తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ ఎందుకు అంటోంది?

అమిత్ షా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కీర్తి దుబే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కర్ణాటక తర్వాత ప్రస్తుతం తెలంగాణలోనూ ముస్లిం రిజర్వేషన్లపై చర్చ జరుగుతోంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం ఏర్పడితే, ఇక్కడ కూడా ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని హోం మంత్రి అమిత్ షా తాజాగా ఒక బహిరంగ సభలో ప్రకటించారు.

‘‘టూ బెడ్ రూమ్ హాల్ కిచెన్ పథకంలోనూ ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఈ పథకాన్ని పేద ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం నడిపించాలి. ఒవైసీ కోసం కాదు. విద్య, ఉద్యోగాల్లో రాజ్యాంగానికి విరుద్ధంగా ముస్లింలకు ఇక్కడ రిజర్వేషన్లు అమలుచేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే, ముస్లిం రిజర్వేషన్లను రద్దుచేస్తాం. ఇక్కడ రిజర్వేషన్లు అనేది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కు. వారికి మాత్రమే రిజర్వేషన్లు దక్కాలి’’ అని ఇటీవల నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా చెప్పారు.

అమిత్ షా వ్యాఖ్యలపై ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘‘బీజేపీ ఇంకెంత కాలం విద్వేషాన్ని వెదజల్లుతుంది? తెలంగాణలో ముస్లింలకు కులం ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తున్నారు. కానీ, మతం ఆధారంగా ఈ రిజర్వేషన్లు వర్తింప చేస్తున్నారని అమిత్ షా అంటున్నారు. ఇదొక పెద్ద అబద్ధం. ఎందుకు ముస్లింలను బీజేపీ శత్రువులుగా చూస్తోంది?’’అని ఒవైసీ ప్రశ్నించారు.

ముస్లిం రిజర్వేషన్లు

ఫొటో సోర్స్, Getty Images

కర్ణాటకలో ఏం జరిగింది?

ఇదివరకు కర్ణాటకలో ముస్లింలకు నాలుగు శాతంగా ఉండే రిజర్వేషన్లను బీజేపీ రద్దుచేసింది.

అయితే, కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో ముస్లిం నాయకులు సవాల్ చేశారు. ప్రస్తుతం మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి ఒకరోజు ముందు, అంటే మే 9న ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది.

అప్పటివరకు రాష్ట్రంలో ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగుతాయని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది.

అమిత్ షా, మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ముందుగా కర్ణాటక, తెలంగాణల్లో ముస్లింలు ఎంత శాతం రిజర్వేషన్లు పొందుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. అసలు ఈ రిజర్వేషన్లు ఎప్పుడు మొదలయ్యాయి? కర్ణాటకలో వీటిని ఎందుకు రద్దు చేశారో తెలుసుకోవాలి.

మొదటగా కర్ణాటక గురించి మాట్లాడుకుందాం.

అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందుగా రాష్ట్రంలో ముస్లింలకు కల్పిస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నాలుగు శాతాన్ని లింగాయత్, ఒక్కలిగలకు చెరో రెండు శాతాన్ని పంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకమని, అందుకే ఈ రిజర్వేషన్లను రద్దు చేస్తున్నామని బీజేపీ ప్రభుత్వం వెల్లడించింది.

ఈ విషయంలో తీసుకున్న నిర్ణయంపై మార్చిలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడారు. ‘‘రాజ్యాంగంలో మతపరంగా రిజర్వేషన్లు కల్పించేందుకు ఎలాంటి నిబంధనలూ లేవు. కులం ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించాలని స్వయంగా రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ ప్రకటించారు’’అని ఆయన అన్నారు.

కర్ణాటకలో 1994లో మండల్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా ‘‘సామాజిక, ఆర్థిక వెనుకబాటు’’ను చూపిస్తూ ముస్లింలలోని కొన్ని కులాలను ఇతర వెనుకబడిన కులాలు(ఓబీసీ)ల్లోని సబ్‌ కేటగిరీగా చేర్చారు.

నిజానికి కర్ణాటకలో ఏ కులాలు, వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలే తేల్చేందుకు చిన్నపరెడ్డి కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం 1986లోనే ఏర్పాటుచేసింది.

