ఆంధ్రప్రదేశ్: తీరంలో పోర్టుల నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయి?

పోర్టులు
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం...

ఏపీ అభివృద్ధికి అవకాశం కల్పించే అంశాల్లో తీర ప్రాంతం ప్రధానమైనది. 974 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఉండటంతో దానిని వనరుగా మార్చుకోవాలనే ఆలోచన చాలాకాలంగా ఉంది. కానీ, గడిచిన రెండు దశాబ్దాల్లో కొత్త పోర్టుల నిర్మాణంపై పెద్దగా శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు.

వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2008 జూలై 17న కృష్ణపట్నం పోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అయితే, అది అంతకుముందు నాటి ప్రతిపాదనే.

రాష్ట్ర విభజన తర్వాత కాకినాడ సెజ్ పరిధిలో జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో గేట్ వే పోర్ట్ నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రామాయపట్నం, బందరు పోర్టులకు కూడా ఆయన హయంలోనే పునాదిరాయి పడింది. కానీ నిర్మాణ పనులు మాత్రం మొదలుకాలేదు.

ప్రస్తుతం ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వమే 3 పోర్టుల నిర్మాణానికి పూనుకుంటోంది. ఇప్పటికే అందులో ఒక పోర్టు పనులు ప్రారంభమయ్యాయి. రెండోది శంకుస్థాపన అయ్యింది. మూడో పోర్టుకి కూడా వచ్చే నెలలోనే ముహూర్తం అని ప్రభుత్వం చెబుతోంది.

ఇప్పటికైనా వీటి నిర్మాణం ఆచరణలోకి వస్తే రాబోయే కొన్నేళ్లలో ఏపీ తీరప్రాంత అభివృద్ధికి మార్గం ఏర్పడుతుంది. ఎగుమతులు, దిగుమతులతో సందడి మొదలవుతుంది. ఉపాధి సహా వివిధ రంగాలు దూసుకెళ్లే అవకాశం ఉంటుంది.

పోర్టులు

కొత్త పోర్టుల పరిస్థితి ఏమిటీ?

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ( 2013) ప్రకారం నెల్లూరు, ప్రకాశం జిల్లాల సమీపంలో దుగరాజపట్నం ఓడరేవు నిర్మించాల్సి ఉంది. నిర్మాణ బాధ్యత కేంద్రానిది. కానీ దాని స్థానంలో రామాయపట్నం వద్ద పోర్టు నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. దానికి కేంద్రం నుంచి ఆశించిన స్పందన రాలేదు.

చివరకు 2019 ఎన్నికలకు ముందు నాటి టీడీపీ ప్రభుత్వం రామాయపట్నం పోర్టు నిర్మాణానికి పూనుకుంది. బందరు పోర్టు సహా రామాయపట్నం పోర్టు నిర్మాణాలకు నాటి సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు చేశారు. అయితే పనులు ముందుకు సాగలేదు.

అదే సమయంలో కాకినాడ సెజ్ పరిధిలో జీఎంఆర్ సంస్థ మరో ప్రైవేటు పోర్టు నిర్మాణానికి ప్రతిపాదించింది. కాకినాడ పోర్టుకి సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో గేట్ వే పోర్టు నిర్మాణానికి అనుమతులు తీసుకుంది. చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. కానీ పనులు మొదలుకాలేదు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు మూడోవంతు పూర్తికావడం ఆశాజనకంగా కనపడుతోంది. బెర్తుల కోసం 2 వేల ఎకరాల విస్తీర్ణంలో పనులు జరుగుతున్నాయి. అరబిందో ఇన్ఫ్రా సంస్థ ఆధ్వర్యంలో ఏడాదిగా సాగుతున్న పనుల్లో కొంత పురోగతి కనిపిస్తోంది. ఈ ఏడాది చివరికి ఒక బెర్త్ సిద్ధం చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు ప్రాజెక్ట్ మేనేజర్ పెరుమాళ్ బీబీసీతో అన్నారు.

సముద్రంలో బెర్తుల నిర్మాణానికి అవసరమైన కార్యకలాపాలతో రామాయపట్నం ప్రస్తుతం సందడిగా మారుతోంది. ఏపీ మారిటైమ్ బోర్డు నేతృత్వంలో దాదాపు రూ. 3,600 కోట్ల వ్యయంతో ఈపీసీ పద్ధతిలో పోర్టు నిర్మాణం జరుగుతోందని ప్రభుత్వం ప్రకటించింది.

పోర్టు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మూలపేట పోర్ట్ పనులకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.

బందరులో జాప్యం...

