ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనే మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి... ముగ్గురూ మోదీకే జై కొడుతున్నారా?

జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

'ఆంధ్రప్రదేశ్ లో మేమే ప్రత్యామ్నాయం. వైసీపీ, టీడీపీ విధానాలతో జనం విసుగెత్తిపోయారు. వచ్చే ప్రభుత్వం మాదే.' ఇది ఏప్రిల్ 24న గుంటూరు వేదికగా జరిగిన ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ నేతలు చేసిన ప్రకటన.

కానీ, మరునాడే మోదీ డెవలప్ మెంట్ విజన్ కి చంద్రబాబు జై కొట్టారు. తన మద్దతు కూడా ప్రకటించారు.

వాస్తవానికి రాష్ట్రంలో రెండు పార్టీలకు తాము సమానదూరం పాటిస్తున్నామని బీజేపీ అంటోంది. కానీ బీజేపీ కి ఏపీలోని మూడు ప్రధాన పార్టీలు సన్నిహితంగానే ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నాయి. జనసేన నేరుగా బీజేపీ తో మితృత్వం నడుపుతోంది. తమ అనుబంధం రాజకీయాలకి అతీతమైనది అంటూ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నేరుగా మోదీ సమక్షంలోనే ప్రకటించారు. తాజాగా చంద్రబాబు కూడా మోదీ విధానాలను కొనియాడారు. తాను మద్దతుగా నిలుస్తానని కూడా ప్రకటించారు.

బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ అని దేశమంతా చెప్పుకుంటున్నా, ఏపీ లో మాత్రం బాబు - జగన్ - పవన్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తాయి. గుజరాత్, యూపి కన్నా ఏపీలోనే బీజేపీ బలంగా కనిపిస్తోందని, మూడు ప్రధాన పార్టీల మద్దతు పొందడమే దానికి కారణం అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ వ్యాఖ్యానించారు.

ఇంతకీ ఏపీ రాజకీయాల్లో ఇలాంటి పరిణామం ఎందుకు, కేంద్రంలో అధికార పక్షానికి సమిష్టిగా వంతపాడే వైఖరి వల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం ఏమైనా ఉందా అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, FACEBOOK/NARENDRA MODI

నాలుగేళ్లుగా అదే తంతు..

2019 ఎన్నికల తర్వాత పార్లమెంట్ లో వైఎస్సార్సీపీ, టీడీపీ ఒకే వైఖరి అవలంభిస్తున్నాయి. అటు లోక్ సభ, ఇటు రాజ్యసభలో కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ వస్తున్నారు. కీలకమైన బిల్లులపై పార్లమెంట్ సై అని చేతులు ఎత్తేసి, రాష్ట్రంలో నై నై అంటూ నిరసనలకు దిగడం కూడా అలవాటుగా మార్చుకున్నాయి. నూతన వ్యవసాయ చట్టాలు, దానికి ముందు పౌరసత్వ చట్టం సవరణల అంశంలో ఏపి పాలక, ప్రతిపక్షాలు దిల్లిలో ఓ వైఖరి, గల్లీలో మరో వైఖరి తీసుకున్నాయి. భిన్నమైన పార్టీలు, పైగా ప్రత్యర్థులు కూడా మోదీ ప్రభుత్వ ప్రతిపాదనల పట్ల ఒకే రీతిలో వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

చివరికి రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీజేపీ బలపరిచిన అభ్యర్థికి పూర్తి మెజార్టీ దక్కిన అతి కొద్ది రాష్ట్రాల్లో ఏపి కూడా ఒకటిగా నిలవడం ఇరు పార్టీల ఉమ్మడి వైఖరికి తార్కాణం.

అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాలు ఉన్న పార్టీలు జాతీయ స్థాయి వ్యవహారాల్లో ఒకే విధానం అనుసరిస్తుండగా, రాష్ట్రంలో మూడో పెద్ద పార్టీగా ఉన్న జనసేన కూడా బీజేపీ గూటిలో చేరింది. 2019 ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో జతగట్టి ఓటమి పాలైన తర్వాత 7 నెలలు తిరగక ముందే 2020 జనవరిలో బీజేపీతో బంధం ఏర్పరుచుకున్నారు. కీలక సందర్భాల్లో బీజేపీ విధానాలను బలపరిచారు. చివరికి 2022 మార్చిలో జరిగిన తన పార్టీ ఆవిర్భావ సభలో బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ ఆశిస్తున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

తద్వారా నాలుగేళ్లుగా మూడు పార్టీలు దాదాపుగా ఒకే విధానంలో సాగుతున్నాయి. అది కూడా మోదీ ప్రభుత్వానికి వంతపాడే పనిలో ఉన్నాయి.

ఓటు

ఫొటో సోర్స్, INCTELANGANA/FACEBOOK

అయినా అసలు సమస్య అలానే..

