వజైనల్ ఆట్రఫీ: సెక్స్‌లో నొప్పికి కారణమయ్యే ఈ రుగ్మతకు చికిత్స ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అలీసియా హెర్నాండేజ్
- హోదా, బీబీసీ న్యూస్
వజైనల్ ఆట్రఫీ.. దాదాపు మహిళలంతా తమ జీవితంలో ఏదో ఒక దశలో ఈ రుగ్మతకు గురయ్యే ఉంటారు. కానీ, దీని గురించి పెద్దగా ఎవరూ బయటకు మాట్లాడరు.
కొన్నిసార్లు లక్షణాలు తీవ్రంగా కనిపిస్తున్నప్పటికీ వైద్యులను సంప్రదించేందుకు చాలా మంది వెనుకాడుతూ ఉంటారు.
‘‘మొదట్లో చాలా కొద్ది మందినే ఈ రుగ్మత పీడిస్తుందని అనుకునేవారు. కానీ, నేడు చాలా మందికి ఇది వేధిస్తోందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా చాలా మందిలో లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొంతమందిలో అయితే, లక్షణాలు ఆందోళనకర స్థాయిలో కూడా కనిపిస్తున్నాయి’’ అని సెక్సాలజిస్టు, రీప్రోడక్టివ్ హెల్త్ నిపుణురాలు లారా కామెరా చెప్పారు.
ఈ వ్యాధి వచ్చినట్లు ఎలా తెలుస్తుంది? దీన్ని ఎలా గుర్తు పట్టాలి? దీనికి చికిత్స ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
లక్షణాలు ఏమిటి?
ఈ రుగ్మత సోకినవారిలో యోని పొడిబారుతుంది. సెక్స్ సమయంలో విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ రుగ్మతతో వైద్యుల దగ్గరకు వచ్చే వారిలో 90 శాతం మంది తమకు విపరీతమైన నొప్పి వస్తుందని చెబుతుంటారు.
‘‘సెక్స్ సమయంలో వచ్చే నొప్పి గురించి మనం అంతగా పట్టించుకోం. చాలా మంది మహిళలు సెక్స్ సమయంలో చాలా ఇబ్బంది పడతారు. కానీ, దాని గురించి మాట్లాడేందుకు ఎవరూ ముందుకురారు. దీన్ని వారొక చెడ్డ విషయంగా భావిస్తారు’’ అని కామెరా చెప్పారు.
సెక్స్ సమయంలో జననాంగాల్లో శ్లేష్మం సరిగా లేకపోవడం, విపరీతమైన దురద, చిరాకు, సెక్స్ తర్వాత రక్తం కారడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి.
మూత్రం పూర్తిగా బయటకు రాకపోవడం, వెంటనే మూత్రం వస్తున్నట్లు అనిపించడం, మళ్లీమళ్లీ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు కూడా వజైనల్ ఆట్రఫీలో కనిపిస్తాయని స్పానిష్ సొసైటీ ఆఫ్ గైనకాలజీ అండ్ ఆబ్‌స్టెట్రిక్స్ (ఎస్ఈజీవో) తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
కొందరిలో సెక్స్ కోరికలు కూడా తగ్గుతుంటాయి. మిగతా లక్షణాలు కూడా కోరికలు తగ్గేందుకు కారణం కావచ్చు.
‘‘విసుగు, ఆందోళన మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఫలితంగా దంపతుల సెక్స్ జీవితంపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా సెక్స్ చేసేటప్పుడు కచ్చితంగా నొప్పి వస్తుందనే ఆందోళన మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నొప్పి వల్ల సెక్స్ జీవితాన్ని కూడా వారు ఆస్వాదించలేరు’’ అని కామెరా చెప్పారు.
‘‘ఈ నొప్పిని చాలా మంది మహిళలు నిర్లక్ష్యం చేస్తారు. మా దగ్గరకు వచ్చే మహిళల్లో కొందరైతే దాదాపు ఏళ్ల నుంచి మేం దీని భరిస్తున్నామని చెబుతుంటారు’’ అని ఆమె అన్నారు.
ఈస్ట్రోజెన్ స్థాయులు పడిపోవడంతో..
వజైనల్ ఆట్రఫీని వైద్య పరిభాషలో జెనిటోయూరినరీ సిండ్రోమ్ ఆఫ్ మెనోపాజ్ (జీఎంఎస్)గా పిలుస్తారు.
దీని వల్ల జననాంగాలు, మూత్రనాళం, మూత్రాశయం కూడా ప్రభావితం అవుతాయి. మెనోపాజ్‌కు దగ్గర పడే మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు పడిపోయినప్పుడు ఇది వచ్చే అవకాశం ఎక్కువ.
ఈస్ట్రోజెన్ అనేది అటు మహిళలతోపాటు పురుషుల్లోనూ ఉత్పత్తయ్యే హార్మోన్. గుండె పనితీరు, ఎముకల దృఢత్వం, మెదడు ఆరోగ్యంలోనూ ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది.
మెనోపాజ్ సమీపిస్తున్నప్పుడు ఈ హార్మోన్‌లో హెచ్చుతగ్గులు వస్తుంటాయి. మరోవైపు ఒత్తిడి కూడా ఈ హార్మోన్‌ను ప్రభావితం చేస్తుంటుంది.
