703 మంది తెలంగాణ రాష్ట్రంలో 5,202 మంది వృద్ధులు లబ్ధి పొందారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి పరికరాలు ఉచితంగా అందజేస్తారు?
చూపు మందగించడం, పళ్లు ఊడటం, అంగవైలక్యం, వినికిడి సమస్య, మధుమేహం తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి కొన్ని రకాల పరికరాలు, కృత్రిమ అవయవ పరికరాలు ఉచితంగా ఇవ్వాలని కేంద్ర నిర్ణయించింది. అవి.
1. సాధారణ సమస్యలున్నవారికి
- ఊతకర్ర
- మోచేతి ఊతకర్రలు
- నడక సాధనాలు
- ట్రైపాడ్స్ / క్వాడ్‌పాడ్స్
- వినికిడి యంత్రాలు
- కృత్రిమ దంతాలు
- కళ్ల అద్దాలు
2. ప్రత్యేక పరికరాలు
- చక్రాల బండి
- మరుగుదొడ్డిసహిత చక్రాల బండి
- మరుగుదొడ్డిసహిత కుర్చీ/బల్ల
- సిలికాన్ ఫోమ్ కుషన్
- మోకాలి తొడుకు
- వెన్ను సపోర్టు
- సెర్వికల్ కాలర్లు
- నడుము బెల్డు
- వాకర్/ రొలేటర్ విత్ బ్రేక్స్
- పాదాల కట్లు - ఫెక్సీ జెల్ సాక్సులు, సాక్స్ కుషన్ శాండల్, సిలికాన్ ఇన్‌సోల్, ఇన్‌సోల్ విత్ ప్రెజర్ పాయింట్ రిలీఫ్

ఫొటో సోర్స్, Science Photo Library
ఈ పరికరాల ధర ఎంత ఉంటుంది?
వృద్ధులకు అందించే ఈ పరికరాల ఖరీదు సాధారణ పరికరాలైతే ఒక్కోటి రూ.15వేల లోపు, ప్రత్యేక పరికరాల ఖరీదు రూ.20వేల లోపు ఉంటుంది.
వీటిని ప్రభుత్వమే అందజేస్తుందా మనం కొనుక్కోవచ్చా?
ఈ పరికరాలన్నీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే స్వయంగా అందజేస్తుంది. బయట కొనడానికి వీలు లేదు.
ఎక్కడ తయారు చేయిస్తారు?
ఈ పరికరాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి చెందిన భారత ప్రభుత్వ కృత్రిమ అవయవాల తయారీ సంస్థ (Artificial Limbs Manufacturing Corporation of India -(ALIMCO) వీటిని నాణ్యత ప్రమాణాలతో తయారీ చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తుంది.
ఈ పథకం అమలులో ఈ సంస్థ కూడా ఒక నోడల్ ఏజెన్సీలాగా పనిచేస్తుంది.
ఈ పథకం అమలు ఎలా చేస్తారు?
మూడు దశల విధానంలో ఈ పథకాన్ని అమలు చేస్తారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ప్రధాన నోడల్ ఏజెన్సీగా ఉంటుంది.
ఈ పథకానికి ఎవరు అర్హులు?
60 సంవత్సరాల వయసు పైబడిన వృద్ధులు ఈ పథకానికి అర్హులు
వృద్ధులు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారై ఉండాలి.
ఏమేమీ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది?
వయసును ధ్రువీకరించడానికి ఆధార్ కార్డు
* ఆదాయ ధ్రువీకరణకు ఉపాధి హామీ కార్డు లేదా, రెవెన్యూ అధికారులు ఇచ్చే ఇన్‌కం సర్టిఫికేటు, ఆయా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛను కార్డు, ఇందిరా గాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పింఛను పథకం కార్డు, నేషనల్ సోషియల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కార్డు... వీటిలో ఏ ఒక్కటి పొందుపరిచినా సరిపోతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎమ్మెల్యే, ఎంపీ సర్టిఫికేట్ ఇచ్చినా సరిపోతుందా?
అధికారుల నుంచీ ఆదాయ ధ్రువీకరణ పత్రం పొందలేకపోయిన వారు తమ ప్రాంత ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యే, ఎంపీ, వార్డు కౌన్సిలర్ నుంచీ సర్టిఫికేట్ తీసుకొచ్చినా కూడా దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం ఉందా?