అడపాదడపా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు కొన్ని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటనలు మూడు పార్టీల నుంచి వస్తున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వంటి విషయాల్లో గమనించవచ్చు. రాష్ట్రంలో కార్మికుల ఆందోళనకు ఈ పార్టీల నాయకులంతా హాజరవుతారు. కానీ లోక్ సభలో నాలుగో పెద్ద పార్టీగా గుర్తింపు ఉన్న వైఎస్సార్సీపీ గానీ, టీడీపీ గానీ బలంగా నినదించిన దాఖలాలు లేవు. ప్రైవేటీకరణ సహా ఇతర విధానాలపై ఉమ్మడిగా కొన్ని విపక్షాలు ఉద్యమించే సమయంలో సైతం వారితో గొంతు కలపడానికి కూడా సంసిద్ధత వ్యక్తపరిచిన దాఖలాలు లేవు.

ప్రత్యేక హోదా ప్రస్తావన నామమాత్రం. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయకపోయినా, పెరిగిన ధరలకు అనుగుణంగా డిపిఆర్ సవరించకపోయినా, వైజాగ్ రైల్వే జోన్ తాత్సార్యం చేస్తున్నా, విభజన చట్టంలోని ఇతర అంశాలు ఉపేక్షించినా కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధం కాలేదు. రాష్ట్రానికి సంబంధించిన కీలక సమస్యలన్నీ అలానే ఉన్నప్పటికీ ఉమ్మడిగా వాటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలనే ఆలోచన కూడా చేయలేదు. పైగా విపక్షంలో ఉండగా అఖిలపక్ష సమావేశం జరిపి, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దామంటూ ప్రతిపాదించిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపేక్షించారు.

కేంద్ర ప్రభుత్వ పెద్దలని కలిసిన సందర్భాల్లో రాష్ట్ర సమస్యలు విన్నవించినట్టు పత్రికా ప్రకటనలు మాత్రం ఇచ్చారు. కానీ సమస్యలు పరిష్కారం కాకపోయినా తదుపరి కార్యాచరణకు దిగేందుకు సిద్ధం కాలేదు.

బీజేపీ

ఫొటో సోర్స్, ANI

ఏమి సాధించారో చెప్పాలి..

కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండి రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్నామని ఏపి పాలక పక్షం అంటోంది. మిత్రపక్షం బీజేపీ ద్వారా రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూస్తామని జనసేన అంటోంది. మోదీ డెవలప్ మెంట్ విజన్ కి తాను సహకరిస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఇలాంటి సానుకూలత ద్వారా ఏమి సాధించారో అయా పార్టీలు ప్రజలకు తెలియజేయాలని రాజకీయ విశ్లేషకుడు టి లక్ష్మీ నారాయణ కోరారు.

"కేంద్రంతో కయ్యానికి దిగాలని ఎవరూ కోరుకోరు. కానీ అన్ని విషయాల్లో బలపరుస్తున్నప్పుడు దాని ద్వారా రాష్ట్రానికి ప్రయోజనం ఉండాలి కదా. మూడు పార్టీలు ఉమ్మడిగా ఒకే వైఖరి తీసుకున్నప్పుడు ప్రజా ప్రయోజనాలు నెరవేరాలని ఆశిస్తారు కదా. మరి ఏమి సాధించారు.. అదనంగా ఏపి కి ఏమి తెచ్చారు.. విభజన చట్టం ఎంతవరకూ అమలు చేయించగలిగారు.. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముగ్గురు నాయకుల మీద ఉంది. కేవలం కేంద్రంలో అధికార పక్షానికి భయపడి మద్దతు పలుకుతున్నారని జనం అనుకునే పరిస్థితి వచ్చింది" అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

జగన్ దుష్ట పాలన అంతం చేస్తామని చెబుతున్న వారికి మోదీ పాలనలో ఏమి విజన్ కనిపించిందన్నది అంతుబట్టకుండా ఉందని ఆయన బీబీసీతో అన్నారు.

వీడియో క్యాప్షన్, పవన్ కల్యాణ్: కమ్యూనిస్టు ఆదర్శాలు.. కాషాయ రోడ్ మ్యాప్.. జనసేన దారెటు?

రాష్ట్రానికి చేటు..

తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో తమ రాష్ట్ర సమస్యల మీద అన్ని పార్టీలు ఉమ్మడిగా సాగడం చూస్తామని, ఏపిలో మాత్రం ప్రజల సమస్యలతో సంబంధం లేకుండా మోదీతో స్నేహం కోసం అర్రులు చాచడం చూస్తున్నామని సీనియర్ జర్నలిస్ట్ గాలి నాగరాజు అన్నారు.

"ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో మోదీ కి ప్రతిపక్షమే లేకపోవడం సిగ్గుచేటు. 2018లో మోదీ వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పిన వాళ్ళు ఈ కాలంలో రాష్ట్రానికి ఏమి చేశారని మద్దతు పలుకుతున్నారు. విభజన చట్టంలో ఒక్క అంశం నెరవేరిందని మూడు పార్టీలు చెప్పగలవా.. అయినా ఎందుకు మోకరిల్లాల్సి వస్తోంది. ఇది ఏపికి తీరని ద్రోహం అవుతుంది. పార్టీలు గ్రహించకపోవడం బాధాకరం" అంటూ వ్యాఖ్యానించారు.

