సొరంగాల్లోకి వేడి నీళ్లు ఎందుకు పంపుతున్నారు? ఈ నగరం భూగర్భంలో ఏం జరుగుతోంది?

ఫొటో సోర్స్, MALARENERGI
- రచయిత, క్రిస్ బరానిక్
- హోదా, బీబీసీ న్యూస్
ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో స్వీడన్ నగరం వెస్తెరోస్ కింద భారీ సొరంగాల్లో 3 లక్షల క్యూబిక్ మీటర్ల చమురు నిల్వ చేశారు.
మూడో ప్రపంచ యుద్ధం వచ్చి ప్రపంచ దేశాల నుంచి ఇంధన సరఫరాలు నిలిచిపోతే ఈ చమురును ఉపయోగించాలని స్వీడన్ భావించింది.
అయితే, 1958ల్లో ప్రచ్ఛన్న యుద్ధ కాలంనాటి ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఆ సొరంగాల్లోని చమురును ఖాళీ చేశారు. ప్రస్తుతం అవి ఖాళీగానే ఉన్నాయి.
స్వీడన్ ఎనర్జీ కంపెనీ మలరెనేర్గి ప్రస్తుతం ఆ సొరంగాలను శుభ్రంచేసి, 95 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలుండే వేడి నీటితో వీటిని నింపే ప్రాజెక్టును మొదలుట్టింది.
అంటే వీరు అండర్‌గ్రౌండ్ థెర్మోస్ (వేడిని అలానే నిల్వ ఉంచే భూగర్భ కేంద్రం)ను నిర్మిస్తున్నారు. ఇది యూరప్‌లోనే అతిపెద్ద థెర్మోస్ అవుతుందని సంస్థ చెబుతోంది.
‘‘వీటిలో ఇంకా కాస్త చమురు కనిపిస్తోంది’’ అని గతంలో అక్కడికి వెళ్లినప్పుడు పరిస్థితి ఎలా ఉందో సంస్థ ప్రతినిధి లీసా గ్రాన్స్‌ట్రమ్ చెప్పారు.
‘‘మనం అనుకున్న దానికంటే అవి చాలా వేడిగా ఉన్నాయి. కానీ, కాస్త చమురు వాసన వస్తోంది’’ అని ఆమె చెప్పారు.
‘‘ఇక్కడ దాదాపు 120 ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్‌లో పట్టే పరిమాణంలోని నీటిని నింపొచ్చు. భూమిపై అతిపెద్ద వేడి నీళ్ల ట్యాంకు కంటే ఇది 11 రెట్లు పెద్దది’’ అని గ్రాన్స్‌ట్రమ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏం చేస్తారు?
భవిష్యత్ అవసరాలకు ఉష్ణాన్ని దాచిపెట్టేందుకు ఇలాంటి అండర్‌గ్రౌండ్ థెర్మోస్‌ను ఉపయోగిస్తుంటారు.
పునరుత్పాదక ఇంధనం వైపుగా ప్రపంచ దేశాలు అడుగులు వేయడంతోపాటు యుక్రెయిన్‌పై రష్యా దాడితో ఇంధన సరఫరాపై ఆందోళన పెరగడంతో ఇలాంటి చాలా భూగర్భ థెర్మోస్‌లను సిద్ధం చేయాలని నిపుణులు పిలుపునిస్తున్నారు.
వెస్తెరోస్ సొరంగాల్లోని వేడిని హీట్ ఎక్స్‌చేంజెర్స్ ద్వారా డిస్ట్రిక్ట్ హీటింగ్ నెట్‌వర్క్‌కు పంపొచ్చు. నగరంలోని 1,30,000 మందికి అవసరమైన విద్యుత్‌ను ఈ నెట్‌వర్కే పంపిస్తుంది.
ఈ ఏడాది చివరికల్లా సొరంగాల్లో నీటిని నింపాలని మలరెనేర్గి ప్రణాళికలు రచిస్తోంది. దీని ద్వారా 500 మెగావాట్‌ల హీటింగ్ ఎనర్జీని నెట్‌వర్క్‌కు అందించాలని భావిస్తోంది.
అసలు ఉష్ణం ఎక్కడి నుంచి వస్తోందంటే వస్తువులను మండించడం ద్వారా.
కంపెనీకి దగ్గర్లో విద్యుత్ కర్మాగారం ఉంది. అక్కడ వ్యర్థాలు లేదా బయోమాస్ నుంచి విద్యుత్ లేదా థెర్మల్ ఎనర్జీని ఉత్పత్తి చేసేందుకు ఫర్నీస్‌లు పనిచేస్తుంటాయి.
ప్రస్తుతం కర్బన ఉద్గారాలను ఒడిసిపట్టే టెక్నాలజీ ఇక్కడ అందుబాటులో లేదు. అయితే, త్వరలో ఆ టెక్నాలజీ ఇక్కడ ఏర్పాటుచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు గ్రాన్స్‌ట్రమ్ చెప్పారు.
ఆ వేడి నీళ్ల రిజర్వాయర్‌తో శీతాకాలంలో ఇళ్లకు అవసరమైన ఉష్ణాన్ని అందించాలని మలరెనేర్గి భావిస్తోంది. శీతాకాలంలో ఇక్కడ విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఆ అవసరాన్ని దీనితో భర్తీ చేయాలని సంస్థ భావిస్తోంది.

