స్పైడర్ వెయిన్స్: కాళ్లపై కనిపించే ఈ నరాలు చిట్లిపోతాయా... వీటికి చికిత్స ఏమిటి?

స్పైడర్ వెయిన్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డాక్టర్ ప్రతిభా లక్ష్మి
    • హోదా, బీబీసీ కోసం

కొంత మందికి కాళ్ళలో నరాలు వాపు రావడం చూస్తూ ఉంటాము. వాటిని ‘వెరికోస్ వేయిన్స్’ లేదా ‘స్పైడర్ వెయిన్స్’ అంటారు.

చర్మానికి దగ్గర్లో ఉండే రక్తనాళాల వాపు వల్ల కాళ్లు ఇలా కనిపిస్తాయి. మొదట్లో వాటి వల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. పడుకున్నప్పుడు ఇవి పెద్దగా కనిపించవు కూడా.

నిలబడినప్పుడు మాత్రమే నరాలు బాగా వాచినట్లు, లేక ఉబ్బినట్టుగా కనిపిస్తాయి.

చూడడానికి ఇబ్బందిగా కనిపిస్తోందని చాలా మంది వైద్యులను సంప్రదిస్తారు. అయితే, చాలామందిలో ఏళ్లపాటు ఇవి ఇలానే కనిపించొచ్చు.

స్పైడర్ వెయిన్స్

ఫొటో సోర్స్, Getty Images

కారణం ఏమిటి?

దీనికి ప్రధాన కారణం కాళ్ల నుంచి గుండెకు రక్తం తీసుకు వెళ్ళే రక్తనాళాల వాపు.

భూమి గురుత్వకర్షణ శక్తిని అధికమించి రక్తం గుండె వైపు రావడం కోసం, ఆ రక్త నాళాలలో, చిన్న కవాటాలు(valves) ఉంటాయి.

కాలి కండరాలు సంకోచించినప్పుడు ఆ కవాటాలు, రక్తం కేవలం గుండె వైపు వెళ్లేలా చేయడంలో దోహదపడతాయి. దానితో రక్తం కాళ్ళల్లో నిలిచిపోకుండా ఉంటుంది.

ఏదైనా కారణం వల్ల ఆ వాల్వ్‌లు బలహీనమైనప్పుడు, రక్తం ఎక్కువగా ఆ రక్తనాళాలలో నిలవడం వల్ల, అవి వాచినట్లుగా కనిపిస్తాయి.

స్పైడర్ వెయిన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఎందుకు ఇలా?

దీనికి కచ్చితమైన కారణం అంటూ ఏదీ చెప్పలేక పోయినప్పటికీ, వెరికోస్ వెయిన్స్ రావడానికి అనేక కారణాలను పరిశోధకులు గుర్తించారు.

వృద్ధాప్యం ఒక ముఖ్య కారణం. వయసు పెరగడంతో కవాటాలు బలహీనపడి, రక్తనాళాలు వాపు వచ్చే అవకాశం పెరుగుతుంది.

వివిధ హార్మోన్ల ప్రభావం వల్ల, వెరికోస్ వేయిన్స్ మహిళల్లో అధికంగా కనిపిస్తాయి.

గర్భిణుల్లో రక్తం పరిమాణం (volume) ఎక్కువ అవ్వడం వల్ల రక్తనాళాల్లో వాపు కనిపించొచ్చు.

కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉన్నట్లయితే వారి సంతానానికి కూడా ఈ సమస్య రావచ్చు.

అధిక బరువు వల్ల వెరికోస్ వేయిన్స్ సమస్య కలిగే అవకాశం ఎక్కువ.

ఎక్కువ సమయం నిలబడి ఉండడం వల్ల, లేక చాలా సేపు ఒకే చోట కదలకుండా కూర్చొని ఉండే వారిలో సాధారణంగా ఇలా వాపు కనిపిస్తుంది.

స్పైడర్ వెయిన్స్

ఫొటో సోర్స్, Getty Images

నొప్పి కూడా వస్తుందా?

వెరికోస్ వెయిన్స్ రుగ్మతలో సాధారణంగా ఎలాంటి ఇతర లక్షణాలు కనిపించవు.

మొదట్లో కేవలం కాళ్ళు అందంగా కనిపించడంలేదని, లేదా అసలెందుకు ఇలా కనిపిస్తున్నాయని కంగారుతో వైద్యులను సంప్రదిస్తారు.

