సతి: భర్త చితి మీదే భార్యను ఆహుతి చేసే దురాచారంపై భారత్ ఎలా గెలిచింది?

ఫొటో సోర్స్, KEAN COLLECTION
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ న్యూస్
హిందువుల్లో చనిపోయిన భర్తతోపాటు భార్యను కూడా చితిపై సజీవ దహనంచేసే దురాచారం ‘‘సతి’’ని 1829 డిసెంబరులో బ్రిటిష్ ఇండియా తొలి గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్ రద్దుచేశారు.
అప్పట్లో ఆయన బెంగాల్ గవర్నర్ జనరల్‌గా ఉండేవారు. సతిపై 49 మంది సీనియర్ సైన్యాధికారులు, ఐదుగురు జడ్జిల అభిప్రాయాలను ఆయన సేకరించారు. ఆ తర్వాత ‘బ్రిటిష్ పాలనపై మచ్చ’లా కనిపిస్తున్న దీన్ని రద్దుచేసేందుకు సమయం ఆసన్నమైందని ఆయన భావించారు.
‘‘మానవత్వానికి చెంపపెట్టులా మారిన సతి చాలా మంది హిందువులనూ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది, ఇది చట్టవిరుద్ధమైనది కూడా..’’అని విలియం బెంటింక్ తన ఆదేశంలో పేర్కొన్నారు.
వితంతువును దహనం చేసేందుకు ప్రయత్నించిన లేదా దీని కోసం సాయంచేసిన వారిని హత్య కేసులో దోషిగానే పరిగణిస్తామని ఆ ఆదేశంలో బెంటింక్ స్పష్టంచేశారు. ఇది ఆమె ఇష్టపూర్వకంగానే జరిగినప్పటికీ చర్యలు తీసుకుంటామని తెలిపారు.
దీంతో సతి కోసం వితంతువులను బలవంతపెట్టినా లేదా సజీవ దహనంలో ఆమెకు సాయం చేసినా మరణ శిక్ష విధించే అధికారాన్ని కోర్టులకు ఆయన అప్పగించారు.

ఫొటో సోర్స్, SCIENCE & SOCIETY PICTURE LIBRARY/GETTY IMAGES
సతిని నిర్మూలించేందుకు భారత సంఘ సంస్కర్తలు సూచించిన సిఫార్సుల కంటే బెంటింక్ కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చారు. దీని తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ నేతృత్వంలోని దాదాపు 300 మంది ప్రముఖ హిందువులు ఆయనను కలిసి థ్యాంక్స్ చెప్పారు.
‘‘మహిళలను చనిపోయిన భర్తతోపాటు చితిపై హత్య చేయడంతో తమకు అంటుకున్న కళంకాల నుంచి శాశ్వతంగా రక్షించారు’’అంటూ వారు ధన్యవాదాలు చెప్పారు.
అయితే, కొందరు సంప్రదాయ హిందువులు దీన్ని వ్యతిరేకించారు. ఈ విషయంపై వారు బెంటింక్‌కు పిటిషన్‌లు కూడా సమర్పించారు. మేధావులు, గ్రంథాల్లో అంశాలను ప్రస్తావిస్తూ.. ‘‘మతపరంగా ఇది తప్పనిసరి’’అని చెప్పుకొచ్చారు. కానీ, బెంటింక్ వెనకడుగు వేయలేదు.
దీంతో ఆ పిటిషనర్లు బ్రిటిష్ ఇండియాలోని సర్వోన్నత న్యాయస్థానమైన ప్రీవీ కౌన్సిల్‌కు వెళ్లారు. 1832లో ఆ కౌన్సిల్ కూడా బెంటింక్ నిర్ణయాన్ని సమర్థించింది. ‘‘సతిని గర్హనీయమైన నేరం’’గా కౌన్సిల్ పేర్కొంది.
