చక్కెర ధర పెరిగిపోతుందా... టీ, కాఫీలు మరింత కాస్ట్‌లీ అవుతాయా?

- రచయిత, జయ్ శుక్లా
- హోదా, బీబీసీ ప్రతినిధి
అంతర్జాతీయ మార్కెట్‌లో చక్కెర ధరలు పెరుగుతున్నాయి. భారత రీటెయిల్ మార్కెట్‌లో మూడు రుపాయల వరకు ధర పెరిగింది.
రానున్న రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ ధరలు మరింత పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు.
భారత్‌లో చక్కెర ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. దీంతో ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు ఇక్కడ మనకు చక్కెర అందుబాటులో ఉంటోంది.
అయినప్పటికీ గత 45 రోజుల్లో చక్కెర ధరలో పెరుగుదల కనిపిస్తోంది. రానున్న రోజుల్లో భారత్‌లోనూ ధరలు పెరగొచ్చని నిపుణులు చెబుతున్నారు.
అసలు చక్కెర ధరలు పెరగడానికి కారణం ఏమిటి? దీనిపై ఏ అంశాలు ప్రభావం చూపిస్తున్నాయనేప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
పడిపోయిన చెరకు దిగుబడి
భారత్‌లో చక్కెర ఉత్పత్తి తగ్గిందని, అందుకే ధరలు పెరుగుతున్నాయని, భవిష్యత్‌లో ఇవి మరింత పెరగొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) గణాంకాల ప్రకారం ఏప్రిల్ 15 నాటికి గత ఏడాదితో పోలిస్తే చక్కెర ఉత్పత్తి ఆరు శాతం తగ్గి 311 లక్షల టన్నులుగా నమోదైంది.
గత ఏడాది ఇదే సమయానికి చక్కెర ఉత్పత్తి 328.7 లక్షల టన్నులుగా ఉండేది. అంటే, దాదాపుగా 15 లక్షల టన్నుల దిగుబడి తగ్గింది.
సాధారణంగా చక్కెరను అక్టోబరు నుంచి తర్వాత ఏడాది సెప్టెంబరు వరకు లెక్కిస్తారు. ఐఎస్ఎంఏ గణాంకాల ప్రకారం సెప్టెంబరు నాటికి మొత్తం దిగుబది 334 టన్నులు పెరిగే అవకాశం ఉంది. అయితే, గత ఏడాది ఇది 358 లక్షల టన్నులుగా ఉంది.
ప్రస్తుత సీజన్‌లో 532 మిల్స్ పనిచేస్తున్నాయని, 400 మిల్స్ ఖాళీగా ఉన్నాయని ఐఎస్ఎంఏ చెబుతోంది.
చక్కెర ఉత్పత్తిపై ఉగార్ షుగర్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జతిన్ కొఠారీ బీబీసీతో మాట్లాడారు. ‘‘ఈ సీజన్‌లో భారత్ 336 మెట్రిక్ టన్నుల పంచదార ఉత్పత్తి చేయొచ్చు. ఇక్కడ మరొక 60 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలు ఉంటాయి’’ అని ఆయన చెప్పారు.
‘‘వీటిలో దేశీయ అవసరాలకు 275 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయి. మిగతా 61.5 మెట్రిక్ టన్నులను ఎగుమతి చేస్తారు’’ అని ఆయన వివరించారు.
‘‘మిగతా 55 మెట్రిక్ టన్నులు వచ్చే ఏడాది కోసం నిల్వలకు వెళ్తాయి’’ అని ఆయన వివరించారు. ప్రస్తుతం మార్కెట్‌లో ధరల పెరుగుదలకు ఉత్పత్తి తగ్గడమే కారణమని ఆయన తెలిపారు.

‘‘అంత ప్రభావం ఉండకపోవచ్చు’’
మరోవైపు ఆర్థిక నిపుణుడు బీరెన్ వకీల్ కూడా బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘మీరు గత పదేళ్లలో సరకుల ధరలను పరిశీలిస్తే, పంచదార ధర ఎంత పెరిగింది? మిగతా వస్తువుల ధరలు ఎలా పెరిగాయి? లాంటి అంశాలు అర్థమవుతాయి’’ అని ఆయన అన్నారు.
‘‘ఇక్కడ ప్రభుత్వ నియంత్రణ ఉండటం వల్లే చక్కెర ధరలు తక్కువగా ఉన్నాయి’’ అని ఆయన చెప్పారు.
‘‘నవీ ముంబయిలోని వశీ మార్కెట్‌లో గత నెల రోజుల్లో చక్కెర ధర క్వింటాలుకు రూ.3,300 నుంచి రూ.3,520కి పెరిగింది. అంటే క్వింటాలుకు రూ.220 పెరిగింది. ఇదేమీ అంత పెద్ద పెరుగుదల కాదు’’ అని ఆయన అన్నారు.