ఈ కమిషన్ సూచనల మేరకే ఓబీసీల్లోని 32 శాతం రిజర్వేషన్లలో ముస్లింలకు నాలుగు శాతాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఓబీసీ కేటగిరీలోనే ఇదివరకు కూడా ఒక్కలిగలు, లింగాయత్‌లకు నాలుగు, ఐదు శాతం చొప్పున రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ రెండు వర్గాలు కర్ణాటకలో నిర్ణయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. దీంతో తాజాగా అదనంగా మరో రెండేసి శాతం రిజర్వేషన్లను వీరికి కల్పించారు.

ముస్లిం రిజర్వేషన్లు

ఫొటో సోర్స్, Getty Images

రాష్ట్రంలో రిజర్వేషన్లపై అధ్యయనం చేస్తున్న మైసూర్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ముజఫర్ అసాదీ తాజా పరిణామాలపై బీబీసీతో మాట్లాడారు.

‘‘రాష్ట్రంలో ఒక్కలిగ, లింగాయత్ వర్గాలు 17 శాతం రిజర్వేషన్లను డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ముస్లింల వాటా తీసుకున్నప్పటికీ వీరికి కేవలం ఆరు నుంచి ఏడు శాతం రిజర్వేషన్లే వస్తున్నాయి. ఈ రెండు వర్గాలూ ఆర్థికంగా బలమైనవి. అయినప్పటికీ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే వారికి రిజర్వేషన్లు కల్పిస్తున్నారు’’అని అసాదీ చెప్పారు.

‘‘ముస్లింలకు రిజర్వేషన్లను రద్దుచేసే సమయంలో మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ, ఇక్కడ రిజర్వేషన్లకు ఆధారం మతం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’’అని ఆయన చెప్పారు.

కర్ణాటకలో ముస్లింల జనాభా 12 శాతం వరకూ ఉంటుంది. దేశంలో కులం ఆధారిత జన గణనను చేపట్టలేదు. అయితే, కొన్ని అంచనాల ప్రకారం, రాష్ట్రంలో లింగాయత్‌లు 17 శాతం, ఒక్కలిగలు 15 శాతం ఉంటారు.

ముస్లిం రిజర్వేషన్లు

ఫొటో సోర్స్, LUTHFI LUTHFI / EYEEM

రాజకీయంగానూ ఈ రెండు వర్గాలూ నిర్ణయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులు ఈ కమ్యూనిటీల నుంచి వచ్చారు. రాష్ట్రం నుంచి ప్రధాన మంత్రి పదవి వరకూ వెళ్లిన హెచ్‌డీ దేవె గౌడ కూడా ఒక్కలిగ వర్గానికి చెందినవారే.

దీంతో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ముస్లింల రిజర్వేషన్లను రద్దుచేసి వీటిని ఒక్కలిగలు, లింగాయత్‌లకు పంచడంపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది.

అయితే, ఈ నిర్ణయంతో ఎక్కువ నష్టపోయేది ముస్లింలేనని ప్రొఫెసర్ అసాదీ అన్నారు.

‘‘నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ప్రతి క్లాసులోనూ ఇక్కడ ఇద్దరు ముస్లింలు కనిపిస్తారు. భవిష్యత్‌లో వారి ప్రాతినిధ్యం తగ్గిపోవచ్చేమో’’అని ఆయన చెప్పారు.

‘‘ముస్లింలలో వెనుకబడిన వర్గాలకు ఇకపై రిజర్వేషన్లు దూరం కావచ్చు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు చెందిన పది శాతం రిజర్వేషన్ల కోసం ఇతరులతో కలిసి వీరు ప్రస్తుతం పోటీపడాల్సి ఉంటుంది. భవిష్యత్‌లో విద్య, ఉద్యోగాల్లో ముస్లింల ప్రాతినిధ్యంపై ఇది ప్రభావం చూపించొచ్చు’’అని ఆయన అన్నారు.

కేసీఆర్

ఫొటో సోర్స్, @TELANGANACMO

ఇప్పుడు తెలంగాణలో..

కర్ణాటక తర్వాత ఇప్పుడు తెలంగాణలోనూ ముస్లింలకు రిజర్వేషన్లను రద్దుచేయడంపై బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు.

మొదట్నుంచీ తెలంగాణలో రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకిస్తోంది. అయితే, వీరి అభ్యంతరాలను తోసిరాజని 2017లో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది.

అయితే, గత ఏడాది ఈ రిజర్వేషన్లను కేసీఆర్ ప్రభుత్వం నాలుగు శాతం నుంచి మూడు శాతానికి తగ్గించింది.

ఐఏఎస్ అధికారి జీ సుధీర్ నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ సూచనల ఆధారంగా రాష్ట్రంలో ముస్లింలకు రిజర్వేషన్లను కల్పించారు.