వృద్ధాప్య సమస్యలతో బాధపడేవారు దానికి సంబంధించి డాక్టర్ నుంచి మెడికల్ సర్టిఫికెట్ తీసుకుని సమర్పించాల్సి ఉంటుంది.
* ఒకవేళ వైద్యాధికారి నుంచీ ఈ సర్టిఫికేట్ పొందలేకపోతే ALIMCO రిహాబిలిటేషన్ నిపుణుల నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి.
మహిళలకు ప్రాధాన్యం ఇస్తారా?
ఈ పథకం అమలులో వృద్ధాప్య మహిళలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది.
మొత్తం పథకం లబ్ధిదారుల్లో 30 శాతం మంది తప్పనిసరిగా మహిళలై ఉండాలి.
అబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారు?
ప్రత్యేక శిబిరాల నిర్వహన ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
ఇందుకోసం ఆయా జిల్లాల్లో కలెక్టర్ నేతృత్వంలో మండలాల వారీగా శిబిరాలను ఎంపిక చేస్తారు
ఈ శిబిరాల్లో ALIMCO ప్రతినిధులు పాల్గొంటారు.
శిబిరానికి వచ్చిన వృద్ధులను ఈ ప్రతినిధులు పరిశీలించి వారి ఫిట్‌మెంట్‌ను నిర్ణయిస్తారు.
ఈ శిబిరం ద్వారా ఎంపికైన వృద్ధులకు ఈ పరికరాలను ఉచితంగా అందజేస్తారు.
ఎన్ని రోజుల్లోపు పరికరాలు ఎంపిక చేస్తారు
శిబిరాల్లో ఎంపికైన తరువాత కేవలం వారం రోజుల్లోపే పరికరాలను అందజేస్తారు
శిబిరం గురించి తెలిసేదెలా?
మీ ప్రాంతంలో శిబిరం ఎప్పుడు నిర్వహిస్తారు, లబ్ధిదారులను ఎప్పుడె ఎలా ఎంపిక చేస్తారనేది.. పత్రికలు, టీవీలు, ఇతర ప్రసార సాధనాల ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తారు.
ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చా?
ఆన్‌లైన్‌లో కూడా వృద్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం ALIMCO ఒక ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించింది. దీనిపేరు Alimco Mitra.
గూగుల్ ప్లే స్టోర్ నుంచీ ఈ యాప్‌ను మీ మొబైల్ ఫోనులో డౌన్‌లోడు చేసుకోవాలి.
అందులో మీ వివరాలన్నీ నమోదు చేయాలి.
అలాగే ఈ పథకానికి అవసరమైన పత్రాలన్నీ కూడా అప్‌లోడు చేయాలి.
తరువాత సబ్‌మిట్ బటన్ నొక్కితే మీ దరఖాస్తు పూర్తయినట్లే.
https://play.google.com/store/apps/details?id=com.alimcog.alimcogrievance
టోల్‌ఫ్రీ నంబరు ఉందా?
వయో వృద్ధుల కోసం ALIMCO టోల్ ఫ్రీ నంబరు నిర్వహిస్తోంది. ఆ నంబరు 18001805129 ద్వారా వృద్ధుల నుంచి ఫీడ్ బ్యాకు తీసుకుంటోంది.
ఇవి కూడా చూడండి:
- సచిన్‌తో బీబీసీ ఇంటర్వ్యూ: ‘‘నేను ఎందుకు రిటైర్ అయ్యానంటే..’’
- డిబ్రూగఢ్ జైలు: అమృత్‌పాల్ సింగ్‌ను బంధించిన ఈ కారాగారం ఎలా ఉంటుంది?
- హైదరాబాద్ బిర్యానీ, పిస్తా హౌజ్ హలీమ్‌లను వందల కిలోమీటర్ల దూరం ఎందుకు పంపుతున్నారు?
- స్వలింగ సంపర్కుల పెళ్లిని చట్టబద్ధం చేస్తే వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి?
- ట్రాన్స్‌జెండర్ జంట: బిడ్డకు జన్మనిచ్చిన కేరళ కపుల్
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