‘‘పిల్లలకు పాలిచ్చేటప్పుడు కూడా ఈ హార్మోన్ స్థాయులు తగ్గుతుంటాయి. గర్భ నిరోధక మాత్రలు వేసుకునేటప్పుడు, కొన్ని రకాల క్యాన్సర్‌లు చుట్టుముట్టినప్పుడు, కాన్సర్ చికిత్సల సమయంలోనూ ఈస్ట్రోజెన్ స్థాయులు తగ్గిపోతుంటాయి’’ అని కామెరా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
చికిత్స ఏమిటి?
ఈస్ట్రోజెన్ స్థాయులు తగ్గడం అనేది దాదాపు అందరి మహిళలకూ జీవితంలో ఏదో ఒక దశలో జరుగుతూనే ఉంటుంది. ఇది వజైనల్ ఆట్రఫీగా మారక ముందే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు.
మెనోపాజ్‌కు ఏళ్ల ముందు నుంచే ఆరోగ్యకర జీవన శైలి మార్పులను అలవాటు చేసుకోవాలని ఎస్ఈజీవో సూచిస్తోంది. అంటే ఆరోగ్యకర బరువు ఉండేలా చూసుకోవడం, తరచూ వ్యాయామం చేయడం, మంచి ఆహారం తీసుకోవడం లాంటివి చేయాలి.
పొగ తాగే అలవాటు ఉంటే దానికి దూరం జరగాలి.
‘‘ధూమపానంతో ఈస్ట్రోజన్ జీవక్రియా చర్యల్లో వేగం పెరుగుతుంది. అంటే వజైనల్ ఆట్రఫీ లక్షణాలు మరింత ఎక్కువగా కనిపిస్తాయి’’అని కామెరా చెప్పారు.
మనం ముందుగా చెప్పుకున్నట్లే చాలా కొద్ది మంది మాత్రమే ఈ సమస్యకు చికిత్స కోసం వైద్యుల దగ్గరకు వస్తుంటారు. అంటే ఏళ్లపాటు చాలా మంది శారీరక, మానసిక ఆందోళనకు గురవుతుంటారు.
బాధితులకు మొదట వజైనల్ ల్యూబ్రికెంట్లు, జననాంగాల్లో పూసుకునే మాయిశ్చరైజింగ్ క్రీమ్‌లను సూచిస్తారని ఎస్‌ఈజీవో చెబుతోంది.
వీటి వల్ల జననాంగాల్లో శ్లేష్మం స్థాయులు పెరుగుతాయని, వీటితో ఆరోగ్యానికి కూడా ఎలాంటి హానీ ఉండదని ఎస్ఈజీవో చెబుతోంది.
‘‘పొడిబారినట్లు అనిపించిన వెంటనే ఆ క్రీములను ఉపయోగించడం మొదలుపెట్టాలి. వీటిని చర్మంపై మనం సాధారణంగా రాసుకునే క్రీముల్లానే ఉపయోగించుకోవచ్చు. మార్కెట్‌లో ఇవి అందుబాటులో ఉంటాయి’’ అని కామెరా చెప్పారు.
అప్పటికీ ఎలాంటి మార్పూ లేకపోతే, హార్మోన్ చికిత్సను వైద్యులు సూచిస్తారు. ఈస్ట్రోజెన్ క్రీముల నుంచి వజైనల్ ట్యాబ్లెట్లు, రింగులను వైద్యులు సూచించొచ్చు. ఇవి హార్మోన్ స్థాయులు పెరగడానికి దోహదం చేస్తాయి.
కొత్తగా లేజర్ టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే, దీర్ఘకాలంలో ఇది ఎలాంటి ప్రభావం చూపుతోందో స్పష్టంగా వెల్లడించే డేటా అందుబాటులో లేదని ఎస్‌ఈజీవో చెబుతోంది.
ఇవి కూడా చదవండి:
- విశాఖ స్టీల్ ప్లాంట్‌ను తెలంగాణ ప్రభుత్వం కొనగలదా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- డేటింగ్: బహుళ వ్యక్తులతో సంబంధాలు నడిపే ‘సోలో పాలియమరి’లో మంచి, చెడు ఏమిటి?
- ఇండియాలో టీనేజ్ సెక్స్ ఎందుకు నేరం? ‘సమ్మతి తెలిపే వయసు’ను తగ్గించాలని కొందరు జడ్జిలు ఎందుకు అంటున్నారు
- పోలీసుల ఘోర తప్పిదంతో టీనేజర్‌కు మరణశిక్ష, 28 ఏళ్లు జైల్లోనే..చివరికెలా బయటపడ్డారంటే?
- జలియన్‌వాలా బాగ్ మారణహోమం: సరిగ్గా 104 ఏళ్ల కిందట ఈ రోజున అసలేం జరిగింది
- కిబితూ: భారత్‌లోని చివరి గ్రామం నుంచి చైనాకు మోదీ ప్రభుత్వం పంపుతున్న సందేశం ఏమిటి?
- మారుమూల దీవిలో ఆ వింత రాళ్లు ఎలా ఏర్పడ్డాయి? అక్కడేం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