ఇక్కడ కూడా ‘‘సామాజిక, ఆర్థిక వెనుకబాటు’’ ఆధారంగానే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని సుధీర్ కమిషన్ సూచించింది.

మరి బీజేపీ చేస్తున్న ‘‘మతపరమైన రిజర్వేషన్‌ల రద్దు’’పై ప్రకటనలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయా? అనే ప్రశ్నపై హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ కే శ్రీనివాసులు మాట్లాడారు.

‘‘ఏ ప్రభుత్వమూ రిజర్వేషన్లు ఒక్కసారిగా ప్రకటించదు. దీనిపై అధ్యయనం కోసం మొదట ఒక కమిషన్ ఏర్పాటుచేస్తారు. ఆ కమ్యూనిటీ సామాజిక, ఆర్థిక, విద్యా పరమైన వెనుకబాటు గురించి మొదట అధ్యయనం చేపడతారు. ఆ తర్వాతే ఏ వర్గానికి రిజర్వేషన్లు ఇవ్వాలనే నిర్ణయాన్ని తీసుకుంటారు’’అని ఆయన అన్నారు.

‘‘అలానే ఒక కమ్యూనిటీని ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ జాబితా నుంచి తొలగించడం కూడా కమిషన్ సిఫార్సులపైనే ఆధారపడి ఉంటుంది. కానీ, కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసేటప్పుడు ఎలాంటి కమిషన్‌ను బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేయలేదు. వీరు సొంతంగానే నిర్ణయం తీసేసుకున్నారు. అలాంటప్పుడు కోర్టులో ఇది ఎలా చెల్లుబాటు అవుతుందనేది అతిపెద్ద ప్రశ్న’’అని ఆయన వివరించారు.

తెలంగాణలోనూ నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. అందుకే ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ల రద్దు అంశాన్ని ప్రస్తావించి బీజేపీ లబ్ధి పొందాలని అనుకుంటోందా?

వీడియో క్యాప్షన్, అల్లా-హు-అక్బర్ అంటూ నినాదాలు చేసిన ముస్లిం యువతి ముస్కాన్ ఇంటర్వ్యూ

బీజేపీకి ప్రయోజనం దక్కుతుందా?

ఇక్కడ కర్ణాటక, తెలంగాణ అనేవి రెండు భిన్నమైన రాష్ట్రాలని గుర్తుపెట్టుకోవాలని ప్రొఫెసర్ శ్రీనివాసులు అన్నారు. ‘‘ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ అంత బలంగా లేదు. భవిష్యత్‌లోనూ బలపడుతుందనే సంకేతాలు కనిపించడం లేదు’’అని ఆయన అన్నారు.

‘‘ఇక్కడ హిందూ-ముస్లింల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా వారు లబ్ధి పొందొచ్చనే వార్తలు వస్తున్నాయి. కానీ, దీని వల్ల అంత ప్రయోజనమేమీ ఉండకపోవచ్చు. ఇక్కడ ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే’’అని ఆయన చెప్పారు.

మరోవైపు కర్ణాటకలో హిందూ-ముస్లింల మధ్య ఘర్షణల చరిత్ర ఎప్పటినుంచో ఉందని, అందుకే అక్కడ హిందూత్వ రాజకీయాలు చేయడం బీజేపీకి తెలికని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

‘‘కర్ణాటక తరహాలో తెలంగాణలో ఈ రాజకీయాలతో బీజేపీకి మేలు జరగకపోవచ్చు. కర్ణాటకలో ముస్లింలను సైలెంట్ కమ్యూనిటీగా చెప్పుకోవచ్చు. వీరి గళం మనకు ఎక్కడా పెద్దగా వినిపించదు. కానీ, తెలంగాణలో పరిస్థితి అలా కాదు’’ అని అసాదీ అన్నారు.

‘‘అయితే, కర్ణాటకలో ముస్లింల రిజర్వేషన్లు ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మళ్లీ వారికి రిజర్వేషన్లు కల్పించడం అంత తేలిక కాదు’’అని ఆయన వివరించారు.

‘‘ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా లింగాయత్‌ లేదా ఒక్కలిగల నుంచి ఆ రెండు శాతం రిజర్వేషన్లను తీసుకునే ధైర్యం చేయకపోవచ్చు’’అని ఆయన అభిప్రాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, ప్రభుత్వ విద్యాసంస్థల్లో హిజాబ్, కాషాయ కండువాలు ధరించవచ్చా?

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)