మరోవైపు గుజరాత్ స్టేట్ షుగర్ ఫ్యాక్టరీస్ చైర్మన్ ఈశ్వర్‌భాయ్ పటేల్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత ఏడాదిలో ఎకరాకు తొమ్మిది టన్నులకు దిగుబడి తగ్గింది’’ అని చెప్పారు.
‘‘దీంతో మార్కెట్‌లో కేజీకి రూ.3 వరకు ధర పెరిగింది’’ అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, MANSI THAPLIYAL
ఇథనాల్ ఉత్పత్తి
మరోవైపు ఇథనాల్ ఉత్పత్తి పెరగడమూ చక్కెర ఉత్పత్తిపై కొంతవరకు ప్రభావం చూపిస్తోంది.
ముడి చమురు దిగుమతి బిల్లుతోపాటు కాలుష్యాన్ని తగ్గించేందుకు పెట్రోలులో ఇథనాల్ కలిపేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2025నాటికి పెట్రోలులో 20 శాతం వరకు ఇథనాల్ కలపాలని లక్ష్యం నిర్దేశించుకుంది.
దాదాపు 45 లక్షల టన్నుల చెరకు రసాన్ని ఇథనాల్ కోసం తరలిస్తున్న ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా చక్కెర దిగుబడి కొంతవరకు తగ్గుతోంది.
అయితే, చక్కెర ధరలు మరీ అంత పెరగకపోవచ్చని, ఎందుకంటే భారత్‌లో సరిపడా నిల్వలు ఉన్నాయని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ వైస్ చైర్మన్ కేతన్ పటేల్ అన్నారు.
‘‘కొన్ని మిల్స్ ఇథనాల్ ఉత్పత్తిపై దృష్టిపెట్టాయి. అందుకే భారత్‌లో ఈ ఏడాది కొంత పంచదార ఉత్పత్తి తగ్గింది’’ అని ఆయన చెప్పారు. అయితే, చాలావరకు చక్కెర ఉత్పత్తిలో భాగంగా వచ్చే పదార్థాలను ఇథనాల్ కోసం ఉపయోగిస్తారని, నేరుగా చెరకు రసాన్ని తరలించేది తక్కువేనని ఆయన అన్నారు.
మరోవైపు చక్కెర దిగుబడి తగ్గడానికి వాతావరణ మార్పులు కూడా ఒక కారణమని కొందరు నిపుణులు చెబుతున్నారు. ‘‘గత ఏడాది ఒక ఎకరంలో 35 టన్నుల దిగుబడి వచ్చింది. ఇప్పుడు అది 15 టన్నులకు పడిపోయింది. దీనికి వాతావరణంలో మార్పులు కూడా ఒక కారణం’’ అని ఈశ్వర్‌భాయ్ పటేల్ చెప్పారు.
‘‘భారీగా చెరకును ఉత్పత్తిచేసే మహారాష్ట్ర, కర్ణాటకలోనూ చెరకు దిగుబడి తగ్గింది’’ అని జతిన్ కొఠారీ తెలిపారు.
‘‘మొదట వర్షాలు పడలేదు. ఆ తర్వాత వరదలు వచ్చాయి. మరోవైపు ఈ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే పంచదార ఉత్పత్తి మరింత తగ్గొచ్చు’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇతర దేశాల్లోనూ...
పంచదార ఉత్పత్తి ప్రపంచంలోని చాలా దేశాల్లో తగ్గుతోంది.
ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) గణాంకాల ప్రకారం, చక్కెర ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో బ్రెజిల్ ఉంటుంది. అయితే, ఎగుమతుల్లో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉంటుంది.
థాయిలాండ్, చైనా, పాకిస్తాన్‌తోపాటు కొన్ని ఐరోపా దేశాలు కూడా పంచదారను ఉత్పత్తి చేస్తుంటాయి.
ప్రస్తుతం బ్రెజిల్ మినహా అన్ని దేశాల్లోనూ చక్కెర దిగుబడి తగ్గింది.
‘‘థాయిలాండ్‌తోపాటు కొన్ని యూరోపియన్ దేశాల్లో అసలు నిల్వలే లేకుండా పోయాయి’’ అని వకీల్ చెప్పారు.
‘‘భారత్‌లో సరిపడా నిల్వలు ఉన్నాయి. అయితే, ఎగుమతులపై భారత్ ఆంక్షలు విధించింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చక్కెర ధరలు పెరుగుతున్నాయి’’అని ఆయన చెప్పారు.
