‘నానమ్మ చనిపోయి రోజులు గడుస్తున్నా మృతదేహాన్ని తెప్పించలేకపోతున్నా’ - ఓ మనవరాలి వేదన

నాన్నమ్మతో అజార్

ఫొటో సోర్స్, AZHAAR SHOLGAMI

    • రచయిత, బార్బారా ప్లెట్ అషర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అజార్ షోల్గామి తన నానమ్మ మతదేహాన్ని ఖననం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఒక పెద్దావిడ చనిపోయారు. ఆమె చనిపోయి ఎన్ని రోజులవుతుందో ఎవరికీ తెలియదు.

సూడాన్‌లో ఇద్దరు జనరల్స్ మధ్య జరుగుతున్న క్రూరమైన యుద్ధం కారణంగా ఖార్టూమ్‌ నగరంలో ఆమె ఒంటరిగా చిక్కుకుపోయారు.

న్యూయార్క్‌లో ఉంటున్న అజార్ ఆమెను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఇప్పుడు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇది ఆమె ఒక్కరి పరిస్థితే కాదు. సూడాన్‌లో ఘర్షణల కారణంగా, రాజధాని ఖార్టూమ్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి చనిపోయిన వారి మృతదేహాలను తీసుకురావడం ప్రమాదకరంగా మారింది.

ఇరువర్గాల మధ్య జెడ్డాలో శుక్రవారం మానవతా ఒప్పందం కుదిరింది. ఘర్షణల వల్ల చనిపోయిన వారి మృతదేహాలను సేకరించడం, నమోదు చేసుకోవడం, ఖననం చేస్తున్న సిబ్బందికి సాయం గురించి అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

సూడాన్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, సూడాన్‌లో గత కొద్దికాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి.

అమలు కాని ఒప్పందం

వారం రోజుల చర్చల తర్వాత సూడాన్‌లో ఘర్షణ పడుతున్న ఇరువర్గాలు సామాన్యుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఒక ఒప్పందానికి వచ్చాయి.

ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలను వదిలివెళ్లే ప్రజలకు సురక్షిత మార్గం అందించడం, సహాయక సిబ్బందికి రక్షణ కల్పించడం, సామాన్య పౌరులను కవచాలుగా వాడుకోకూడదని అంగీకారానికి వచ్చాయి.

అయితే, పోరాటం ఆపేందుకు మాత్రం ఇరువర్గాలు అంగీకరించలేదు.

''వీధుల్లో మృతదేహాలు పడి ఉండడం మేము చూస్తూనే ఉన్నాం. మూతపడిన ఆస్పత్రులను కూడా'' అని రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ కమిటీ, ఆఫ్రికా రీజినల్ డైరెక్టర్ పాట్రిక్ యూసెఫ్ చెప్పారు. ''ఈ కొత్త ఒప్పందంలోని అంశాలు మానవతా సాయాన్ని అనుమతిస్తాయని ఆశిస్తున్నా'' అన్నారు.

ఇప్పటి వరకూ అది జరగలేదు. ఇరువర్గాల మధ్య కుదిరిన ఒప్పందాలు కాగితాలకే పరిమితమయ్యాయి.

సూడాన్

ఫొటో సోర్స్, AZHAAR SHOLGAMI

ఫొటో క్యాప్షన్, అజార్ తాత అబ్దల్లా షోల్గామి

చనిపోయినట్లు ఫోన్ కాల్

అజార్ నానమ్మ తాతయ్యలు అబ్దల్లా షోల్గామి, అలవెయ రెష్వాన్ ఘర్షణల వల్ల సూడాన్‌లో చిక్కుకుపోయారు. వాళ్లు ఖార్టూమ్‌లోని మిలిటరీ హెడ్‌క్వార్టర్స్, బ్రిటిష్ ఎంబసీకి సమీపంలోని బలడియా వీధిలో నివాసముండేవారు. సూడాన్ ఆర్మీ, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ మధ్య ఘర్షణలతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది.

అబ్దల్లా షోల్గామి బ్రిటిష్ పౌరుడు. ఆయనపై మూడుసార్లు కాల్పులు జరిగాయి. వికలాంగురాలైన తన భార్యను ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి ఆయన ఎలాగో తప్పించుకున్నారు. ఆయన్ను సూడాన్ నుంచి తరలించేందుకు ఆయన కుటుంబం ప్రయత్నాలు చేస్తోంది.

అయితే, అజార్ నానమ్మ అలవెయ గురించి ఎలాంటి సమాచారం లేదు. కొన్ని వారాల నుంచి అజార్ బ్రిటిష్ ఎంబసీకి ఫోన్ కాల్స్ చేస్తున్నా ఎలాంటి సాయం అందలేదు.

బ్రిటిష్ పౌరులను తరలిస్తున్న విమానాశ్రయానికి అజార్ నానమ్మ, తాతయ్యలు చేరుకోలేకపోయారు. దీంతో వారు ఖార్టూమ్‌లోనే చిక్కుకుపోయారు.