శ్రీకాకుళం జిల్లా భావనపాడులో కూడా పోర్టు నిర్మాణం అనేక దశాబ్దాలుగా ప్రతిపాదనలకు, ప్రకటనలకు పరిమితమయ్యింది. ఎట్టకేలకు 2023 ఏప్రిల్ 19న పోర్టు నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అయితే భావనపాడులో భూసేకరణ సమస్యల కారణంగా పోర్టు నిర్మాణం అక్కడికి సమీపంలోనే ఉన్న మూలపేటకు మార్చారు. దాంతో ఇప్పుడు అది మూలపేట పోర్టుగా మారింది.

రూ. 4,362 కోట్ల ఖర్చుతో రెండున్నరేళ్లలో ఈ పోర్టు నిర్మాణం పూర్తవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. 4 బెర్తులు అందులోకి తెస్తామని అంటోంది. ఏపీతో పాటుగా చత్తీస్ ఘడ్, జార్ఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాలకు అందుబాటులో ఉండటంతో జనరల్ కార్గోతో పాటుగా బొగ్గు ఎగుమతి, దిగుమతులకు పోర్టు ఉపయోగపడుతుందని, తద్వారా 25వేల మందికి ఉపాధి కలుగుతుందని చెబుతోంది.

ఈ పోర్టు నిర్మాణం జరిగితే దాదాపు 190 కిలోమీటర్ల తీరప్రాంతమున్న శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో దూసుకెళుతుందని భావిస్తున్నారు.

బ్రిటీష్‌ కాలం నాటి బందరు పోర్టు పునరుద్దరణ మాత్రం ఆపసోపాలు పడుతుంది. స్వాతంత్ర్యానికి పూర్వమే ఎగుమతులు, దిగుమతులకు కేంద్రంగా ఉన్న మచిలీపట్నం పోర్టు నిర్మాణం గురించి వరుసగా ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయే గానీ ఆచరణ రూపం దాల్చడం లేదు.

వైఎస్సార్, చంద్రబాబు వంటి వారు శంకుస్థాపనలు చేసినా అడుగులు పడలేదు. ఇప్పుడు మరోసారి శంకుస్థాపన చేసేందుకు జగన్ సన్నద్ధమవుతున్నారు. మూలపేట పోర్టుతో పాటుగా మచిలీపట్నం పోర్టుని కూడా ఏపీ ప్రభుత్వమే నిర్మించబోతున్నట్టు చెబుతున్నారు.

బందరు పోర్టు నిర్మాణం కోసం నవయుగ సంస్థకు గత ప్రభుత్వంలో పనులు అప్పగించారు. కానీ జగన్ ప్రభుత్వం వారిని తప్పించి, మరోసారి టెండర్లు పిలిచింది. ఈ చర్య వివాదాస్పదమైంది. టెండర్ల ప్రక్రియలో వివాదం కూడా బందరు పోర్టు నిర్మాణ పనుల విషయంలో జాప్యానికి ఓ కారణం.

చివరకు కోర్టు తీర్పుతో ఈ వివాదానికి తెరపడింది. కొత్త కాంట్రాక్టర్ గా మేఘా సంస్థకు పనులకు అప్పగించినట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

ఇపుడు ఒకేసారి 3 పోర్టులను ఏపీ ప్రభుత్వం భుజాన వేసుకుంది.

ప్రభుత్వమే నిర్మిస్తున్న పోర్టులకు తోడుగా కాకినాడ జిల్లా తొండంగి మండలంలో గతంలో జీఎంఆర్ ప్రతిపాదించిన ప్రైవేటు పోర్టు పనులు కూడా మొదలయ్యింది. అటు శ్రీకాకుళం, కాకినాడ, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో కొత్త పోర్టులకు రంగం సిద్ధమయినట్టు కనిపిస్తోంది.

పోర్టులు

ఫొటో సోర్స్, APMTB

ఇప్పటికే ఉన్నవి ఐదు..

ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద పోర్టు విశాఖపట్నంలో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఏపీ పరిధిలో ఇప్పటికే ఐదు పోర్టులు నిర్వహణలో ఉన్నాయి. అందులో మూడు మేజర్ పోర్టులు. వాటిలో కృష్ణపట్నం పోర్టుది అగ్రస్థానం. ఈ పోర్టు ఇటీవలే అదానీ సంస్థల చేతుల్లోకి వెళ్లింది. 2020 నాటికే ఈ పోర్టులో 50 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో ఆపరేషన్స్ నిర్వహించారు.

ఇక గంగవరం పోర్టులో 35 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో రవాణా జరిగింది. ఈ పోర్టులో కూడా ఏపీ ప్రభుత్వ వాటాని ఏడాది క్రితమే అదానీకి బదలాయించారు. దాంతో ఏపీలో రెండు పెద్ద పోర్టులు కూడా అదానీ సంస్థల చేతుల్లోకి వెళ్లాయి.

