ఐసీయూలో అద్భుతం: 'నా భార్య బతికే అవకాశాలు 2 శాతమే అన్నారు.. కానీ, ఏడాదిన్నర తరువాత కోమా నుంచి బయటికొచ్చింది'

ఫొటో సోర్స్, PERSONAL ARCHIVE/LUCIANO BUENO
- రచయిత, గిలియా గ్రాంచి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇసాబెల్ కార్డోసో 2021 నవంబర్‌లో తన రొమ్ములలో ఒకదానికి కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నారు. రొమ్ములో ట్యూమర్ బాధపెడుతుండడంతో కొంత భాగాన్ని తొలగించాల్సి వచ్చింది. ఈ సర్జరీ బ్రెజిల్‌లో జరిగింది.
సర్జరీ తరువాత ఇసాబెల్‌కు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. మెదడుకు తగినంత ఆక్సిజన్ అందలేదు. దీన్నీ 'రిబ్రల్ హైపోక్సియా' అంటారు.
ఇదెలా జరిగిందో తమకు తెలియలేదని ఇసాబెల్ భర్త లూసియానో బ్యూనో చెప్పారు.
మెదడుకు ఆక్సిజన్ అందకపోతే నిమిషాల వ్యవధిలో కణాలకు కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుంది.
ఆక్సిజన్ సరిగా అందకపోతే జ్ఞాపకశక్తి కోల్పోవడం, చేతులు, కాళ్లు సమన్వయం కోల్పోవడం, ఏకాగ్రత కోల్పోవడం, మూర్ఛరావడంతో పాటు కోమాలోకి వెళ్లిపోయే పరిస్థితి కూడా రావచ్చు.
ఇసాబెల్‌కు సరిగ్గా ఇదే జరిగింది.
"ఆమెకు రోజూ సీజర్స్ (మూర్చలు) వచ్చేవి. వాటిని నియంత్రించడానికి మందులిచ్చి కోమాలోకి పంపాల్సి వచ్చింది. మందులు ఆపేశాక, ఆమె పూర్తిగా నిద్రావస్థలోకి వెళ్లిపోయింది. ఒక్కోసారి కళ్లు తెరిచేది. కానీ, చూస్తోందో లేదో మాకు తెలీదు. ఇది మెదడుతో సంబంధం లేకుండా జరిగే ప్రక్రియ అని డాక్టర్లు చెప్పారు" అని లూసియానో వివరించారు.
అప్పటికి ఇసాబెల్‌కు 45 ఏళ్లు, లూసియానోకు 43 ఏళ్లు. వారికి వివాహమై 15 సంవత్సరాలైంది. పిల్లల్ని దత్తత తీసుకోవడానికి దరఖాస్తు పెట్టుకున్నారు. పిలుపు కోసం వేచి చూస్తున్నారు.
"మాకు ఎన్నో కలలు ఉన్నాయి. ఇద్దరం కలిసి చేయాల్సిన పనులు ఉన్నాయి. కానీ, అనుకోని విపత్తు వచ్చిపడింది. మందులు ఆపేశాక, ఆమె కళ్లు తెరుస్తుంది, మేం ఇంటికి వెళ్లిపోవచ్చు అనుకున్నా. మెల్లగా మా జీవితాలు మళ్లీ ప్రారంభమవుతాయని ఆశించాను" అని లూసియానో చెప్పారు.

ఫొటో సోర్స్, PERSONAL ARCHIVE/LUCIANO BUENO
క్రమంగా ఇసాబెల్ పరిస్థితి దిగజారుతోందని, ఆమె కోలుకోవడానికి అవకాశాలు చాలా తక్కువ అని డాక్టర్లు చెప్పారు.
ఏడాది కన్నా ఎక్కువ కోమాలో ఉంటే మళ్లీ కోలుకునే అవకాశాలు చాలా తక్కువ.
2019లో 'న్యూరాలజీ' జర్నల్‌లో వచ్చిన ఒక అధ్యయనం ప్రకారం, ఏడాది కోమా తరువాత కోలుకునే అవకాశాలు కేవలం 4 శాతం.
"ఆక్సిజన్ అందకపోతే మెదడులోని సున్నితమైన భాగాలు దెబ్బతింటాయి. అవి తిరిగి సాధారణ స్థితికి రావడం కష్టం. కొన్నిసార్లు రోగి కళ్లు తెరిచినప్పటికీ, మెదడు పనిచేయదు. వాళ్లు మామూలు కావడానికి అవకాశాలు చాలా తక్కువ" అని బ్రెసిలియాలోని శాంటా లూసియా హాస్పిటల్‌లో న్యురాలజిస్ట్ అమౌరి అరౌజో గోడిన్హో వివరించారు.