‘‘190 ఏళ్ల బ్రిటిష్ పాలనలో సనాతన వాదులకు ఎలాంటి ప్రత్యేక రాయితీలు ఇవ్వకుండా రూపొందించిన ఏకైక సామాజిక చట్టం ఇదే కావొచ్చు’’అని భారత్‌లో కులాలకు సంబంధించిన చట్టాల చరిత్రపై కొత్త పుస్తకం ‘‘క్యాస్ట్ ప్రైడ్’’రాసిన మనోజ్ మిట్ట చెప్పారు.
బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా గాంధీజీ నైతిక పోరాటాన్ని మొదలుపెట్టడానికి చాలా కాలం ముందే, కుల, లింగ పక్షపాతాలకు వ్యతిరేకంగా బెంటింక్ అదే పోరాటం చేశారు’’అని మిట్ట రాసుకొచ్చారు.
‘‘ఇటు స్థానికులకు, అటు వలస పాలకులకు మచ్చ తెస్తున్న ఒక దురాచారాన్ని నేరంగా పరిగణించి ఆయన నైతిక విజయం సాధించారు’’అని మిట్ట చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నీరు గార్చారు..
అయితే, 1837లో బెంటింక్ చట్టాన్ని మరో బ్రిటన్ పాలకుడు, భారత శిక్షా స్మృతి (ఐపీసీ) రచయిత థామస్ మెకాలే నీరుగార్చారు. ఆ వితంతువు సమ్మతితోనే చితికి నిప్పుపెట్టారని సాక్ష్యాధారాలతో రుజువు చేయగలిగే ఆ నిప్పు పెట్టినవారిని విడిచి పెట్టొచ్చంటూ మెకాలే మార్పులు చేశారు.
‘‘మహిళలు తమకు తాము నిప్పు పెట్టుకోవడం మతపరమైన కర్తవ్యం కావొచ్చు. కొన్నిసార్లు దీన్ని వారు తమ గౌరవానికీ ప్రతీకగా భావించొచ్చు. అందుకే వారు తమకు తాము నిప్పు పెట్టుకొని ఉండొచ్చు’’అని ముసాయిదాలో ఆయన రాసుకొచ్చారు.
సతి విషయంలో మెకాలే ‘‘సానుభూతి’’ ఆ తర్వాత కాలంలో బ్రిటిష్ పాలకుల వైఖరితో ప్రతిధ్వనించిందని మిట్ట అన్నారు.
ఈస్ట్ ఇండియా కంపెనీపై 1857నాటికి సిపాయిల తిరుగుబాటు తర్వాత మెకాలే తన ముసాయిదాను సిద్ధంచేశారు. తూటాలపై తమ మతాల్లో నిషేధించిన జంతువుల కొవ్వుతో పూతవేశారనే ఆందోళన కూడా ఆనాటి తిరుగుబాటుకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ‘‘తిరుగుబాటులో ప్రధాన పాత్ర పోషించిన అగ్రవర్ణాల హిందువులను సతి నిబంధనలను నీరుగార్చడం ద్వారా శాంతింపచేసేందుకు బ్రిటిష్ పాలకులు ప్రయత్నించారు’’అని మిట్ట రాసుకొచ్చారు.
1862నాటి చట్టం ‘సతిని నరహత్యగా పరిగణించడం, ఇలాంటి కేసుల్లో దోషులకు మరణ శిక్ష విధించే అవకాశం’.. ఈ రెండింటినీ రద్దుచేసింది. అంటే, ఆమె స్వయంగానే భర్తతోపాటు ఆహుతి చేసుకోవాలని భావించారు కాబట్టి ఇది ఆత్మహత్యగా కోర్టులో నిందితులు తరఫు న్యాయవాదులు వాదించేందుకు ఇది వీలుకల్పించింది.
‘‘సతి రద్దు, కుల బహిష్కరణపై నిషేధం, కులాలు, మతాల నుంచి వెలివేసిన వారికి వారసత్వంగా ఆస్తి పొందే హక్కును కల్పించే 1850నాటి చట్టం.. లాంటి సామాజిక చట్టాలకు వ్యతిరేకంగా చెలరేగుతున్న అసమ్మతిని బుజ్జగించే ప్రయత్నంగా సతి చట్టాన్ని నీరుగార్చారు’’అని మిట్ట రాసుకొచ్చారు.