కాకినాడలో రెండు పోర్టులున్నాయి. డీప్ వాటర్ పోర్టులో 15 మిలియన్ మెట్రిక్ టన్నుల మేర కార్గో ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయి. యాంకరేజ్ పోర్టులో మాత్రం దాదాపు 3 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో కార్యకలాపాలు జరుగుతాయి. కరోనా తర్వాత ఈ పోర్టు నుంచి బియ్యం వంటి ఎగుమతులు పెరిగాయి.

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఎస్.యానాం వద్ద ఉన్న రవ్వ పోర్టు చిన్నది. దాదాపు 1 మిలియన్ మెట్రిక్ టన్నుల లోపు సరకు అక్కడి నుంచి పంపిస్తారు.

చిన్నా, పెద్దా కలిపి ఐదు పోర్టులున్న రాష్ట్రం నుంచి ఎగుమతులు, దిగుమతులు కూడా విస్తృతంగా సాగుతున్నాయి. ముఖ్యంగా బియ్యం, ఆక్వా, హార్టీకల్చర్ ఉత్పత్తులను ప్రపంచంలోని వివిధ దేశాలకు తరలిస్తున్నారు. కొత్తగా నిర్మిస్తున్న 4 పోర్టులు కూడా అందుబాటులోకి వస్తే అదనంగా మరో 20 బెర్తుల వరకూ సిద్ధమవుతాయి. కార్యకలాపాలు జోరందుకునే అవకాశం ఉంటుంది.

పోర్టు

అవకాశాలు పుష్కలం...

"ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్న చాలా రాష్ట్రాలకు తీర ప్రాంతం లేదు. తెలంగాణా వంటి రాష్ట్రాలకు ఎగుమతులు, దిగుమతుల కోసం ఏపీ మీద ఆధారపడాలి. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలకు కూడా ఏపీ పోర్టులే ఆధారం. ఇప్పటికే కర్ణాటక నుంచి ఐరన్ ఓర్, ఒడిశా, మధ్యప్రదేశ్, యూపీ రాష్ట్రాల ధాన్యం వంటివి కూడా ఏపీ నుంచే ఎగుమతి చేస్తున్నారు. కొత్త పోర్టులు అందుబాటులోకి వస్తే ఇతర రాష్ట్రాలకు కూడా ఏపీ తీరం గేట్ వే అవుతుంది. తద్వారా రాష్ట్రాభివృద్ధికి అవకాశాలు మెరుగవుతాయి" అని ఎక్స్ పోర్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి ఆర్.రమేష్ బాబు అన్నారు.

పోర్టుల ప్రతిపాదనలు, శంకుస్థాపనల దశ దాటి నిర్మాణం జరిగితేనే ప్రయోజనం నెరవేరుతుందని, లేదంటే అవకాశాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

రామాయపట్నం పనులు ఆశాజనకంగా జరుగుతున్నప్పటికీ ఇతర పోర్టుల పనులు మొదలుకాలేదని, ప్రభుత్వ ప్రయత్నం ఫలిస్తే లాజిస్టిక్స్ లో ఏపీ మెరుగైన స్థానానికి చేరుతుందని రమేష్ బాబు అన్నారు.

'పెద్ద మార్పు జరగబోతోంది'

ప్రస్తుత ప్రతిపాదనలన్నీ కార్యరూపం దాల్చడం ఖాయమని ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో లెఫ్టినెంట్ రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. పనులు మొదలయిన రామాయపట్నంతో పాటు, మూలపేట, మచిలీపట్నం పోర్టులు కూడా త్వరలోనే పట్టాలెక్కబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు.

"లాజిస్టిక్స్ లో ప్రపంచంలోనే ఇండియా ర్యాంక్ మెరుగుపడింది. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి అందుకు దోహదపడుతుంది. ఒకేసారి నాలుగు పోర్టులు కార్యరూపం దాల్చడం కొత్త చరిత్ర అవుతుంది. రెండు చోట్ల పనులు జరుగుతున్నాయి. ఒకచోట మొదలయ్యాయి. మరో చోట ప్రారంభించాల్సి ఉంది. జూన్ నాటికి నాలుగు పోర్టుల పనులు ఏకకాలంలో జరుగుతుంటే అందరూ ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది. అన్ని ఆటంకాలు అధిగమించి అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు వేశాం. రెండు, మూడేళ్ల తర్వాత పెను మార్పు చూడబోతున్నాం" అంటూ రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు.

కాకినాడ సెజ్ లో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం, పోర్టు నిర్మాణం ఏకకాలంలో జరుగుతున్నాయని ఆయన బీబీసీకి తెలిపారు. రామాయపట్నం పోర్టులో 36 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)