అయితే, పిల్ల న్యూరోప్లాస్టిసిటీ కారణంగా కోలుకునే అవకాశాలు కొంత మెరుగ్గా ఉంటాయని ఆయన చెప్పారు.
న్యూరోప్లాస్టిసిటీ అంటే మెదడు నిర్మాణాన్ని, కార్యకలాపాలను మార్చుకోగలిగే సామర్థ్యం.
ఇది పిల్లల్లో ఉంటుంది. వారి మెదడు అభివృద్ధి చెందే దశలో ఉంటుంది కాబట్టి, మార్పులను కొంతవరకు తట్టుకోగలదు. అయితే, పిల్లలు కూడా కచ్చితంగా కోలుకుంటారని చెప్పలేం.
'నా భార్య మళ్లీ కోలుకోదని చెప్పారు'
ఇసాబెల్‌ను ఇంటికి తీసుకెళ్లి, అలవాటైన పరిసరాల్లో చికిత్స అందించవచ్చని డాక్టర్లు సూచించారు.
"ఆ మాట విని నేను షాక్ అయిపోయాను. ఇసాబెల్ కోలుకునేవరకు ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తారనుకున్నా. ఇంట్లోనే వైద్యం చేయిస్తే కలిగే ప్రయోజలేమిటో నాకు అర్థం కాలేదు. దీనిపై కొంత రీసర్చ్ చేసిన తరువాత అర్థమైన విషయం ఏమిటంటే, ఇసాబెల్ లాంటి కండిషన్ ఉన్నవారికి ఆస్పత్రి పరిసరాలు పనికి రావు" అని లూసియానో చెప్పారు.
లూసియానో, తన సోదరుడితో కలిసి సొంత కంపెనీ నడుపుతున్నారు. కాబట్టి, ఎక్కువ భాగం ఇంటివద్ద గడుపుతూ, భార్యను చూసుకునేవారు.
ఎంత బాగా చూసుకుంటున్నప్పటికీ, ఇసాబెల్‌కు ఏదో ఒక సమస్య వస్తూనే ఉండేది. ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చేది.
"ఫ్లూ మనకు సోకితే వేరు. ఇసాబెల్ వంటి రోగులకు వస్తే మరోలా ఉంటుంది. అలాగే, తనకు థ్రాంబోసిస్ సోకింది. సమస్య వచ్చిన ప్రతిసారి 15-20 రోజులు ఆస్పత్రిలో చికిత్స అందించాల్సి వచ్చేది. ఇసాబెల్ పరిస్థితి మెరుగుపడదని, కోలుకునే అవకాశాలు 2 శాతం మాత్రమేనని డాక్టర్లు స్పష్టంగా చెప్పేశారు."
అప్పటి నుంచి లూసియానో ఆ రెండు శాతాన్నే పట్టుకున్నారు. ఆ రెండు శాతంలో తన భార్య ఉండవచ్చని ఆశపెట్టుకున్నారు.
"కోమా నుంచి కోలుకున్న రోగుల గురించి చదవడం మొదలెట్టాను. వైద్య పరిశోధనలను పరిశీలించాను. కానీ, నా భార్య లాంటి కేసు ఏదీ కనిపించలేదు."

ఫొటో సోర్స్, PERSONAL ARCHIVE/LUCIANO BUENO
'ఐసీయూలో అద్భుతం'
ఈ ఏడాది మార్చిలో ఇసాబెల్‌ను ట్రాకియోబ్రోన్కైటిస్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చవలసి వచ్చింది. అప్పుడు మళ్లీ ఆమెకు మూర్ఛలు వచ్చాయి. ఐసీయూలో పెట్టారు.
అక్కడ నర్స్ ఒకామె రోజూ ఇసాబెల్‌కు గుడ్ మార్నింగ్ చెబుతూ ఉండేవారు. ఒకరోజు ఇసాబెల్ అందుకు స్పందించారు.
"ఆమె నోరు కదిపింది. ట్రాకియోబ్రోన్కైటిస్ చికిత్స కోసం ఆమె నోట్లో ఒక గొట్టం పెట్టారు. ఆమె నోట్లో నుంచి శబ్దం వస్తోందో లేదో తెలుసుకోవాలంటే ఆ గొట్టాన్ని చేత్తో మూసివేయాలి. మేం అలా చేయగానే ఆమె గొంతు నుంచి శబ్దాలు వచ్చాయి. అతికష్టం మీద నా పేరు చెప్పింది. తనకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారన్న విషయం తెలుసని చెప్పింది. అది చూడగానే నాకు ఏడుపొచ్చేసింది. నా భార్య బతకడానికి 2 శాతం మాత్రమే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెప్పారు. కానీ, తను కోమా నుంచి బయటికొచ్చింది" అంటూ ఆ క్షణాలను గుర్తుచేసుకున్నారు లూసియానో.