అయితే, సతి చట్టాన్ని నీరు గార్చడానికి చివరి కారణం మాత్రం జంతువుల కొవ్వు పూసిన తూటాలతో అగ్ర వర్ణాల హిందువుల సైనికుల్లో చెలరేగిన ఆందోళనను శాంతింపజేయడమే.

ఫొటో సోర్స్, Getty Images
1829 నుంచి 1862 మధ్య ఈ నేరం హత్య నుంచి ఆత్మహత్యాయత్నంగా మారింది.
‘‘1829 తర్వాత సతిని పాటించేవారు తగ్గారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా అగ్రవర్ణాల్లో భర్తతోపాటు ఆత్మాహుతి చేసుకునేవారు’’అని మిట్ట రాసుకొచ్చారు.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కాంగ్రెస్‌లో క్రియాశీల పాత్ర పోషించిన, భారత స్వాతంత్ర పోరాటంలోనూ కీలకంగా మారిన న్యాయవాది మోతీలాల్ నెహ్రూ.. 1913లో ఉత్తర్ ప్రదేశ్‌లో ఆరుగురు అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులకు సతి కేసులో శిక్ష పడకుండా వాదించారు.
ఆ ఆరుగురూ ఓ మహిళ ఆత్మాహుతి చేసుకోవడంలో సాయం చేశారు. అయితే, ఈ కేసులో ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిని దోషిగా జడ్జి నిర్ధారించారు. వీరిలో ఇద్దరికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు.
70 ఏళ్ల తర్వాత, సతి చివరి మలుపు తీసుకుంది. 1987లో మోతీలాల్ నెహ్రూ మనుమడు రాజీవ్ గాంధీ.. సతిని నేరంగా పరిగణిస్తూ చట్టం తీసుకొచ్చారు. వితంతువులు ఆత్మహత్య చేసుకోవడానికి సాయం చేసినా, వారికి మద్దతు పలికినా ఏడేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేశారు. మళ్లీ ఆత్మహత్య నుంచి హత్యకు ఈ నేరాన్ని మార్చారు. ఆమె చితికి నిప్పు పెట్టినవారికి మరణ విక్ష కూడా తీసుకొచ్చారు.
రాజస్థాన్‌లోని ఒక చిన్న గ్రామంలో ‘‘రూప్ కన్వర్’’అనే ఒక చిన్నారి పెళ్లి కూతురికి చనిపోయిన భర్తతోపాటు నిప్పుపెట్టడంతో భారీగా నిరసన వ్యక్తమైంది. దీంతో ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. 1947 తర్వాత అది 41వ సతి కేసని మిట్ట రాసుకొచ్చారు.
రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఆ చట్టంలోని చాలా అంశాలు విలియం బెంటింక్ చట్టంలో కనిపిస్తాయి. ‘‘అది బెంటింక్‌కు నివాళి అర్పించడమే. అది ఒక వలస పాలకుడికి వలస పాలిత దేశం ఇచ్చిన నివాళి’’అని మిట్ట తన పుస్తకంలో రాశారు.
ఇవి కూడా చూడండి:
- సచిన్‌తో బీబీసీ ఇంటర్వ్యూ: ‘‘నేను ఎందుకు రిటైర్ అయ్యానంటే..’’
- డిబ్రూగఢ్ జైలు: అమృత్‌పాల్ సింగ్‌ను బంధించిన ఈ కారాగారం ఎలా ఉంటుంది?
- హైదరాబాద్ బిర్యానీ, పిస్తా హౌజ్ హలీమ్‌లను వందల కిలోమీటర్ల దూరం ఎందుకు పంపుతున్నారు?
- స్వలింగ సంపర్కుల పెళ్లిని చట్టబద్ధం చేస్తే వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి?
- ట్రాన్స్‌జెండర్ జంట: బిడ్డకు జన్మనిచ్చిన కేరళ కపుల్
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