కొద్ది కాలం తరవాత కాళ్ళు బరువుగా అనిపించడం, నొప్పి మొదలవుతాయి.

ఒక్కోసారి నరాల పక్కన దురద, చర్మం రంగు మారడం (పిగ్మెంటేషన్) లాంటివి కనిపిస్తాయి.

కొన్ని సందర్భాల్లో, ఆ రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టడం(thrombus)తో చాలా నొప్పి రావచ్చు. ఆ గడ్డకట్టిన రక్తం అక్కడి నుండి విడుదల అయ్యి ఏదైనా ముఖ్య అవయవానికి చేరి, రక్త నాళాలను మూసి వేస్తే, అత్యవసర పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉంది.

కొంతమందిలో పుండ్లు (venous ulcer) అవుతుంటాయి. ఇవి అంత త్వరగా మానవు.

అతి కొద్దిమందిలో, ఆ రక్తనాళాలు చిట్లి (ulcer bleed) రక్త స్రావం జరిగే అవకాశం ఉంది.

రక్త స్రావం అధికంగా జరగకపోయినా, ఆ పుండు మానడం కోసం వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.

ఒకసారి ఉబ్బిన రక్తనాళం సాధారణ పరిస్థితికి పూర్తిగా రావడం అనేది జరగకపోవచ్చు. దీనికి శస్త్రచికిత్స కూడా అవసరం రావచ్చు. రక్తనాళాల వాపు ఎక్కువ అవ్వకుండా, ఇతర సమస్యలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

స్పైడర్ వెయిన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పుడు ఏం చేయాలి?

రక్తనాళాలు వాపు రాకుండా ఉండడానికి, అధిక సమయం ఒకే చోట నిలబడి ఉండడం లేక కదలకుండా కూర్చొని ఉండడం లాంటివి చేయకూడదు. తరుచూ కదులుతూ, మధ్య మధ్యలో నడుస్తూ ఉండడం వల్ల, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

అధిక బరువు ఉన్న వారు, బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దానికి పీచు పదార్థాలు అధికంగా తినడం, పిండి పదార్ధాలు తగ్గించడం, శారీరిక వ్యాయామం చేయడం అవసరం.

కూర్చున్నప్పుడు లేక పడుకున్నప్పుడు కాళ్ళు ఎత్తులో పెట్టుకోవడం కూడా ఈ రక్తనాళాల వాపును పెరగకుండా చేస్తుంది.

వాపు తొలి దశలో ఉన్నప్పుడే జాగ్రత్తలు తీసుకుంటూ, కాళ్ళకు స్టాకింగ్స్ వేసుకోవడంతో వాపు పెరగకుండా, ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ స్టాకింగ్స్ రోజంతా వేసుకొని, పడుకునే సమయంలో తీసివేయాలి.

వీడియో క్యాప్షన్, కళ్ళు ఎందుకు అదురుతాయి? కళ్ళు చెప్పే ఆరోగ్య రహస్యాలివే..

చికిత్స ఏమిటి?

ముందే తెలిపినట్టు, రక్త నాళాలు వాపు వచ్చిన తరువాత అది తగ్గడం దాదాపుగా జరగదు. ఎక్కువ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడమే.

రక్తనాళాల చికిత్స చేసే వారు, జనరల్ సర్జన్లు అనేక రకాల శస్త్ర చికిత్సలు వీటి కోసం చేస్తారు. లైగేషన్, స్ట్రిప్పింగ్, గ్లూ వేసి మూసివేయడం, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, వంటి అనేక చికిత్స విధానాలు దీని కోసం అందుబాటులో ఉన్నాయి.

శస్త్ర చికిత్సలో కొత్తగా లేజర్ ద్వారా చాలా తేలికగా రక్తనాళాల వాపును తొలగించే విధానాలు కూడా వచ్చాయి.

అయితే ఒక సారి తొలగించిన తరవాత మళ్లీ వాపు కలిగే అవకాశం కూడా ఉంటుంది.

అందుకే, పీచు పదార్థాలు అధికంగా తీసుకుంటూ శరీర బరువును అదుపులో పెట్టుకోవాలి. అప్పుడే ఈ సమస్య ముప్పు తగ్గుతుంది.

(నోట్: రచయిత వైద్యురాలు. ఈ కథనం పాఠకులకు స్థూల అవగాహన కోసమే)

వీడియో క్యాప్షన్, వీర్యం, అండం లేకుండా సృష్టించిన ఈ పిండం గుండె కొట్టుకుంటోంది

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)