ఏడాది నుంచి ఇసాబెల్‌కు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, నర్సులు అందరూ వెంటనే ఆ గదిలోకి వచ్చేశారు.
"ఇసాబెల్ కోమా నుంచి లేవడం చూసి అందరం చాలా ఆశ్చర్యపోయాం. ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదు" అని ఐసీయూ కోఆర్డినెటర్ డాక్టర్ గుస్తావో టర్రే అన్నారు.
ఇసాబెల్ కోలుకోవడానికి కారణాలు స్పష్టంగా తెలియలేదని డాక్టర్లు చెప్పారు. కొత్తగా మందులేవీ ఇవ్వలేదని, రోజూ ఇస్తున్నవే ఇచ్చామని చెప్పారు.
ఈ కేసును "ఐసీయూ 4 అద్భుతం" అని పిలవడం మొదలుపెట్టారు. ఐసీయూ 4 లోనే ఇసాబెల్ ఎక్కువసార్లు చికిత్స పొందారు.

ఫొటో సోర్స్, PERSONAL ARCHIVE/LUCIANO BUENO
కోలుకుంటున్న ఇసాబెల్
ఇసాబెల్‌కు కొన్ని విషయాలు గుర్తున్నాయని, మెదడుకు దెబ్బ తగిలినా ఆమె జ్ఞాపకశక్తి పూర్తిగా కోల్పోలేదని లూసియానో చెప్పారు.
ఆమెకు తన పేరు గుర్తుంది. కుటుంబ సభ్యులను చూడగానే గుర్తుపడతారు. సంతోషపడతారు. కానీ, వాళ్ల పెంపుడు కుక్కను గుర్తుపట్టలేదు. దాన్ని ఇసాబెల్ సర్జరీకి కొన్ని రోజుల ముందే ఇంటికి తెచ్చి పెంచడం మొదలెట్టారు.
"ఆమె కోమా నుంచి బయటపడ్డారు కానీ, పూర్తిగా కోలుకున్నారని చెప్పలేం. ఇంకా కొంత మెరుగుపడాల్సింది ఉంది" అని డాక్టర్ టర్రే చెప్పారు.
ఇసాబెల్‌కు ఇంట్లోనే స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ అందిస్తున్నారు. అలాగే, మానసిక వైద్యం కూడా అందిస్తున్నారు.
ఆమెకు అన్నీ సౌకర్యవంతంగా ఉండేలా చూసుకుంటున్నారు ఆమె భర్త లూసియానో.
"పాడియాట్రిస్ట్‌తో సెషన్లు పెడుతున్నాను. ఆమె జుత్తును సవరించడానికి ప్రొఫెషనల్‌ను అపాయింట్ చేశా. తన చర్మాన్ని తేమగా ఉంచేందుకు నేనే స్వయంగా క్రీములు రాస్తుంటాను. తన ఆత్మగౌరవం కాపాడడం చాలా ముఖ్యం.
రోజుకో అడుగు ముందుకు వేస్తున్నాం. ఆమె ఇప్పుడు నాతోనే ఉంది. నేను చెప్పే మాటలు తనకు వినబడుతున్నాయి. కొద్ది కొద్దిగా స్పందిస్తోంది. మాట్లాడుతోంది. తను పూర్తిగా కోలుకుంటుందని నాకు నమ్మకం ఉంది" అంటున్నారు లూసియానో.
ఇవి కూడా చదవండి:
- నరేంద్ర మోదీపై చంద్రబాబు స్వరం ఎలా మారుతూ వస్తోంది? ఎప్పుడు పొగిడారు, ఎప్పుడు విమర్శించారు?
- 'చివరి లాటరీ టికెట్'తో రెండున్నర కోట్లు గెలుచుకున్న 89 ఏళ్ల రిక్షావాలా
- మూల కణాల మార్పిడి: క్యాన్సర్‌తోపాటు హెచ్ఐవీ నుంచి కోలుకున్న అమెరికన్ కథ
- లైంగిక వేధింపుల గురించి మహిళా క్రీడాకారులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు..
- ఆనంద్ మోహన్ సింగ్: తెలుగు ఐఏఎస్ అధికారి హత్య కేసులో నేరస్థుడిని ఎందుకు విడుదల చేస్తున్నారు?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