ఫొటో సోర్స్, MALARENERGI
భూగర్భ కేంద్రాలు లేదా సొరంగాల్లో ఉష్ణాన్ని నిల్వ చేయడం చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ఇక్కడి నుంచి వేడి బయటకు దాదాపుగా వెళ్లదు. పైనుండే భూమి పొరల వల్ల ఉష్ణం అక్కడే నిల్వ ఉంటుంది.
కొన్ని వారాలపాటు ఇక్కడ ఉష్ణం నిల్వ ఉంటుందని గ్రాన్స్‌ట్రమ్ చెప్పారు.
‘‘ఒకసారి నీళ్లను వేడిచేసిన తర్వాత, వాటి నుంచి ఉష్ణం బయటకు వెళ్లే అవకాశం తక్కువ. ఎందుకంటే మీరు ఆ చుట్టుపక్కల ఉండే రాళ్లను కూడా నీటితో వేడిచేస్తారు కాబట్టి’’ అని ఆమె చెప్పారు.
లండన్ లాంటి నగరాలకూ ఈ టెక్నాలజీ మెరుగ్గా ఉపయోగపడే అవకాశముంది.
ఎందుకంటే అక్కడ రైళ్లు తిరిగే భూగర్భ సొరంగాలు చాలా వేడిగా ఉంటాయి.
ప్రాజెక్ట్ వెస్తెరోస్ ఏమీ కొత్తది కాదు. ఫిన్లాండ్‌లో ఎనర్జీ సంస్థ హెలెన్.. ముస్తిక్కమా దీవిలో చిన్నచిన్న సొరంగాలను ఇలానే 2021లో వేడి నీళ్లతో నింపింది. ఆ చుట్టుపక్కలుండే 25,000 వన్-బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌లకు ఇక్కడి నుంచి ఉష్ణం వెళ్తోంది. సంవత్సరం పొడవునా ఇది పనిచేస్తోంది.
‘‘ఈ పరిష్కారం చాలా మెరుగ్గా పనిచేస్తుంది. మన దగ్గరుండే ప్రత్యామ్నాయాలలో ఇది కూడా ఒకటి’’ అని లీడ్స్ యూనివర్సిటీకి చెందిన ప్లూయెర్ లోవరిడ్జ్ అన్నారు.

ఫొటో సోర్స్, MALARENERGI
బ్రిటన్ కోల్ అథారిటీ సమాచారం ప్రకారం, బొగ్గు తవ్వేసి విడిచిపెట్టిన సొరంగాలకు పరిసరాల్లోని భూమిపై బ్రిటన్‌లో 25 శాతం జనాభా నివసిస్తోంది. వరదల సమయంలో ఈ సొరంగాల్లో చాలావరకు నీరు చేరుతుంది. దీని వల్ల చుట్టుపక్కల ఉష్ణోగ్రతలు కాస్త ఎక్కువగా ఉంటాయి.
గనుల్లోని ఈ నీటిని హీట్ పంప్ సిస్టమ్‌లతో మరికాస్త వేడిచేసి ఆ ఉష్ణాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చుట్టుపక్కల ఇళ్లకు పంపించొచ్చు.
బ్రిటన్ కర్బన ఉద్గారాల్లో 25 శాతం వరకూ ఇళ్లలో హీటింగ్ ఉపకరణాలే కారణమని ప్రొఫెసర్ లోవరిడ్జ్ అన్నారు. ఇక్కడ కర్బన ఉద్గారాలు తగ్గించడం చాలా కష్టమని లోవరిడ్జ్ చెప్పారు. ఇప్పటికీ ఇక్కడ లక్షల ఇళ్లు శిలాజ ఇంధనాలతో పనిచేసే బాయిలర్లను ఉపయోగిస్తున్నారు.
‘‘మన మంతా అందుబాటులోనుండే థెర్మల్ ఎనర్జీని వాడుకుంటే చాలా కర్బన ఉద్గారాలు తగ్గుతాయి’’అని ఆమె అన్నారు.
అయితే, ఈ థెర్మోస్ టెక్నాలజీకి ప్రత్యామ్నాయం కూడా ఉంది. అవే హాట్ రాకీ స్పాంజెస్.
ఇంపీరియల్ కాలేజీ లండన్‌కు చెందిన మాథ్యూ జాక్సన్ వీటి గురించి మాట్లాడుతూ- ‘‘నీళ్లను పీల్చుకునే ఆక్విఫెర్స్, భూమిపై గులకరాళ్లతో ఉండే పొరలను దీని కోసం ఉపయోగించుకోవచ్చు’’ అని చెప్పారు.
‘‘వీటిలోకి కూడా వేడి లేదా చల్ల నీళ్లను పంపి అలానే నిల్వచేయొచ్చు. మనకు అవసరమైనప్పుడు వాటిని ఇంటిని వేడి చేయడానికి లేదా చల్లబరచడానికి ఉపయోగించొచ్చు. ఇవి థెర్మోస్ కంటే మెరుగ్గా పనిచేస్తాయి’’అని జాక్సన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆవు, గేదె పాలే తాగాలా? గాడిద, గుర్రం, ఒంటె పాలకు డిమాండ్ ఎందుకు పెరుగుతోంది? బీపీ, డయాబెటిస్, ఆటిజం తగ్గించే పాలు ఉంటాయా
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
- భారత్, నేపాల్ మధ్య పైప్‌లైన్ ఎందుకు వేస్తున్నారు?
- అమెరికా: పొరపాటున డోర్‌బెల్ కొట్టినందుకు టీనేజర్ తలపై రివాల్వర్‌తో కాల్పులు
- హీట్ వేవ్స్: భారత్‌లో వేలాది మంది ప్రాణాలు తీస్తున్న వడగాడ్పులను ఎదుర్కోవడం ఎలా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