తెలుగు వారి ఆత్మ గౌరవం అంటూ ఒకనాడు గొంతెత్తిన రాష్ట్రంలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఊహించనిది అంటూ నాగరాజు బీబీసీ తో అన్నారు.

సోము వీర్రాజు
ఫొటో క్యాప్షన్, సోము వీర్రాజు

మేము సమానదూరమే

రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ నాయకులు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగిన ఆ పార్టీకి ఒక్క శాతం లోపు మాత్రమే ఓట్లు దక్కాయి. నాటి బీజేపీ ఏపి శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సహా బరిలో దిగిన అభ్యర్థులంతా దాదాపుగా డిపాజిట్లు కోల్పోయారు. ఆ తర్వాత స్థానిక ఎన్నికలు, తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ నామమాత్రంగా మిగిలింది. మొన్నటి శాసన మండలి ఎన్నికల్లో సైతం సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటు కోల్పోయింది. ఇలా ప్రజల్లో బీజేపీ పుంజుకున్న సూచనలు లేవు. పైగా కొందరు కీలక నేతలు కూడా బీజేపీ ని వీడి ఇతర పార్టీల్లో చేరారు.

"పంచాయతీలకు కేంద్రం నుంచి వస్తున్న నిధులు తప్ప, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది కాబట్టే బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించింది. అన్ని రకాలుగా మోదీ ప్రభుత్వం సహాయం అందిస్తోంది. రాజకీయ విమర్శలు ప్రజలు తిరస్కరిస్తారు. మోదీ విధానాలను అందరూ బలపరచడం అభినందనీయం. మేము వైఎస్సార్సీపీ, టీడీపీ లకు సమన దూరం పాటిస్తున్నాం. జనసేన తో కలిసి బరిలో దిగి సత్తా చాటుతాం" అంటూ ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు.

కేంద్రంలో బీజేపీ పెద్దలతో సంబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నంలో ఏపీ ప్రధాన పార్టీల నేతలు ఉండగా, వారిని కాదని తాము బలపడటం ఖాయం అంటూ రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతుండడం విశేషంగా కనిపిస్తోంది.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: రాజకీయాలను ఇంకెంత దిగజారుస్తారు? -వీక్లీ షో విత్ జీఎస్

మూడు పార్టీలు ఏమంటున్నాయ్?

2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి కి 49.95% ఓట్లతో అధికారం దక్కింది. తొలిసారి ఒంటరిగా బరిలో దిగిన తెలుగుదేశం పార్టీకి 39.17% ఓట్లు లభించాయి. వామపక్షాలు, బిఎస్పీతో కలిసి పోటీ చేసిన జనసేన పార్టీకి 5.53 శాతం ఓట్లు దక్కాయి. రాష్ట్రంలో 173 స్థానాలకు పోటీ చేసినప్పటికీ బిజెపికి మాత్రం కేవలం 0. 84% ఓట్లు పోలయ్యాయి.

రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలను నిర్దేశించే స్థాయిలో ఓటర్ల ఆదరణ బిజెపికి లేదని ఈ లెక్కలు చాటుతున్నాయి. అయినప్పటికీ ఆ పార్టీతో స్నేహం కోసం ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ తహతహలాడడం రాజకీయంగా విస్మయకరంగా మారిందనే అభిప్రాయం వినిపిస్తోంది.

ఈ వ్యవహారం పై పార్టీల నేతలు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై తాము పోరాడలేదనే విమర్శ వాస్తవం కాదని వైఎస్ఆర్సిపి ఎంపీ, లోక్ సభలో ఆ పార్టీ విప్ మార్గాన్ని భరత్ అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని సమస్యల పైనా కేంద్రాన్ని పలుమార్లు నిలదీసినట్టు ఆయన తెలిపారు. విభజన చట్టం అమలు తీరుపై ప్రైవేటు బిల్లు కూడా ప్రతిపాదించినట్టు భరత్ బిబిసి కి తెలిపారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము బీజేపీ తో పొత్తు పెట్టుకున్నామని జనసేన పార్టీ నాయకుడు బొలిశెట్టి సత్య అన్నారు. ద్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు ఫలించాయని అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో అనేకమార్లు మాట్లాడినట్టు ఆయన తెలిపారు.

టీడీపీ మాత్రం భిన్నంగా స్పందించింది. రాష్ట్ర హక్కులకై ఉద్యమించిన ఘనత తమదేనని ఆ పార్టీ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ అన్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయాల కన్నా దేశ ప్రయోజనాలకే టీడీపీ కట్టుబడి ఉంటుందని తమ అధినేత స్పష్టం చేసినట్టు ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానన్న పవన్, వైసీపీ నేతలు ఏమన్నారంటే..

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)