దాదాపు అన్ని దేశాల్లో ప్రస్తుత సీజన్‌లో చక్కెర ఉత్పత్తి 7 నుంచి 8 శాతం వరకూ తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి.
ఆఫ్రికా దేశాలతోపాటు ఫిజీ, కరీబియన్ దేశాల్లోనూ చక్కెర నిల్వలు పడిపోయాయి.

ఫొటో సోర్స్, AVERAGE PA
బ్రెజిల్‌లో పరిస్థితులపై జతిన్ కొఠారీ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం బ్రెజిల్‌లో సీజన్ మొదలైంది. గత సీజన్‌లో ఇక్కడ సోయాబీన్ బంపర్ క్రాప్ వచ్చింది. నేడు అక్కడ సోయాబీన్స్, మొక్కజొన్న మంచి ధర పలుకుతున్నాయి. దీంతో ఎంతమంది చెరకు పంట వేస్తారో చూడాలి’’ అని కొఠారీ అన్నారు.
‘‘మొత్తంగా గత ఏడాదితో పోలిస్తే చెరకు దిగుబడి ఆరు నుంచి ఏడు శాతం ఎక్కువే ఉండొచ్చు’’ అని ఆయన తెలిపారు.
‘‘ప్రపంచ దేశాలకు చక్కెర ఎక్కువగా బ్రెజిల్, ఇండియాల నుంచి వెళ్తుంది. భారత్ ఇప్పటికే 61.5 మెట్రిక్ టన్నుల పంచదారను ఎగుమతి చేసింది’’ అని ఆయన చెప్పారు.
‘‘అయినప్పటికీ డిమాండ్‌కు సరఫరా చక్కెర ఉండటం లేదు. భారత్‌తో పోలిస్తే, అమెరికాలో ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి’’ అని ఆయన వివరించారు.
ముంబయిలోని వశీ మార్కెట్‌లో ధరలు కేజీ రూ.35.50 నుంచి రూ.36 వరకు ఉన్నాయి. గతేడాది ఇవి రూ.32 నుంచి రూ.33 మధ్య ఉండేవి. కానీ, అమెరికాలో వీటి ధరలు భారీగా పెరిగాయి.
‘‘భారత్‌లో చక్కెర ప్రభుత్వ నియంత్రణలో ఉండటంతో ధరలు కాస్త స్థిరంగా ఉన్నాయి. కానీ, అమెరికాది స్వేచ్ఛా విపణి. అందుకే ఇక్కడ ధరలు మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా పెరుగుతున్నాయి’’ అని వకీల్ అన్నారు.
‘‘అమెరికా మార్కెట్‌లో ఒక పౌండు చక్కెర అంటే 453 గ్రాములు 24.80 సెంట్లుగా ఉంది. ఆరు నెలల క్రితం అంటే ఆగస్టు 2022లో ఇది 17 సెంట్లు మాత్రమే’’అని ఆయన వివరించారు.
‘‘అంటే ఆరు నెలల్లో 7.8 సెంట్లు ధర పెరిగింది. అంటే దాదాపు 35 శాతం పెరుగుదల’’ అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, NURPHOTO
‘‘రైతులకు మద్దతు ధర దక్కడం లేదు’’
భారత్‌లో రైతులు భవిష్యత్‌లో చెరకు నుంచి ఇతర పంటలకు మళ్లే అవకాశముందని, ఎందుకంటే వారికి కనీస మద్దతు ధర దక్కడం లేదని నిపుణులు అంటున్నారు. దీనికి ప్రభుత్వ నియంత్రణే కారణమని చెబుతున్నారు.
‘‘చెరకు, గోదుమ లాంటి పంటల విషయంలో ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంటోంది. ఒకవైపు రైతులకు అధిక ధర రావాలని, మరోవైపు ప్రజలకు తక్కువ ధరకే ఇవి అందుబాటులో ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది చాలా కష్టమైన పని’’ అని వకీల్ అన్నారు.
‘‘నేడు చెరకు క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.3,100గా ఉంది. దీన్ని రూ.3,600కు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే తమకు మేలు జరుగుతుందని వారు చెబుతున్నారు’’ అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కెంటన్ పాట్స్: పెర్ల్ హార్బర్ దాడిలో మృతదేహాలను సేకరించిన వ్యక్తి... ఇప్పుడెలా మరణించారంటే
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- కేశవానంద భారతి: ఈ ఆధ్యాత్మిక గురువును ‘రాజ్యాంగ రక్షకుడు’ అని ఎందుకన్నారంటే
- ఐపీఎల్: DRS అంటే 'ధోనీ రివ్యూ సిస్టమ్'.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