మూడు రోజుల కిందట ఇంటి పక్కనే ఉన్న తుర్కియే ఎంబసీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆమె నానమ్మ చనిపోయారని వారు చెప్పారు.

ఆ మాటను అజార్ నమ్మలేకపోతున్నారు.

''నేను మళ్లీ వారికి కాల్ చేశాను. కోమాలోకి వెళ్లిందేమో చూడమని చెప్పాను, మీరు పల్స్ చెక్ చేశారా? ఆమెను పరీక్షించారా? ఆమె గుండె కొట్టుకుంటుందేమో చూడండి, అని చెప్పాను. అప్పుడు, ఆమె శరీరం కుళ్లిపోయిందని అతను చెప్పాడు'' అని ఆమె చెప్పారు.

సూడాన్‌లో ఈ కాలంలో చాలా వేడిగా ఉంటుంది. కనీసం కరెంటు కూడా లేకుండా ఆమె ఎలా గడిపిందో, ఆమె ఒంటరిగా ఎలా ఉందో అని ఆలోచిస్తే చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు బాంబు శబ్దాలతో నిద్రలేవాల్సి వస్తోంది.

అక్కడ మరో మహిళతో మాట్లాడాం, వాళ్ల మామయ్య అహ్మద్ అక్కడికి సమీపంలోనే ఉంటారు. ఆమె మాకు ఒక విషయం చెప్పారు. కానీ ఆమె పేరు బయటపెట్టేందుకు ఇష్టపడలేదు. పేరు బయటికి తెలిస్తే ఎవరైనా టార్గెట్ చేస్తారేమోనని ఆమె భయపడుతున్నారు.

సూడాన్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఘర్షణల నుంచి తప్పించుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు

ప్లాస్టిక్ సంచుల్లో మృతదేహాలు

సూడాన్ వదిలి వెళ్లిపోవాలని భావించిన అహ్మద్ కుటుంబం వాళ్ల బంధువు ఇంటికి వెళ్లారు. అందరూ కలిసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకున్నారు. అయితే, వెళ్లిపోయేందుకు అవసరమైన పత్రాలు మర్చిపోవడంతో తెచ్చేందుకు ఆయన రియాద్ సమీపంలోని తన ఇంటికి వెళ్లారు. కానీ, ఆ తర్వాత ఆయన తిరిగిరాలేదు.

ఆరు రోజుల తర్వాత, అహ్మద్ ఇంటి ముందు మృతదేహం పడి ఉండడం గమనించి ఆయన సోదరుడికి ఒకరు ఫోన్ చేశారు.

ఇంట్లో ఉండగా అహ్మద్‌ను ఆర్ఎస్‌ఎఫ్ బలగాలు గుర్తించాయని, వాళ్లతో గొడవ జరగడంతో అతన్ని చంపేసి, ఇంటిని దోచుకుని వెళ్లిపోయారని అతను చెప్పారు.

ఇరుగుపొరుగు వారు అహ్మద్ మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచుల్లో చుట్టేసి ఉంచారు. స్థలం లేకపోవడంతో ఆయన్ను అక్కడే ఖననం చేద్దామనుకున్నారు. కానీ, అలా వీధుల్లో పడేసేందుకు ఆయన కుటుంబం ఒప్పుకోలేదు. దీంతో ఆయన మృతదేహం ఇంకా ప్లాస్టిక్ సంచుల్లోనే కట్టేసి ఉంది.

సూడాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తీవ్ర ఘర్షణల కారణంగా ఖార్టూమ్ నగరం భయానకంగా మారింది.

తన నానమ్మ మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు చేసే వారి కోసం అజార్ ప్రయత్నిస్తోంది. జెడ్డాలో ఒప్పందం కుదిరిన రోజు ఒక సంస్థ ఆ ప్రయత్నం చేసింది. కానీ, తుపాకీ కాల్పులు జరగడంతో వెనక్కితగ్గింది.

''మా నానమ్మతో నాకు చాలా సాన్నిహిత్యం ఉంది. నేను న్యూయార్క్ వెళ్లేముందు చివరిసారి ఆమెతో మాట్లాడినప్పుడు నన్ను ఒంటరిగా వదిలి వెళ్తున్నావు, నాకు భయంగా ఉందన్నారు.''

''అప్పుడు నేను నవ్వి ఆమెకు చెప్పాను. నిన్ను ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టను. నేనెప్పుడూ నీతోనే ఉంటానని చెప్పాను. కానీ ఆమెను నేను నిరాశపరిచాను'' అని అజార్ అన్నారు.

వీడియో క్యాప్షన్, సురక్షిత ప్రాంతాలకు పారిపోతున్న సూడాన్ ప్రజలు ...

ఇవి కూడా చదవండి: